Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

స్వ‌చ్చ‌త‌కు స‌హ‌క‌రించండి..

హైదరాబాద్ బస్తీల రూపురేఖలు మారాలంటే ప్రజలందరూ సంపూర్ణంగా సహకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభ్యర్థించారు. ఆరునెలల్లో ఎలాఉండే బస్తీ ఎంత బాగా అయ్యింది? అనుకునే విధంగా అందంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. మీరు నాకు శక్తినివ్వండి.. సహకరించండి. మీరు ఊహించని విధంగా బస్తీలను అద్భుతంగా తీర్చిదిద్దుతా అని సీఎం అన్నారు. లండన్, అమెరికా బాగుంటాయని చెప్పుకుంటాం కానీ, అక్కడుండేది మనుషులే. వాళ్లు బంగారం తినరు.

-నాకు శక్తి ఇవ్వండి .. ఆరునెలల్లో బస్తీల రూపురేఖలు మారుస్తా – పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి – ఎన్ని నిధులైనా అభివృద్ధి జరగాల్సిందే – రహదారులు విస్తరించడం తప్పనిసరి – నష్టపోయే బాధితులకు భారీ పరిహారమిస్తాం – పారిశుద్ధ్యంతో పాటు యువతకు ఉపాధి కల్పిస్తాం – నాలుగేండ్లు ఇక్కడే ఉంటా.. సమస్యలు పరిష్కరిస్తా – ఇక మెట్టుగూడలోని పాత ఇల్లే కార్యక్షేత్రం – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టీకరణ – స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా బస్తీల్లో పర్యటన

KCR participated in swachh Bharath  in Secunderabad Constituency (4)

మనకన్నా తెలివైనవారూ కాదు.. అయితే వాళ్లు ఆలోచించుకుని బాగుచేసుకుంటే మనం ఆలోచించక చెడిపోతున్నాం అని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు ఆదివారం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ నియోజకవర్గం పార్శిగుట్ట పరిధిలోని పలు బస్తీల్లో పర్యటించారు. ఉదయం 11.55 గంటలకు అంబర్‌నగర్‌ను సందర్శించి, అక్కడి కమ్యూనిటీ హాల్‌లో స్థానికులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకొని, పరిష్కారంగా ఏం చేయాలనేదాని పై వారితో మాట్లాడారు. అనంతరం పక్కనే ఉన్న న్యూఅశోక్‌నగర్ బస్తీకి వెళ్లి అక్కడి అర్బన్ వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కమిటీ హాలులో బస్తీవాసులతో సమావేశం జరిపారు. వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం బస్తీ రూపురేఖల్ని మార్చాలంటే ఏం చేయాలో వారికి వివరించారు. ఈ రెండు, మూడు బస్తీలే కాకుండా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను బాగు చేసేందుకు రెండు, మూడు రోజుల్లో తార్నాకలో మరో సమావేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఏదో ఉపన్యాసమిచ్చి… రెండు, మూడు రోజులు తిరిగేందుకు తాను రాలేదన్న కేసీఆర్ వచ్చే నాలుగేండ్లు ఇక్కడే ఉండి నిరుపేదల ఇండ్ల సమస్యలతో సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే.. నిన్న నా దగ్గరకు పది మంది మంత్రులొచ్చి చెప్పిండ్రు.

సార్ మీరు చెప్తే ఏమో అనుకున్నం. హైదరాబాద్ అంత చండాలంగ ఉంది. మెయిన్ రోడ్లు మాత్రమే బాగున్నయి. జనమంత మురికిల, కంపుల బతుకుతుండ్రు అన్నరు. మరి యుద్ధం చేద్దామా? అని అడిగిన. నేను ఎట్లయితె పార్శిగుట్ట్టను తీసుకొని ఇక్కడికి వచ్చిన్నో అట్లనే మంత్రులు, ఐఏఎస్ అధికారులు అందరూ హైదరాబాద్‌ల 400 జాగలల్ల తిరుగుతున్నరు. నిన్న సాయంత్రం ప్రారంభం చేసినం. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ, ఐటీ, పీటీ అంటున్నం. అమెరికా వ్యక్తి పార్శిగుట్ట్టకు వచ్చిపోయిండనుకో మళ్ల ఇంకోసారి వస్తడా హైదరాబాద్‌కు? ఆయన్ని తీసుకవచ్చి ఒక మోరీ దగ్గర రెండు నిమిషాలు నిలబెడితే ఈజ్ దిస్ హైదరాబాద్ సిటీ అని మళ్ల జిందగీల హైదరాబాద్ జోలికి రానుకూడా రాడు అని పేర్కొన్నారు.

