నత్తనడకన సాగుతున్న శ్రీశైలం ఎడమకాలువ ప్రాజెక్ట్‌లో సొరంగమార్గాన్ని పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు. ఎస్సెల్బీసీ పనుల పురోగతి, ప్రాజెక్ట్ పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం అన్ని పార్టీల నాయకులతో అసెంబ్లీ కమిటీహాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవసరమైతే కాంట్రాక్ట్ పనులు చేపట్టిన సంస్థకు రేట్లను పెంచి ఇవ్వాలని వివిధ పార్టీల సభ్యులు సూచించారు.
-రెండురోజుల్లో కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశం -పనులనుబట్టి వెంటనే నిధులు -అన్ని రాజకీయపక్షాలతో ముఖ్యమంత్రి సమీక్ష

ప్రస్తుతం పనులు చేస్తున్న జయప్రకాశ్ అసోసియేట్స్‌కే ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే బాధ్యత అప్పగించాలని, మరో సంస్థను తెరమీదకు తెస్తే అసాధారణ జాప్యం జరుగుతుందని మెజార్టీ సభ్యులు తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో ప్రతిపక్షనేత జానారెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి.. కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి, భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్ నుంచి కిషోర్, సునీత, ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, బాలరాజు.. బీజేపీ నుంచి ప్రభాకర్, సీపీఐ నుంచి రవీంద్రకుమార్‌నాయక్, సీపీఎం నుంచి సున్నంరాజయ్య, వైఎస్సార్సీపీ నుంచి వెంకటేశ్వర్లు, ఎంఐఎం ఎమ్యెల్యే అహ్మద్‌బలాల, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పనుల వేగవంతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ముఖ్యమంత్రి, వివిధపక్షాల ప్రతినిధుల సలహాలు తీసుకున్నారు. సొరంగమార్గం ద్వారా ప్రాజెక్ట్ పని పూర్తిచేయడం తప్ప వేరే మార్గం లేదని మెజార్టీ సభ్యులు స్పష్టంచేశారు.
గతంలో హైలెవల్ కమిటీ సిఫారసు చేసినట్లు స్టీల్, సిమెంట్, ఇంధనం వంటి రేట్లను పెంచి ఇవ్వాలని నల్లగొండకు చెందిన అన్ని పక్షాల సభ్యులు సూచించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 44 కిలోమీటర్ల పొడవునా సొరంగమార్గం పనులు చేపట్టగా ఇప్పటివరకు సగం పూర్తయిన విషయం తెలిసిందే. కానీ రేట్లు పెరిగిపోయినందున తాము మిగతా పనులు చేపట్టలేకపోతున్నామని, కనీసం రూ.1400 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచాలని జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీ స్పష్టంచేసింది. దీనిపై గత ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ.. రూ.763 కోట్లు పెంచవచ్చని సిఫారసు చేసింది. కానీ చాలాకాలంగా ఆ సిఫారసు పెండింగ్‌లో ఉంది.
వెంటనే ఆ సిఫారసును అమల్లోకి తెచ్చి పనులు వేగవంతం చేయాలని సభ్యులు కోరారు. సొరంగమార్గం పూర్తిచేయడానికి భారీమొత్తంలో నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామని, పనులను బట్టి వెంటనే నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టంచేసినట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను పిలిపించి మాట్లాడాలని సమావేశంలో నిర్ణయించారు.