-బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్తున్నాం
-గ్లోబల్ పెట్టుబడిదారుల సమావేశంలో మంత్రి కేటిఆర్
-ముంబైలో ఒకరోజు పర్యటనలో కేటీఆర్ బిజీబిజీ
-ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్తో ప్రత్యేక సమావేశం
-సూక్ష్మ,చిన్నతరహా పరిశ్రమల బలోపేతంపై పలువురు పారిశ్రామికవేత్తలతో సుదీర్ఘ చర్చ
-చందాకొచ్చర్, జిందాల్, నీలేశ్గుప్తాలతో భేటీలు
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని ఒక స్టార్టప్ కంపెనీలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు. ఉన్నతమైన నిబద్ధత, పట్టుదలతో రాష్ట్రంలో పెట్టుబడులకోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.తాము రూపొందించిన పారిశ్రామిక పాలసీ, ఇతర పాలసీలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, పెట్టుబడుల సేకరణవంటి బహుముఖ లక్ష్యాలతో ముందుకెళుతున్నామని వివరించారు. ముంబై పర్యటన సందర్భంగా మంత్రి కేటిఆర్ సోమవారం పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.ఉదయం ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచ్చర్‌తో మంత్రి సమావేశమయ్యారు.తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డిజిటల్ ఇనిషియేటివ్స్పై ఆమెతో చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న టీ ఫండ్‌లో భాగస్వాములు కావాలని కోరారు. తర్వాత మంత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. జేఎస్ డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్‌తో సమావేశమై.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సమావేశం తర్వాత రామ్‌పై సజ్జన్ జిందాల్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధిపట్ల కేటీఆర్‌కు ఉన్న నిబద్ధత, ఆలోచనలు, ఇతర రాజకీయ నాయకులకూ ఉంటే.. దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని జిందాల్ ట్వీట్‌చేశారు. తర్వాత లూపిన్ ఇండియా ఎండీ నీలేశ్ గుప్తాతో సమావేశమైన మంత్రి.. రాష్ట్రంలోని ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సాయంత్రం జరిగిన వార్షిక గ్లోబల్ పెట్టుబడిదారుల సమావేశంలో.. స్టార్టప్ స్టేట్‌గా మూడేండ్ల తెలంగాణ ప్రయాణం అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు.తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కావాల్సిన ప్రణాళికలు మంత్రి కేటీఆర్ వద్ద ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపట్ల రామ్‌కు ఎంత అంకితభావం, చిత్తశుద్ధి ఉన్నాయో ప్రత్యక్షంగా చూశాక అద్భుతమనిపించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపనను కేటీఆర్‌లో గుర్తించగలిగాను. అదే తపన నన్ను కూడా ముందుకు నడిపిస్తుంది. ప్రతి రాజకీయ నాయకుడు రామ్ తరహాలో కృషిచేయాల్సిన అవసరం ఉంది. రామ్‌లాంటి వ్యక్తులు భారతదేశాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తారు.
– ట్విట్టర్లో సజ్జన్ జిందాల్ ప్రశంసలు
చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి మద్దతివ్వండి
రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ను మంత్రి రామ్ కోరారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సమస్యలపై, వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా వివరిస్తూ రాసిన లేఖను పటేల్‌కు మంత్రి అందజేశారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఆర్బీఐ నుంచి కావాల్సిన మద్దతు గురించి మంత్రి వివరించారు. దేశ ఆర్థికవ్యవస్థలో చిన్నతరహా పరిశ్రమల పారిశ్రామికోత్పత్తి 45% ఉందని, మొత్తం 40% ఎగుమతులు చిన్నతరహా పరిశ్రమల నుంచే వస్తున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు.
చిన్నతరహా పరిశ్రమలతో లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, ఇలాంటి రంగానికి కేంద్ర బ్యాంకు సహకారం అవసరమని మంత్రి ఆయనకు వివరించారు. ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆశించిన మేరకు చిన్నతరహా పరిశ్రమలకు సహకారాన్ని అందించడం లేదని, చాలా సందర్భాల్లో ఇవి చిన్నతరహా పరిశ్రమలను ఖాయిలా పరిశ్రమలుగా గుర్తించి వేలం వేస్తున్నాయని విచారం వ్యక్తంచేశారు. చిన్నతరహా పరిశ్రమలను నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా గుర్తించడంలో ఆర్బీఐ ఇచ్చిన టెక్నో వయబిలిటీ అధ్యయనం, కనీసం పదిహేడు నెలల గడువువంటి మార్గదర్శకాలను బ్యాంకులు చాలా సందర్భాల్లో ఉల్లంఘిస్తున్నాయని మంత్రి ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని ఒక ప్రభుత్వ బ్యాంకు అక్కడి చిన్నతరహా పరిశ్రమను ఎన్పీఏగా గుర్తించిన 15 రోజుల్లోనే వేలంవేసిన విషయాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్నతరహా పరిశ్రమల బకాయిల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు జిల్లాస్థాయిలో ఒక కమిటీని ఏర్పాటుచేయాలన్న ఆర్బీఐ మార్గదర్శకాలను చాలా బ్యాంకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇదేవిధంగా, రాష్ట్రస్థాయి ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 69,120 గుర్తింపు పొందిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలుండగా, సుమారు 8,618 పరిశ్రమలను సిక్ యూనిట్లుగా గుర్తించినట్టు తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇందుకోసం సుమారు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేసిందని వివరించారు. ఈ హెల్త్ క్లీనిక్లద్వారా చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వంలోని వివిధ శాఖల సహకారంతోపాటు, వివిధ ఆర్థిక సంస్థల నుంచి సహాయం అందేలా చూస్తున్నదని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యం గల తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను ప్రత్యేక ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా గుర్తించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను ఆర్బీఐ అందించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
సిర్పూర్ పేపర్ మిల్లుపై ఐడీబీఐ చైర్మన్ ఎంకే జైన్‌ను కలిసిన కేటీఆర్.. సిర్పూర్ పేపర్ మిల్లును తెరువడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఇదే అంశంపై ఐడీబీఐ అధికారుల బృందంతోకూడా మంత్రి విస్తృతస్థాయి చర్చలు జరిపారు. కేటీఆర్‌పై సజ్జన్ జిందాల్ ప్రశంసల జల్లు జేఎస్‌డబ్ల్యూ సీఎండీ సజ్జన్ జిందాల్‌తో సమావేశం ఫలప్రదమైందని, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపానని మంత్రి కేటీఆర్ ముంబై నుంచి ట్వీట్ చేశారు. తెలంగాణకు రావాల్సిందిగా జిందాల్‌ను కోరామని తెలిపారు. ఆ తర్వాత, జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ ట్వీట్ చేస్తూ.. ఉత్సాహపూరితమైన వాతావణంలో కేటీఆర్‌తో చర్చలు జరిగాయని పేర్కొన్నారు.