అధికారులకు తిట్లు పడాలని ఉంటదా? పార్శిగుట్ట్టలో లక్ష మంది జనాభా ఉన్నరు. ఇల్లు మీద ఇల్లు ఉన్నట్లుంది. నేను చూస్తే మోరీ మీద ఇల్లు కట్టి ఉన్నది. ఆ కట్టినోడెవడో… పర్మిషన్ ఇచ్చినోడెవడో? ఇట్ల ఇచ్చిండ్రు, ఇప్పించిండ్రు… నాశనమైపోయింది. వాన వస్తే బస్తీ అంత నీళ్లు. ఇట్ల తయారైంది ఇప్పుడు. మనకొచ్చే నాలాల్ని మనమే చేతులు పెట్టి ఆపేస్తే… ముఖ్యమంత్రి ఏం చేస్తడు. ఎక్సైజ్ మంత్రి ఏం చేస్తడు. ఇపుడు ఏం చేద్దామన్నా చెయ్యలేం. ఓ పైప్ లైన్ ఎయ్యాలె అంటె రోడ్డు సాలకపాయె. ఎట్ల మరి? మీకు నీళ్లు కావాలె. డ్రైనేజి పోవాలె. నాలాల మీద ఇండ్లు కడితిరి. ఎక్కడినుంచి లైన్లు వెయ్యాలె.

పరిస్థితి ఇట్ల పెట్టకోని ఆఫీసర్లను తిడతం. నేను అడిగిన వాళ్లను… ఏం బాబు ఇట్ల అంటె, సార్ మేమేం చేయాలె? ఓ పైప్ వేయరాదు. వెయ్యనియ్యరు. నల్లా నీళ్లు, మురికి నీళ్లు కలిసిపోతున్నయి అంటున్నరు. రెండు వేర్వేరు లైన్లు వేస్తే మంచిగ ఫ్రెష్ నీళ్లు వస్తయి. కానీ ఎక్కడినుంచి వెయ్యాలె అంటున్నరు. అధికారులకు దారి చూపిస్తె చేస్తరు. వాళ్లకు కూడా బస్తీ ప్రజలతోటి తిట్లు పడాలని ఏమన్న ఉంటదా? వాళ్లంతా ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, మంచిగ చదువుకున్నోళ్లు. మీరు తిడుతుంటె వాళ్లకు బాధ గాదా. అరె మేం చేసే డ్యూటీ చేస్తున్నం, కానీ జనమైతె తిట్టబడితిరి అని బాధ పడరా? అధికారులను మనమే కాళ్లు కట్టేసి ఎట్ల పరిష్కరిస్తవో పరిష్కరించమంటె ఎట్ల? అని ప్రశ్నించారు.

పద్ధతి ప్రకారం చేద్దాం.. ఇదంతా ఓ పద్ధతిగ చేస్తే తప్ప సరిగ్గా కాదు. అనేక సమస్యలున్నయి. వీటన్నింటినీ సెట్‌రైట్ చేసి మంచిగ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లెక్క చేయాలంటే… అన్నిటికన్న ముందు జాగా కావాలి. జాగలు ముట్టద్దు..పనులు కావాలె అంటె గాల్లో చెయ్యలేం కద. నేను కాలేజీ తెస్త. ఇంకోటి తెస్త… బిల్డింగ్‌లు ఎక్కడ కట్టాలె. ఈ బస్తీని చూస్తే నాకర్థమైందేందంటే… ఇక్కడ ఇండ్లు తీసేయాల్సిన పరిస్థితి వస్తది. ఒక జబ్బు వచ్చింది. ట్యాబ్లెట్‌తో పోయేదైతే పోతది. కానీ ఆపరేషన్ చేయాలంటె చీరాలె. ఒప్పుకోరు. కానీ తప్పని పరిస్థితి వచ్చినపుడు ఏం చేస్తం? మనిషి బతుకుడు ముఖ్యం కాబట్టి ఆపరేషన్ చేసి పేషెంట్‌ను బచాయిస్తరు.

