Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

స్లమ్ ఫ్రీ హెదరాబాద్ , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిన

– నగరంలో పేదలకు 2 లక్షల ఇండ్లు – ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల నిర్మాణం – అవసరమైతే భూముల కొనుగోలు – ప్రతి బస్తీలో 15 మందితో బస్తీ కమిటీలు – ఇండ్లపై ఉన్న విద్యుత్‌లైన్లన్నీ తొలగించాలి – కేబుల్, విద్యుత్ లైన్లన్నీ ఇక భూగర్భంలోనే – చెత్త సేకరించే ఆటోరిక్షాలు బస్తీ పిల్లలకే – నాలాలపై కబ్జాలను తొలగించాల్సిందే – స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములయ్యారు – ప్రభుత్వంపట్ల వారికి నమ్మకం ఏర్పడింది – ఈ నెల 26న ప్రజాప్రతినిధులతో భేటీ – నగర సమస్యల పరిష్కారాలపై ఆ సమావేశంలోనే విధాన నిర్ణయాలు – సమీక్ష సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు

KCR addressing in swachh hyderabad feedback programme

హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. నగరంలో ఎక్కడకు వెళ్లినా ఇండ్లులేని పేదలు తమకు ఇండ్లు కావాలని అడుగుతున్నారని ఆయన చెప్పారు. హౌస్ ఫర్ ద పూర్ స్కీమ్ పెట్టి అందరికీ ఇండ్లు నిర్మించి నగరంలో స్లమ్స్ కల్చర్ లేకుండా చేయాలని అన్నారు. ఈ క్రమంలో దశలవారీగా నగరంలో 2లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. పేదలకు కట్టించే ఇండ్లు ప్రభుత్వ స్థలాల్లోనే నిర్మిస్తామని, అవసరమైతే భూమి కొనుగోలు చేసి మరీ ఇండ్లు కడతామని చెప్పారు. బస్తీల బాగుకోసం నెలకోసారి మళ్లీ బస్తీలకు వెళదామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి బస్తీలో 15 మందితో బస్తీ కమిటీలు వేసుకుందామని చెప్పారు. ఐదురోజులపాటు ఉద్యమంలా సాగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ప్రజలనుంచి వచ్చిన వినతులు, అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో విస్తృత స్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో గుర్తించిన ప్రజాసమస్యల పరిష్కారానికి ఈ నెల 26న ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటుచేసి, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. ఈ సమావేశానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చాలా గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది. పట్టుదలతో కలిసి పనిచేస్తే తప్పక ఫలితం ఉంటుందని నిరూపించింది. తమ బతుకులు బాగుపడతాయనే నమ్మకం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కలిగింది. ప్రభుత్వం ప్రజలకోసం ఉందనే అభిప్రాయం ఏర్పడింది అని చెప్పారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. రోడ్లపై ఒక్క చెత్త కాగితం ముక్క కూడా లేకుండా చూడాలని అన్నారు. ఇంకా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఏమన్నారంటే.. నగరంలో మొత్తం 77 నాలాలు ఉన్నాయి. ఇందులో ఐదు నాలాలు హుస్సేన్‌సాగర్‌లో కలుస్తాయి. 72 నాలాలు మూసీలో కలుస్తాయి. 77 నాలాల నిడివి 390 కిలోమీటర్లు ఉంది. ఈ నాలాలన్నీ వందశాతం కబ్జా అయ్యాయి. గతంలో పనిచేసిన కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ అధికారుల కాళ్లు మొక్కాలి. వాళ్లే పర్మిషన్లు ఇచ్చారు. నాలాల్లో నీళ్లు ఇండ్ల గోడలకు తగులుకుంటూ పోతున్నాయి. ఇంటి పిల్లర్‌పై అడ్డంగా ఒక దిమ్మె వేసి ఇంటిని పూర్తిగా నాలాపై కడతారు. ముక్కుపుటాలు అదిరిపోయే దుర్వాసన వస్తుంది. నగరంలో ఎక్కడకు వెళ్లినా ఇండ్లులేని పేదలు తమకు ఇండ్లు కావాలని అడుగుతున్నారు. హౌస్ ద పూర్ స్కీమ్ పెట్టి అందరికీ ఇండ్లు నిర్మించి స్లమ్స్ కల్చర్ లేకుండా చేయాలి. చాలా చోట్ల అక్రమాలున్నాయి. అగ్గిపెట్టెలు పేర్చినట్లు ఇండ్లు కట్టారు. చెట్టు పెడదామంటే కూడా జాగా లేదు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక కాలేజీ పెడదామంటే కూడా జాగాలేదు. అక్కడ 8 నుంచి 10 వేల మంది పేదలకు ఇండ్లు కావాలి. బస్తీల్లో చాలా అవసరాలున్నాయి. నగరంలో చాలా చోట్ల దురాక్రమణలున్నాయి. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కూడా అన్ని ఆక్రమణలే ఉన్నాయి. హైటెక్ సిటీలో అనేక బిల్డింగ్స్‌కు అనుమతులు లేవు. వీటన్నింటినీ క్రమబద్ధీకరించాలి. నగరంలోశాంతి భద్రతల పరిస్థితి కూడా మరింత మెరుగు పర్చాలి.

రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదు నగరంలో ఐదారు సమస్యలు కీలకంగా కనిపిస్తున్నాయి. వాటిల్లో శానిటేషన్ ముఖ్యమైనది. మనుషులు చేతులద్వారా చెత్త తీయలేని పరిస్థితి ఉంది. మన దగ్గర చెత్త తరలింపు, నిర్వహణ కాంట్రాక్టు రాంకీ సంస్థకు అప్పగించాం. వాళ్లకు నెలకు రూ.6 కోట్లు చెల్లిస్తున్నాం. అయితే రాంకీ సంస్థ ఇంటింటినుంచి చెత్తను సేకరించడంలేదు. జీహెచ్‌ఎంసీ కార్మికులు సమ్మె చేయడంతో వారు చెత్తను సేకరించడం లేదు. హ్యాండిలింగ్ ఒకటే చేస్తున్నారు. రాంకీని ఉంచుదామా? తీసివేద్దామా? అనేది తరువాత నిర్ణయిద్దాం. ముందుగా హైదరాబాద్‌లో ఎక్కడా ఒక్క చెత్త కాగితం కూడా కనపడకుండా చేయాలి.

Swachh Hyderabad success meet

ప్రతి ఇంటికీ రెండు బుట్టలు ప్రతి ఇంటికీ రెండు చెత్తబుట్టలను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఈ చెత్తను ఇప్పుడు రిక్షాలద్వారా సేకరించడం సాధ్యమయ్యే పని కాదు. బాగా ఎత్తు ప్రాంతాలకు తోసుకుంటూ వెళ్లలేరు. చెత్తను ఇంటింటి నుంచి సేకరించడానికి 2500 ఆటో రిక్షాలను కొనుగోలు చేస్తాం. వీటికి స్వచ్ఛ సారథి అని లేదా స్వచ్ఛ వారధి అని పేరు పెడదాం. చెత్తను సేకరించే ఆటోలకు టెండర్లు పిలిచి, ఆయా బస్తీల పిల్లలకే ఇద్దాం. వాళ్లకే ఇవ్వాలి. హైదరాబాద్ రోడ్లపై ఎక్కడా ఒక్క కాగితం ముక్క కూడా ఉండకూడదు. ఇంటినుంచి ఆటోలకు.. అక్కడి నుంచి ట్రక్‌లకు వెళతాయి. ఈ చెత్తను ఎక్కడ వేసినా వర్షాకాలంలో అంతా తడిసి భూగర్భజలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో ఉపయోగిస్తున్న విధానాలు అనుసరిద్దాం. చెత్తను నిర్మూలించడానికి అభివృద్ధి చెందిన దేశాల్లో రెండు రకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. ఒకటి చెత్తద్వారా విద్యుత్‌ను తయారు చేస్తున్నారు. రెండోది తడి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువులను తయారు చేస్తున్నారు. మనం కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తాం. నగరంలో షాపుల వాళ్లు ఉదయం 10 గంటలకు తీస్తారు. ఆ తరువాత ఊచ్చి, చెత్తను రోడ్లపైవేస్తారు. పారిశుధ్య కార్మికులు అప్పటికే రోడ్లు ఊడ్చి వెళతారు. షాపులవాళ్లు కూడా డస్ట్ బిన్‌లు ఏర్పాటు చేసుకునేలా చేయాలి. రెండు నెలల్లో శానిటేషన్ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తాం.

నగరంలో చాలాచోట్ల విద్యుత్ లైన్లు ఇండ్ల మీదనుంచి పోతున్నాయి. కొన్ని చోట్ల 133 కేవీ లైన్లు కూడా ఉన్నాయి. వీటివల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ విధంగా ఉన్న అన్ని విద్యుత్ లైన్లను తొలగించాలని ట్రాన్స్‌కో, డిస్కమ్ అధికారులకు చెప్పాం. పవర్, కేబుల్ వైర్లు అండర్ గ్రౌండ్‌లో (డక్ట్ వ్యవస్థ) ఉండే విధంగా రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దాలి.

