-కార్యకర్తలు పంచాయతీ ఎన్నికలపై దృష్టిసారించాలి -మన పథకాలు దేశానికే ఆదర్శం.. పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం మనదే -సిరిసిల్ల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్ఎస్ -వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు -నియోజకవర్గంలో పంచాయతీలు ఏకగ్రీవం అయితే అదనంగా -రూ.15 లక్షలు మంజూరు చేస్తానని హామీ
టీఆర్ఎస్ కార్యకర్తలంతా పంచాయతీ ఎన్నికలపై దృష్టిసారించాలని, టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేలా కృషిచేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువశాతం ఏకగ్రీవాలు అయ్యేలా చూడాలని కోరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందించే రూ.10 లక్షలకు అదనంగా తన ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.15 లక్షలు మంజూరుచేస్తానని ప్రకటించారు. 2019 ఎన్నికల నామ సంవత్సరమని, పంచాయతీ, పార్లమెంటు, మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగబోతున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజ యం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సిరిసిల్ల, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలాల కార్యకర్తలతో సమావేశమై పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ఆయువుపట్టు అని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న నాయకులంతా గుంపులుగా రాష్ర్టానికి వచ్చినా.. కార్యకర్తల బలంతోనే కేసీఆర్ వారిని సింగిల్‌గా ఎదుర్కొన్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలంతా తన కోసం పనిచేశారని, ఇప్పుడు తాను కార్యకర్తల కోసం పనిచేస్తానని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రానివారికి సొసైటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. 88 సీట్లు గెలిచామన్న గర్వం లేకుండా ప్రజలు కోరినవిధంగా పాలన అందించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని కార్యకర్తలకు సూచించారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పునరుద్ఘాటించారు.

మన పాలన దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు రైతుబంధు వంటి పథకాలను ప్రకటించాయన్నారు. రైతులను విస్మరిస్తే పుట్టగతులు ఉండవన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రైతుబంధు తరహా పథకం అమలుచేయబోతున్నారని చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని 11 రాష్ర్టాల్లో ప్రారంభిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని పేర్కొన్నారు. ఇలా దేశమంతా తెలంగాణవైపే చూస్తున్నదని వివరించారు.
చరిత్ర తిరగరాసిన తెలంగాణ ప్రజలు గతంలో ముందస్తు ఎన్నికలకు పోయినవారంతా విజయం సాధించలేదని, కానీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించి చరిత్రను తిరుగరాశారని కేటీఆర్ కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు ప్రచారంచేసినా, విపక్షాలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మీడియా ఎంత దుష్ప్రచారంచేసినా ప్రజలు కేసీఆర్ వెంటే ఉండి అఖండ మెజార్టీతో గెలిపించారని చెప్పారు. నాలుగున్నరేండ్ల పాలన చూసి 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ పేదలపక్షం లేని పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు. జిల్లా ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఢిల్లీలో రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని కొనియాడారు.
ఏకగ్రీవ పంచాయతీలకు రూ.25లక్షలు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువశాతం ఏకగ్రీవం అయ్యేటట్టు చూడాలని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే పంచాయతీలకు ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రోత్సాహకం అందిస్తే, అదనంగా ఎమ్మెల్యే నిధుల నుంచి మరో రూ.15 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ రూ.25 లక్షలతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్‌లో పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా ఎన్నికైన మంజుల నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపూర్ను అన్ని గ్రామాలూ ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గంలో అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. జనవరి 25 వరకు జరిగే ఓటరు నమోదు కార్యక్రమంలో కార్యకర్తలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి బస్వరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని తదితరులు పాల్గొన్నారు.
