Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా?

-మూడు ప్రాంతాల్లో నీటి వినియోగం చెప్పండి -ఏ ప్రాంతానికి ఎంతిచ్చారు? -సీమాంధ్ర వాటా ఎంత? వాడిందెంత? -జీవోలు పంపిస్తున్నా.. చదువుకోండి -టీడీపీ పాలకులకు మంత్రి హరీశ్ సవాల్

Harish Rao (2) తొమ్మిదేండ్ల టీడీపీ పాలనలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు చేపట్టి ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇచ్చారో స్పష్టం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు సవాలు చేశారు. అప్పుడే మూడు ప్రాంతాల ప్రజలకు నిజానిజాలు అర్థమవుతాయని అన్నారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ, మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్‌పై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరకాల ఓ స్వయం ప్రకటిత మేధావి, విద్రోహకర్త అని మండిపడ్డారు. శ్రీశైలం నీటి ప్రాజెక్టు నీటి మట్టాలపై అబద్ధాలను వల్లిస్తూ తమపైనే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఏ ఎండకాగొడుగు పడుతూ బురద జల్లుతున్నారని, సూర్యుడిపై ఉమ్మేస్తే అది వారిపైనే పడుతుందని తెలుసుకోవాలన్నారు. కృష్ణా జలాల్లో ఎవరి వాటా ఎంత? తెలంగాణకు ఇచ్చిందెంత? సీమాంధ్రకు తరలించిందెంత? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి ఆయకట్టును పెంచారో, అదే సీమాంధ్రలో ఎన్నింటిని పూర్తిచేసి ఆయకట్టును పెంచారో చెప్పాలన్నారు.

చదువుతా వినండి.. జీవోలు సరిగ్గా చదువుకోలేదంటూ ఆంధ్రా మంత్రి దేవినేని ఉమ, సలహాదారుడు పరకాల వ్యాఖ్యానించడాన్ని హరీశ్‌రావు తప్పుపట్టారు. ఏయే జీవోల్లో ఏముందో సోమవారం సాయంత్రం సచివాలయంలో మీడియాకు చదివి వినిపించారు. జీవో కాపీలను వారికి పంపిస్తున్నామని మంత్రి చూపించారు. జీవో నెం.233ను తాను బయట పెట్టే వరకు ఆంధ్రా బాబులు మాట్లాడలేదన్నారు. జీవోలో 4 పేరాలు ఉందని, ఏయే పేరా ఏం చెబుతుందో వాళ్లు తెలుసుకోవాలన్నారు. ఒకట్లో గాలేరు-నగరి సృజల స్రవంతి గురించి చెప్పారు. రెండో దాంట్లో జీవో నెం.69 ప్రకారం 834 అడుగుల వరకు వినియోగించుకోవచ్చునని స్పష్టంగా ఉందన్నారు. జీవోల్లో శ్రీశైలం నీటి మట్టాల గురించి లేదంటూ ప్రజలను మభ్యపెట్టొద్దని సూచించారు.

వాళ్లకు తెలిసిందంతే.. జీవో నెం.233 అసలు శ్రీశైలం నీటికి సంబంధించినది కానే కాదంటూ వాదించడంపై హరీశ్ విస్మయం వ్యక్తం చేశారు. జీవోల మీద వారి అవగాహన స్థాయి అంతేనని ఎద్దేవా చేశారు. నీటి మట్టాలపై 1996లో టీడీపీ హయాంలో జారీ చేసిన జీవో 69లో 834 అడుగులుగా, 2004లో జీవో నెం.107 ప్రకారం 854 అడుగులు అంటూ పేర్కొన్నారు. అలాగే 2005లో జీఓ 233ను జారీ చేస్తూ 834 అడుగులకు పరిమితం చేశారు. దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ టీడీపీ విజయవాడలో ధర్నా చేసి నిరసన తెలిపింది.

