– విజయవంతమైన రైతుబంధు – అవసరమైన చోట చెక్కుల పంపిణీ షెడ్యూల్ పొడిగింపు – మిగిలిన చెక్కులు మండల కార్యాలయాల్లో అందజేత – 8వ రోజు 782 గ్రామాల్లో 3,02,000 చెక్కుల పంపిణీ – ఎనిమిది రోజుల్లో మొత్తం 42,19,746 చెక్కులు
ఇసొంటి సాయం ఎవరు సెయ్యలె.. ఎవుసం సేద్ద్దామన్న సోయే పోయింది. పొలమున్నా నీళ్లు రావాయె.. పైసలుండవాయె..బ్యాంకోళ్లు ఇయ్యకపోయిరి.. సీఎం కేసీఆర్ సారుకు కోటి దండాలు.. ఇప్పుడు చెర్వులు నిండినయి.. ఎరువులు, విత్తనాలకు పైసలొచ్చినయి. ఇన్నేండ్లకు మళ్లీ ఎవుసంపై మనసు పోతున్నది. రాష్ట్రంలో ఎవరినోట విన్నా ఇదేమాట.. ఇదే ప్రశంస.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అభిమానం ఉప్పొంగుతున్నది. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు సొంతూళ్లకు వచ్చి మళ్లీ వ్యవసాయం చేయాలని మనసు పడుతున్నారు. వలసలు వాపస్ అయినయి. రాష్ట్రంలో సేద్యాన్ని సుసంపన్నం చేయడానికి నిత్యకృషీవలుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న ఒకే ఒక్క నిర్ణయం రైతుబంధు గ్రామీణ ఆర్థిక వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్నది. రాష్ట్రంలో సేద్యాన్ని సుసంపన్నం చేయడానికి నిత్యకృషీవలుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న ఒకే ఒక్క నిర్ణయం రైతుబంధు గ్రామీణ ఆర్థిక వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్నది.
ఎనిమిది రోజులపాటు పల్లెపల్లెనా సాగిన చెక్కులు, బుక్కుల పంపిణీతో సాగుసంబురం మిన్నంటింది. రైతుబం ధు పథకం కింద చెక్కులు.. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి ముందు గా నిర్ణయించిన షెడ్యూలు గురువారంతో ముగిసింది. ఇంకా పంపిణీ పూర్తికాని కొన్ని గ్రామాల్లో షెడ్యూల్‌ను పెంచుకొనే వెసులుబాటును జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది. వివిధ కారణాలవల్ల ఇంకా చెక్కులు తీసుకోనివారు నెలరోజుల వరకు మండల, తహసీల్దార్ కార్యాలయాలలో పొందవచ్చని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 735 గ్రామసభలు నిర్వహించి 3.02 లక్షల చెక్కులను పంపిణీచేశారు. ఈ నెల పది నుంచి గురువారం వరకు మొత్తం 10,052 గ్రామాలలో రైతుబంధు గ్రామసభలు నిర్వహించి సుమారు 42 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఎనిమిదోరోజు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో చెక్కుల పంపిణీ కొనసాగింది. గురువారం బ్యాంకుల దగ్గర రైతుల సందడి పెరిగింది. నగదు తీసుకొని పెట్టుబడికి అప్పుచేయడం తప్పిందని రైతులంగా సంతోషం వ్యక్తంచేశారు. ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సాయం చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం ఆయా జిల్లాల్లో జరిగిన రైతుబంధు కార్యక్రమాల్లో ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జోగురామన్న, ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాశ్, సీతారాం నాయక్, బాల్క సుమన్, రాష్ట్ర రైతు సమన్వయసమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొని చెక్కులు, బుక్కులు పంపిణీచేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రైతులతో కలిసి నృత్యాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 58.33 లక్షల మంది రైతులకు కోటి 43 లక్షల 270 ఎకరాలకు రూ.5,730 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయాల్సి ఉండగా షెడ్యూల్ ముగిసేసరికి 10,052 గ్రామసభలు నిర్వహించి సుమారు 42 లక్షల చెక్కుల పంపిణీ జరిగింది. మిగిలిన చెక్కులను నెలరోజులపాటు స్థానిక మండల కార్యాలయాల్లో తీసుకోవచ్చని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.