ఇది కూడా అంతే. మంచి వసతులు రావాలంటె సహకరించాలె. చిలకలగూడ, వారాసిగూడ, అంబర్‌నగర్‌ల ఇండ్లు పైకి సూస్తె ఈ ఇల్లు, ఆ ఇల్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నట్లె ఉన్నయి. ఇండ్లోడు అందుల దూకొచ్చు, అండ్లోడు ఇందుల దూకొచ్చు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 70-80 ఫీట్లు వెడల్పుతోటి రెండు రోడ్లు వేసుకుంటే సకల సమస్యలు పోతయి. మరి ఇది జరగాలంటే వంద రెండు వందల ఇండ్లు పోతయి. వాళ్లందరికీ వేరేచోట ఇండ్లు ఇద్దాం. పరిహారం కూడా రూ.50 ఇచ్చే దగ్గర రూ.వంద ఇద్దాం. కాకపోతే వాళ్లను సంజాయించాలి. అది మీరే చెయ్యాలె. అట్లని వాళ్లను తీసి బజార్ల ఎయ్యం. మొత్తం పరిహారం చేతిల పెట్టినంకనే పని మొదలు పెడ్తం అని ఉద్బోధించారు.

రూ. 50 కోైట్లెనా ఇస్తాం.. మీ బస్తీల అభివృద్ధికి అదనంగా రూ.50 కోట్లు కావాలంటె ఇస్త. కానీ పని చేసే పరిస్థితి ఉండాలె. అందుకే కాలనీ ప్రతినిధులే మీ జనాన్ని కూర్చోబెట్టి చెప్పాలె. బస్తీవాసులను కన్విన్స్ చేయాలె. సీఎం స్వయంగ వచ్చి హామీ ఇచ్చిండు అని చెప్పాలె. నష్టమైన వాళ్లకు అడ్వాన్సుగ డబ్బులిస్తమని నేను ప్రామిస్ చేస్తున్న. అధికారులు ప్లాన్ వేస్తే ఏ ఇండ్లు పోతయో తెలుస్తది. మాదంత ఉన్నది ఉన్నట్టుండాలె, సీఎంగారూ బాగా చేయాలంటె నేనేం చేయాలె? ఎవరైనా మనిషే. మాయమశ్చీంద్ర ఉండదు కదా. ఎవరైతే నష్టపోతరో పక్కనే రైల్వే జాగానా ఖాళీ జాగానా.. ఎక్కడైనా ఓ పదెకరాలు, ఇరవై ఎకరాలు దొరికితే మొత్తం నిరుపేదలందరికీ ఐడీహెచ్ కాలనీలో మాదిరిగ ఇండ్లు కట్టిస్తం. ఓ పద్ధతి ప్రకారం వాటర్, డ్రైనేజీ అన్నీ పెట్టి కట్టిస్తం. ఇండ్లు లేని నిరుపేదలకు కూడా నాలుగేండ్లలో కట్టిస్తం. ఒక ఆరు నెలల్ల కంప్లీట్ దీని ముఖచిత్రం మారుతది అని ధీమా వ్యక్తం చేశారు.

డబ్బులు సమస్యనే కాదు… పరిస్థితిని నేను కండ్లారా చూస్తున్న. ఇక్కడ ప్రత్యేక పరిస్థితి ఉన్నందున రూ.200 కోట్లయినా మంజూరు చేస్త. డబ్బు సమస్య కాదు. ఇక్కడ నేనే ఇన్‌ఛార్జి గనుక కచ్చితంగ చేస్త. ఆ శక్తి నాకుంది. ఓ ముఖ్యమంత్రి అనుకుంటే ఈ రూ.200-300 కోట్లు పెద్ద గొప్ప కాదు. సికింద్రాబాద్ నియోజకవర్గం పూర్తిగ పురాతనమైంది. పాతది. 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నరు. ప్రభుత్వం దగ్గర వేల కోట్ల రూపాయలున్నయి. బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం డీసీఎం, ఆటోలు కొనియ్యడంగానీ, షాపులు పెట్టుకుంటమంటె డబ్బులు సాయం చేయడంగానీ, ఇతరత్రా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీంలు ఇవ్వడంగానీ చేద్దాం అని హామీ ఇచ్చారు.

