Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

స్వైన్‌ఫ్లూపై సీఎం కేసీఆర్ అభయం

స్వైన్‌ఫ్లూ అనేది చాలా సాధారణమైన వైరస్ అని, దీనిపై ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. అయితే ఇది వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. స్వైన్‌ఫ్లూను తరిమేయడానికి ప్రభుత్వంలోని అన్నిశాఖలు, మీడియా కలిసి ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించి, ఒక యుద్ధంలాగా చేయాలని, వైరస్‌ను తరిమికొట్టాలని అన్నారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నట్లు, మరణాలు సంభవిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగారు.

KCR-review-meet-on-Swine-flu

-అందరం కలిసి వైరస్‌ను తరిమేద్దాం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి స్వైన్‌ఫ్లూ -వ్యక్తిగత పరిశుభ్రతతో రక్షణ -108ల ద్వారా రోగుల తరలింపు -మీడియా సమావేశంలో సీఎం -రాష్ర్టానికి నలుగురు సభ్యులకేంద్ర బృందం -ట్యాబ్లెట్లు, సిరప్‌ల సరఫరాకు కేంద్రం హామీ -కార్పొరేట్ ఆస్పత్రులవైద్యులతో సీఎం సమావేశం -అత్యవసరంగా క్యాబినెట్ భేటీ బుధవారం ఉదయమే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితిని అదుపు చేసేందుకు పూర్తి సహకారం అందించేందుకు మోదీ, నడ్డా సంసిద్ధత వ్యక్తం చేశారు. 50వేల టామీఫ్లూ ట్యాబ్లెట్లు, సిరప్‌లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా బుధవారం నడ్డాతో ఢిల్లీలో సమావేశమయ్యారు.

అనంతరం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శిలతో కూడా సురేశ్‌చందా సమావేశమై రాష్ర్టానికి కావాల్సిన అవసరాలను వివరించారు. చికిత్సకు అవసరమైన ఒసేల్టామివిర్ గోలీల నిల్వలు సరిపడా కేంద్రం దగ్గర ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో మరో మూడువేల మందికి సరిపోయే గోలీలు కూడా రిజర్వ్‌లో ఉంచినట్లు నడ్డా చెప్పారు.

రాష్ట్రంలో పరిస్థితిని పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందాన్ని కూడా పంపుతున్నట్లు తెలిపారు. మరోవైపు నగరానికి చెందిన పలు కార్పొరేట్ హాస్పిటళ్ల ప్రతినిధులు, వైద్యులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఇదే అంశంపై చర్చించేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గాన్ని అత్యవసరంగా సమావేశపర్చారు. అనంతరం సచివాలయం సీ బ్లాక్‌లోని సమావేశ హాలులో డిప్యూటీ సీఎంలు డాక్టర్ రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పద్మారావు,నాయిని నర్సింహారెడ్డి, పార్లమెంటరీ సెక్రటరీ జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు.

స్వైన్‌ఫ్లూ వ్యాప్తి, దాని నివారణ, అందుకు తీసుకుంటున్న చర్యలు వివరించారు. పొద్దున్నే మీడియాలో వచ్చిన కథనాలు, వార్తలు చూసి నేనుకూడా భయపడ్డాను. ఒకేరోజు ఐదుగురు చనిపోయినట్టు వచ్చిన వార్తలతో అప్రమత్తమయ్యాం. దీనిపై కేంద్రం సహకారాన్ని కోరాను. ఉదయం 8.30 గంటల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో మాట్లాడాను. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో మూడునాలుగుసార్లు మాట్లాడాను.

దేశవ్యాప్తంగా ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఉన్నట్టు వారు తెలిపారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, కావాల్సిన వైద్య, ఇతరత్రా సాయం చేస్తామని చెప్పారు అని కేసీఆర్ విలేకరులకు తెలిపారు. ఇక్కడి కార్పొరేట్ దవాఖానల ప్రతినిధులతో, వైద్యులతో మాట్లాడాం.