నగరంలో ఇంటింటికీ మంచినీళ్లు చాలా ప్రాంతాల్లో మంచినీరు, సీవరేజ్ నీరు కలిసిపోతున్నాయి. నల్లాల్లో మురుగునీరు వస్తున్నది. ఇలా మంచినీళ్లు, మురుగునీళ్లు కలువకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించా. బస్తీలవారీగా వచ్చిన సమాచారాన్నంతటినీ క్రోడీకరించి పరిష్కరిద్దాం. నగరంలో కూడా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు సరఫరాచేస్తాం. గోదావరి, కృష్ణాద్వారా నగరానికి మంచినీరు అందిస్తాం. దాదాపు 35 టీఎంసీల నీరు తెచ్చుకుందాం.

మల్టీలెవల్ పార్కింగ్‌లు కూరగాయలు, మాంసం మార్కెట్లు, శ్మశానవాటికలు, పార్కులు, బస్‌బేలు మెరుగుపర్చాలి. వంద మార్కెట్లు, 50-60 చోట్ల మల్టీలెవల్ పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేయిస్తాం. మొదటి రెండు నెలలు ప్రజలను భాగస్వామ్యం చేసే అంశంపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత జనాభా, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. ఈ నెల 26న జరిగే సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, సఫాయి కర్మచారీల వేతనాలు పెంచుకుందాం. భవన శిథిలాలు మైనింగ్ గుంతలలో వేయాలి. కరెంటు, మంచినీటి సరఫరాలతో సానుకూల ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రజలు కూడా నమ్ముతారు.

అందరికీ ధన్యవాదాలు స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ చేతులు జోడించి దండం పెట్టారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అభినందించారు. ప్రజలతో మమేకమైన గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. డీజీపీతోసహా పోలీసులందరూ పాల్గొన్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజలు బాగా కలిసివచ్చారని, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచిపేరు వచ్చిందని కేసీఆర్ చెప్పారు. ఇతర రాష్ర్టాలు దీనిని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు.

ఆరునెలల్లో కొత్త హైదరాబాద్‌ను చూస్తాం: గవర్నర్ ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌వద్ద ప్రణాళికలున్నాయని గవర్నర్ నరసింహన్ చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో కొత్త హైదరాబాద్‌ను చూస్తాననే నమ్మకం తనకుందని అన్నారు. జీహెచ్‌ఎంసీ బాగా పని చేస్తున్నదని గవర్నర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్యమంత్రికి గవర్నర్ అభినందనలు తెలిపారు. సమావేశంశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రారంభోపన్యాం చేయగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఐదురోజుల పాటు జరిగిన కార్యక్రమాన్ని వివరించారు. కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ సమావేశ సమన్వయ కర్తగా వ్యవహరించారు. బస్తీలల్లో పర్యటించిన సందర్భంగా ఎదురైన అనుభవాలను అధికారులు ఈ సమావేశంలో వివరించారు. సీనియర్ అధికారులు ప్రదీప్‌చంద్ర, మహేందర్‌రెడ్డి, మిశ్రా, ఏకే ఖాన్, పీకే అగర్వాల్, తేజ్‌దీప్‌కౌర్, సురేశ్ చంద్ర, ఎన్‌వీఎస్ రెడ్డి, కళ్యాణ్‌చక్రవర్తి, బీఆర్ మీనా, తిరుపతయ్య, ప్రభాకర్‌రావు, శ్రీనివాసరెడ్డి, చంద్రవదన్, యాదగిరి తదితరులు తమ అనుభవాలను వివరించారు. ఈ సమావేశంలో ఇంకా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో పాటు స్వచ్ఛ హైదరాబాద్ బృందాలు పాల్గొన్నారు.

నగరంలో నా ఫొటోలతో పోస్టర్లు వద్దు ఇకపై నగరంలోని మెట్రో పిల్లర్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో తన ఫొటోలతో కూడిన పోస్టర్లు ఉందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నాతో పాటు నగరంలో ఎవరి పోస్టర్లు, రాజకీయ పార్టీల పోస్టర్లు, గోడలపై లేకుండా చేయాలి. వాటన్నింటినీ తొలగించాలి అన్నారు. మంత్రుల పోస్టర్లు కూడా ఉండొద్దని చెప్పారు. ఇదే విధానాన్ని ఇతర రాజకీయ పార్టీలు కూడా అనుసరించాలని ఆయన ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.