Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీబీజీకేఎస్ గెలుపు చారిత్రాత్మకం

-సింగరేణి ఎన్నికలు 2019 ఎన్నికలకు అద్దం -ప్రజలు తిప్పికొడుతున్నా వారికి బుద్ధి రావడం లేదు -గని కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం -అరడజను భూగర్భ గనులను త్వరలో ప్రారంభిస్తాం -విపక్షాలవి నీతిమాలిన రాజకీయాలు.. ఏకమై పోటీచేసినా ఓడిపోయారు -బీజేపీ సంఘానికి దక్కింది 246 ఓట్లే -టీబీజీకేఎస్ గెలుపునకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు విలేకరుల సమావేశంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు

సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. టీఆర్‌ఎస్ సర్కారు మీద విశ్వాసం ఉంచిన కార్మికులు గతంలో ఎన్నడూ లేనంతగా ఓట్లు వేసి సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా తొమ్మిది డివిజన్లలో గెలిపించారన్నారు. ఈ విజయంలో భాగస్వామ్యులుగా నిలిచిన కార్మికులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు పార్టీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీలను వందకువంద శాతం నెరవేర్చుతామని, ఇప్పుడు సీఎం హోదాలో చెబుతున్నానని స్పష్టంచేశారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా భారీ మెజారిటీతో గెలుస్తూ టీఆర్‌ఎస్ ప్రజల మన్ననలను పొందుతున్నదని చెప్పారు. సింగరేణిలో నష్టాలు వస్తున్నప్పటికీ భూగర్భగనులను కొనసాగిస్తున్నామని, మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం త్వరలో ఆరు భూగర్భ గనులు ప్రారంభిస్తామని చెప్పారు. కారుణ్య నియామకాల విధానంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ ఎన్నికతోనే కేసీఆర్ పతనం అంటూ ప్రగల్భాలు పలికిన విపక్షాలే పతనమయ్యాయని చెప్పారు. ఎన్నిక ఏదైనా భారీ మెజారిటీతో గెలిచామని చెప్పారు. ఇదే సమయంలో విపక్షాల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేస్తూ విపక్షాలు ఏకమైనప్పటికీ కార్మికులు తగిన బుద్ధి చెప్పారన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కోదండరాం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

రికార్డులు సృష్టించాం రాష్ట్రంలో విచిత్రం జరుగుతున్నది. టీఆర్‌ఎస్ వచ్చినప్పటి నుంచి రికార్డుల పరంపర కొనసాగుతుంది. ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యే చనిపోతే జరిగే ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలు వీస్తాయి. వారి కుటుంబ సభ్యులే గెలుస్తారు. కానీ పాలేరు, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలను అధిగమించి 40, 50 వేల ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారు. మెదక్, వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించారు. వరంగల్‌లో నాలుగు లక్షల మెజారిటీ వచ్చింది. జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఏ పార్టీకి రానంత మెజారిటీ టీఆర్‌ఎస్‌కే వచ్చింది. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్‌ఎస్ పతనం, కేసీఆర్ పతనం అంటూ ప్రతిపక్షాలు ఉక్రోషం వెళ్లగక్కుతున్నాయి. ప్రజలు ప్రతిసారి తిప్పికొడుతున్నా జ్ఞానం రావట్లేదు. సింగరేణిలో పూర్తిస్థాయిలో అబద్ధాలు ప్రచారం చేశారు. 1998- 2002లో డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా సంతకాలు చేసిందే ఐఏటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్‌ఎమ్మెస్. ఆనాడు టీబీజీకేఎస్ లేదు. కానీ దీనికి కేసీఆర్ కారణమంటూ ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. దొంగే.. దొంగ, దొంగ అన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ కార్మికులు వాళ్లను నమ్మలేదు. పార్టీ అధ్యక్షుడి హోదాలో కార్మికులకు ఇచ్చిన వాగ్దాలన్నీ అమలు చేస్తానని సీఎం హోదాలో చెప్తున్నా. కార్మికులు ఇంకా పాత ఆలోచనలో ఉండకుండా మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకునే ఆలోచన తెచ్చుకోవాలి. వాస్తవ పరిస్తితిని గుర్తించి పురోగమిస్తేనే లక్ష్యం నెరవేరుతుంది.

