Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సూపర్ హిట్

-తెలంగాణ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది.. -ప్రజల స్పందన అపూర్వం -ప్రభుత్వం మీద విశ్వాసానికి నిదర్శనం -ప్రతిఫలం ఆశించని ఉద్యోగులకు నమస్కరిస్తున్నా -ఇదే ఆదరణ చూపితే బంగారు తెలంగాణ చేతుల్లో పెడతా: సీఎం కేసీఆర్ -విమర్శలు చేసిన వారి పరువే పోయింది -ఆంధ్ర ప్రజలు కూడా పాల్గొన్నారు -చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ వివరాలిచ్చారు -వివరాలివ్వని వారు ఇక టూరిస్టులే -సర్వే వల్ల భయపడాల్సింది చీటర్లు.. లూటర్లే -మంచి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగదు -మిస్సయిన వారికి అవకాశంపై కసరత్తు

మంగళవారం నాటి సమగ్ర కుటుంబ సర్వే దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ సర్వే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిందని, ప్రభుత్వం మీద ప్రజలకు ఎంతో విశ్వాసం, ఆదరణ ఉందనడానికి ఉదాహరణగా ఈ సర్వే నిలిచిందని అన్నారు.

CM-KCR-giving-details-to-Survey-Enumaratorsఊహకందని రీతిలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వివరాలు అందించారని, ఎన్యూమరేటర్లకు టీలు, టిఫిన్లు అందించి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సర్వే తమ మేలు కోసమేనన్న విశ్వాసంతో దేశంలో ఎక్కడెక్కడో నివసిస్తున్న ప్రజలు కూడా తరలి వచ్చారని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజలు చూపిన ఈ స్పందన అపూర్వమని చెప్పిన సీఎం, భవిష్యత్తులో ఇదే రీతిలో సహకరిస్తే బంగారు తెలంగాణ సాధించి తీరుతానని ధీమాగా చెప్పారు.

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అంకితభావంతో సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు రెండుచేతులు జోడించి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ సర్వే మీద అర్థంపర్థంలేని విమర్శలు చేసిన వారు చివరికి వారి పరువే పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అక్రమార్కులకు తప్ప సక్రమార్కులెవరికీ సర్వే మీద బాధ లేదన్నారు. ఆంధ్ర ప్రజలు కూడా సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్నారన్నారు. సర్వేకు సహకరించని వారు తెలంగాణలో టూరిస్టుల్లా మిగిలిపోతారన్నారు.

తెలంగాణలో సమగ్ర సర్వేను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. సర్వే అద్భుతంగా జరిగింది. ఇది తెలంగాణ ప్రజానీకం ఆవిష్కరించిన గొప్ప సందర్భం.. ప్రపంచంలోనే ఎన్నడూ జరగని విధంగా తెలంగాణలో సర్వే జరిగింది అని ముఖ్యమంత్రి అన్నారు.

సర్వే నిర్వహించడానికి వెళ్లిన ఎన్యూమరేటర్లకు ప్రజలే స్వచ్ఛందంగా భోజనం పెట్టారని, ఇది తెలంగాణ ప్రజల ఆప్యాయతకు, సంస్కృతికి నిదర్శనమని చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలో ఇలాంటి సర్వే గతంలో ఎప్పుడూ జరగలేదని వివిధ రాష్ర్టాలు దేశం యావత్తూ ఇదే పంథాలో సర్వే నిర్వహిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన సర్వే అని కేసీఆర్ కొనియాడారు. సర్వే విజయవంతం కావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని సీఎం చెపారు. ఒకటి తెలంగాణ ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, రెండవది ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రయివేటు ఉపాధ్యాయులు అంకిత భావంతో, స్ఫూర్తితో పనిచేయడం అని ఆయన అన్నారు. ఎలాంటి అదనపు రెమ్యూనరేషన్ ఆశించకుండా ఉద్యోగులు సర్వే చేయడం హర్షణీయం అన్నారు. సర్వే విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులందరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు.

వాస్తవ వివరాలు తెలిశాయి.. ఇపుడు సర్వే పూర్తయింది కనుక అన్ని లెక్కలు నికరంగా తేలుతాయని కేసీఆర్ అన్నారు. ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎవరెవరికి ఎన్నెన్ని ఇండ్లు కట్టాలి. ఎవరెవరికి రేషన్ కార్డులు, ఇవ్వాలి అన్న విషయాలు తేలుతాయని అన్నారు.

సమగ్ర సర్వేతో ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 లక్షల కుటుంబాలు, కోటి 20 లక్షల జనాభా ఉంటుందని అధికారులు చెబుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఎంత మంది జనాభా ఉంటున్నారో స్పష్టంగా తెలుసుకుంటే, వచ్చి పోయే వారితో కలిపి వారికి కావాల్సిన అవసరాలను, మంచినీటి సరఫరాను ఎలా చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకోవడానికి పనికి వస్తుందని సీఎం చెప్పారు. అలాగే అందుతున్న వివరాలను బట్టి తెలంగాణ జనాభా అంచనాలు కూడా భారీగా మారుతున్నాయని కేసీఆర్ చెప్పారు.

