Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

స్టేబుల్‌ సర్కార్‌.. ఏబుల్‌ లీడర్‌

-రైతుల ముంగిట్లో రైతుబంధు ముల్లె
-టీఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ రైతు సర్కారు
-నాడు అన్నమో రామచంద్రా.. నేడు అన్నపూర్ణ
-తెలంగాణలోని పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?
-పథకాలపై బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు చర్చకు సిద్ధమా?
-సాగు రంగాలకు రూ.2.70 లక్షల కోట్లు ఇచ్చాం
-మాటలకందని మహా సంకల్పం రైతుబంధు పథకం
-సంక్రాంతి వరకు రైతుబంధు సంబురాలు
-టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌
-కార్పొరేట్లకు రుణమాఫీ చేసింది మీరు.. రైతులకు రుణ మాఫీ చేసింది మేము.
-నాడు కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, లాక్కొనిపోయే స్టార్టర్లు.
-నేడు పచ్చని పొలాలు, పాడి పంటలు, ధాన్యం రాసులు, అలుగు పారే చెరువులు.
-నాడు భూమి అమ్ముదామన్నా కొనేవాడు లేడు.. నేడు కొందామన్నా అమ్మేవాడు లేడు.
-నాడు రైతు కండ్లల్లో దైన్యం.. నేడు రైతు కల్లాల్లో పుట్లకొద్దీ ధాన్యం.
-నాడు తెర్లు అయిన ఊర్లు.. నేడు తేరుకొంటున్నాయి. ఆగమైన రైతు బాగుపడుతున్నాడు.
-చెరువులు నాడు తాంబాళాలు.. నేడు గంగాళాలు

వ్యవసాయం, అనుబంధ రంగాలపై తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ ఖర్చు చేసిన రాష్ట్రాలు దేశంలో ఏవైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. తెలంగాణ సర్కారు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై గత ఏడేండ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ‘చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రాలు విడుదలచేయటంలో పోటీ పడదాం. నల్ల చట్టాలు చేయటంలో కాదు’ అని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ రైతుబంధు ద్వారా పంపిన రూ.50 వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెకు చేరిందని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ జీ విజయలక్ష్మి, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అభివృద్ధిపై తెలంగాణను అవమానించటం కాదు.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు వారి పాలనలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఏం సాధించారో, ఎక్కువగా ఏం చేశారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ‘తెలంగాణకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం కాదు.. శ్వేతపత్రాల్లో పోటీపడుదాం రండి’ అని సవాల్‌చేశారు.

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భం
స్వాతంత్య్రానంతరం దేశ చరిత్రలో రైతాంగానికి సంబంధించి సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుతమైన సందర్భమిది అని రైతుబంధు ద్వారా రైతులకు రూ.50 వేలకోట్లు పంపిణీ పూర్తయిన సందర్భాన్ని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. ‘60 ఏండ్ల రైతుల గోస తీర్చి, 60 శాతం జనతా కష్టాలను తీర్చి, రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, 60 లక్షల మంది కార్యకర్తల పక్షాన, 65 లక్షల రైతు కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని కేటీఆర్‌ అన్నారు. రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లు జమ అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలను జరుపుకోవాలని ఇచ్చిన పిలుపునకు రైతులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అద్భుతంగా స్పందించారని, కరోనా నిబంధనలు పాటిస్తూనే కార్యక్రమాల్లో భాగస్వాములై రైతుబంధు స్పూర్తిని చాటారని ప్రశంసించారు. కార్యకర్తలు, నాయకుల విజ్ఞప్తి మేరకు రైతుబంధు సంబురాలను సంక్రాంతి వరకు పొడిగించామని తెలిపారు.

కేసీఆర్‌ మహా సంకల్పమే రైతుబంధు
దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ నాయకుడు చేయని, మాటలకందని మహా సంకల్పం సీఎం కేసీఆర్‌ చేశారని, ఆయన మానస పుత్రికే రైతుబంధు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ రైతు సర్కారు అని పార్టీకి కొత్త అర్థాన్ని చెప్పారు. రైతుబంధు రూపంలో 64 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లు జమ కావడం వ్యవసాయ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయమని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల వెతలు పత్రికల్లో ప్రధాన శీర్షికలు అయ్యేవని, తెలంగాణ స్వయం పాలనలో రైతుల బ్యాంకు ఖాతాలు పతాక శీర్షికలు అయ్యాయని తెలిపారు.

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొన్న కష్టాల గురించి ఎంతచెప్పినా తక్కువే. నాడు బోర్ల కింద పంటలు, బోర్లా పడ్డ రైతుల బతుకులు, బోర్ల రాంరెడ్డి వంటి బిరుదులు, ఫెయిల్‌ అయిన బోర్లే ఇంటి పేర్లుగా మారాయి. ముషంపల్లిలో రాంరెడ్డి అనే రైతు 58 బోర్లు వేస్తే ఆయన ఇంటి పేరు బోర్ల రాంరెడ్డిగా మారింది. ప్రాజెక్టులకు దిక్కులేదు. రైతు బతుక్కు భరోసా లేదు. ఆనాడు ఛిద్రమైన బతుకులు, చితికిపోయిన జీవితాలు’ అని కేటీఆర్‌ గుర్తుచేశారు.