హామీలన్నీ నెరవేర్చుతాం…డివిజన్లకు కమిటీలు కార్మికులకు మంచి వెసులుబాటు ఇచ్చాం. వారసత్వ ఉద్యోగాలను కారుణ్యం కింద ఇప్పిస్తాం. వద్దనుకుంటే రూ.25 లక్షలు ఇస్తాం. అలియాస్ ఉద్యోగాలు ఈ ఒక్కసారికి ఎవరిపేరుతో వారికిస్తాం. ఇప్పుడు వారసులు లేక, ఉద్యోగం చేయలేమనుకునేవారికి మంచి ప్యాకేజీ ఇస్తాం. ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల వడ్డీలేని రుణం ఇస్తాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏమేమి చెప్పామో అన్ని హామీలు నెరవేరుస్తాం. ప్రతినెల రెండుగంటలపాటు సింగరేణిపై స్వయంగా సమీక్ష నిర్వహిస్తా. డివిజన్లకు కమిటీలను కూడా నేనే నియమిస్తా. వారిని సమావేశాలకు పిలుస్తా. కార్మికులకు ఏం చెప్పామో అది చేస్తాం. వందశాతం వాగ్దానాలను నెరవేర్చుతాం. విపక్షాల అడ్డగోలు మాటలను కార్మికులు పట్టించుకోకుండా భవిష్యత్‌పై దృష్టిసారించి ముందుకుసాగాలి. సదుపాయాలు పొందేందుకు కార్మికులు నిజాయితీగా ఉండాలి. వారసులు లేకుంటే అబద్ధాలు ఆడవద్దు.

సింగరేణి బోర్డులో కార్మికులకు అవకాశం సింగరేణి సంస్థ బొగ్గుతోనే ఆగిపోదు. గనుల విషయం మొత్తం సింగరేణికే ఇస్తాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సింగరేణికి అప్పగించాలని చూస్తున్నాం. అండర్‌గ్రౌండ్ మైన్స్‌తో నష్టం ఉన్నప్పటికీ ఓపెన్‌కాస్ట్‌ల వల్ల నష్టాన్ని పూడ్చుకుంటూ ముందుకుపోతాం. గనులను మూసేయడం ఉండదు. త్వరలో అరడజను గనులు ప్రారంభిస్తాం. తానే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తానని ప్రకటించారు. అన్నం పెట్టే తల్లి కాబట్టి ఉద్యోగాలు పోగొట్టం. లాభనష్టాలు సమన్వయం చేస్తం. ఎన్నికలు అయిపోయినయి కదా, అని మాట్లాడకుండా ఉండలేం. ఇప్పుడు హామీఇస్తున్నా.. ఆర్టీసీలో మాదిరిగానే సింగరేణి బోర్డులో కార్మికులకు అవకాశం కల్పిస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణిని పట్టించుకోలేదు. కోల్‌ఇండియా కంటే సింగరేణి ఉత్తమమైంది. గనుల తవ్వకంలో మేటి. గుజరాత్ పారిశ్రామికవేత్త అదానీ కరెంట్ ఉత్ప త్తి తనకు ఇవ్వాలనికోరాడు. అయినా ఒప్పుకోలేదు. ఆర్టీసీ, సింగరేణి, కరెంట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలకే ప్రా ధాన్యం ఇస్తాం. మరింత విస్తరిస్తాం. ఇది టీఆర్‌ఎస్ విధానం. ఇతరదేశాల్లో సింగరేణి పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సీఎండీ ఇతర దేశాలు తిరిగివచ్చిండు.

