Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

స్వచ్ఛ సిరిసిల్ల సాధించాం..

సిరిసిల్ల నియోజకవర్గంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామారావు చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని స్వచ్ఛ సిరిసిల్లగా ఆయన ప్రకటించారు. సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని, కేవలం 20 రోజుల వ్యవధిలోనే 12వేల పైచిలుకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేసి రికార్డు సృష్టించిన ఘనత సిరిసిల్లకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

KTR-in-Siricilla-Meeting

-అభివృద్ధిలో పోటీపడుతున్నాం.. ఇదే స్ఫూర్తి రాష్ట్రవ్యాప్తం కావాలి -ఈ పంచాయతీల్లో 60 పౌరసేవలు -మరుగుదొడ్డి ఉంటేనే ఎన్నికల్లో పోటీ: మంత్రి కే తారకరామారావు -రైతు విషాదం నాటి పాలకుల పాపమే -నదులు మళ్లించి ఉంటే ఆత్మహత్యలు జరిగేవా? -ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన కేటీఆర్ సిద్దిపేట నియోజకవర్గం కూడా వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేసినట్టుగా మంత్రి హరీశ్‌రావు ఈరోజు ప్రకటించారని అంటూ అభివృద్ధిలో ఇలా పోటీ పడడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నిర్మాణం పూర్తిచేసి దేశానికి అదర్శంగా తెలంగాణను నిలుపుతామన్నారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికల్లోనైనాసరే పోటీచేసే వ్యక్తికి కచ్చితంగా మరుగుదొడ్డి ఉండాలన్న నిబంధనలతో కూడిన కొత్త చట్టం త్వరలో రాబోతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకరికి నీతులుచెప్పే ముందు మనమే అదర్శంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రతికార్యక్రమాన్ని తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల కేంద్రంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలతోపాటు నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండలం బీబీపేట గ్రామంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ముందుగా సిరిసిల్ల మండలం చిన్నబోనాల గ్రామపంచాయతీలో పల్లె సమగ్రసేవాకేంద్రాన్ని ప్రారంభించారు. స్థానికంగా పలు రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సిరిసిల్ల-వేములవాడ-చొప్పదండి నియోజకవర్గాల్లో రూ.1132 కోట్లతో చేపట్టిన జలహారం పనుల పైలాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుర్రంవాని పల్లె వద్ద వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అధ్యతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తుందన్నారు.

2004లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ యావత్తు నియోజకవర్గానికి మంచినీరు సరఫరాచేయడానికి పక్కా ప్రణాళికలుచేసి కేంద్రం ద్వారా మంజూరు చేయిస్తే అప్పటి ముఖ్యమంత్రి 20శాతం నిధులు చెల్లించకుండా మోకాలు అడ్డు పెట్టారని విమర్శించారు. ఆ కలను నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాకారం చేసేందుకు రూ. 35వేల కోట్లతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. రైట్‌ఆఫ్‌వే- రైట్‌ఆఫ్ యూజ్ పేరుతో చట్టం తెచ్చామని, దానిని అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అర్థంచేసుకొని తదుపరి ప్రజాప్రతినిధులందరికీ తెలుపాలని సూచించారు.

ఇదంతా మీ వల్లనే… ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తారకరామారావు విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యలకు నాటి పాలకుల పాపాలే కారణమన్నారు. 60 ఏండ్లు చిత్తశుద్ధితో వ్యవసాయరంగాన్ని ముందుకు తీసుకెళ్లి ఉంటే ఈరోజు ఆత్మహత్యలు ఉండేవా? గోదావరి, కృష్ణ జలాలను వినియోగించి సాగునీరు ఇచ్చి ఉంటే రైతులు అత్మహత్యలకు పాల్పడేవారా? అని నిలదీశారు. అసెంబ్లీలో ఈ అంశంపై రెండురోజుల పాటు చర్చలకు అవకాశమిస్తే జానరెడ్డి జానెడు సూచన చేయలేదని, చిన్నారెడ్డి చిన్న సలహా ఇవ్వలేదని, జీవన్‌రెడ్డి జీవితానికి ఉపయోగపడే మాటలు చెప్పలేదని, దయాకర్‌రావు దయలేని మాటలు చెప్పారే తప్ప ఒక్క సూచన,సలహాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వాల వైఫల్యాలను విప్పిచేప్పేందుకు అవకాశం ఉన్నా.. ముఖ్యమంత్రి ఆ దిశగా ముందుకు వెళ్లలేదన్నారు. అత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. 6 లక్షల పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా నిర్ణయం తీసుకున్నదని, ఇంత భారీ పరిహారం దేశంలో ఎక్కడాలేదని అన్నారు. ఒకేసారి రుణ మాఫీ అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారన్నారు.

ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఏమి మాట్లాడాలో తెలియక పసలేని రాజకీయ విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. మూడేళ్లలో గోదావరి కృష్ణ జలాలను మళ్లించి ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, కరీంనగర్ జిల్లాలో 13లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని స్పష్టంచేశారు. తెలంగాణ సాధించినట్లే.. బంగారుతెలంగాణ సైతం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. పనిలేని ప్రతిపక్ష పార్టీల నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని, ప్రజలకు మాత్రం జవాబుదారిగా ఉంటామని అన్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ, రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈదశంకర్‌రెడ్డి, కరీంనగర్ మేయర్ రవిందర్‌సింగ్ పాల్గొన్నారు.

ప్రజల ముంగిట్లోకి పౌరసేవలు ఈ- పంచాయతీ అంటే ఎలక్ట్రానిక్ పంచాయతీ మాత్రమే కాదని… సుదూరంలో ఉన్న పౌరసేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చి సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తారకరామారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండలం బీబీపేటలో ఈ- పంచాయతీ సేవలను కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ జనన మరణ ధృవీకరణ పత్రాల నుండి మొదలుకొని మొత్తం 320 పౌరసేవలు ఉండగా వాటిలో 60 పౌరసేవలను గడపగడపకు అందించి పారదర్శకమైన పరిపాలన అందిస్తామన్నారు. పింఛన్లు, ఉపాధిహామీ కూలీ డబ్బులతోపాటు ప్రభుత్వం నుండి వచ్చే ఎలాంటి ప్రయోజనాన్నయినా ఈ- పంచాయతీల ద్వారానే లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. బీమా, బ్యాంకింగ్ సేవలను కూడా ఈ- పంచాయతీల ద్వారానే చేరవేస్తామన్నారు. ప్రస్తుతానికి 104 గ్రామపంచాయతీల్లో ఈ- సేవలు ప్రారంభించామని, ఈనెలాఖరు కల్లా 700 గ్రామాలను,వచ్చే మూడేండ్లలో అన్ని పంచాయతీలను ఈ- పంచాయతీలుగా మారుస్తామని పేర్కొన్నారు. రుణమాఫీలో మిగిలిన 8 వేల కోట్ల రూపాయలను ఏకకాలంలో మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ మాట్లాడుతూ మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌లు 2004 ఎన్నికలకు ముందు మాచారెడ్డి మండలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థికసహాయం చేసి చేతులు దులిపేసుకున్నారని దుయ్యబట్టారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.