Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

స్వరాజ్యం దిశగా గ్రామజ్యోతి

గ్రామ స్వరాజ్యం దిశగా మరో ముందడుగు పడింది. గ్రామసీమల రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించిన గ్రామజ్యోతి కార్యక్రమ లక్ష్యాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రకటించారు. గ్రామాల్లో సంపూర్ణ మౌలికవసతుల కల్పన, సంపూర్ణ అక్షరాస్యత, సహకార, వ్యవసాయ, పాడిరంగాల అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఈ కార్యక్రమం రూపకల్పన జరిగింది. మౌలిక వసతుల్లో పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, డంపింగ్‌యార్డ్‌లు, శ్మశానాల ఏర్పాటువంటి అంశాలను చేర్చారు. హరితహారంతో పర్యావరణ రక్షణ, గుడుంబా నిర్మూలనతో దుర్వ్యసనాల ప్రక్షాళన, స్వయం ఉపాధి పథకాలతో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలని నిర్దేశించారు.

CM-KCR-addressing-in-Grama-sabha-review-meet-with-govt-officials

-మౌలిక వసతుల కల్పన, సంపూర్ణ అక్షరాస్యత, ప్రజల ఆర్థిక స్వావలంబన ప్రధానాంశాలు -ప్రజల సంఘటిత శక్తే ప్రధాన వనరు -గ్రామజ్యోతి తీరుతెన్నులు వివరించిన సీఎం కే సీఆర్ -మంత్రులు, అధికారులు, చేంజ్ ఏజెంట్స్‌తో అవగాహన సదస్సు -ఏడు దశాబ్దాలు కావస్తున్నా అభివృద్ధి జాడలేదు -ప్రణాళికల్లో ప్రజల భాగస్వామ్యం లేకే ఈ దుస్థితి -గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్‌లే ఆదర్శం -గ్రామజ్యోతిలో మార్పుసాధకులదే కీలక పాత్ర -ప్రతి ఎమ్మెల్యే మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకోవాలి: సీఎం -స్వరాజ్యం దిశగా గ్రామజ్యోతి -సంఘటిత శక్తిని చాటాలి అన్ని పథకాల్లో ప్రజల భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తేవడమే గ్రామజ్యోతి లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రామజ్యోతి పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీవోలు, చేంజ్ ఏజెంట్స్, వివిధ శాఖల ఉన్నతాధికారుల అవగాహన సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆ లక్ష్యంతోనే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున తలపెట్టామని వివరించారు. గ్రామాల అభివృద్ధి పథకాలకు గ్రామస్తుల సమక్షంలో, వారి భాగస్వామ్యంతో రూపకల్పన జరపాలని అన్నారు. ప్రజలకు వారి సంఘటిత శక్తి విలువ ఏమిటో చెప్పడం ఈ పథకంలో ప్రధానాంశమని వెల్లడించారు. రావాల్సిన మార్పు రాలేదు: కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఇలా సాగింది… ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో గ్రామాల్లో రావాల్సినంత గుణాత్మక మార్పు రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి పద్ధతిలో అభివృద్ధి జరుగలేదు. గ్రామాలు, పట్టణాల్లో మార్పు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మానవ వనరులకు మించిన సంపద లేదు. ప్రజల సంఘటిత శక్తిలోని బలాన్ని ప్రజలకు చెప్పలేకపోయాం. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో కొంత పని జరిగినా, అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో మనం గ్రామజ్యోతి కార్యక్రమం తీసుకున్నాం.

రాబోయే నాలుగేండ్లలో వివిధ శాఖలద్వారా గ్రామాల అభివృద్ధికి రూ.25వేల కోట్లు ఖర్చు పెడతాం. స్థానికంగా ఏది అవసరమో గుర్తించి, ఆ పనులు చేయాలి. ఇది కేవలం సర్పంచ్‌ల కార్యక్రమం కాదు. అందరిదీ. గ్రామసభల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పాల్గొని గ్రామాల ప్రణాళికలు తయారు చేయాలి. గ్రామానికి ఉన్న అవసరాలేంటో గుర్తించి, నిధులపై అంచనా వేసుకుని ప్రణాళికలు రూపొందించాలి. ప్రతి ఎమ్మెల్యే మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకొనేలా ప్లాన్ చేయాలి. ఆ గ్రామాలను మిగతా గ్రామాలకు ఆదర్శంగా చూపాలి

