Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీ పాస్‌కు ఆమోదం

-తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే బిల్లు లక్ష్యం – ప్రజలు కన్న కలలు నెరవేర్చే దిశగా ఓ ముందడుగు -నూతన పారిశ్రామిక విధానబిల్లును ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్

KCR in Assembly

తెలంగాణ నూతన పారిశ్రామిక విధాన బిల్లును అన్ని పక్షాల సభ్యుల హర్షధ్వానాల మధ్య రాష్ట్ర శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. పారిశ్రామికాభివృద్ధికి నూతన పాలసీ ఇతోధికంగా తోడ్పడుతుందని అన్ని పక్షాలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఉన్నత స్థాయిలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. అధికారపక్షంతోపాటు ప్రధాన ప్రతిపక్షం, ఇతర పక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో నూతన పారిశ్రామిక విధాన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు.

తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో భవిష్యత్తును కలగంటున్నారని, వారి ఆశలను సఫలీకృతం చేసే దిశగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాలనే మహోన్నత ఆశయంతో, సంకల్పబలంతో నూతన పారిశ్రామిక బిల్లును ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సంతోషంగా.. సగర్వంగా, తెలంగాణ పారిశ్రామిక రంగంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చి నూతన ఒరవడిని సృష్టించాలనే మహదాశయంతో ఈ బిల్లును సభ ముందు ఉంచుతున్నానన్నారు.

ప్రపంచంలోని అనేక దేశాల పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేశామని, దేశీయ పారిశ్రామిక సంస్థలు ఫిక్కీ, డిక్కీ, సీఐఐ వంటి సంస్థలతో విస్తృతంగా చర్చించామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా, తెలంగాణ వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వినూత్నమైన, భిన్నమైన, ఆదర్శవంతమైన, అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును తయారు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను ఆలంబనంగా చేసుకొని జీవిస్తున్న బలహీనులందరికీ ప్రాధాన్యత లభించేవిధంగా అన్ని పార్శాలను, అన్నీ సంస్థలను భాగస్వాములను చేస్తూ లక్షల సంఖ్యలో ఎదురుచూస్తున్న విద్యావంతులైన నిరుద్యోగ విద్యార్థులు, యువకుల ఉపాధి అవకాశాల ఆశయాలను స్పృశిస్తూ కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని విశదీకరించారు.

గతంలో మంచినీ స్వీకరించాం..: పారిశ్రామిక విధానంలో గతంలోని మంచిని కూడా స్వీకరించామని కేసీఆర్ చెప్పారు. కొత్తపాతల మేలుకలయిక ఈ పారిశ్రామిక విధానమని ఆయన నిర్వచించారు. ప్రధానంగా స్వదేశీ పరిశ్రమల యజమానుల మధ్యన ఉండేపోటీని, ప్రపంచ బడా పారిశ్రామిక వేత్తల మధ్యన పోటీని దృష్టిలో పెట్టుకొన్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే నూతన జాతీయ పాలసీని అనుసంధానం చేస్తూ ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తూ ఈ విధానం ఉన్నదని ఆయన వివరించారు.

మౌలిక సదుపాయాలకు పెద్దపీట..: సాధారణంగా పరిశ్రమల స్థాపనలో భూమి, నీరు, విద్యుత్తు ప్రధానమైన మౌలిక సదుపాయాలు అవుతాయని, రాయితీలు, పన్నువిధానం, ప్రోత్సాహకాలు, ఆర్థికవనరులు రెండో ప్రాధాన్యతలో ఉంటాయని కేసీఆర్ చెప్పారు. వీటన్నింటినీ అధ్యయనం చేసి మౌలిక సదుపాయాలు కల్పించడంకోసం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను బలోపేతం చేశామని చెప్పారు. ఈ సంస్థ పరిధిలోకి 2లక్షల 35వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగుకు యోగ్యంకాని భూమి 30 లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నదని, తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి ఈ భూమే ఇపుడు వరప్రసాదమని ఆయన చెప్పారు.

రెండేండ్లలో 24 గంటల విద్యుత్ ఇస్తాం..: 800 నుండి వేయి మెగావాట్ల కొరత ఉన్నదని, దీనిలో దాపరికం లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఏడాదికాలంలో ఈ కొరత అధిగమిస్తామని, రెండు సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలందరికీ కావాల్సిన విద్యుత్ ప్రత్యేకంగా పరిశ్రమలకు, వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్ సాధిస్తామని చెప్పారు. ఎన్‌టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్లు, జన్‌కోద్వారా 6వేలమెగావాట్లు అందుబాటులోకి రానున్నదని చెప్పారు.

