Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సై..సై.. జోడెడ్ల బండి

-రైతన్న సన్నద్ధం.. సర్కారు సమాయత్తం
-రైతుబంధు కింద ఇప్పటికే 5,500 కోట్లు
-వారం పది రోజుల్లో మరో 1,500 కోట్లు
-వానకాలం సాగుకు ముందే పెట్టుబడి
-1.25 కోట్ల ఎకరాల్లో నియంత్రిత సాగు

దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ వ్యవసాయంపై సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మొగులు చూసి కాలమెట్లా అవుతుందో ఊహించేవాడు కర్షకుడు. కాలమాన పరిస్థితి చూసి భవితను అంచనా వేసేవాడు నాయకుడు.

అదును పదును చూసి పొలంలోకి ఎడ్లను నడిపిస్తాడు కర్షకుడు. మార్కెట్‌ సరళిని చూసి రైతును సేద్యంలోకి నడిపిస్తాడు నాయకుడు. రైతు- నేత చేయి చేయి కలిపితే.. సాగేది జోడెడ్ల వ్యవసాయమే! తెలంగాణలో ఇప్పుడు ఈ అద్భుతమే జరుగబోతున్నది. మార్కెట్లో గిరాకీ ఉండే పంటలనే పండించాలంటూ నియంత్రిత వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిస్తే.. రైతన్న జై అన్నాడు. దీంతో కొత్త సాగు విధానానికి ప్రభుత్వం సై అన్నది. దేశానికే ఆదర్శమయ్యేలా.. తెలంగాణలో ఈ వానకాలంలో కొంగొత్త ఏరువాక సాగనున్నది.

కరోనాతో యావత్‌ ప్రపంచం స్తంభించి ఉండవచ్చు. కానీ తెలంగాణ రైతన్న మాత్రం ఆగలేదు. యాసంగిలో బంగరు వరి ధాన్యం దిగుబడిలో, ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు సృష్టించిన రైతన్న ఇప్పుడు నియంత్రిత సేద్యానికి నాగలి కడుతున్నాడు.

కరోనాతో ప్రభుత్వాల ఆదాయాలన్నీ పడిపోయి ఉండవచ్చు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఆగలేదు. పడావుబడ్డ బీళ్లలోకి కాళేశ్వరం నీళ్లను పరవళ్లు తొక్కించిన సీఎం కేసీఆర్‌.. కరోనా కష్ట కాలంలోనూ రైతన్న చేయి వదల్లేదు. మార్కెట్లు బందైన రోజుల్లో ఊరూరికీ వెళ్లి పండించిన ప్రతి గింజా కొనడమే కాదు; 25 వేల లోపు పంట రుణాలను ఇప్పటికే మాఫీ చేశారు. తాజాగా నియంత్రిత సాగుకు పెట్టుబడి సాయం కింద ఇప్పటికే 5500 కోట్లు విడుదల చేశారు. వారం పది రోజుల్లో మరో 1500 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. వానకాలం పంటకు నాగలి కట్టే సమయానికే చేతిలో డబ్బు పెట్టి, రైతన్న భుజం తట్టి భరోసా ఇచ్చారు. అటు రైతన్న ఇటు ముఖ్యమంత్రి జోడెడ్లుగా తెలంగాణ వ్యవసాయ ప్రగతి రథ చక్రం ఈ వానకాలం కొత్త పుంతలు తొక్కనున్నది.

రాష్ట్రంలో రైతులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి, దాని ప్రకారం విత్తనాలు వేసుకోవడానికి సిద్ధంకావడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. మార్కెట్లో డిమాండ్‌ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందన్నారు. ఇందుకు రైతుల నుంచి వందకు వందశాతం మద్దతు లభించిందని సీఎం చెప్పారు. రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే రైతుబంధు సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో నియంత్రిత పంటలసాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇప్పటికే వ్యయసాయ పనులు ప్రారంభమయ్యాయయని, ఏ ఒక్క రైతు కూడా పెట్టుబడి డబ్బులకోసం ఇబ్బంది పడవద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఒక్క ఎకరా కూడా మిగులకుండా.. ఒక్క రైతును వదులకుండా అందరికీ వారం పదిరోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేయాలన్నారు. రైతుబంధు డబ్బులను సరిగ్గా వినియోగించుకొని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని రైతులకు పిలుపునిచ్చారు. వానకాలం పంటలకోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే, యాసంగి పంటలకోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.

యాసంగి పంటలకు సాగు ప్రణాళిక
యాసంగికి కూడా సమగ్రమైన వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాసంగిలో ఏయే పంటలు సాగుచేయాలనే విషయంలో రైతులకు మార్గదర్శకంచేయడంతోపాటు, ఆ పంటకు సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ‘గత యాసంగిలో 53.5 లక్షల ఎకరాల్లో పంటసాగు జరిగింది. ఈసారి ప్రాజెక్టుల ద్వారా వచ్చే సాగునీటితోపాటు, మంచి వానలు కూడా కురిసే అవకాశం ఉన్నందున మరో 10-12 లక్షల ఎకరాల సాగు పెరిగే అవకాశం ఉంటుంది. వానకాలంలో వద్దని చెప్పిన మక్కలు యాసంగిలో సాగుచేసుకోవాలి. 45 లక్షల ఎకరాల్లో వరి, ఆరేడు లక్షల ఎకరాల్లో మక్కలు, నాలుగు లక్షల ఎకరాల్లో శనగలు, ఐదు లక్షల ఎకరాల్లో వేరుశనగ (పల్లి), లక్షన్నర ఎకరాల్లో కూరగాయలు సాగుచేసుకొనేలా ప్రణాళిక సిద్ధంచేయాలి. దీనికి సంబంధించిన విత్తనాలు కూడా అందుబాటులోకి తేవాలి.

