Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సుఖశాంతులు, సుభిక్షం

గోదారి..కృష్ణమ్మ మన బీళ్లకు మళ్లాలే
పచ్చని మాగాణాల్లో పసిడి పంట పండాలే
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం తేవాలే..

ఉద్యమ సమయంలో మట్టి మనుషుల ఆకాంక్ష ఇది. పొక్కిలైన వాకిళ్లు, తెర్లయిన బతుకులు సుభిక్షం కావాలనే ఆశయం. నెర్రెలు బాసిన బీళ్లలో కి గోదారి నీళ్లు మళ్లాలనే ఆర్తి. ఉద్యమరోజుల్లో ఆ పాటకు జనం వంత పాడేటోళ్లు. ఆకలి పేగుల్లోని చప్పుడు కడుపు దాటకుండా అదిమి పెట్టుకొని భవిష్యత్తు తెలంగాణ కోసం ఉద్యమించేటోళ్లు. కర్రునాగలి భూజా న పెట్టుకొని కేసీఆర్ అడుగుల్లో అడుగు వేసేటోళ్లు. ఇవాళ తెలంగాణ వచ్చింది. బీడు భూమల్లోకి గోదావరి, కృష్ణా జలాలు మళ్లాయి. పంట చేలు పచ్చగా నవ్వుతున్నాయి. భూమికే బరువయ్యేట ట్టు వచ్చిన వరి ధాన్యం రాశుల దిగుబడిని చూస్తుంటే ఆ పాట, మా నాయిన కష్టం యాదికొచ్చింది.

మా ఊరు చిట్టాపూర్. మా బాపు రామక్రిష్ణారెడ్డి 10 ఎకరాల రైతు. పోలీ సు పటేల్‌గిరి కూడ ఉండే. చెరువు కింది భూమి. దర్జాగానే బతికిన కుటుం బం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత చెరువుల విధ్వంసం జరిగింది. చిట్టా పూర్ పెద్ద చెరువు ఎండిపోయింది. నిలబడి కురిసే వానలు కూడా వెనుక బడ్డాయి. బువ్వ గింజలకే కష్టం వచ్చింది. నా బాల్యంలో ఎండిపోయిన మా చెరువు కింద భూమిల బాపు చెమట తీసి చేను తడిపేటోడు. అయినా జేజకు పెట్టిన నాడో.. జ్వరం వచ్చిన్నాడో వరి మెతుకుల బువ్వ తినేటోళ్లం. జొన్నల గాబులో ఇత్తులు ఒడిసిపోయిన నాడు ఉపవాసమే. ఉన్న జొన్న మెతులు మాకు (పిల్లలకు) పెట్టి ఆకలి బాధను పంటి బిగువున అదిమిపెట్టి, తెల్ల బట్టలు వేసుకొని పటేల్ గిరి చేసిన రోజులు నా మనసును ఇప్పటికీ మెలి పెడుతుంటాయి.