జీఓ 69 ప్రకారం అమలు చేయాలంటూ డిమాండ్ చేసిన విషయం అన్ని ప్రాంతాల ప్రజలకు తెలుసునన్నారు. 2002లో నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు కేసు వేస్తే దానికి అఫిడవిట్(రిట్ పిటిషన్ నెం.2444/2002)లో నీటి వినియోగాన్ని ప్రభుత్వం ప్రజావసరాల కోసం ఏ స్థాయిలోనైనా వినియోగించుకునే అధికారం ఉందని పేర్కొన్నట్లు చూపించారు. జీఓ నెం.233 అసలు శ్రీశైలం నీటికి సంబంధించినది కానే కాదంటూ వాదిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఆ జీఓను బాబు ఎందుకు అమలు చేయలేదు..? చంద్రబాబునాయుడు పాలనలో ఆయన జారీ చేసిన ఏ జీఓనూ సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 1996, 1997లో 733.30 అ., 1998లో 808.2, 1999, 2000లో 805.80 అ., 2001-02లో 811.01అ, 2003-04లో 801 అ., 2003-04లో 762.2అ.ల వరకు వినియోగించుకున్నారు. ఈ వివరాలు సీడబ్ల్యూసీ నుంచి తీసుకున్నవని స్పష్టం చేశారు. బాబు గారి హయాంలో జీఓలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఏ ఒక్క సంవత్సరం కూడా అమలు చేయలేదన్నారు.

శ్రీకృష్ణ కమిటీకి ఏం చెప్పారు? ఇదే పెద్ద మనుషులు సమైక్యంగా ఉంటే తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని ఢిల్లీలో శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. శ్రీశైలంలో విద్యుత్తును ఉత్పత్తి చేసి తెలంగాణ రైతాంగానికే ఇస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారని గుర్తు చేశారు. అందుకే కలిసుండాలంటూ వాదనలు వినిపించినట్లు చెప్పారు. పైగా శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ప్రాజెక్టు అని మర్చిపోతున్నారని గుర్తు చేశారు.

కరెక్టే.. టీ టీడీపీ, టీ కాంగ్రెస్‌లది అసమర్థతే.. కృష్ణా నదీ జలాలను వాడుకోకపోవడం వారి అసమర్థత అంటూ దేవినేని ఉమ అంటున్నారు. నిజమే.. తెలంగాణ టీడీపీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అసమర్థతే కారణమని స్పష్టం చేశారు. నీటి కేటాయింపుల్లేకుండానే పులిచింతల, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు కడుతుంటే వీళ్లంతా నోరు మూసుకున్నారు. అదే కృష్ణా నది ఆరంభంలోనే ఉన్న జూరాల, కల్వకుర్తి-నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను గాలికొదిలేస్తే ప్రశ్నించని అసమర్థుల వల్లనే ఈ సమస్య తలెత్తిందని మండిపడ్డారు.

నోటి కాడి బుక్కను గుంజుకుంటూ చేతగానోళ్లు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఊడిగం చేయడం వల్లే ఈ గోస పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జానారెడ్డి, ఉత్తంకుమార్‌రెడ్డి, డీకే అరుణలకు ముందుచూపు లేకపోవడం వల్లే ఈ సమస్య అన్నారు. తెలంగాణలో ఒక్క విద్యుత్తు ప్రాజెక్టు పెట్టకపోతే అడిగిన పాపాన పోలేదు. ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఎందుకు చేయరని నిలదీసిన దాఖలాలు లేవు అన్నారు.

ఇక వదిలేది లేదు… అయితే ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైంది. ఇప్పుడు మీ ఆటలు సాగవని హరిశ్‌రావు హెచ్చరించారు. ఒక్క చుక్క నీటిని కూడా వదిలేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జీఓ నెం. 69 ప్రకారం పక్కాగా నీటిని వినియోగించుకుంటాం. మా ప్రాంత రైతాంగాన్ని కాపాడుకునేందుకు విద్యుత్పత్తి చేసి తీరుతాం అని పునరుద్ఘాటించారు. ఆంధ్రా ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కరెంటు ఇవ్వకపోతే, పంటలను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు.

దుకాణం ఖాళీ అవుతుందనే… ప్రభుత్వ పథకాలు ప్రజాదరణ పొందడంతో టీడీపీ దుకాణం ఖాళీ అవుతున్నదని హరీశ్ అన్నారు. రైతుల రుణాలను మాఫీ చేసేందుకు రూ.17 వేల కోట్లు ఇస్తున్నాం. రూ.488 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఇచ్చాం. సేకరణ ధర పెంచి పాడిపరిశ్రమను కాపాడుకుంటున్నాం. విజయ డెయిరీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నాం.. ఉద్యాన వన విభాగాన్ని ఆధునీకరిస్తున్నాం. ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ఇచ్చారు. ఇప్పుడు ఒక్క రోజుకే పరిమితం చేస్తున్నామని స్పష్టం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు రోజుకో ఎమ్మెల్యే జారి పోతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాయని విమర్శించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.