-మరో 20-25 వరకు వస్తాయనుకున్నాం -సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఆశీర్వదించారు -టీఆర్ఎస్కు ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు -కష్టపడ్డ పార్టీ శ్రేణులకు, నేతలకు కృతజ్ఞతలు -సోషల్ మీడియా వారియర్స్‌కు అభినందనలు -ఫలితాలపై విశ్లేషించుకొని ముందుకుపోతాం -జీహెచ్ఎంసీ ఫలితాలపై మంత్రి కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అతి స్వల్ప తేడాతో 13 స్థానాలను కోల్పోయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను అతిపెద్ద పార్టీగా ఆశీర్వదించారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. మరో 20 నుంచి 25 స్థానాలు అదనంగా వస్తాయని భావించామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన శుక్రవారం సాయంత్రం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వారందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్దే ఆధిపత్యమని తెలిపాయని ఆయన గుర్తుచేశారు. ఈ ఫలితాలపై విశ్లేషించుకొని ముందుకుపోతామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు గత పదిహేను ఇరవై రోజులుగా ప్రతీ డివిజన్‌కు ఇంచార్జీలుగా పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, రాష్ట్రమంతటి నుంచి వచ్చి పనిచేసిన నాయకత్వానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేసిన సోషల్ మీడియా వారియర్స్‌కు పేరు పేరునా ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పనిచేసిన ప్రతీ కార్యకర్తకు, నాయకుడికి పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
స్వల్ప తేడాతో 12 సీట్లలో ఓటమి స్వల్ప తేడాతో పది నుంచి 12 సీట్లను కోల్పోయామని, పార్టీ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి మరో 20 నుంచి 25 సీట్లు అదనంగా వస్తాయని భావించినట్టు తెలిపారు. బీఎన్ రెడ్డి నగర్లో 18 ఓట్లు, మల్కాజిగిరిలో 70, మూసాపేటలో 100, అడిక్‌మెట్‌లో 200, మౌలాలిలో 200 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ను అతిపెద్ద పార్టీగా ఆశీర్వదించారని చెప్పారు.
ఫలితాలపై విశ్లేషించుకుంటాం ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఫలితాల మీద విశ్లేషించుకొని ముందుకుపోతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘అన్ని విషయాలపై తప్పకుండా పార్టీలో సమగ్రంగా చర్చించి, విశ్లేషించుకుంటాం. మేయర్ ఎన్నికు ఇంకా రెండు నెలల సమయం ఉంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు’ అన్నారు. ఈ మీడియా సమావేశంలో మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతు బంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, నాయకులు కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.