– పులి తోక గిచ్చాలని చూడకు బిడ్డా
– కాళేశ్వరం ఏటీఎం అయితే దేశంలోని
– ప్రాజెక్టులన్నీ మోదీకి ఏటీఎం లేనా?
– బందిపోట్లు, జేబుదొంగల పార్టీ బీజేపీ
– ఆబ్కారీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైకో, లుచ్చా, బద్మాష్ మాదిరిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పులి లాంటి వాడని, పులితోక పట్టుకొని గిచ్చాలని చూస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని వేషాలు వేసినా కమలం వికసించదని చెప్పారు. పాదయాత్రల పేరిట పచ్చబడ్డ పాలమూరును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ర్టానికి ఏం చేశారో చెప్పకుండా మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు అంటూ తెలంగాణను మోసం చేసిన చరిత్ర బీజేపీదని దుయ్యబట్టారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్నే ప్రధాని మోదీ అవమాన పరిచారని, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ అవహేళన చేశారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జీవితాలను బాగుచేసుకొంటుంటే కండ్లు కుట్టిన బీజేపీ తెలంగాణ మీద అక్కసు వెళ్లగక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవగాహన లేని నడ్డా
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పేర్కొనడం దుర్మార్గమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కీర్తించారని, బీజేపీ మంత్రులే పార్లమెంటు సాక్షిగా అవినీతి జరగలేదని చెప్పారని గుర్తుచేశారు. పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రశంసిస్తున్నారని వివరించారు.
అవినీతి తాత మోదీ
దేశంలో అతిపెద్ద కమీషన్ల పార్టీ బీజేపీ అనే విషయం లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను అమ్మడంతోనే తేలిపోయిందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వేలు, పవన్‌హన్స్ వంటి సంస్థలను అమ్మకానికి పెట్టడం ద్వారా మోదీకి ఎంత మొత్తం కమీషన్లు వచ్చాయని ప్రశ్నించారు. ఏటీఎం అంటే అవినీతి తాత మోదీ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేయటం, తాకట్టు పెట్టడం తెలిసిన మోదీ.. అదానీకి తొత్తు అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను రజాకార్ల పార్టీగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ అంటే బందిపోట్లు, జేబుదొంగల పార్టీనా? అని నిలదీశారు. ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ స్థాయికి, హోదాకు, వయస్సుకు కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను సామాన్య ప్రజలు చెప్పుతో కొట్టే రోజులొచ్చాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురోగమిస్తున్న రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చేతనైతే మంచిపనులు చేయాలని, పిచ్చిమాటలు మానుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని డిమాండ్ చేశారు. దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీ నేతలు బాగుపడుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వీధిరౌడీలా సంజయ్
జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిననే సోయి లేకుండా బండి సంజయ్ వీధి రౌడీలా, పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. సిగ్గూ, శరం, లజ్జ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. సంస్కారం లేని నీచుడికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎవరిచ్చారు? ఇదేం సంస్కృతి? అని నిలదీశారు. బండి సంజయ్ పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్చాలని ఎద్దేవా చేశారు.