-మంత్రి కేటీఆర్‌కు కంపెనీల హామీ -సిలికాన్ వ్యాలీలో పర్యటించిన కేటీఆర్ -నాస్కాం ఇన్నోట్రెక్ సమావేశంలో ప్రధాన ఉపన్యాసం -టీ-హబ్ విశిష్టతపై వివరణ -ప్రముఖ చిప్ కంపెనీ ఎన్‌విడియా ఉపాధ్యక్షులతో భేటీ

రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటన ఎనిమిదోరోజు అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీల స్వర్గధామంగా భావించే ప్రతిష్ఠాత్మక సిలికాన్ వ్యాలీలో కొనసాగింది. పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. కాలిఫోర్నియాలోని పాల్ అట్లోలోని సాప్ (ఎస్‌ఏపీ) ప్రాంగణంలో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోట్రెక్ సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. ప్రసిద్ధ కంపెనీలు, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సమావేశంలో మంత్రి టీ హబ్ స్వరూప స్వభావాలను వివరించారు. పరిశోధనలకు ప్రోత్సాహమిచ్చేలా చేపడుతున్న టీ-హబ్ వంటి వ్యవస్థ దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేదని మంత్రి తెలిపారు. భారీ ఎత్తున చేపడుతున్న ఈ కార్యక్రమంతో తెలంగాణ దేశ ఐటీ రంగంలో విశిష్టస్థానం సంతరించుకుందని చెప్పారు. టీ హబ్ కార్యక్రమం వల్ల హైదరాబాద్‌లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఐటీరంగంలో అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుందని నమ్ముతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. టీ హబ్‌పై మరిన్ని వివరాలు వాకబు చేసిన వివిధ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలు ఈకార్యక్రమాన్ని అభినందించారు. టీ-హబ్ ద్వారా వచ్చే స్టార్టప్ కంపెనీలకు సిలికాన్ వ్యాలీలో అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని సైతం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్ అట్లో నగర మేయర్ కరెన్ హోల్మన్, నాస్కామ్ తరఫున వైస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రవి గుర్రాలతోపాటు సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులు నిశిత్ దేశాయ్, మోహన్ ఉత్తర్వర్, పీకే గులాటీ, రాజురెడ్డి, సునీల్ ఎర్రబెల్లి, మాలవల్లి కుమార్, మైక్రోసాఫ్ట్ వెంచర్‌కు చెందిన రవినారాయణ్, బ్లూమ్ వెంచర్ తరఫున కార్తీక్ రెడ్డి, సంజయ్‌నాథన్‌లు హాజరయ్యారు. అనంతరం కావియమ్ సీఈవో సయిద్ అలీతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానం, ఐటీలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తర్వాత ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఎన్‌విడియా కార్పొరేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డెబోరా సీ షోకిస్టు , డ్విట్ డైరెక్స్‌లతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల కోసం చేపట్టనున్న కార్యక్రమాలను, ప్రభుత్వం అందించే సహకారాన్ని వివరించారు.