Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

20 కోట్లతో ఘనంగా అవతరణ పండుగ

-వారం పాటు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు -హైదరాబాద్‌లో భారీగా ముగింపు ఉత్సవం -విద్యుత్ శాఖలో 1919 ఇంజినీర్ పోస్టుల భర్తీ -ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ -పోలీసు అమరవీరుల కుటుంబాలకు 40 లక్షల పరిహారం -రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు

KCR

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వారం పాటు అవతరణ ఉత్సవాలు నిర్వహించాలని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారిని సన్మానించాలని మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలో 1919 కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. మరోవైపు తీవ్రవాద హింసాత్మక సంఘటనల్లో మరణించిన పోలీస్ కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.40 లక్షలకు పెంచే ప్రతిపాదనపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వేసవి నీటి ఎద్దడి నివారణ చర్యలతో పాటు ఇతర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

వారం పాటు రాష్ర్టావతరణ ఉత్సవాలు.. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయపతాకావిష్కరణ చేయాలని మంత్రిమండలి నిర్దేశించింది. జూన్ 2 నుంచి 8 వరకు వారం పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవాలు నిర్వహించాలని, చివరిరోజున ముగింపు ఉత్సవం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లాకు కోటి రూపాయలకు తక్కువ కాకుండా మొత్తంగా రూ.20 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి మండల స్థాయిలో రూ.10,116, జిల్లా స్థాయిలో రూ.50,116, రాష్ట్ర స్థాయిలో లక్షా 116 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే జూన్ చివరివారంలో విద్యాసంస్థలలోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పాటల పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు.

తీవ్రవాదుల హింసాత్మక సంఘటనల్లో మరణించిన పోలీస్ కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇలాంటి సంఘటనల్లో గాయపడిన ఇతరులకు, ఆస్తులు నష్టపోయినవారికి ఎంత మొత్తంలో పరిహారం చెల్లించాలో నిర్ణయించేందుకు హోంశాఖ మంత్రి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఉంటారు. ఇక పోలీస్ శాఖలో ఖాళీగ ఉన్న 3,620 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ వేసవి కాలంలో గ్రామాలు, మున్సిపాలిటీల్లో నెల కొన్న నీటి ఎద్దడిపై చర్చించి నివారణ చర్యలు తీసుకోవడానికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద అవసరమైన నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు. సిరిసిల్లలో పవర్ లూమ్ వీవర్స్‌కు 2010-14 వరకు ఉన్న రూ. 7 కోట్ల 19 లక్షల టారిఫ్‌కన్సేషన్ మంజూరు చేస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.

విద్యుత్ సంస్థల్లో 2,600 పోస్టులు రాష్ట్ర విద్యుత్ శాఖలో జెన్‌కో, ట్రాన్స్‌కో, రెండు డిస్కమ్‌ల పరిధిలో కొత్తగా 1,919 ఇంజనీర్ పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యుత్‌సంస్థల్లో పదవీ విరమణ, పదోన్నతులతో ఏర్పడే ఖాళీలు 681 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం అనుమతించింది. దీంతో మొత్తంగా 2,600 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెలాఖరులో 1,919 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటన వెలువడనున్నది. వచ్చే మూడు, నాలుగు నెలల్లో కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించింది. కొత్త పోస్టుల అంశం మూడు నెలలుగా ప్రభుత్వ పరిశీలనలో ఉండగా మంగళవారం క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టేబుల్ ఐటమ్‌గా ఈ అంశాన్ని తీసుకువచ్చారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షకు లోబడి కొత్త పోస్టులకు సర్కారు పచ్చజెండా ఊపింది. వచ్చే మూడేళ్ళలో అదనంగా ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు నేపథ్యంలో జెన్‌కోకు కొత్త పోస్టుల అవశ్యకతను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. దాని కనుగుణంగా ట్రాన్స్‌కో, రెండు డిస్కమ్‌ల పరిధిలో విద్యుత్ వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రస్తుతం క్షేత్రస్థాయి(సెక్షన్ ఆఫీసు)లో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)లపై తీవ్రమైన పనిభారాన్నితగ్గించడం, కొత్త సెక్షన్ ఆఫీసులను ఏర్పాటుచేయడం, ఇటీవల కొత్తగా ఏర్పాటుచేసిన సిద్దిపేట సర్కిల్‌కు అవసరమైన పోస్టులకు మంత్రివర్గం ఆమోదించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.