Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శ్రీరాంసాగర్ కు పునరుజ్జీవం

శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు శ్రీరాంసాగర్ పునరుజ్జీవన కార్యక్రమం చేపట్టారు. కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి గోదావరి జలాలను మళ్ళించి శ్రీరాంసాగర్‌కు తిరిగి ఊపిరి పోసి పునర్ వైభవం కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు.

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం కీలమైన పథకాన్ని ప్రారంభిస్తున్నాం. సమైక్య పాలనలో ఎస్.ఆర్. ఎస్.పి. గురించి పదే పదే ఊదరగొట్టినారు. 1964లో ప్రారంభించిన ప్రాజెక్టుకు నిన్న మొన్నటి దాకా కాల్వలు తవ్వుతూనే ఉన్నారు. కానీ ఏనాడూ ఎస్.ఆర్.ఎస్.పి. నిండింది లేదు. కాల్వలు పారింది లేదు. పొలాలు పండింది లేదు. ఎస్.ఆర్.ఎస్.పి అనేది చూసుకుని మురుసుడు, చెప్పుకుని ఏడ్చుడు అన్నట్లయింది. ఎస్.ఆర్.ఎస్.పి. ప్రాజెక్టును సమైక్య రాష్ట్రంలో పాలకులు వట్టిపోయేలాగా చేసినారు. దశాబ్దాల పాటు కొనసాగిన తీవ్ర నిర్లక్ష్యం, వివక్ష ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలు శిథిలమైనాయి. ప్రాజెక్టు ఉండి కూడా లేనట్లే అయింది. ఎడారిలో ఒయాసిస్సులా కావాల్సిన ప్రాజెక్టు ఎండమావిలా మిగిలింది. ఎస్.ఆర్.ఎస్.పి. ఆయకట్టు రైతులకు కన్నీళ్లే తప్ప ఏనాడూ సాగునీళ్లు రాలేదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద రైతుల ప్రయోజనాలని కాపాడేందుకు శ్రీరాంసాగర్ పునరుజ్జీవన కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్ స్వయంగా పోచంపాడు వద్ద ఎస్.ఆర్.ఎస్.పి. పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన చేస్తున్నారు. అక్కడే బహిరంగ సభను కూడా నిర్వహిస్తారు. కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి గోదావరి జలాలను మళ్ళించి శ్రీరాంసాగర్‌కు తిరిగి ఊపిరి పోసి పునర్ వైభవం కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుని 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో, 196 టీఎంసీల నీటి వినియోగం కోసం నిర్మించారు. ఎగువన మహారాష్ట్ర అనేక బ్యారేజీలని నిర్మించడంతో శ్రీరాంసాగర్ వద్ద నీటి లభ్యత 54 టీఎంసీలకు పడిపోయింది. 25 సంవత్సరాల గోదావరీ ప్రవాహ లెక్కలు కూడా విషయాన్ని ధృవీకరించాయి. పూడిక వలన జలాశయం నిల్వ సామర్థ్యం కూడా 80 టీఎంసీలకు పడిపోయింది. దానితో శ్రీరాంసాగర్‌పై ఆధారపడిన వివిధ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరందించడం దుర్లభమైంది.