బస్తీవాసుల సహకారంతోనే.. ఇక్కడ శానిటేషన్ బాగా లేదు. బండి ఒక్కటే ట్రిప్పు వస్తది. అట్ల కాకుండా ఇవే బస్తీలల్ల పిల్లలకు ఫ్రీగ ఆటోలు కొనిద్దాం. వాళ్లు ఇండ్లల్ల నుంచి చెత్త తీసుకోవాలి. ఇంటికి రెండు ప్లాస్టిక్ బుట్టలిస్తం. ఇంట్లనె చెత్తను డీగ్రేడ్ చేయాలె. వాడిన టూత్‌బ్రెష్, ప్లాస్టిక్ వంటి ఐటమ్స్ ఒక బుట్టల ఎయ్యాలె. కూరగాయల తరుగు, కిచెన్ వేస్ట్ ఇంకో బుట్టల వేయాలె. మన ఇంటికొచ్చే ఆటోలో కూడా రెండు కంపార్ట్‌మెంట్లు ఉంటయి. బయోవేస్ట్ ఒక కంపార్ట్‌మెంట్ల, ఇంకోటి మరోదాంట్ల పోసుకుంటరు. అది ఎక్కడ పోవాల్నో అక్కడికి పోయిన తర్వాత దాని నుంచి కరెంటు తయారు చేయాల్నా.. ఇంకేమైనా చేయాల్నా అనేది ప్లాన్ చేస్తం. ఇక నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గంల బజార్ల చెత్త ఉండవద్దు. ఇంట్ల కెళ్లి ఆటోలకు రావాలె, అక్కడి నుంచి సక్కగ లారీలుండె దగ్గరికి పోవాలె అని వివరించారు.

గోరటి పాట లెక్కనె ఉన్నయి… గోరటి వెంకన్న రాసిన పాట లెక్క గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది… అన్నట్టుగనె ఇక్కడ పరిస్థితి ఉంది. కవి కాబట్టి ఉన్నది ఉన్నట్టు రాసిండు. దాని మీద యుద్ధం చేద్దామా? వంద శాతం అందరూ పిడికిలి బిగిస్తే కచ్చితంగ అయితది. ఆ లండన్ అట్ల ఉందట, అమెరికా ఇట్ల ఉందట అని అనుకుంటం. వాళ్లేమో బంగారం తింటున్నరా? మనకన్న ఎక్కువ సిపాయిలా? వాళ్లకు ధమాకుంది, మేల్కొని ఆలోచించిండ్రు. కానీ మనం ఆలోచించక, మురికిల పడి ఉంటున్నం అన్నారు.

ఇక మెట్టుగూడలోనే నా అడ్డా… పార్శిగుట్ట్టనే అనుకున్న. సికింద్రాబాద్ నియోజకవర్గం అంతా దరిద్రంగా ఉంది. అందుకే నేను నియోజకవర్గం మొత్తం పెట్టుకున్న. నేను ట్రాన్స్‌పోర్టు మినిష్టర్‌గ ఉన్నపుడు మెట్టుగూడ దగ్గర ఉన్న చర్చి పక్కన ఇల్లు ఉన్నది. నేను అక్కడనే ఉంటున్న. ఆడనే నా అడ్డా. సికింద్రాబాద్ కెపాసిటీ బిల్డింగ్ మీటింగులు అన్నీ అక్కడనే జరుగుతాయి. అక్కడ ఒక ప్రత్యేక అధికారిని పెడత. ఎవరికి ఏ బాధ ఉన్నా, చీమ చిటుక్కుమన్నా అక్కడికి పోవాలె. రాపీయాలె. రెండు, మూడు రోజుల తర్వాత తార్నాకల అందరికీ మీటింగు పెడుతున్నం. ఒక్కో బస్తీకి ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉండేటట్లు కమిటీలు వేసుకోండి. మీ వ్యక్తిగత సమస్యలున్నా నాకు లిస్టు ఇయ్యండి. బస్తీల జబ్బు వచ్చినోళ్లు ఉంటె వంద శాతం ప్రభుత్వపరంగ వైద్యం చేయిస్తం, పింఛను రావాల్సినవాళ్లు ఎవరైనా ఉంటె లిస్టు ఇయ్యండి. అర్హులకు రేషన్ కార్డు రాకుంటే ఆ లిస్టు కూడా ఇయ్యండి. రేపే సాంక్షన్ చేస్త అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఒక్క దెబ్బకు రైల్వే పర్మిషన్లు.. మనం కృష్ణానది, గోదావరి నది నుంచి వేల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తెస్తున్నం. ఆ నీళ్లు అందరూ వాడుకుంటరు. ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లు తెస్తున్నం. మూడు జాగలల్ల ఆ పైపులైను రైల్వే లైన్లు క్రాస్ చేయ్యాలె. మూడు సంవత్సరాలాయె మన ఆఫీసర్లను రైల్వే వాళ్లు పర్మిషన్ కోసం సావగొడుతున్నరు. జలమండలి అధికారులను పిలిచి అడిగితె ఈ రైల్వే అధికారులు అనుమతి ఇస్తలేరు సార్. తిరిగి తిరిగి సచ్చిపోతున్నం అని చెప్పిండ్రు. వాళ్లు పోయినంక నేను రైల్వే జీఎం శ్రీవాత్సవ్‌కు టెలిఫోన్ చేసిన. మీరు మూడు బోర్‌వెల్స్ తెచ్చుకోండి.. తెల్లారేసరికల్ల రెండు, మూడొందల బోర్లు వేసుకోండ్రి అని చెప్పిన. అదేంది సార్ ఎందుకు అని అడిగిండు.