మార్పుసాధకులది క్రియాశీలకపాత్ర.. గ్రామజ్యోతి పథకం కోసం నియమించిన మార్పు సాధకులు (చేంజ్ ఏజెంట్స్) క్రియాశీలకంగా పనిచేయాలి. మంచిమార్గం చూపితే అనుసరించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ప్రజలను చైతన్యపరచడం, వారిని భాగస్వాములను చేయడమే చేంజ్ ఏజెంట్స్ కర్తవ్యం. ప్రారంభంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ స్థిరంగా పని చేసుకుపోవడంవల్ల మంచి ఫలితాలు వస్తాయి. మొన్న నేను దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్‌కు వెళ్లాను. అక్కడ పరిస్థితి బాగా లేదు.

Govt-officials

దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. మీరు గ్రామాలకు వెళ్లినప్పుడు కూడా నిరుత్సాహకర పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. దానికే మనం నీరుకారిపోకూడదు. ముందు గ్రామ పరిస్థితిపై అంచనా వేసుకోవాలి. తర్వాత ప్రజలతో కలిసి చర్చించి, అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలి. ప్రజల సంఘటిత శక్తిలో ఎంత బలముందో వారికి వివరించాలి. ప్రజలంతా కలిసి పనిచేస్తే మార్పు సాధ్యమనే విషయం వారికి చెప్పాలి. చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితాలుంటాయి. స్థిరమైన ప్రయత్నంచేస్తే ఏదైనా సాధించవచ్చనే దానికి తెలంగాణ రాష్ట్ర సాధనే మంచి ఉదాహరణ.

చేంజ్ ఏజెంట్లుగా వెళ్లిన వారు చిత్తశుద్ధితో పనిచేస్తే గ్రామాలు, తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది. ఏ గ్రామానికి.. ఏ పథకం ద్వారా.. ఎన్ని నిధులు వస్తాయో కూడా అధికారులకు ముందే తెలియజేస్తాం. వాటిని సద్వినియోగం చేయాలి. కానీ ఏ పనులు చేయాలనే విషయం మాత్రం గ్రామస్తులే నిర్ణయించాలి. గ్రామసభలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పాల్గొనాలి. నాలుగు సంవత్సరాలకుగాను ప్రణాళిక గ్రామసభలో తయారు కావాలి. గ్రామాల శక్తిని పరిపుష్ఠం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం.

నిధులు కరుగుతున్నా అభివృద్ధి అంతంతే.. అభివృద్ధి పనులకోసం చట్టసభల సభ్యులు, స్థానిక సంస్థల ద్వారా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అయినా గ్రామాల్లో మంచి పద్ధతిలో అభివృద్ధి జరుగడం లేదు. ప్రణాళికా బద్ధంగా నిధులు ఖర్చు కాకపోవడం, ప్రజలు ప్రణాళికలో భాగం కాకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే వీటిని అధిగమించి ఎంతో బాగుపడిన గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్ గ్రామాలు మన తెలంగాణలోనే ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ, సహకార వ్యవస్థలు ఈ గ్రామాల్లో పటిష్ఠంగా ఉన్నాయి.

వీటిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రజలు కలిసి మెలిసి గ్రామ కమిటీలు వేసుకుని అభివృద్ధి చెందుతున్నారు. ఇదే పద్ధతిలో అన్ని గ్రామాలు ముందుకుపోవాలి. ప్రస్తుతం దేశంలోని చాలా గ్రామాలు మౌలిక వసతుల అభివృద్ధిలో గంగదేవిపల్లిని, వ్యవసాయాభివృద్ధిలో అంకాపూర్‌ను, సహకార సంఘాల పనితీరులో ముల్కనూర్‌ను చూసి నేర్చుకుంటున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు కూడా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలి.

