-పంద్రాగస్టున దళితులకు భూ పంపిణీపై రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం -నల్లగొండ జిల్లా నుంచి పంపిణీ ప్రారంభం – గవర్నర్ అధికారాలను ఒప్పుకోం – సుప్రీం తీర్పుకు అనుగుణంగానే ఎంసెట్ కౌన్సెలింగ్ – రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ. 480 కోట్లు – మంత్రిమండలి నిర్ణయాలు – విద్యార్థులకు ఫాస్ట్ అమలుపై కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలను అప్పగించటాన్ని రాష్ట్ర క్యాబినెట్ తీవ్రంగా నిరసించింది. హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్‌కు అప్పగించటమంటే తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవటమేనని క్యాబినెట్ అభిప్రాయపడింది. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మరోసారి లేఖ రాయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం రెండు రాష్ర్టాల అధికారులు కూర్చొని చర్చించి కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నాలుగు గంటలపాటు జరిగింది. ఈ సమావేశంలో ఆరు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే ఫీజులపై సుదీర్ఘంగా చర్చ సాగింది.
1956ను స్థానికతకు ప్రామానికంగా తీసుకొంటే ఇప్పటివరకు ఉన్న ఫీజు బకాయిలను చెల్లించటంలో ఎలాంటి విధానం అవలంబించాలనే అంశంతోపాటు పథకం అమలు సాధ్యాసాధ్యాలపై క్యాబినెట్ భేటీలో విస్తృత చర్చ సాగింది. పాత బకాయిల విషయంలో ఎవరైనా కోర్టుకు వెళితే ప్రభుత్వం ఏమి చేయాలన్నదానిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. గవర్నర్‌కు అధికారాల అప్పగింతపై పార్లమెంటులో ఒకవైపు ఎంపీలు పోరాటం చేస్తున్నారని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. పార్లమెంటులో సోమవారం ఎంపీలు గవర్నర్ అధికారాలపై కేంద్రాన్ని నిలదీయటాన్ని క్యాబినెట్ అభినందించింది. ఈ నెల 18న కేంద్ర హోంమంత్రితో ఎంపీల సమావేశం అనంతరం కేంద్రం అనుసరించే వైఖరి ఆధారంగా మరోసారి కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్రంపై దుందుడుకుగా వెళ్లకుండా ఆచితూచి వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో అన్నట్లు సమాచారం. రుణాల రీషెడ్యూల్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని రిజర్వుబ్యాంకుకు లేఖ రాయాలని మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. రైతుల రుణాల రీషెడ్యూల్ కోసం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిని ముంబై పంపాలని నిర్ణయించారు. దళితులకు భూ పంపిణీ కోసం అవసరమైన భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌కు బదులు గోల్కొండ కోటలో నిర్వహించాలన్న నిర్ణయంపై మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది.
2009 నుంచి 2014వరకు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.480 కోట్ల 42 లక్షలు చెల్లించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 26లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో మంత్రి టీ పద్మారావు, మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జెండా ఆవిష్కరణ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ పరిధిలో 120 కల్లు దుకాణాలను ప్రారంభించటానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దళిత మహిళల పేరిటే భూ పట్టాలు: పోచారం దళితులకు భూపంపిణీ పథకంలో ఆ కుటుంబంలోని మహిళ పేరిటే పట్టాలు ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంత్రిమండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15న రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంపికచేసి భూ పంపిణీ నిర్వహిస్తామన్నారు. మొదటి విడతగా అసలు భూమిలేని దళిత కుటుంబాలను ఎంపిక చేశామని, ఆయా జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా బోరుబావి తవ్వటంతోపాటు విద్యుత్ మోటార్, ఏడాది వ్యవసాయ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.