-నూతన విధానానికి క్యాబినెట్ ఆమోదం
-స్థానికులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు
-ఉపాధి కల్పనలో ద్విముఖ విధానం

రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీనివల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ర్టానికి వస్తున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పరిశ్రమలశాఖను ఆదేశించారు. దీనిపై మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమలశాఖ.. ముసాయిదా తయారుచేసింది. దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమలో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది.
స్థానికులకు ఉపాధిని ప్రోత్సహించే విధానం
నూతన పారిశ్రామిక విధాన లక్ష్యాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధిలో స్థానిక ప్రజలు సాధికారత సాధించడం, ఆర్థిక స్వావలంబనతో జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చడం కూడా ముఖ్యమైనది. రాష్ట్రంలో నెలకొల్పబోయే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను ప్రభుత్వ పారిశ్రామిక, విద్యాసంస్థల పరస్పర సహకారంతో అందించాలి. మహారాష్ట్ర (పర్యవేక్షక సిబ్బందిలో 50%, మొత్తం ఉద్యోగులలో 80%) , కర్ణాటక (75%), ఆంధప్రదేశ్ (75%), మధ్యప్రదేశ్ (70%) లాంటి రాష్ర్టాలు స్థానికులకు కచ్చితంగా ఉపాధిని కల్పిస్తేనే రాయితీలను అందించే నిబంధనను వర్తింపజేస్తున్నాయి. అయితే.. పౌరులను జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వ, స్థిర నివాసం అనే ప్రాతిపదికలపై వివక్ష చూపరాదనే రాజ్యాంగంలోని 16వ అధికరణం ప్రకారం ఈ నిబంధన ఉల్లంఘనకు గురి అవుతుందని పారిశ్రామికవర్గాల్లో, ప్రసార మాధ్యమాల్లో పలు విమర్శలను ఎదురయ్యాయి.
ఉపాధి కల్పనలో ద్విముఖ విధానం
స్థానికులకు ఉపాధి కల్పనలో భాగంగా నకారాత్మక చర్యలు కాకుండా వినూత్నంగా ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని క్యాబినెట్లో నిర్ణయించారు. టాస్క్ వంటి సంస్థల ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతను కల్పించడం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ముఖ్యమైన పరిశ్రమలను ఐటీఐలను, పాలిటెక్నిక్ కళాశాలతో అనుసంధానం ఉంటుంది. దీనికోసం రాయితీలను రెండుగా విభజించారు. ఇందులో..
క్యాటగిరీ-1 పాక్షిక నైపుణ్యం ఉన్న మానవ వనరుల్లో స్థానికులు 70% ఉండాలి. నైపుణ్యం ఉన్న మానవ వనరుల్లో స్థానికులు 50% ఉండాలి. క్యాటగిరీ-2 పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో 80% స్థానికులు ఉండాలి. నైపుణ్యం గల మావన వనరుల్లో స్థానికులు 60% ఉండాలి.