-సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలి -ఓటర్లకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపు -సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా: సుజాత

ప్రజా ఉద్యమాలతోపాటు తెలంగాణ ఏర్పాటులో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సేవలు ఎనలేనివని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. ఆయన సేవలను టీఆర్‌ఎస్ మరువదని, దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంగళవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్, అందోల్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌లతో కలిసి మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో సోలిపేట నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామలింగారెడ్డి సతీమణి సుజాత వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ ఆమెను ఓదార్చి ధైర్యం చె ప్పారు. రామలింగారెడ్డి చేసిన సేవలను గుర్తించి దుబ్బా క ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసేందుకు సుజాతకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, పోటీకి సిద్ధం కావాలని హరీశ్‌రావు ఆమెను కోరారు. నియోజకవర్గ ప్రజలు కూడా నిండు మనస్సుతో ఆమెను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు తొగుట/దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధికి ఆకర్షితులై ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరుకుంటున్నారు. మంగళవారం సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో తొగుట మండలం రాంపూర్ సర్పంచ్ అప్పనపల్లి శ్యామల ఆంజనేయులు ఆధ్వర్యంలో బీజేపీ నుంచి ఉప సర్పంచ్ శిరీష, ఏడుగురు వార్డు సభ్యులు లచ్చొల్ల పోశయ్య, లచ్చొల్ల రమేశ్, లింగొల్ల కనకయ్య, శేరుపల్లి యాదగిరి, రాజు, లచ్చొల్ల ఆంజనేయులు, లింగాపూర్‌కు చెందిన బీజేపీ నాయకులు సప్పెట భూపాల్‌రెడ్డి, సీపీఐ నుంచి మస్కూరి శంకరయ్య, అక్కారం రాములు బీజేపీ నుంచి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన బ్రాహ్మణ బంజేరుపల్లి టీఆర్‌ఎస్‌కు బాసటగా నిలిచింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని ఆ గ్రామస్థులు మంగళవారం మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. అలాగే, దుబ్బాక రెడ్డి సంఘంలో జరిగిన కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎంపీటీసీ మాధవి, మాజీ సర్పంచ్, సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. దుబ్బాకకు చెందిన టీజీవీపీ నాయకులు చరణ్‌తేజతో పాటు సుమారు వందమంది మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల వేళ వచ్చి మాయమాటలు చెప్పి తర్వాత మాయమైపోతారని ఈ సందర్భంగా హరీశ్‌రావు విమర్శించారు. ముంపు బాధితుల త్యాగాలు మరువలేనివి, వారిని గుండెల్లో పెట్టుకొని కాపాడు కుంటామన్నారు. నవంబర్ 3న జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సుజాత సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించినందుకు తమ కుటుంబం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుందని ఆమె తెలి పారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆ నాడు సీఎం కేసీఆర్ పెండ్లి పెద్దగా ఉండి తమ వివాహం చేశారని, తమ పిల్లలకూ ఆయన చేతుల మీదుగానే పెండ్లిళ్లు జరిగాయని సుజాత గుర్తుచేశారు. రామలింగారెడ్డి మృతితో ధైర్యాన్ని కోల్పోయిన తమకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు గ్రామానికి వచ్చి ధైర్యాన్ని నింపారని ఆమె కన్నీరుకార్చారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మంత్రి హరీశ్‌రావు సైతం కంటతడిపెట్టారు.