వరిలో సన్న, దొడ్డు రకాలను కూడా రైతులకు సూచించాలి. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతాయి. వేరుశనగ, శనగ విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధంచేయాలి. నియంత్రిత పంటల సాగు విధానం అంటే ఇదే. ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకొని, దానికి అనుగుణమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం’ అని సీఎం కేసీఆర్‌ అధికారులకు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌కుమార్‌, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు, వ్యవసాయశాఖ ఉపసంచాలకులు విజయ్‌కుమార్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్‌ నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

రైతులు అర్థంచేసుకొన్నారు
నియంత్రిత పంటలసాగుకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విషయాలను రైతులు అర్థంచేసుకొన్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘తెలంగాణ సమాజం పరిణామశీలమైనది. రాష్ట్రంలో చైతన్యవంతమైన రైతాంగం ఉన్నది. రాష్ర్టావిర్భావం తర్వాత తెలంగాణ దేశంలోనే గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా మారింది. భవిష్యత్తులో వ్యవసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం సంకల్పం. నియంత్రిత పద్ధతిలో పంటసాగు విధానం అమలుచేయాలని ప్రభుత్వం మార్గదర్శకంచేసింది. వ్యవసాయరంగం సుస్థిరంగా నిలబడాలని, వ్యవస్థీకృతం కావాలని, రైతులకు స్థిరమైన ఆదాయం రావాలని ప్రభుత్వం ఆశిస్తున్నది.

అందుకోసమే నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసుకోవాలని కోరింది. దానికి రాష్ట్ర రైతాంగం అద్భుతంగా స్పందించింది. ప్రభుత్వం చెప్తున్నది తమకోసమే అని రైతులు అర్థంచేసుకొన్నారు. రైతులంతా నియంత్రిత పద్ధతిలో పంటలసాగు చేయడానికి సిద్ధపడటం గొప్ప ముందడుగు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేయడానికి, దేశానికి ఆదర్శంగా నిలువడానికి అమలుచేస్తున్న ఈ విధానంలో మన రైతులు గొప్పగా తొలి అడుగువేశారు. రాబోయే కాలంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలుస్తుంది. రైతును రాజు చేయాలన్నది ప్రభుత్వ అంతిమలక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవడానికి మంచి ప్రారంభం జరిగింది’ అని సీఎం చెప్పారు.

1.25 కోట్ల ఎకరాల్లో పంటలసాగు
జిల్లాలవారీగా పంటలసాగు పరిస్థితిని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. అన్ని జిల్లాల నుంచి వ్యవసాయాధికారులు పంపిన నివేదికలను పరిశీలించారు. అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం సూచించిన విధంగానే పంటలసాగు జరుగుతున్నట్లు తేలింది. ఇప్పటివరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ప్రభుత్వం సూచన ప్రకారమే రైతులు విత్తనాలను కొనుగోలుచేసినట్లు సీడ్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా 41,76,778 ఎకరాల్లో వరి పంట, 12,31,284 ఎకరాల్లో కందులు, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్‌, 60,16,079 ఎకరాల్లో పత్తి, 1,53,565 ఎకరాల్లో జొన్నలు, 1,88,466 ఎకరాల్లో పెసర్లు, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరుకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తున్నట్లు అధికారులు వివరించారు. మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంట సాగు జరుగుతున్నదని పేర్కొన్నారు.

ఖాతాల్లోకి రైతుబంధు
‘రాష్ట్రంలో రైతులంతా పంటలసాగుకు సిద్ధమయ్యారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతులందరికీ వెంటనే రైతుబంధు సాయం అందించాలి. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు అందించే రైతుబంధు డబ్బులు మాత్రం తప్పక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి ఒక ఎకరానికి పదివేల చొప్పున సాయం అందించాలన్నది ప్రభుత్వ విధానం. వానకాలంలో ఐదు వేలు, యాసంగిలో ఐదు వేలు ఇస్తున్నాం. ఈ వానకాలంలో రైతుబంధు అందించడానికి మొత్తం రూ.ఏడువేల కోట్లు కావాలి. ఇప్పటికే రూ.5,500 కోట్లను ప్రభుత్వం వ్యవసాయశాఖకు బదిలీచేసింది. మరో రూ.1500 కోట్లను కూడా వారంపది రోజుల్లో జమచేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించాం. వెంటనే బ్యాంకు ఖాతాల్లోకి రైతుబంధు జమచేసే పని మొదలవుతుంది. పది పన్నెండు రోజుల్లో రైతులందరి ఖాతాల్లోకి డబ్బులు చేరుతాయి. రైతులకు అండగా ఉండాలనే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం’ అని సీఎం పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.