పరిమితి లోబడే అప్పులు అన్ని ఖర్చులకు లెక్కలు చెప్తాం. అప్పులు చేసిండు అంటున్నారు. విజ్‌డం ఆఫ్ ఎకానమీ అనేది ఉంటది. తెలివి ఉండాలి. రాష్ట్రాల అప్పు నియంత్రణ మన చేతిలో ఉండది. కేంద్రం చూస్తది. పరిమితి ఉంటది. అందుకు లోబడే అప్పులు తీసుకుంటం. వనరులు ఉండి, అవకాశం ఉండి చేయకపోతే అది నేరం. గుమ్ముటం లెక్క పిల్లలుండాలే అన్నట్టుంది వాళ్ల ఆలోచన. మాకు చేతగాదు. మైండ్ పనిచేయలేదు. మీరు కూడా చేయద్దనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మీరు ఒక్కపని అయినా చేశారా.. 24 గంటల కరెంట్ ఇస్తుంటే రైతులే వద్దంటున్నరు.

ప్రతిపక్షాల మెదడు పనిచేస్తున్నదా? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో ఎవరూ చేయనివిధంగా రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేలు ఇస్తామని చెప్పాం. ఎవరన్నా ఇచ్చారా? నిర్మాణాత్మకంగా ముందుకు పోతున్నాం. డబ్బులన్నీ వాస్తవంగా రైతులకే చేరాలని తలచి భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నాం. 80 ఏండ్ల నుంచి ఎవరూ భూరికార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. దాన్ని వ్యతిరేకించడం ఏమిటి? మెదడు పనిచేస్తున్నదా? మెంటల్ కేసులా! రైతు ఆత్మహత్యలు నివారిద్దామని ప్రయత్నిస్తుంటే, స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని దుష్ప్రచారం ఏమిటి? భూమిరికార్డులకు, స్థానిక సంస్థలకు సంబంధం ఉన్నదా? మోకాలుకు బోడి గుండుకు ఏం సంబంధం? అమర్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా రాస్తున్నారు. స్థానిక సంస్థలకు, రైతు సమన్వయ సమితులకు ఏమి సంబంధం? పిచ్చిగా ప్రవరిస్తున్నారు.

సింగరేణి గెలుపు 2019 ఎన్నికలకు అద్దం సింగరేణి ఎన్నికలు 2019కి అద్దం పడుతున్నాయి. టీఆర్‌ఎస్ పాలనను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. లేకుంటే స్థాయి దిగజారుతది. రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన ప్రతిపక్షం ఉందా? అని అందరూ అనుకుంటున్నారు. ఇతర రాష్ర్టాల ముందు పరువుపోతది.

దత్తాత్రేయ తీరుతో ఎన్నికలు ఆలస్యం గుర్తింపు సంఘం ఎన్నికలు ఏడునెలలు జరుగకుండా ఆలస్యం కావడానికి కారణం మొన్నటివరకు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న దత్తాత్రేయతోపాటు, బీజేపీలే. వీళ్లు ప్రతి రోజూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అన్నారు. ఇప్పుడు వాళ్లకు వచ్చిన ఓట్లు 246. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేసీఆర్‌పై విషం చిమ్ముతున్నది. గతంలో సింగరేణి ఎన్నికల్లో గతంలో విడివిడిగా పోటీ చేస్తే ఐదుచోట్ల టీబీజీకేఎస్ గెలిచింది. ఇప్పుడు టీబీజీఎస్‌కేకు వ్యతిరేకంగా అందరై ఏకమై పోటీచేస్తే 11 ఏరియాల్లో తొమ్మిదిచోట్ల గెలిచింది. గతంలో 36 శాతం మెజారిటీ వస్తే, ఈ సారి 45.56 శాతం మెజారిటీ అనేది రికార్డుబ్రేక్. చరిత్రలోనే ఇంత మెజారిటీతో ఎవరూ గెలువలేదు. సింగరేణి ఎన్నికలకు ఏఐసీసీ నుంచి కుంతియాను తీసుకొచ్చి ప్రచారం చేయించారు.ఇలా చేయడం తొలిసారి. ఇంత పెద్దగా ఆర్భాటం ప్రదర్శించినా గెలువలేకపోయారు. ప్రతిపక్షాల మాటలను కార్మికులు, ప్రజలు నమ్మడం లేదు.