చరిత్రలో ఎస్.ఆర్.ఎస్.పి. చివరి ఆయకట్టుకు ఎన్నడూ కూడా నీరు అందని విషయం రైతులందరికీ అనుభవమే. భూపాలపల్లి నియోజకవర్గంలో 85వేల ఎకరాల ఆయకట్టు చూపించారు. కానీ ఎన్నడూ ఒక్క ఎకరం కూడా పారలేదు. డోర్నకల్ నియోజకవర్గంలో 58వేల ఎకరాల ఆయకట్టు చూపిస్తే అక్కడా ఒక్క ఎకరం పారలేదు. మొత్తం ఎస్.ఆర్.ఎస్.పి. ఆయకట్టు 14 లక్షల ఎకరాలైతే, కనీసం సగం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదు. 8500 క్యూసెక్కుల సామర్థ్యంతో కాల్వలు ప్రవహించాలి కానీ, 3500 క్యూసెక్కులకు మించి పారలేదు. నిజానికి ఎస్.ఆర్.ఎస్.పి. ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని లాంటిది. దీనిపై ఆధారపడి ఎంతో ఆయకట్టు, ఎన్నో పథకాలున్నాయి. దిగువ మానేరు వరకు కాకతీయ కాలువ ఆయకట్టు, సరస్వతి కాలువ ఆయకట్టు, లక్ష్మి కాలువ, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ఆయకట్టు, ఆలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నిజామాబాద్ జిల్లా ప్యాకేజీలు 21, 22 ల ఆయకట్టు, నిర్మల్ జిల్లా ప్యాకేజీలు 27, 28 ల ఆయకట్టు, శ్రీరాంసాగర్ జలాశయం నుండి నిర్మించిన నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆయకట్టుకు నీరందించే చిన్న తరహా లిఫ్ట్ పథకాలు, మిషన్ భగీరథ కోసం నీటి సరఫరా… ఇవన్నీ శ్రీరాంసాగర్ జలాశయం మీద ఆధారపడినవే. వీటికి మొత్తం మీద అవసరమయ్యే నీరు 95 టీఎంసీలు, ఆధారపడిన ఆయకట్టు 9.73 లక్షల ఎకరాలు. కానీ ఎస్.ఆర్.ఎస్.పి జలాశయానికి తగినంత నీరు రాకపోవడం, కాలువలు శిథిలావస్థకు చేరడం వల్ల ఈ ప్రాజెక్టులపై ప్రభావం పడింది. ఎస్.ఆర్.ఎస్.పి సమృద్ధిగా ఉంటేనే వీటికి ఉపయోగం ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి ప్రవాహాలు లేక జలాశయం ఎండిపోయింది.

జలాశయంలో ఉన్న మొసళ్ళు కూడా బయటకు రావాల్సిన దయనీయమైన స్థితి ఏర్పడింది. ఈ దుర్గతిని తప్పించడానికి ఇవ్వాళ మేం శ్రీరాంసాగర్‌ను పునరుజ్జీవింప జేసే బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కాళేశ్వరం వద్ద వరద కాలువనే జలాశయంగా మార్చి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి నీటిని తరలిస్తునాం. ఈ తరలింపు వల్ల శ్రీరాంసాగర్ మళ్ళీ జలకళను సంతరించుకుంటుంది. 1067 కోట్ల ఖర్చుతో ఈ పునరుజ్జీవన పథకం చేపడతాం. ఏడాదిలో పథకాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎస్.ఆర్.ఎస్.పి పునరుజ్జీవన పథకంలో భాగంగా 22వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం కలిగిన వరద కాలువను రిజర్వాయర్‌గా మారుస్తాం. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు కాళేశ్వరం నీళ్ళను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామం వద్ద వరద కాలువ 99వ కి.మీ. వద్ద జారవిడుస్తారు. అక్కడినుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని మూడు దశల్లో 33మీ. ఎత్తుకు నీటిని పంపుచేసి ఎస్.ఆర్.ఎస్.పి జలాశయంలోకి పంపిస్తాం. ఒక్కొక్క పంపు హౌజ్‌లో 6.5మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎనిమిది పంపులు అమరుస్తాం. ఇందుకోసం 156 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ఇందుకోసం పంపుహౌజ్‌ల నిర్మాణం కోసం కేవలం 40 ఎకరాల భూమిని సేకరిస్తున్నాం.

నిజానికి ఎస్.ఆర్.ఎస్.పి. పునరుజ్జీవన కార్యక్రమం ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఏదైనా ప్రాజెక్టుకు అనుకున్న విధంగా నీటి లభ్యత లేకున్నా, నిర్వహణలో ఏదైనా సమస్య వచ్చినా ప్రత్యామ్నాయాల ద్వారా దానికి పునరుజ్జీవనం కల్పిస్తారు. సమైక్య పాలనలో ఆంధ్ర ప్రాంతంలోని ప్రాజెక్టులను అలాగే ఆధునీకరించారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు, వారికి వంత పాడిన తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రయోజనాలని దారుణంగా దెబ్బతీసారు. ఆంధ్ర ప్రాంత సాగునీటి అవసరాలు తీర్చడం కోసం అక్కడి ప్రాజెక్టులన్నింటినీ ఆధునీకరించుకున్నారు. ధవళేశ్వరం ఆనకట్టను బ్యారేజీగా మార్చి గోదావరి డెల్టా ఆయకట్టును స్థిరీకరించుకున్నారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టును, సుంకేసుల ఆనకట్టను ఆధునీకరించి కేసీ కెనాల్ ఆయకట్టును పూర్తి స్థాయిలో స్థిరీకరించుకున్నారు. తెలంగాణలో మాత్రం ఒక్క ఆనకట్టను కూడా బ్యారేజీగా మార్చిన పాపాన పోలేదు. పైగా ఉన్న ప్రాజెక్టులని ధ్వంసం చేసారు. ఈ విధ్వంసకాండ విష ఫలితాలను తెలంగాణ రైతాంగం నేటికీ అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో స్వయంగా పరిశీలించి సాగునీటి పథకాలకు రూపకల్పన చేసారు. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులని ఆధునికీకరించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