సిటీల వాటర్ సరిపోతలేదు.. పబ్లిక్‌కే ఇవ్వలేకపోతున్నం, మీ రైల్వేకు ఎట్ల ఇస్తం? అందుకే మీ ఇంతజాం మీరు చేసుకోండి అని చెప్పిన. అరె ఏం సార్ అట్ల కోపానికి వస్తున్నరని అన్నరు. మరి కోపానికి రాక ఏముంది? నువ్వు ఓ గవర్నమెంటువు కాదా? ఆఫీసర్ కాదా? ప్రజలల్ల బతుకుతలేవా? సిటీకొచ్చే నీళ్లను ఆపితే ఎట్ల నీళ్లియ్యాలె? వచ్చే నీళ్లల్ల మీకు కూడా ఇస్సా ఉంది. మూడేండ్ల నుంచి అడ్డుకుంటె ఎట్ల ఇస్తం? అని అన్న. అంతె.. లేదుసార్ అధికారులను పంపీయండి. రేపు మధ్యాహ్నం వరకల్ల ఇస్త. లేకుంటే సాయంత్రంకల్ల నల్లా కట్ చేయండి అని అన్నరు. ఒకటే దెబ్బకు మధ్యాహ్నం ఇచ్చిండు. మూడేండ్ల నుంచి అట్ల ఏడిపించిండ్రు. రైల్వే జాగాలది కూడా అట్లనె మాట్లాడిన. ఢిల్లీకి పోయినపుడు రైల్వే మంత్రిని కలిసి జాగా కావాలన్నం. ఆ భూములన్నీ మా నిజాంవే అని చెప్పినం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇట్ల అర్థం చేసుకొని, డీప్‌గ ఆలోచించి, ఇంత ఫోకస్‌గ పనిచేయలె అని కేసీఆర్ అన్నారు.

ఒప్పుకొంటే అందరికీ పక్కా ఇండ్లు నిర్మిస్తాం -హమాలీ బస్తీలో సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన -ఆనందంలో బస్తీవాసులు రైల్వేస్టేషన్‌లో గూడ్స్ రైళ్ళ నుంచి సామానులు మోసి జీవనం సాగించే హమాలీలు ఇక్కడ 60 ఏళ్ళుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వారిని గత ప్రభుతాలు, నేతలు పట్టించుకున్నా పాపాన పోలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పేదలు నివసించే హమాలిబస్తీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఆయన బస్తీ వద్ద ఆగి, నేరుగా ఇండ్ల మధ్యకు వెళ్ళారు. మంత్రి టీ పద్మారావుతో కలిసి ఇరుకైన ఇండ్లలో, మురికి వాడలో అరకొర వసతులతో వారు ఉంటున్న తీరుని స్వయంగా పరిశీలించారు. నగరం నడిబొడ్డున ఉండి, సామూహిక మరుగుదొడ్డిని వాడుతున్నారని తెలుసుకుని ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.