ప్రస్తుతం నమోదైన కుటుంబాలు, జనాభాకు దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలను కలుపుకుంటే తెలంగాణ జనాభా నాలుగున్నర కోట్లవరకు చేరవచ్చుననే అంచనాలు ఉన్నాయని అన్నారు. సర్వేలో మిస్ అయిన వారికి ఎలా అవకాశం కల్పించాలో ఒకటి, రెండు రోజల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో అధికారుల కమిటీ కూర్చొని చర్చించి నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఇలాగే సహకరిస్తే బంగారు తెలంగాణ.. ఇదే కమిట్ మెంట్‌తో తెలంగాణ ప్రజలు సహకరిస్తే వంద శాతం మీరు కలలుగన్న బంగారు తెలంగాణాను మీ చేతుల్లో పెడతా అని ముఖ్యమంత్రి ఉద్వేగంగా ప్రకటించారు. తెలంగాణలో నిర్వహించిన సర్వేను చూసి దేశం మొత్తంలోని ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేస్తాయి చూడండి అని కేసీఆర్ అన్నారు. సమగ్ర సర్వేలో సేకరించిన డాటా మొత్తం 10 నుంచి 15 రోజుల్లో ప్రభుత్వం వద్దకు చేరుతుందని, ఈ డాటా ముఖ్యమంత్రి టేబుల్ మీద, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టేబుల్ పై, ప్రిన్సిపల్ సెక్రెటరీల టేబుళ్లపై, హెచ్ ఓడిల టేబుళ్లపై, జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలో, ఎమ్మార్వోల టేబుళ్లపై ఉంటుందని సీఎం తెలిపారు.

లెక్కాపత్రం లేకుండా దోచుకోవాలా?… సర్వేపై విమర్శలు చేసిన వారిపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. అంతా ఆకాశరామన్నలాగా లెక్క పత్రం లేకుండా దోచుకొని తినాల్నా?.. దొంగలకు,తప్పులు చేసే వారికి, అక్రమంగా సంపాదించుకునే వారికే ఈ బాధ అని కేసీఆర్ అన్నారు. కొన్ని ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు వెళ్లడం ఆలస్యం అయితే, మా దగ్గరకు సర్వే నిర్వహించే వారు రాలేదని ప్రజల నుంచే ఫిర్యాదులు వచ్చాయని చెప్పిన సీఎం ఆ స్పందన చూసైనా సర్వేపై విమర్శలు చేసిన ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్‌లో అడ్రస్ లేకుండా పోతారని అన్నారు. ఈ సర్వే వల్ల నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందే తప్ప, అన్యాయం జరగదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కాబట్టి వారు కూడా సర్వేలో వారి వివరాలు అందించారని కేసీఆర్ తెలిపారు.

ఎవరిపైనా వివక్ష ఉండదు.. ఈ సర్వే తెలంగాణలోని ఆంధ్ర ప్రాంతం వారిపై వివక్ష చూపడానికేనని కొందరు అంటున్నారు కదా అని మీడియా ప్రతినిధులు అడుగగా.. తెలంగాణలో చీటర్లు…లూటర్లపై వివక్ష ఉంటుంది కానీ… మంచి వాళ్ల మీద ఉండదు అని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడితే సొంత కూతురు, కొడుకునైనా ఉపేక్షించేది లేదని గతంలోనే చెప్పానని సీఎం మరో ప్రశ్నకు బదులిచ్చారు. సర్వేకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించాడని ఓ విలేకరి చెప్పాగా ఆయన ఇక్కడ ఉండదలుచుకోలేదేమో… తెలంగాణలో టూరిస్టుగా ఉంటారేమో, వివరాలు ఇవ్వకపోతే అది వారి కర్మ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేను కొందరు ఫూల్స్ అర్థం చేసుకోలేక పోతే నేనేం చేయలేను అని ముఖ్యమంత్రి మరోప్రశ్నకు బదులిచ్చారు. సర్వే నిర్వహణకు హైవే లాంటి మంచి మార్గం ఉండగా, మరో మార్గాన్ని ఎందుకు అనుసరించాలని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు.

సర్వే విజయవంతం: కే కేశవరావు తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వే విజయవంతమైందని, ఇలాంటి సర్వే గతంలో ఎప్పుడూ జరగలేదని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వే లోపాలు వెదికేందుకుకాదని, కేవలం వాస్తవాలు తెలుసుకునేందుకేనని ఆయన తెలిపారు. దేశంలోనే ఇలాంటి సర్వే గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి వివరాలు ఇచ్చినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్లను తెలంగాణ నుంచి వెళ్లగొట్టేందుకే సర్వే అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.