కమ్యూనిస్టులూ కలిసి రావాలి జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చాం.. అందరూ సంతోషంగా ఉండాలి..కమ్యూనిస్టులు ప్రగతిశీలంగా ఆలోచించాలి. అడ్డంగా మాట్లాడితే కుదరదు. కలిసిరావాలి. గతంలో సింగరేణి విషయంలో అనేక తప్పులు జరిగాయి. ఇక మీదట జరగవు. ఇది పెద్దసంస్థ కాబట్టి సీరియస్‌గా తీసుకుంటాం. దృష్టిసారిస్తాం. ఓడిన దగ్గర కూడాబాగా పని చేస్తం. కార్మికులకు, కార్యకర్తలు, నాయకులు ధన్యవాదాలు. -కోదండరాం జాతిపితలా ఎక్కువ ఊహించుకుంటున్నడు -ఆయనది విషపూరిత మనస్తత్వం -టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఆయనకు ఇష్టం లేదు -జేఏసీ ఉనికే లేదు..దానిని వాడుకునే హక్కు లేదు -ప్రతిపక్షాల మెదడు పనిచేస్తున్నదా? మెంటల్ కేసులా! -భూరికార్డులు, రైతు సమన్వయ సమితులు ఎందుకు వద్దు -స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతాయనేది దుష్ప్రచారం -ప్రాజెక్టులపై కేసుల వెనుక ఉన్నది దామోదర రాజనరసింహనే -మంత్రి పదవి కోసం ఫోరం పెడుతానన్న దరిద్రుడు జానారెడ్డి తెలంగాణలో పెద్దదొర ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కేసీఆర్‌కు ఏం కుల బలం ఉన్నది?.. తెలంగాణే కేసీఆర్ కులం ఎన్నిక ఏదైనా భారీ మెజారిటీతో గెలుస్తూ టీఆర్‌ఎస్ ప్రజల మన్ననలను పొందుతున్నది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ.. ఈ ఎన్నికతో కేసీఆర్ పతనం అంటూ ప్రగల్భాలు పలికిన విపక్షాలే పతనం అయ్యాయి. ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోవాలి. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా మంచి పనులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేరుస్తాం. – సీఎం కేసీఆర్

ఉత్తమ్ కుమార్‌రెడ్డి పెద్ద దొర కులం అనేది ఒక భ్రాంతి. కేసీఆర్‌కు ఏం కుల బలం ఉన్నది. తెలంగాణే కేసీఆర్ కులం. మాది సంఖ్యా పరంగా అతి చిన్న కులం.మైనారిటీ కులం 1.1 శాతం మాత్రమే ఉంటారు. మా కంటే అమర్‌ది ఇంకా తక్కువ సంఖ్య ఉన్న కులం. ఆయన జర్నలిజంలో ఉన్నత స్థితికి ఎదిగారు. నాయకుడు కష్టపడుతు వెళ్లాలి. ఇంకా ఛండాలమైన విషయం ఏమిటంటే.. ప్రజాజీవితంలో కులాలు ఉంటాయా? 0.5 శాతం ఉన్నోడే రాజ్యం ఏలుతున్నాడనడం సరికాదు. 0.5 (అరశాతం) శాతం ఉన్నోడే కదా తెలంగాణ తెచ్చిండు. నన్ను దొర అంటున్నారు. మా ఇల్లు గడి అట, మా ఇల్లు గడీనా? అసలుదొర మీ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి. సూర్యాపేట జిల్లాలోని తాటిపాములలో ఆయన ఇల్లు ఒక గడి. శ్రీనగర్‌కాలనీలో ఆయన తండ్రి కట్టిన ఇల్లు కూడా గడీనే.

దొర అంటే కులం కాదు.. దొర అంటే కులం కాదు. దొర ఈజ్ ఎ కల్ట్. కులం బేస్డ్‌గా ఎవరు పనిచేయరు. సత్యనారాయణ అనే కంసాలి వ్యక్తి ఉండేవారు. ఆయన దొర. వివిధకులాల వారు దొరలుగా ఉన్నారు. ఒక వెలమలే లేరు. డబ్బు, జమీన్ ఉన్నోడు దొర. విస్నూరు రామచంద్రారెడ్డి దొర. నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చిన. మంత్రిని అయ్యేందుకు 13 ఏండ్లు పట్టింది. ఎన్టీఆర్ సైతం కులాల గొడవ వల్ల నాకు పదవి ఇవ్వడం సాధ్యమైతలేదని బాధపడ్డారు. ప్రజలు సమస్యలపై స్పందిస్తారే తప్ప కులాలపై కాదు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం, రాష్ట్రంలో 90.65 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారు.అగ్రకులాలు కేవలం 9.35 శాతం మాత్రమే. తెలంగాణ అంతటా ఒకే కులం. నేడు కేవలం నా కులం ఓట్లతోనే అధికారంలోకి వచ్చానా. తెలంగాణే కేసీఆర్ కులం.

