-మున్సిపాలిటీలు దేశంలోనే ఆదర్శంగా నిలవాలి -142 పురపాలికలు ‘ఓడీఎఫ్ ప్లస్ ప్లస్’కి చేరాలి -యేటా ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి పురస్కారాలు -ఐటీ, పురపాలక మంత్రి కే తారకరామారావు -భువనగిరిలో 14.63 కోట్ల విలువైన పనులకు -మంత్రి చేతులమీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

మున్సిపాలిటీలు స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సంకల్పసిద్ధి, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఫలితంగా స్వచ్ఛతలో వరుసగా మూడుసార్లు పంచాయతీరాజ్‌శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో రూ.14.63 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పట్టణంలోని డంపింగ్‌యార్డు ఆవరణలోని రిసోర్స్‌పార్కులో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల్లో కోతలు విధించినా అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా రాజీ పడకుండా నెలనెలా నిధులను విడుదల చేస్తున్నామని చెప్పారు. పట్టణాల్లో చేపడుతున్న స్వచ్ఛతను గుర్తించిన కేంద్రం తెలంగాణలోని అన్ని పట్టణాలను ఓడీఎఫ్‌గా ప్రకటించిందన్నారు. ఇదే స్ఫూర్తితో పల్లెలు, పట్టణాలన్నీ స్వచ్ఛత దిశగా అడుగువేసినప్పుడే మహాత్మాగాంధీకి అసలైన నివాళి అర్పించినట్టవుతుందని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో స్వచ్ఛత దివస్ పేరుతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
16,338 కమ్యూనిటీ టాయ్‌లెట్స్ తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 6,254 వరకు కమ్యూనిటీ టాయిలెట్స్ ఉండగా, ప్రతి వెయ్యి మందికి ఒకటి చొప్పున ఉండాలన్న ఉద్దేశంతో 16,338 కమ్యూనిటీ టాయిలెట్స్‌ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇంత పెద్దఎత్తున టాయిలెట్స్ నిర్మించడం దేశంలోనే ప్రప్రథమని తెలిపారు. గతం లో 50 నర్సరీలు మాత్రమే ఉండగా.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 142 ము న్సిపాలిటీల పరిధిలో 1,327 నర్సరీలను, 197 డ్రై రిసోర్స్ సెంటర్లను, 140 వరకు కంపోస్ట్ వార్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. కేం ద్రం ప్రకటించిన ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ జాబితాలో హైదరాబాద్, సిద్దిపేట బల్దియాలు, ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, వేములవాడ, భువనగిరి, వికారాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయన్నారు.

ఏటా పట్టణ ప్రగతి పురస్కారాలు ప్రతి ఏటా ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు అదేరోజు వివిధ క్యాటగిరీల్లో పురస్కారాలను అందజేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పచ్చదనం పెంపునకు కృషి చేసినవారికి, పారిశుద్ధ్యాన్ని సమర్థంగా నిర్వహించినవారికి, పారిశుద్ధ్య కార్మికులతో మెరుగ్గా పనిచేయించినవారికి పురస్కారాలను అందజేస్తామని చె ప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రూ.1,112 కోట్ల ను విడుదల చేశామన్నారు. చదువులు, ఉద్యోగాలు, మెరుగైన వైద్యం కోసం పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరగడంతో 43% పైగా జనాభా పట్టణాల్లో ఉంటున్నదన్నారు. వేగం గా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతున్నదని చెప్పారు. దీంతో ప్రతి పట్టణానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్టు తెలిపారు. సాదాబైనామా, జీవో 58, 59లతో ఇప్పటికే లక్షలమందికి యాజమాన్య హక్కులు కల్పించి సీఎం కేసీఆర్ ఉపశమనం కల్పించారని తెలిపారు. యాదాద్రి ఆలయం పునఃప్రారంభమైతే లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉందని, భువనగిరిలో రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్ రైలు రానుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి 64 స్వ యం సహాయ సంఘాలకు రూ.3.4 కోట్ల విలువ చేసే చెక్కులను అందజేశారు. కరోనా బాధితుల కోసం సొంత ఖర్చులతో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటుచేయడంతోపాటు, అంబులెన్స్ కోసం రూ.కోటి చెక్కును అందించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు.

మంత్రి సమక్షంలో ఒప్పందాలు మున్సిపాలిటీల్లోని వ్యర్థాలతో తయారుచేసే సేంద్రియ ఎరువులను ‘తెలంగాణ సిరి’ పేరుతో అగ్రోసంస్థ ద్వారా రైతులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక పరిపాలక శాఖ కమిషనర్ ఎన్ సత్యనారాయణ, అగ్రో సంస్థ ఎండీ రాములుతో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేవాలయాల నుంచి పూల వ్యర్థాలను సేకరించి అగరుబత్తీలను తయారు చేసేందుకుగాను హోలీవేస్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అంతకుముందు త్వరలో అమలుచేయనున్న పట్టణ ప్రగతి టాయిలెట్ మానిటరింగ్ యాప్‌ను, పట్టణ ప్రగతి త్రైమాసిక వార్తా పత్రికను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితారామచంద్రన్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్‌చైర్మన్ చింతల కృష్ణయ్య తదతరులు పాల్గొన్నారు.

-రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న కమ్యూనిటీ టాయిలెట్ల సంఖ్య – 6,254 -ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ల సంఖ్య – 16,388 -రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న నర్సరీల సంఖ్య – 50 -ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నర్సరీల సంఖ్య – 1,327