Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సుభిక్ష తెలంగాణ

-నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు -ఈ ఏడాదిలోగా 15 ప్రాజెక్టులు.. -10వేల ఎకరాల సాగు.. -జల కళ కోసం.. జనం బాగు కోసం కేసీఆర్ ఆరాటం

తెలంగాణ ఇంతకాలం అన్నిట్లా దగా పడ్డది. అంతటా సీమాంధ్ర ఆధిపత్యం, వివక్షే కొనసాగింది. మన నీళ్లు మనకు దొరకలే.. మన నిధులు మనకు దక్కలే.. మన నియామకాలు మనకు కాలే. పరాయి పాలనలో చీకటి బతుకులు వెళ్ళదీసినట్లయింది. ఆ కాలం ముగిసిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రం.. మన పాలన. ఆ దోపిడీ, ఆ వివక్ష అంతం కావాలె. మన న్యాయమైన వాటా మనకు దక్కాలె. అందుకోసం ప్రభుత్వం సిద్ధమైతున్నది. నీటి దోపిడీతో దగా పడ్డ రైతన్నలకు ఊరట కల్పించి, చేయూతనిచ్చేందుకు సరైన ప్రణాళికతో ముందుకుపోవాలనుకుంటున్నది.

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లి తెలంగాణ సుభిక్షమై సుఖశాంతులతో విలసిల్లేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నది. హరిత తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. వాస్తవానికి ఇదేమీ మామూలు విషయం కాదు. ఇందుకోసం కొత్త ప్రభుత్వం అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి ఎన్నో ఆంక్షల సంకెళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణ నీటికి సంబంధించి కొన్ని ఆంక్షలు విధించారు. కొన్ని విషయాలలో అన్యాయం కూడా జరిగింది. ఆంక్షల సంకెళ్లను తొలగించుకుని నీటి వాటాను సాధించుకునేందుకు సర్కార్ న్యాయపోరాటానికి సిద్ధమైంది.

జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంలో ఇంప్లీడ్ పిటిషన్ వేస్తూనే మరోవైపు న్యాయమైన వాటాను దక్కించుకోవడానికి ట్రిబ్యునల్ ముందు వాదన చేయనుంది. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్‌లు కేటాయించిన నికర, మిగులు, వరద జలాలను సమర్థంగా వినియోగించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో రాజీవ్‌భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను వెంటనే పూర్తిచేయాలనుకుంటున్నది. ప్రస్తుత సంవత్సరం ఆఖరుకు దాదాపు 15 ముఖ్యమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు రూ. 5265 కోట్లు వెచ్చించనున్నారు. ఫలితంగా దాదాపు 10వేల ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకి వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో సత్వరం పూర్తిచేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రాజెక్టుల స్థితిగతుల అవలోకనం.

కల్వకుర్తి ఎత్తిపోతల వరద జలాల ఆధారంగా మహబూబ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మూడువేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ కలిసే కొల్లాపూర్ దగ్గర ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది. 25 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ కింద 3.40 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ప్రస్తుతం ఇక్కడ పంపింగ్ స్టేషన్లు, మూడు లిఫ్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. కానీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏర్పాట్లు లేవు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే 13వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని అధికారులు చెప్తున్నారు.

మూడు దశలలో ఉన్న ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తిలోని 19 మండలాల్లోని 30 గ్రామాలకు నీరందుతుంది. దాదాపు రూ. 2990కోట్ల వరకు పరిపాలనాపరమైన అనుమతి ఉండగా అందులో ఇప్పటికే రూ. 2700కోట్లు ఖర్చయింది.

జవహర్ నెట్టెంపాడు కృష్ణానదీ వరదజలాల ఆధారంగా చేపడుతున్న జవహర్ నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు రెండువేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. 141.20 కోట్ల అంచనాతో 22 టీఎంసీల సామర్ధ్యంగల ఈ ఎత్తిపోతల కింద రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. జూరాల ప్రాజెక్టునుంచి నీటిని తీసుకుంటారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ధారూరు, గద్వాల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే 3,700ఎకరాలకు సాగునీరందుతుందని అంచనా.పాలమూరులోని దుర్భిక్ష ప్రాంతాలకు వరప్రదాయినిగా భావిస్తున్న ఈ రెండు దశల ఎత్తి పోతల ప్రాజెక్ట్ వల్ల 14 గ్రామాలకు సాగునీరుతో పాటు తాగునీరందుతుంది. ఈ ఎత్తిపోతలకు 119మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనావేశారు.

రాజీవ్‌భీమా రాజీవ్‌భీమా పూర్తయితే పాలమూరు జిల్లాలో అత్యంత వెనుకబడి కరువుతో కొట్టుమిట్టాడుతున్న కొన్ని ప్రాంతాల ప్రజలకు మంచిరోజులొచ్చినట్లే. రెండు దశలలో నిర్మించే ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్ వల్ల మక్తల్, మేఘనూరు, ఆత్మకూరు, నర్వ, చినచింతాకుల, వనపర్తి, పెబ్బేరు, వీపనగండ్ల, వనపర్తి ప్రాంతాలకు సాగునీరందుతుంది. రామన్‌పాడు, జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా 20టీఎంసీల కృష్ణా నీటిని తరలిస్తారు. దీనివల్ల 2.3 లక్షల ఎకరాలు పారుతుంది. ఎత్తిపోతలకు వంద మెగావాట్ల విద్యుత్ అవసరముంటుంది.