స్థానికులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి? ఇతర వివరాలను ముషీరాబాద్ తహసీల్దార్ సుజాతను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం సుమారు 225 కుటుంబాలు బస్తీలో నివసిస్తున్నాయని వివరించారు.

ఒప్పుకుంటే ఆరు నెలల్లో మంచి ఇండ్లు: ఇంకా ఎంతకాలం ఇలా బతుకుతారు అని సీఎం కేసీఆర్ బస్తీవాసులను ప్రశ్నించారు. ఐకమత్యంగా ఉండాలి. మా ఖర్మ అని అనుకోకుండా, ఇప్పుడన్నా జీవితాలను మార్చుకుంటామంటే ఐడీహెచ్ కాలనీ మాదిరిగా కేవలం ఆరునెలల్లో అందరికీ రెండు పడక గదులతో కూడిన మంచి ఇండ్లను నిర్మించి ఇస్తాం స్థానికులతో సీఎం అన్నారు. అందరూ కూలీ నాలీ చేసుకునే వారే కనుక, తాను సోమవారం సాయంత్రం మరోసారి హమాలిబస్తీకి వస్తానని, అందరి సమక్షంలో ఇండ్ల నిర్మాణం గురించి ప్రకటిస్తానని సీఎం పేర్కొన్నారు. ఎంతమంది ఐడిహెచ్ కాలనీలోని కొత్త ఇండ్లను చూశారని సీఎం ప్రశ్నించారు. అలాంటి ఇండ్లు మీకు కావాలా అని అడిగారు. సోమవారం ఉదయం, అధికారులు బస్తీని సందర్శిస్తారని, వారు అర్హులైన వారిని గుర్తించి ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు.

కేసీఆర్ పర్యటనతో హమాలిబస్తీలో ఆనందం: అనుకోని దేవుడు ఒక్కసారిగా ప్రత్యక్షమైనట్లుగా, సీఎం కేసీఆర్ నేరుగా తమ బస్తీలోకి రావడంతో హమాలిబస్తీవాసులకు మాటల్లో చెప్పలేని విధంగా ఆనందంలో మునిగితేలారు. ఎన్నో ఏండ్ల నుంచి తాము బస్తీలో తాము పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి చూడడం, వెంటనే అందరికీ ఇండ్లు కట్టిస్తామని ప్రకటించడంతో ఇది కలా లేక నిజమా? అనిపిస్తున్నదని పలువురు అన్నారు.

ఎంతవరకు చదువుకుంటావో చదువుకో.. -నీకు ఉన్నత విద్య చెప్పిస్తా -తండ్రిలేని విద్యార్థినికి 5 లక్షలు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ సార్.. నాకు నాన్నలేరు. బాగా చదువుకోవాలని ఉంది. కాని మా దగ్గర పైసలు లేవు అని శ్రావణి అనే విద్యార్థిని మొరపెట్టుకోవడంతో సీఎం కేసీఆర్ చలించిపోయారు.

విద్యార్థిని చదువుకు అవసరమయ్యే విధంగా వెంటనే రూ.5 లక్షలు మంజూరు చేశారు. స్వచ్ఛ హైద్రాబాద్ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ శ్రీనివాస్‌నగర్ కాలనీవాసులతో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మాట్లాడుతుండగా శ్రావణి తన బాధను పంచుకున్నది. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. పదో తరగతి, ఇంటర్‌లోను మంచి మార్కులు వచ్చాయి. కానీ డిగ్రీలో చేరాలంటే ఫీజులు ఎక్కువగా అడుగున్నారు. చదివించడానికి పైసలు ఖర్చుపెట్టే స్తోమత నా కుటుంబానికి లేదు అని సీఎంకు వివరించింది. విద్యార్థిని బాధ విన్న సీఎం నీకు ఉన్నత విద్య చెప్పిస్తాను. బాధపడకు అంటూ అభయహస్తం ఇచ్చారు. ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాను. ఎంతవరకు చదివితే అంతవరకు చదువుకో అంటూ శ్రావణిలో మనోధైర్యాన్ని నింపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.