ఏడాదిలో 2100 మెగావాట్లు..: ఏడాదిలోగా 2100 మెగావాట్ల విద్యుత్ మనకు లభ్యమవుతుందని సీఎం హామీ ఇచ్చారు. బీహెచ్‌ఈఎల్, భూపాలపల్లి, హిందూజా, సింగూరు, ఆర్‌టీపీపీ, సౌరశక్తిల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు రేయింబగళ్లు శ్రమిస్తున్నామని, త్వరలో గొప్ప ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర దక్షిణ భారతాన్ని కలుపుతూ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు కుదర్చుకోవాలనే ప్రయత్నంతోనే చత్తీస్‌గఢ్‌తో ఎంవోయూ చేసుకున్నామన్నారు.

అంగల్-పలాస(శ్రీకాకుళం), వార్దా-డిచ్‌పల్లి లైన్లతో అనుసంధానం చేసుకుంటున్నామని, ఈ గ్రిడ్ ద్వారా విద్యుత్తు లభిస్తుందని చెప్పారు. చత్తీస్‌గఢ్‌తో వేయిమెగావాట్ల ఎంవోయూ ఉన్నదని, మరో వేయిమెగావాట్లు ఇచ్చేందుకు కూడా వారు సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. ఈ కారణాలన్నింటితో విద్యుత్ సమస్యలను అధిగమిస్తామని, పరిశ్రమలు ఉత్పత్తి చేసే దశకు చేరేలోగా రాష్ట్రంలో సమృద్ధిగా విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా సకల చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు.

నెలరోజుల్లో అనుమతులు..: నీరు, విద్యుత్, భూమి తదితర అన్ని అనుమతులు నెలరోజుల్లోగానే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని, నెలరోజులలో క్లియరెన్స్‌లు ఇస్తామని చెప్పారు. జాప్యం జరుగకుండా అనుమతి చేసుకున్న వారందరితో పక్షం రోజులకోసారి సమావేశమై చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు. నూతన బిల్లుకు అనుగుణంగా నిబంధనలను రూపొందిస్తామని, బిల్లు ఆమోదం పొందగానే అధికారులు నిబంధనలపైన కసరత్తు చేస్తారని చెప్పారు.

పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్‌చంద్రను సీఎం అభినందించారు. దళితులకు, మహిళలకు, గిరిజనులకు, మైనార్టీలకు, బీసీలకు ఈ విధానంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

మన సంస్కృతే మనకు బలం..: తెలంగాణలో ఒక భిన్నమైన, విలక్షణమైన ప్రజాస్వామిక సంస్కృతి ఉన్నదని, ప్రతి మనిషిని ఆదరించే విశాల హృదయం ఉన్నదని కేసీఆర్ అన్నారు. రాజధానిలో గుజరాతీ గల్లీ, సింధీగల్లీ, ఫార్సీగుట్ట దానికి తార్కణమని ఆయన అన్నారు. ఇదే మన బలం అంటూ పారిశ్రామికవేత్తలు కూడా పరిశ్రమలకు కూడా ఇలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటారన్నారు. శ్రమశక్తి, మానవసంపద మనకు పుష్కలంగా ఉన్నదని, ఈ వివరాలన్నింటినీ పాలసీలో వివరించామని చెప్పారు.

సింగిల్‌విండో విధానం గతంలోనే ఉన్నా అనుకున్న ఫలితాలను ఆ విధానం సాధించలేదని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సారథ్యంలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే కమిటీ పనిచేస్తుందని, నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. 30 రోజులలోనే అన్ని రకాల అనుమతులు లభించేవిధంగా చర్యలు తీసుకుంటామని, కావాల్సిన క్లియరెన్స్‌లన్నీ నోడల్ ఏజెన్సీయే తీసుకువస్తుందని అన్నారు.

అనేక పరిశ్రమలకు అవకాశాలు..: రాష్ట్రంలో కోళ్లు- మాంసం ఉత్పత్తులు, చేపల ఉత్పత్తులు, జౌళి, ఖనిజాలు, కలప ఉత్పత్తుల పరిశ్రమలకు బాగా అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌లో దేశంలో రెండోస్థానంలో ఉన్నామని, ఫార్మా ఇండస్ట్రీకి అవకాశాలు మెరుగవుతున్నాయని పేర్కొన్నారు. రక్షణరంగంలో ముందువరుసలో ఉన్నామని, అగ్నివంటి క్షిపణిని ఇక్కడే తయారు చేసుకున్నామని చెప్పారు.

త్వరలో మహబూబ్‌నగర్‌లో సోలార్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. తెలంగాణను టెక్స్‌టైల్ హబ్‌గా తీర్చిదిద్దుదామని పిలుపు నిచ్చారు. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-నల్లగొండ, హైదరాబాద్-మహబూబ్‌నగర్ మార్గాలలో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నూతన పారిశ్రామిక విధాన ప్రకటన కోసం తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఎదురుచూస్తున్నారని, వారికోసం త్వరలో హైదరాబాద్‌లో ప్రవాసీ దివస్ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. వివిధ దేశాలలోని తెలంగాణవారిని పరిశ్రమలను స్థాపించాల్సిందిగా ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ కొత్త పాలసీని ఆహ్వానిస్తున్నామని, అయితే జాగ్రత్తలు మాత్రం చాలా అవసరమని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.