పైసా ఇవ్వనంటే ఉత్తమ్, జానా ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రం వచ్చినా లక్ష్యాలు నెరవేరడం లేదని సీఎల్పీ సమావేశంలో జానారెడ్డి అంటున్నాడు. ఆనాడు నిండు శాసనసభలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌డ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇయ్యనన్నడు. చీము నెత్తురు ఉందా? ఒక్క మాటైనా మాట్లాడారా? నువ్వు అవకాశవాదంతో వ్యవహరిస్తావు. అసెంబ్లీలో తెలంగాణ ఫోరం గురించి మాట్లాడదామని అప్పట్లో అన్నాడు. ఆనాడే చెప్పా, జానారెడ్డి, నీలాంటి దొంగలు పెడితే రాననిచెప్పా. విజయభాస్కర్‌రెడ్డి పిలిచి అగ్రికల్చర్ మినిస్టిర్ ఇచ్చిండు, ఫోరం యాడనోబోయింది. నీ మంత్రి పదవి కోసం ఫోరం అంటావా దరిద్రుడా? తెలంగాణ కోసం చాలా సీరియస్‌గా పని చేసింది. కేవలం టీఆర్‌ఎస్ మాత్రమే. కవులు, రచయితలు, సింగరేణి కార్మికులు 45 రోజులు సమ్మెచేసి దేశాన్ని వణికించారు. ఉద్యోగులంతా బంద్‌చేశారు. తెలంగాణ జర్నలిస్టులు ఫోరం పెట్టుకొని మీటింగ్ పెట్టారు. నా ఆమరణ దీక్ష తర్వాతే తెలంగాణ వస్తుందనే ఆశలు చిగురించాయి. నా జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చా. కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటన వెనకకు తీసుకన్నా మాట్లడలేదు. ఆనాడు జానా, ఉత్తమ్‌లు అక్కడుండి మంత్రి పదవులు వెలగబెట్టారు. ఒక్కడన్నా ముందుకొచ్చిండా. ఇవ్వాల మీకు లక్ష్యం ఉందా. సింగరేణి ఎన్నికలు రెఫరెండం అన్నారే, మెజారిటీతో గెలిచాం… ఇప్పుడు మీరు ఏం మాట్లడరా? ఎందుకు మీకు అంత అసహనం. గెలుపోములు సహజం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. ఎవరెన్ని పిచ్చికూతలు కూసినా మా ఎజెండా మారదు. మాది అభివృద్ధి ఎజెండా. నేను దారితప్పనట్టు చూపిస్తరా? అలాచేస్తే 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉండగలనా?

కేసులు వేయించింది దామోదర గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా స్టే తెస్తారా? రైతుల పేరుతో ఎవరు స్టే తెచ్చారో జనానికి తెలియదా? దీని వెనకాల మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఉన్నడు. రైతులు కేసులు వేస్తారా? లాయర్‌కు రోజుకు ఆరు లక్షల రూపాయ ఫీజు ఇచ్చుకోగలరా? రైతుకు ఇంత ఖర్చు పెట్టే శక్తి ఉంటుందా? ఇప్పటికైనా ఇలాంటి పిచ్చిపిచ్చి విషయాలు మానుకొని నిర్మాణాత్మకంగా రావాలి. ఎన్జీటీకి పోయి స్టే తెచ్చే అగత్యం ఎందుకు, కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. చిల్లర ప్రచారంతో ఇష్టం వచ్చినట్టు? మాట్లాడతారా? అతిగా ఊహ ఎందుకు?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.