నేడు పచ్చని పొలాలు, పాడి పంటలు
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా పచ్చని పొలాలు, పాడి పంటలు, ధాన్యం రాసులు, అలుగులు పారే చెరువులు, చేద బాయిలో చేతికందే నీళ్లు కనిపిస్తాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు ఆరు మీటర్లు పెరిగితే ఐఏఎస్‌ అధికారులకు శిక్షణ ఇచ్చే ముస్సోరీలోని లాల్‌ బహుదూర్‌శాస్త్రి అకాడమీ తమ యువ అధికారులకు కేస్‌స్టడీగా ఇక్కడ పాఠాలు నేర్పిందని తెలిపారు. ‘నిరంతర కరెం టు వెలుగులు, వాపస్‌ వస్తున్న వలసలు, ఒకవైపు రివర్స్‌ పంపింగ్‌, మరోవైపు రివర్స్‌ మైగ్రేషన్‌. తెర్లు అయిన ఊర్లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నయి. ఆగమైన రైతు ఇప్పడిప్పుడే బాగుపడుతున్నడు. చేను చేలక బంగారు తునక అయింది. స్టేబుల్‌ గవర్నమెంట్‌, ఏబుల్‌ లీడర్‌షిప్‌వల్లనే ఇది సాధ్యమైంది’ అని వివరించారు.

మీ రాష్ట్రాల్లో ఈ పథకాలు ఉన్నాయా?
టీఆర్‌ఎస్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రైతులకు రూ.16,144 కోట్లు రుణమాఫీ చేసిందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. రెండోసారి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 4 లక్షల మందికి రుణమాఫీ చేశామని తెలిపారు. తెలంగాణ వచ్చేనాటికి బకాయి ఉన్న రూ.1,325 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు చెల్లించామని, రైతుబంధు ద్వారా 64 లక్షల మంది కుటుంబాలు 2.50 కోట్ల జనాభా లబ్ధి పొందారని వివరించారు. ‘రైతుబంధును కాపీకొట్టి ఒకరు పీఎం కిసాన్‌ అని, మరొకరు కాలియా అని, ఇంకొకరు కృషిబంధు అని పేరు పెట్టుకొన్నారు. రైతుబీమా అనే అద్భుత పథకాన్ని తెచ్చింది కూడా కేసీఆరే. 2014 నుంచి 2018 వరకు ఆత్మహత్య చేసుకొన్న 1,089 మంది రైతులకు రూ. 6 లక్షల చొప్పున బీమా చెల్లించాం. 2019 ఆగస్టు నుంచి నేటివరకు 70 వేల మంది రైతులకు రూ.3,535 కోట్ల బీమా అందజేశాం.

ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. పొలిటికల్‌ టూరిస్టుల రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా లాంటి పథకం ఉన్నదా’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంపై రూ.1.16 లక్షల కోట్లు ఖర్చుచేసిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాడు వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు 1.8 శాతం ఉంటే ఇప్పడు 8.1 శాతానికి పెరిగిందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, పద్మా దేవేందర్‌రెడ్డి, ఏ జీవన్‌రెడ్డి, దానం నాగేందర్‌, కేపీ వివేకానంద్‌, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టిఫెన్‌ సన్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ టీ రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, టీఆర్‌ఎస్‌ నేతలు బండి రమేశ్‌, టీ-శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేశానికి అన్నంపెట్టే రాష్ట్రం
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాటలు ఇప్పుడు నిజమయ్యాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముక్కోటి టన్నుల ధాన్యగారంగా తెలంగాణను మార్చింది కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. ‘నాడు రైతు కండ్లలో దైన్యం ఉండేది. నేడు రైతు కల్లాల్లో పుట్లకొద్దీ ధాన్యం ఉన్నది. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు కావా? అని ప్రశ్నించారు. ‘ఇతర పార్టీలు కార్పొరేట్లకు పన్ను మాఫీ చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు పెట్టుబడికి సాయం చేస్తది, రైతుకు రుణమాఫీ చేస్తది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా కేసీఆర్‌ వస్తారని ఏనాడైనా అనుకున్నారా? ఇలాంటి నాయకుడు దేశంలో ఎక్కడైనా ఉన్నారా? కేసీఆర్‌కు దీటుగా రైతుకు సాయం చేసినవారు ఉన్నారా? అని ప్రశ్నించారు.

నాలుగు రకాల విప్లవాలు
-సస్య విప్లవం
-రెండో హరిత విప్లవం. పుట్లకొద్ది ధాన్యం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కనపడుతున్నది.
-గులాబీ విప్లవం
-మాంసం ఉత్పత్తిలో విప్లవం.
రాష్ట్రంలో 2014తో పోలిస్తే 2020 నాటికి 106 శాతం మాంసం ఉత్పత్తి పెరిగింది. 3.88 లక్షల లబ్ధిదారులకు రూ.4,914 కోట్లతో 81.06 లక్షల గొర్రెలను పంపిణీచేశాం. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,685 కోట్లు.

శ్వేత విప్లవం
విజయ డెయిరీ నష్టాల బాట నుంచి లాభాల బాట పట్టింది. ప్రభుత్వానికి డివిడెండ్‌ ఇచ్చే స్థాయికి వచ్చింది.

నీలి విప్లవం
2016 నుంచి రూ.19,398 కోట్లతో 353 కోట్ల చేప పిల్లలు పంపిణీచేశాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో చేపలు దొరుకుతున్నాయి.

60 ఏండ్ల రైతుల గోస తీర్చి, 60 శాతం జనత కష్టాలను తీర్చి, రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, 60 లక్షల మంది కార్యకర్తల పక్షాన, 65 లక్షల రైతు కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

-మంత్రి కేటీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.