-గులాబీ దళాలను వెన్నంటి నడిపిన కేటీఆర్ -సారథిగా సమున్నత శిఖరాలకు చేరిక -పాలేరు ఉప ఎన్నిక మొదలుకొని మున్సిపోల్స్ వరకు.. -ఎన్నికలు ఏవైనా జోరు కారుదే

నాయకుడు ప్రజలను ముందుండి నడిపించాలి. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవాలి. ప్రజాభిమాన రథాన్ని వేగంగా నడిపించి విజయతీరాలకు చేర్చాలి. ఈ లక్షణాలన్నీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావులో మెండుగా ఉన్నాయి. అందుకే ఆయన ఏ కార్యాన్ని చే పట్టినా దిగ్విజయంగా పూర్తిచేస్తున్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజలను, పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తూ ఘనవిజయాలను సాధిస్తున్నారు. పాలేరు ఉప ఎన్నిక మొదలుకొని పంచాయతీ, పరిషత్, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల వరకు అన్నిటా తిరుగులేని విజయాలను సాధించడం నాయకునిగా కేటీఆర్ సత్తాను రుజువు చేస్తున్నాయి. ఎవరు ఆపదలో ఉన్నా.. నేనున్నానంటూ స్పందించి ఆదుకోవడం ఆయనలోని మానవతను పదేపదే చాటుతున్నది.
నాయకత్వ లక్షణాలు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పటినుంచి కేటీఆర్ నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూనే ఉన్నారు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న వాగ్ధాటి, సునిశిత పరిశీలన, ప్రజలతో మమేకంకావడం, భాషా చాతుర్యం ఆయన నాయకత్వ పటిమకు నిత్యం సానపెడుతున్నాయి. అందుకే ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రజాభిమానం వెల్లువెత్తుతున్నది. అంశం ఏదైనా సునిశితంగా విశ్లేషించడం, సమస్యలను పరిష్కరించే విధానం.. ఇటు పార్టీ శ్రేణులకు, అటు ప్రజలకు చోదకశక్తిగా నిలుస్తున్నాయి. అందుకే నాయకుడిగా కేటీఆర్ మహోన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.
సీఎం కేసీఆర్ తర్వాత స్థానం కేటీఆర్‌దే ఏ నాయకుడి సామర్థ్యానికైనా ఎన్నికలే పరీక్షగా నిలుస్తాయి. తెలంగాణలో అలాంటి సత్తా మెండుగా ఉన్న నేతల్లో సీఎం కే చంద్రశేఖర్‌రావు తర్వాత స్థానం కేటీఆర్‌దే. రాష్ట్రంలో ఏ పార్టీకి లేనంత భారీస్థాయిలో దాదాపు 60 లక్షల సభ్యత్వాలున్న టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను భుజానవేసుకున్న కేటీఆర్ ఎన్నిక ఏదైనా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. పార్టీ శ్రేణులను ఐక్యంగా ముందుకు నడుపడంలో ఆయన ప్రత్యేక శైలి మనకు కనపడుతుంది.
ప్రతి ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయాలను అందించేందుకు కేటీఆర్ చేస్తున్న కసరత్తును ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నూతన పురపాలక చట్టం తయారీతోపా టు ఆ చట్టం ప్రకారం తాజాగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగించడంలో కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. నోటిఫికేషన్ వెలువడకముందే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసిన కేటీఆర్.. ద్వితీయశ్రేణి నాయకులు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి వ్యూహాలను అమలుచేశారు.
దావోస్‌కు వెళ్లినా ఓట్లవేటలో పార్టీ శ్రేణులను పకడ్బందీగా ముందుకు నడిపించిన కేటీఆర్.. విపక్షాల వ్యూహాలను చేధిస్తూ ముందుకుసాగారు. పురప్రజల సమస్యలకు పరిష్కారాలను వివరిస్తూ వారిమనసు చూరగొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లినా అక్కడి నుంచే సమస్యలు పరిష్కరిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం, ప్రజల గుండెల్లో మరింత అభిమానాన్ని సంపాదించడం కేటీఆర్‌కే చెల్లింది. అందుకే ‘పురపోరు’లో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టి అఖండ విజయాన్ని అందించారు.
రికార్డుల పరంపర కేటీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పాలేరు ఉప ఎన్నికలో సాధించిన విజయం అప్పట్లో ఓ రికార్డుగా నిలిచింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 99 డివిజన్లను కైవసం చేసుకొని అపూర్వ విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారు. అనంత రం జరిగిన గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులను సమర్థంగా ముం దుకు నడిపి రాష్ర్టాన్ని గులాబీవనంలా మార్చిన కేటీఆర్.. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో జాతీ య పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను మట్టికరిపించి మరోసారి తన నాయకత్వ పటిమను నిరూపించుకొన్నారు.