కోయిల్‌సాగర్ మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత నియోజకవర్గంలోని కోయిల్‌సాగర్ మధ్యతరహా ఎత్తిపోతల ప్రాజెక్ట్ వల్ల 50వేల 250 ఎకరాలకు నీరు పారాల్సి ఉంది. ప్రస్తుతం 12వేల ఎకరాలకు మాత్రమే నీరందుతుంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరముంది. ఈ పథకానికి దాదాపు రూ. 480కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ. 390కోట్లు ఖర్చుచేశారు. ఎత్తిపోతలకు 30 మెగావాట్ల విద్యుత్ సరిపోతుంది.

Yellampallyఎల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, లక్సెట్టిపేట మధ్య నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దాదాపుగా పూర్తి కావచ్చింది. దీనినుంచి హైదరాబాద్ మంచినీటి కోసం 30 టీఎంసీలను తరలించాలని నిర్ణయించారు. కానీ రిజర్వాయర్ మొత్తానికి 21టీఎంసీల సామర్థ్యమే ఉంది. వాస్తవానికి ఎల్లంపల్లిలో మొత్తం 60 టీఎంసీలకు పైగా వరద నీటి లభ్యత ఉంది. ఎల్లంపల్లి నీటిని మొత్తంగా ఎన్టీపీసీ, మంథని సాగునీటికి, కడెం లిఫ్ట్ ఇరిగేషన్, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండంకు మంచినీటికి, సాగునీటికి అందించి హైదరాబాద్‌కు కాంతనపల్లి నుంచి 30 టీఎంసీలను తరలిస్తే సరిపోతుంది.

కాంతనపల్లి, ఎల్లంపల్లి గోదావరి నదిమీద నిర్మాణం, ప్రతిపాదనలో ఉన్న ఎల్లంపల్లి, దేవాదుల, కాంతనపల్లి, రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తిచేయాలి. కాంతనపల్లి ప్రాజెక్ట్‌కు మొత్తం పదివేల కోట్ల రూపాయల పరిపాలనాపరమైన అనుమతి ఉంది. కానీ ఇప్పటివరకు రూ.1800 కోట్లతో బ్యారేజీ నిర్మాణం కోసం టెండర్ మాత్రమే పిలిచారు. మిగతా నిధులతో ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సి ఉంది. రిజర్వాయర్‌ను కట్టి రెండు లిఫ్ట్‌ల ద్వారా నీటిని కాకతీయ కాలువకు మళ్లించాలి.

ఏఎంఆర్‌పీ – ఎస్‌ఎల్‌బీసీ కృష్ణా బేసిన్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, శ్రీశైలం ఎడమకాలువ సొరంగమార్గం, ఉదయసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కలిపి రూ.5811కోట్లు మంజూరుకాగా ఇప్పటివరకు రూ.3900కోట్లు ఖర్చుచేశారు. ఏఎంఆర్‌పీ ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు నీరు పారుతున్నది. అలీసాగర్ వద్ద లో లెవెల్ కెనాల్ పూర్తయితే మరో 80వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.

ఉదయసముద్రం ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలు సాగులోకి వస్తాయి. ఉదయసముద్రం పూర్తికావడానికి మరో రెండు సంవత్సరాలు పడుతుందని అంచనా. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగమార్గం పనులు ఇంకా 21కిలోమీటర్ల వరకు పూర్తి కావాల్సి ఉంది. ఇది పూర్తయ్యాక మరో మూడున్నర లక్షల ఎకరాలకు డిండి ఎత్తిపోతల ద్వారా నీరందించాలనేది సర్కార్ ప్రయత్నం.

దేవాదుల రెండు దశలు పూర్తి గోదావరి నికరజలాల ఆధారంగా వరంగల్ జిల్లాలో చేపట్టిన దేవాదుల పథకానికి సంబంధించి మొదటి, రెండో దశలు దాదాపు పూర్తయినా కీలకమైన మూడో దశ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. రామప్ప గుడికి ముప్పు వస్తుందన్న కారణంగా మూడో దశ కింద చేపట్టిన సొరంగమార్గం పనులకు బ్రేక్ పడింది. రిజర్వాయర్ లేకుండా ఎత్తిపోతల పనులను మొదలుపెట్లారు. కాంతనపల్లి రిజర్వాయర్‌ను వెంటనే నిర్మిస్తే దేవాదుల ఎత్తిపోతలకు నీరందుతుంది. ఇదిలా ఉంటే పూర్తయిన దశల పనుల్లో కూడా నాణ్యత కొరవడింది. నిర్వహణ అధ్వాన్నంగా ఉందని గుర్తించిన సర్కార్ దీనిపై దృష్టి సారించింది.

jalayagnam 28-06-2014ayakattu 28-06-2014
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.