Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

స్థానిక సంస్థలను ఆదుకోవాలి

పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న జిల్లా పరిషత్, మండల పరిషత్‌ను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామా రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో కీలకపాత్ర పోషించే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. -14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో నిర్వీర్యమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థలు -కేంద్ర నిర్ణయాన్ని పున:సమీక్షించాలి -కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి -అన్ని రాష్ర్టాల మంత్రులతో సమావేశానికి చొరవ -వాటర్‌గ్రిడ్ అన్ని రాష్ర్టాలకు స్ఫూర్తిదాయకం: బీరేంద్రసింగ్

KTR--met-union-minister-Choudhary-Birendra-Singh

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత కేంద్ర ప్రభుత్వం నేరుగా స్థానిక గ్రామ పంచాయతీలకే నిధులు అందజేయడంతో ఈ రెండింటి పునాదులే ప్రశ్నార్థకమైపోయాయని, వాటి మూలాలపైనే దెబ్బ పడిందని అన్నారు. పంచాయతీరాజ్ అభివృద్ధిలో ఈ రెండింటి పాత్ర కీలకమైనందున వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేపట్టాలని ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో సోమవారం భేటీ అయిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా సమర్పించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులను నేరుగా స్థానిక గ్రామ పంచాయతీలకే అందజేస్తుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు అభివృద్ధిలో భాగస్వామ్యం లేకుండా పోయిందన్నారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే వివిధ రాష్ర్టాలు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాయి. త్వరలోనే అన్ని రాష్ర్టాల పంచాయతీరాజ్ మంత్రులతో తెలంగాణ ప్రభుత్వమే చొరవ తీసుకుని ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది.

అందరినీ ఒకే వేదికమీదకు తీసుకువచ్చి కేంద్రానికి స్పష్టమైన నివేదికను, తీర్మానాలను పంపిస్తాం. వచ్చే బడ్జెట్ సమావేశాలలోపే కేంద్రంతో మాట్లాడి.. బడ్జెట్‌లో జిల్లా, మండల పరిషత్‌లకు నిధులు రాబట్టుకునేందుకు కృషి చేస్తాం అని తెలిపారు. కేంద్ర నిర్ణయంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనే విషయంపై సీఎం కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌కు వివరించినట్లు చెప్పారు.

కేంద్ర పథకాల అమలులోనూ అవాంతరాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న సీపీడబ్ల్యూ (సమగ్ర తాగునీటి సరఫరా) పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది జిల్లా, మండల పరిషత్‌లేనని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుతో ఆ రెండు అంగాలకు ఎలాంటి ప్రమేయం లేకపోవడంతో సీపీడబ్ల్యూ అమలుపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

తాగునీటి సరఫరా, ఎస్సీ/ఎస్టీ మహిళా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల రూపకల్పన తదితరాలను కేవలం గ్రామ పంచాయతీలు పూర్తిచేయలేవని, కొన్ని సందర్భాల్లో రెండు మూడు గ్రామ పంచాయతీల పరిధిని దాటి ఉండే ఈ పథకాల అమలును అనివార్యంగా మండల, జిల్లా పరిషత్ చేపట్టాల్సి వస్తుందన్న వాస్తవాన్ని కేంద్ర మంత్రికి వివరించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్ అంగాలను విస్మరించి నేరుగా గ్రామ పంచాయితీలకే నిధులను కేటాయించడం ద్వారా ఇలాంటి పథకాల అమలు, అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులోనూ సమస్యలు వస్తాయని, అంతిమంగా ప్రజల దగ్గరకు సంక్షేమ పథకాలను చేర్చాలన్న లక్ష్యం నీరుగారిపోతుందని చెప్పారు.

రాష్ట్ర గ్రాంట్లపై ఆధారపడే పరిస్థితి గతంలో బీఆర్‌జీఎఫ్ కింద ప్రతి జిల్లా ఏటా సగటున రూ.25-30 కోట్ల నిధులు కేంద్రం నుంచి అందుకునేవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి పథకం కింద ఏటా ఒక్కో జిల్లా రూ.30 కోట్లు అందుకునేవి. రాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తీకరణ అభియాన్ పథకం కింద అదనంగా నిధులు అందేవి. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆ ఏడు ప్రాజెక్టుల్లో 30% గ్రాంట్లను జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు అందుకున్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆమోదం తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే గ్రాంట్లపై ఆధారపడాల్సి వస్తున్నది. జిల్లా, మండల పరిషత్‌లు సమావేశాలను నిర్వహించుకోడానికి, ఇతర పరిపాలనా ఖర్చులకు కూడా నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాయి అని వెల్లడించారు.

నీతి ఆయోగ్‌తో చర్చించి.. సవరణలు: బీరేంద్రసింగ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థలపై 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రభావంపై కేటీఆర్ వివరణపై కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తరహాలోనే వివిధ రాష్ర్టాలు కూడా జిల్లా, మండల పరిషత్‌లు నిర్వీర్యం అవుతున్న విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చాయన్నారు. అన్ని రాష్ర్టాల నుంచి ఒక నివేదిక వస్తే.. దానిని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. నీతి ఆయోగ్‌తో చర్చించి అందుకు అనుగుణంగా తగిన సవరణలు చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మళ్లీ అధికారాలు ఇవ్వడం, నిధులను అందజేయడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత బీఆర్‌జీఎఫ్ పూర్తిగా ఆగిపోలేదని, కొన్ని పరిమితులు ఏర్పడ్డాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా జరిగే అభివృద్ధిలో జిల్లా, మండల పరిషత్ విభాగాలను కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

వాటర్‌గ్రిడ్ అందరికీ ఆదర్శం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ (మిషన్ భగీరథ) మెగా ప్రాజెక్టు అన్ని రాష్ర్టాలకు స్ఫూర్తిదాయకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ ప్రశంసించారు. భారీ వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై తాను స్వయంగా హైదరాబాద్‌కు వెళ్లి సమీక్ష జరిపానని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఉద్దేశాన్ని అధికారులు తనకు వివరించారని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ వెలుగులో ఆలోచించడం ఆదర్శంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు వెలుగులో ఒక పథకాన్ని తీసుకురావడానికి ఆలోచిస్తూ ఉన్నదని తెలిపారు. తెలంగాణ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చడానికి ప్రయత్నించడంతోపాటు ఇతర మార్గాల ద్వారా కూడా రుణసాయానికి తగిన చొరవ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని, గ్రామాల్లో సురక్షిత తాగునీటి సరఫరాకు ఇది భేషైన పథకం అని వ్యాఖ్యానించారు.

మేమే చొరవ తీసుకుంటాం..: కేటీఆర్ అన్ని రాష్ర్టాలనుంచి నివేదిక వస్తే పరిశీలిస్తామని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ పేర్కొనడంపై కేటీఆర్ స్పందిస్తూ.. వివిధ రాష్ర్టాల నుంచి కూడా ఇదే తరహా అసంతృప్తి వచ్చినందున స్వయంగా తెలంగాణ ప్రభుత్వమే చొరవ తీసుకుని, అన్ని రాష్ర్టాల పంచాయతీరాజ్ మంత్రులతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తుందని వివరించారు. కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల్లోపే ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు, తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ సమస్యతోపాటు తెలంగాణకు సంబంధించిన మరికొన్ని సమస్యలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ తెలిపారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.