స్వాతంత్య్రానికి పూర్యం దేశం అంతటా ఆహార కొరత ఉండేది. దేశంలో జల వనరుల అభివృద్ధి లేకపోవటం,వలస పాలకులు బ్రిటిష్ వాళ్ల నిర్వా కం కూడా కారణం. ఏడు విడిచి ఏడు దేశంలో ఎక్కడో ఒక దగ్గర కరువు కోరలు చాచి ప్రజలను చంపేసేది. విదేశీ వలస పాలకులు తమ వాణిజ్య అవసరాల కోసం రోడ్డు, జల రవాణామార్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ నదులు, ఆనకట్టలు, పరిశోధనా రంగానికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. కానీ దక్కన్ ప్రాంతంలో మాత్రం పరిస్థితి వేరు. దేశం అంతటా కరువు తాండవించినా, ఇక్కడ మాత్రం కరువు లేదు. కాకతీయులు తవ్వించిన చెరువులు గ్రామ దేవతలై పల్లెలను సుభిక్షంగా ఉంచాయి. మొట్టభూము ల్లో జొన్న దిగుబడి వచ్చి ఈ ప్రాంత ప్రజల ఆహార అవసరాలను తీర్చిం ది. పద్మ నాయకలు, అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు, నిజాం పాలకుల వరకు ఎన్నో చెరువులు తవ్వించారు. పాత చెరువులు పునరుద్ధరిం చి పంట పొలాలకు నీళ్లు పారించారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు కరువు ప్రభావం లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, దేశంలో హరితవిప్లవం 10 ఏండ్ల తేడాతో ఆవిష్కరించబడ్డాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే 1966-67లో హరిత విప్లవ బీజాలు పడ్డాయి. హరిత విప్లవాని కంటే ముందే దేశవ్యాప్తంగా వరి దిగుబడి 200 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండేది. ఇందులో.. దక్కన్ పీఠభూమి ప్రాంతం నుంచే 50 మిలియన్ టన్నుల దిగుబడి ఉంది. ప్రతి ఏడాదికి 2.2 శాతం చొప్పున దిగుబడి పెరిగేది. ఈ ప్రాంతాన్ని పాలించిన చిన్న చిన్న సంస్థానాలు, రాజులు, రాజరిక వ్యవస్థల్లో అప్పటికే సంస్థాగతంగా వ్యవసాయ క్షేత్రంలోని నాణ్యమైన విత్తన కంకులను వేరు చేసి, వాటిని మరుసటి ఏడాదికి చెరువుల కింద విత్తనంగా వాడేవాళ్లు. 1967 తరువాత దేశంలో హరిత విప్లవం ఊపందుకున్నది.

1996 నాటికి దేశంలో వరి వార్షిక దిగుబడి 3.6 శాతానికి పెరిగింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఈ దిగుబడి 1.9 శాతానికి పడిపోయింది. 1996లో దేశ వ్యాప్తంగా 562 మిలియన్ మెట్రిక్ టన్ను ల ధాన్యం దిగుబడి వస్తే ఇందులో తెలంగాణ ప్రాంతం వాటా 50 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే. ఆంధ్ర వలసవాద పాలకులు తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని విస్మరించారు. ఇక్కడి చెరువులను నిర్లక్ష్యం చేశారు. వాతావరణ ప్రతికూలతలను తొలిగించి, ఉత్పాదకత పెంచే ప్రయత్నం చేయలేదు. పంటలపై పరిశోధనలు అన్నీ గుంటూరు, గోదావరి జిల్లాలను బేస్‌గా చేసుకొనే జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 10 ఏండ్లకు తెలంగాణలో వరి పండించే ప్రాంతాలపై కాండం తొలిచే ఉల్లికోడు పురుగు విరుచుపడింది. విత్తనం రాల్చటం, మొక్క స్వరూపాన్నే మార్చేసింది. బ్యాక్టీరియా, ఫంగస్ దాడి చేసింది. అఖిల భారత వరి సమన్వయ పథకం కింద పరిశోధకులు అధ్యయనం కోసం తెలంగాణకు వచ్చారు. కానీ ఇటువంటి వ్యాధే గోదావరి జిల్లాల్లో కన్పించిందని శాస్త్రవేత్తలను అటు వైపుకు తీసుకుపోయి పశ్చిమ గోదావరి జిల్లాలోని వరి చేలపై పరిశోధనలు చేయించారు.

ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో ఒక్క మూడు జిల్లా మినహా మిగిలిన 10 జిల్లాలు సముద్రం ఒడ్డునే ఉంటాయి. సముద్రం ఒడ్డున ఉండే ప్రాంతాల్లోని వాతావరణంలో 18 శాతం నత్రజని, 21 శాతం ప్రాణవాయువు (ఆక్సిజన్), 0.03 శాతం కార్బన్ డై ఆక్సైడ్, 0.9 శాతం ఆర్గాన్, 0.07 శాతం ఇతర అమ్మోనియం, నియాన్, జినాన్ వంటి ఇతర వాయవులు ఉంటాయి. సముద్ర ప్రాంతంలో నీటి ఆవిరి ఎక్కువగానే ఉంటుంది. వాతావరణంలో 1.6 శాతం వరకు నీటి ఆవిరి ఉంటుంది. ఇటువంటి ప్రాంతీయ వాతావరణంలో కంటికి కనిపించని సూక్ష్మజీవులు, కంటికి కనిపించే కీటకాల జీవన విధానం ఒకరకంగాను, పీఠభూమి ప్రాంతంలోని వాతావరణంలోని కీటకాలు, సూక్ష్మజీవుల జీవన విధానం ఇంకో రకంగా ఉంటుంది. వాస్తవానికి ప్రాంతాలను బట్టి రోగ నిరోధక వంగడాలను సృష్టించాలి. కానీ అలా జరుగలేదు. ఆంధ్ర ప్రాంత సమస్యలను, అక్కడి వాతావరణాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని వాటికి తట్టుకోగల వరి వంగడాలను రూపొందించటంపైనే పరిశోధనలు జరిగాయి. ఎంటీయు, ఆర్జీఎల్, ఎన్‌ఎల్‌ఆర్ వంటి ఆంధ్ర ప్రాంత వాతావణాన్ని తట్టుకొని నిలువగలిగే వంగడాలు వచ్చాయి. ఇవే వంగడాలను తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి బలవంతంగా రుద్దారు. వీటితో తెలంగాణలో అనుకున్నంత దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయా రు. అట్లా దేశవ్యాప్తంగా హరిత విప్లవ ఫలాలు అందుతుంటే తెలంగాణ ప్రాంత వ్యవసాయం మాత్రం నిర్లక్ష్యం చేయబడింది.

మన పాలన మన చేతికి వచ్చాక వరి ధాన్యంలో రికార్డుస్థాయి దిగుబడి అందుతున్నది. ప్రతి పల్లెలో వరి సిరులు రాలుతున్నాయి. కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులతో కృష్ణా జలాలు పాలమూరును, సింగూరు, ఎస్సారెస్పీ, మధ్యతరహా ప్రాజెక్టులతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గోదావరి జలాలు పారుతున్నాయి. చెరువుల పునరుద్ధరణ, 24గంటల నిరంతరాయ విద్యుత్తు, రైతు రుణమాఫీతో సుస్థిర సాగు దిశగా అడుగులు పడ్డాయి. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్-15048), బతుకమ్మ వడ్లు వంటి కొత్త వంగడాలు ఆవిష్కరించారు. ఫలితంగా కరువులతో అల్లాడిన రైతులకు ఈ యాసంగిలో కరువు తీరా పంట పండింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా 61 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. వరి దిగుబడి 2015-16 యాసంగితో పోలిస్తే 2016-17 యాసంగిలో మూడు రెట్లు పెరిగింది. 2015-16 యాసంగిలో 7.21 లక్షల టన్నులు రాగా, 2016-17లో ఏకంగా 26.41 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది. 2017-18 వ్యవసాయ సంవత్సరానికి వచ్చే సరికి 38.01 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఆ రికార్డును బద్దలు కొడుతూ 2018-19 లో 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఒక్క వరి ధాన్యం మాత్రమే కాదు, పప్పుధాన్యాల దిగుబడి కూడా పెరిగింది. చేపలు, గొర్రె మాంసం ఉత్పత్తి పెరిగింది. ఈ అభివృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించటంతో పాటు, పౌష్టికాహార లోపాన్ని అధిగమిం చేందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో భవిష్యత్తు తరాల పిల్లలు సం పూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చే దిశలో అడుగులు పడ్డాయి.

(వ్యాసకర్త: దుబ్బాక శాసనసభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.