వారు చెప్పినదానిని బట్టి చూస్తే స్వైన్‌ఫ్లూ అనేదాని గురించి భయపడాల్సిన అవసరం లేదని తేలింది. అదొక థర్డ్‌క్లాస్ వైరస్. కాకపోతే ఇంకా వ్యాపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మంత్రులతోనూ కలిసి మాట్లాడాం. స్వైన్‌ఫ్లూను తరిమేయడానికి ప్రభుత్వంలోని అన్నిశాఖలు, మీడియా కలిసి ప్రజల్లో చైతన్యం కల్పించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించి, ఒక యుద్ధంలా చేయాలి అని ముఖ్యమంత్రి అన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, రోగులకు అందిస్తున్న చికిత్సపై ముందుగానే సమాచారం అందిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. మరణాలపై భిన్నమైన సంఖ్యలు రావడాన్ని ప్రస్తావించగా.. ఆరోగ్యశాఖ మంత్రికి వచ్చిన సమాచారం మేరకే ఆయన మీడియాకు తెలిపారు. అందులో ఆయన తప్పు ఏమీ లేదు.

అధికారులుకూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. దీనికి ఎవరినీ బాధ్యులుగా చేయలేం. చర్యలేమీ ఉండవు. స్వైన్‌ఫ్లూ అని ప్రశ్న వస్తే అందుకు సంబంధించిన సమాచారం మాత్రమే ఇచ్చారు. నిజానికి ఇతరత్రా వ్యాధులు, కారణాలతోకూడా చనిపోయినవారు ఉండవచ్చు. దానివల్లే అంకెల్లో తేడాలున్నాయి. ఇది ముమ్మాటికి మహమ్మారి కాదు. వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తిచెందే వైరస్ మాత్రమే. అంతకు మించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు అని సీఎం స్పష్టం చేశారు. ఇంకా సీఎం ఏమన్నారంటే..

స్వైన్‌ఫ్లూ: ఇది రావడం సాధారణమే. ఇప్పటికే ఏడు రాష్ర్టాల్లో ఉంది. కేంద్రంకూడా స్వైన్‌ఫ్లూ విస్తరించకుండా చర్యలు తీసుకుంది. ఇది వ్యాప్తిచెందకుండా రాష్ట్ర ప్రభుత్వంకూడా విస్తృతంగా చర్యలు చేపట్టింది. స్వైన్‌ఫ్లూ వ్యాప్తికాకుండా అడ్డుకునేందుకు నిర్ణయించాం.

వ్యాప్తి, ప్రభావం: ఇది కేవలం ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. నిజానికి పూర్తిస్థాయి వ్యాధికూడా కాదు. సాధారణంగా తీవ్ర జలుబు, దగ్గు, తీవ్ర ఒంటి నొప్పులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి అయితే మరీ మంచింది. అక్కడైతే వెంటనే పరీక్షలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. ప్రస్తుతం 20-30 మంది మాత్రమే దీనికి చికిత్స పొందుతున్నారు.

నిజానికి ఐదేండ్లలోపు పిల్లలు, 60-65 ఏండ్ల వృద్ధులతోపాటు గర్భిణీలకు ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీడియాలో వచ్చిన కథనాలు, సంఖ్య మాత్రం ఆందోళన కల్గించింది. దీనితో మేం కూడా జాగ్రత్త పడ్డాం. ఇదికూడా ఒకందుకు మంచిదే అయ్యింది. ప్రభుత్వం మరింత వేగంగా స్పందించేలా చేసింది. మరణాలు, బాధితులు, మేము తీసుకుంటున్న చర్యలపై సరైన సమాచారం మీకు అందకపోవడంతో ఇలా జరిగిందని అనుకుంటున్నాను.

ఇకపై అలా ఉండదు. ప్రతిరోజూ నిమ్స్ డైరెక్టర్ మీకు (మీడియాకు) సమాచారం అందిస్తారు. ఏమేం చర్యలు తీసుకున్నదీ, పరిస్థితి ఎలా ఉన్నదీ.. అన్ని వివరాలూ అందిస్తారు. కరచాలనం, కౌగిలించుకోవడం లాంటివి చేస్తే వైరస్ ఎదుటి వ్యక్తికి సోకే అవకాశం ఉంది. అలాగే ప్రజలు ఎక్కువగా గుమిగూడే శుభకార్యాలు, సినిమాహాళ్ళులాంటి చోటుకి దూరంగా ఉంటే మంచిది.

