తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధితోపాటు పల్లెసీమల అభివృద్ధికి తనదైన శైలిలో కృషిచేస్తున్న రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరోసారి జాతీయస్థాయి గౌరవం దక్కింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన లైఫ్‌ైస్టెల్ మ్యాగజైన్ రిట్జ్, జాతీయ చానళ్లలో టాప్ రేటింగ్‌లో ఉన్న సీఎన్‌ఎన్-ఐబీఎన్ సంయుక్తంగా మంత్రి కేటీఆర్‌కు మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ ఐకాన్ (అత్యంత స్ఫూర్తి ప్రతీక) అవార్డుకు ఎంపిక చేశాయి. దేశంలోని పలు రంగాల్లో విశేషమైన ప్రతిభ కనబర్చినవారిని విభిన్న అంశాల ప్రాతిపదికన విశ్లేషించి పలు క్యాటగిరీల్లో అవార్డుకు ఎంపిక చేస్తుంటారు.

-విఖ్యాత రిట్జ్- సీఎన్‌ఎన్ ఐబీఎన్ పురస్కారానికి ఎంపికైన మంత్రి -ప్రజాజీవితంలో అద్భుత పురోగతి సాధించారు -అపారమైన జ్ఞానం కలిగి ఉన్న కొత్తతరం నేత -కేటీఆర్‌కు అవార్డు ఎంపిక కమిటీ ప్రశంసలు -13న బెంగళూరులో అవార్డు ప్రదానం
ప్రజా జీవితంలో అద్భుత పురోగతి సాధించినందుకుగాను ఈ ఏడాది ఈ అవార్డుకు మంత్రి కేటీఆర్‌ను ఎంపిక చేసినట్లు రిడ్జ్- సీఎన్‌ఎన్‌ఐబీఎన్ తెలిపింది. పరిపాలనలో ఉన్నత ప్రమాణాలు నిలిపి, తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్న తెలివైన నాయకుడని మంత్రి కేటీఆర్ గురించి ఎంపిక కమిటీ విశ్లేషించింది. ప్రజల అవసరాలపైన అపారమైన జ్ఞానం కలిగి ఉన్న కొత్తతరం రాజకీయ నాయకుడిగా ఎంపిక కమిటీ కితాబిచ్చింది. ఈ మేరకు మంత్రిని అభినందిస్తూ ప్రత్యేకంగా ఈ-మెయిల్ పంపించింది. డిసెంబరు 13న బెంగళూరులోని తాజ్ వెస్ట్‌ఎండ్ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనుంది.
త్వరలోనే సంస్థ సీనియర్ ప్రతినిధి బృందం స్వయంగా మంత్రి కేటీఆర్‌ను కలిసి అవార్డు వివరాలను వివరించనున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులను ఈ అవార్డుకు ఎంపికచేశారు. గతంలో రిట్జ్ పత్రిక మంత్రి కేటీఆర్‌ను ది కంప్లీట్ మ్యాన్‌గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. మ్యాన్ ఆన్ ఏ మిషన్ పేరుతో యూ అండ్ ఐ మ్యాగజైన్ కితాబిచ్చింది.
ఈ గుర్తింపు తెలంగాణ ప్రభుత్వానికే: మంత్రి కేటీఆర్ రిట్జ్, సీఎన్‌ఎన్-ఐబీఎన్ అవార్డుకు ఎంపికకావడంపై మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమంకోసం పనిచేస్తూ అన్ని రంగాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన గుర్తింపే ఈ జాతీయ అవార్డు అని మంత్రి తెలిపారు.