నిజాం కాలంలో మెదక్ జిల్లాలో నిర్మించిన ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచాలని, కాలువలను ఆధునికీకరించాలని ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. ఇవ్వాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనపురం ఆనకట్ట కాలువలను ఆధునికీకరించింది. ఆనకట్ట ఎత్తును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. గతంలో ఈ ప్రాజెక్టు కింద 15 వేల ఎకరాలకు మించి సాగునీరు అందలేదు. మా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇవ్వాళ ఘనపురం ఆనకట్ట కింద పూర్తిస్థాయిలో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నాము. ఈ రకంగా మెదక్ జిల్లా రైతాంగానికి గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దగలిగాం. నిజాం కాలంలోనే నిర్మల్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాటు ఆనకట్ట ఒక అద్భుతం. దీని ద్వారా గతంలో 15 వేల ఎకరాలకు సాగునీరు అందేది. ఎగువన శ్రీరాంసాగర్ నిర్మాణంతో సదర్మాటు ఆనకట్టకు నీటి ప్రవాహాలు తగ్గిపోయినాయి. ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆనకట్టను బ్యారేజీగా మార్చి వరద కాలంలో నీటిని నిలువ చేస్తే సదర్మాటు రైతుల అవసరాలు తీర్చవచ్చు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో సదర్మాటు రైతుల ఆవేదన అరణ్య రోదనగా మిగిలిపోయింది. ఇవ్వాళ తెలంగాణను సాధించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సదర్మాటు బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నది. 1.58 టీఎంసీల నిల సామర్థ్యం కలిగిన సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం వల్ల ఉభయతారకంగా ఇటు సదర్మాట్ ఆయకట్టుతో పాటు కుడివైపున జగిత్యాల జిల్లాలో గంగానాల ప్రాజెక్టు కింద ఉన్న 5000 ఎకరాల ఆయకట్టు కూడా స్థిరీకరణ పొందుతుంది. సదర్మాటు బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం 516.23 కోట్లను మంజూరు చేసింది. బ్యారేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

తెలంగాణ సమాజానికి జీవన రేఖగా ఉన్న గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను గత పాలకులు దుర్మార్గంగా ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసారు. విలీనానికి ముందు తెలంగాణలో 75 వేల చెరువులు ఉంటే తెలంగాణ అవతరణ నాటికి 46 వేలు మాత్రమే శిథిలావస్థలో మిగిలి ఉన్నాయి. ఈ చెరువులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ పథకాన్ని రూపొందించి ఇప్పటికే రెండు దశల్లో 18 వేల చెరువుల పునరుద్ధరణ విజయవంతంగా పూర్తి చేసాం. మిషన్ కాకతీయ అమలు ఫలితంగా 2016–-17 పంట కాలంలో 15 లక్షల ఎకరాలు చెరువుల కింద సాగులోనికి వచ్చినాయి. గతంలో మంచి వర్షాలు కురిసిన ఏడు ఇది 10 లక్షలకు మించలేదు. అయిదు దశల్లో చెరువుల పునరుద్ధరణ పూర్తి అయిన తర్వాత చెరువుల కింద 25 లక్షల ఎకరాలు సాగులోనికి రానున్నాయి.

తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు ఎన్నో ఏండ్ల కింద ఉన్న నీటి వనరులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందులో భాగంగానే ఎస్.ఆర్.ఎస్.పి పునరుజ్జీవన పథకాన్ని చేపట్టాం. దీన్ని విజయవంతం చేయాలని నేను ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులను కోరుతున్నాను. -తన్నీరు హరీశ్‌ రావు సాగునీటి శాఖామంత్రి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.