చికిత్స, మందులు : దీని నివారణకు టామీఫ్లూ అనే గోళీ సరిపోతుంది. ఇప్పుడు మన దగ్గర 16 వేల గోళీలు ఉన్నాయి. మరో 40-50 వేల గోళీలను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దీనితోపాటు మరో 10 వేల బాటిళ్ళ సిరప్‌నుకూడా పంపించాలని మేము కోరితే దానికీ సానుకూలంగా స్పందించారు. దీనితోపాటు స్వైన్‌ఫ్లూ పరీక్షించడానికి కావాల్సిన సంబంధించిన యంత్రపరికరాలు మన రాష్ట్రంలో రెండుచోట్ల మాత్రమే ఉన్నాయి.

ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రుల్లో మాత్రమే ఉన్నాయి. మరో ఐదారు పంపించాలని కేంద్రాన్ని కోరాం. అవి వస్తే వరంగల్ ఎంజీఎం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో పెట్టవచ్చు. స్వైన్‌ఫ్లూ సోకిన వ్యక్తిని ప్రత్యేకంగా స్టెరిలైజ్ చేసిన గదిలో ఉంచి చికిత్స అందించాలి. అందుకు నగరంతోపాటు అన్ని జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో ఇలాంటి ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటుచేశాం. కేంద్రం నుంచి వచ్చే అధికారులు, వైద్యుల బృందంతో గురువారంనాడు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సమావేశమవుతాం.

ప్రజల్లో చైతన్యం: తీవ్ర జలుబు, దగ్గు, తీవ్ర ఒంటి నొప్పులు ఈ మూడు లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో వైద్యుడిని సంప్రదించాలి. ప్రభుత్వ ఆస్పత్రి అయితే మరింత మంచిది. అసలు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తే ఈ వైరస్ సోకదు. పెళ్ళిళ్లు, శుభకార్యాలు, సినిమాలకు వెళ్ళనీయకుండా చూసుకోవాలి.

ఆరోగ్యశ్రీ: ఆయా శాఖల అధికారులు, మంత్రులతో మాట్లాడిన తరువాత సామాన్యులకు ఈ వ్యాధి చికిత్స అందుబాటులో ఉండేలా స్వైన్‌ఫ్లూ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ఆదేశాలు జారీచేశాం. వ్యాధి లక్షణాలున్న రోగిని అవసరమైతే హైదరాబాద్‌లోని దవాఖానలకు 108 అంబులెన్సుల ద్వారా ఉచితంగా తరలించాలని ఆదేశించాం. దీనివల్ల రవాణా భారం ఉండదు. పైగా వైరస్ ఇతరులకు సోకదు.

చర్యలు : వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు, సామాజిక (కమ్యూనిటీ) పరిశుభ్రతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఇందుకు అన్ని శాఖలతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీచేశాం. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్‌ను ప్రత్యేకంగా నియమించాం. వ్యాధి లక్షణాలు బయటపడ్డ వెంటనే రోగి వివరాలు చెబితే వెంటనే సంబంధిత శాఖల నుంచి అధికారులు, సిబ్బంది వెళ్ళి ఆ ఇంటిలో పరిశుభ్రతా చర్యలు, స్టెరిలైజ్ చర్యలు తీసుకుని ఇతరులకు ఆ వైరస్ వ్యాపించకుండా చూస్తారు. పరిశుభ్రతపై మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

వ్యాక్సిన్ : వైద్యులందరూ అసలు వ్యాక్సిన్ అవసరం లేదని అన్నారు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తున్నది. రోగులకు చికిత్స అందించే డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఈ వైరస్ సోకితే.. వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ అవసరమని వైద్యశాఖ ఉన్నతాధికారులు చెప్పారు. కిమ్స్ డైరెక్టర్ భాస్కర్‌రావు అయితే తన వద్దకు వచ్చినవారిని వ్యాక్సిన్ అవసరం లేదని వెనక్కి పంపిస్తున్నట్టు తెలిపారు.

స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరు మృతి నమస్తే తెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్రంలో బుధవారం మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూ వ్యాధితో మృతి చెందారు. బుధవారం మొత్తం 34మందికి పరీక్షలు చేయగా.. తాజాగా 13మందికి పాజిటివ్ కేసులు వచ్చాయి. గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.