ఆర్థిక ప్రేరణ వరకే ప్రభుత్వ బాధ్యత.. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ప్రవేశపెడితే వెంటనే నిధులు ఎన్ని వస్తాయి? అనే ప్రశ్న ముందుకొస్తుంది. ఈ కార్యక్రమానికి డబ్బులు ప్రధానం కాదు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యం. ప్రభుత్వం అర్థిక ప్రేరణ కల్పిస్తుంది. గ్రామాల్లో వెలుగులు నింపడమే గ్రామజ్యోతి లక్ష్యం. ఈ కార్యక్రమాల్లో యువశక్తిని, మహిళాశక్తిని బాగా ఉపయోగించుకోవాలి. హరితహారం కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. గ్రామాభివృద్ధి ప్రణాళికల ఆధారంగా గిరిజన తండాలు, ఆదివాసీ గూడేల కోసం ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, దళితవాడలకోసం ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు కూడా వాడుకోవచ్చు. గ్రామజ్యోతి గ్రామసభల తర్వాత మళ్లీ చేంజ్ ఏజెంట్ల సమావేశం నిర్వహిస్తాం.

పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు సవరించుకోవచ్చు.. గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు సవరించుకోవచ్చని సీఎం తెలిపారు. వేతనాలకోసం గతంలో ఆదాయంలో 30% మాత్రమే ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ పరిమితిని ఇపుడు 50 శాతానికి పెంచుతున్నాం. ఈ వెసులుబాటుతో గ్రామ పంచాయతీలు సిబ్బంది వేతనాలను సవరించుకోవచ్చు అని సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామజ్యోతి పథకం పై పంచాయతీరాజ్ సెక్రటరీ రేమండ్ పీటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

గంగదేవిపల్లి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడికి సీఎం సన్మానం గంగదేవిపల్లి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కూనం రాజమౌళిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ సందర్భంగా సన్మానించారు. గంగదేవిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా నిలపడంలో చేసిన కృషిని, ప్రజల భాగస్వామ్యంతో చేసిన అభివృద్ధి గురించి సభలో రాజమౌళి వివరించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు గ్రామజ్యోతిపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

గ్రామజ్యోతిపై నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్రామజ్యోతి పథకంపై బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాల్సిందిగా సమాచారాన్ని పంపారు. రాష్ట్రంలోని తొమ్మిది మంది జడ్పీ చైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం మొదలవుతుంది. గ్రామజ్యోతి పథకం వివరాలు, దాని ముఖ్యోద్దేశం, లక్ష్యాలను ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించనున్నారు. దీనితోపాటు ప్రజాప్రతినిధులందరూ ప్రత్యేక శ్రద్ధతో పథకం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

ఏమేం చేయాలి?… గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, శ్మశానవాటికల నిర్మాణం, చెత్త డంప్‌యార్డుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామ ప్రణాళిక రూపొందించే క్రమంలో ప్రత్యేకమైన సమస్యలను గుర్తించాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని గుర్తించి, వైద్యం చేయించాలి. గ్రామాల్లో గుడుంబా మహమ్మారి ఓ విషవలయంగా మారింది. అనేక మంది మరణిస్తున్నారు. ఈ విషయంలో గ్రామాల్లో చైతన్యం రావాలి. గ్రామాలనుంచి గుడుంబాను తరిమికొట్టే విధంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తించాలి. గ్రామాల్లో వందశాతం అక్షరాస్యత సాధించాలి.

చదువుకున్న యువత సహాయంతో గ్రామాల్లో అందరికీ చదువు నేర్చించాలి. గ్రామంలో ఒకరోజు పవర్‌డే నిర్వహించుకోవాలి. వంగిన పోల్స్‌ను, వేలాడే వైర్లను సరిచేయాలి. అన్ని ఇండ్లకు టాయిలెట్స్ ఉండాలి. వాటిని వాడేలా చూడాలి. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త సేకరించడానికి గ్రామాలకు 25 వేల రిక్షాలను ప్రభుత్వం కొని ఇస్తుంది. 750 జనాభాకు ఒక మూడు చక్రాల రిక్షా ఇస్తారు. గ్రామాల్లో మురికి కాలువలనుంచి వచ్చే మురుగు నీరు ఊరు అవతలికి తరలించాలి. ఊరవతల సోక్ ట్యాంకులు నిర్మించాలి. అందులో మురికినీటిని నింపాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.