Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శ్రేయోరాజ్యమే లక్ష్యం

కరోనాతో రాష్ట్రాలకు రాష్ట్రాలు కుదేలవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ప్రజల సహకారంతో సుస్థిరమైన బడ్జెట్‌ను రూపొందించుకోగలిగింది. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధికి ఆలంబనగా నిలిచే బడ్జెట్‌ ఇది. బంగారు తెలంగాణ లక్ష్యమని టీఆర్‌ఎస్‌ హామీనిచ్చినట్లు ప్రభు త్వం అదే దిశగా అడుగులు వేస్తున్నది. ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమం, పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక అంశాల మీద కసరత్తు చేసి అద్భుత బడ్జెట్‌ తెచ్చారు. 2021-22కుగాను రూ.2,30,875 కోట్ల బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీశ్‌రావు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఉన్న ఆదాయంలో అన్ని వర్గాల, అన్ని రంగాల అభివృద్ధికి పెద్దపీట వేసి ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు అద్దం పట్టారు.

సంక్షేమ పథకాల రూపకల్పనలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో అమలుచేయని సంక్షేమ పథకమంటూ లేదు. ఏయే వర్గాలకు ఏయే పథకాలు అవసరమో అన్నింటినీ గుర్తించి వాటిని దశలవారీగా అర్హులకు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రేయోరాజ్య స్ఫూర్తిని చాటుతున్నారు. రైతులకు ప్రాధాన్యమిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం బర్రెల పంపిణీ పథకంతో సత్పలితాలు సాధించింది. వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, వికలాంగులకు సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆపన్నహస్తం అందిస్తున్నది.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్‌లోను పేద ప్రజల సంక్షేమానికి అగ్రతాంబూలమివ్వడమే కాదు- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా కేటాయింపులు, వ్యయాలు పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు ప్రతిపాదించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11వేల కోట్లు కేటాయించడంతో ఇండ్ల పూర్తికి చిత్తశుద్ధితో ఉన్నదని అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రతిసారీ సాగునీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. రూ.16,931 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో పారిశ్రామిక రంగం తిరోగమనంలో ఉంటే మన రాష్ట్రంలో మాత్రం పురోగమనంలో ఉండటానికి ఏకైక కారణం మంత్రి కేసీఆర్‌ చూపిస్తున్న చొరవే.

జనాభాలో సగంగా ఉన్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి రూ.1,702 కోట్లు కేటాయించారు. ప్రగతి బాటలో రహదారుల పాత్ర ఎంతో కీలకమైంది. తెలంగాణ రాష్ట్రంలోని హైవేలు, ప్రధాన రహదారులే కాకుండా గ్రామీణ ప్రాంతాలలోనూ మెరుగైన రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నది. బంగారు తెలంగాణకు భాగ్యనగరాన్ని మణిహారంలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, అభివృద్ధి వికేంద్రీకరణ వంటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణను అన్ని అంశాల్లోనూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై ఉన్నారు. తలపెట్టిన అభివృద్ధి యజ్ఞాన్ని పట్టుదలతో కొనసాగిద్దాం. సమాజంలో అట్టడుగున్న ఉన్న ఆఖరి వ్యక్తి దాకా ప్రగతి ఫలాలను అందిద్దాం.
(వ్యాసకర్త: జూబ్లీహిల్స్‌ శాసనసభ్యుడు)
మాగంటి గోపినాథ్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.