Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీడీపీకి లీడర్ లేడు.. కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు

-ఆ పార్టీల కలయిక జుగుప్సాకరం
-500 కోట్లు పెట్టి కాంగ్రెస్‌ను కొంటున్న
-చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే నెలన్నర రోజులకో సీఎం
-కాంగ్రెస్ పవర్‌కట్ చేస్తేనే తెలంగాణకు కరంటు వచ్చింది
-మరోసారి మోసపోతే బతుకులు ఆగమైతయ్
-ఢిల్లీకి గులాంగా కాదు.. తెలంగాణ గులాబీగా ఉందాం
-ముస్తాబాద్ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి లీడర్ లేడని, కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని.. అలాంటి పార్టీలు కూటమి పేరిట కలువడం జుగుప్సాకరమని మంత్రి కే తారక రామారావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కయిన చంద్రబాబు.. నేడు రూ.500 కోట్లతో కాంగ్రెస్ పార్టీని కొంటున్నారని విమర్శించారు. రైతులను కాల్చిచంపిన రాబందుల పక్కన ఉంటారా? రైతు బంధువైన కేసీఆర్ వెంట ఉంటారా? ఢిల్లీ నుంచి సీల్డ్‌కవర్‌లో వచ్చే సీఎం కావాలా? మన మట్టిలోనే పుట్టిన కేసీఆర్ కావాలా? అని ప్రశ్నించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఏఎంఆర్ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. డ్బ్భై ఏండ్లలో ఏ ఒక్క ప్రభుత్వమూ రైతుల గురించి ఆలోచించలేదని, ఎకరానికి రూ.8 వేల పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక నాయకుడు ప్రపంచంలోనే సీఎం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు.

రూ.5,600 కోట్లతో 43 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నం. గొర్రెల పంపిణీ పథకానికి రూ.5వేల కోట్లు, చేపల పెంపకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించినం అని కేటీఆర్ తెలిపారు. దరిద్రపుగొట్టు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ చీకటిమయం అయిందని, దాని పవర్ (అధికారం) కట్ చేస్తేనే తెలంగాణలో 24 గంటల కరంటు వచ్చిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరంట్ పోతుందని, వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ కూడా ఇవ్వరని పేర్కొన్నారు. చంద్రబాబును ఎప్పుడో తెలంగాణ నుంచి వెళ్లగొట్టామని అన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే నెలన్నర రోజులకో సీఎం మారుతారని ఎద్దేవా చేశారు.


దేశానికే ఆదర్శవంత పథకాలు..

తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరి జలాలు తెచ్చి బీడు భూములకు ప్రాణం పోయాలని చూస్తుంటే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతోపాటు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలూ దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌రోడ్డు నిర్మాణాలు చేపట్టామని, నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలకు కేటాయించిన రూ. 3 కోట్లు వారి చేతుల్లోనే పెట్టి, ఇంచార్జి మంత్రుల వ్యవస్థను తొలగించినట్టు తెలిపారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఎక్కువ పరిహారం అడుగడం సమంజసమేనని, కోర్టులకెళ్లి కొట్లాడడం కూడా న్యాయమైనదని.. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రాజెక్టులు ఆపేందుకు కుట్రలు పన్ని రెండొందల కేసులు వేశారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను సైతం అడ్డుకున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 6 గంటల కరెంటు కూడా సక్రమంగా సరఫరా చేయలేకపోవడంతో సబ్‌స్టేషన్ల ముట్టడించి ధర్నాలు చేసిన రైతులు ఆ కష్టాలను ఎన్నటికీ మర్చి పోరని అన్నారు. ప్రపంచంలోనే రైతులకు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని, ఈ ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో 20 గురుకులాలుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం 120 గురుకులాలు ఏర్పాటు చేసి కార్పొరేట్‌కు దీటుగా పేదలకు విద్యనందిస్తున్నదని తెలిపారు. ఆకలిచావులు, ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లకు బతుకమ్మ చీరలు, ఆర్వీఎం వస్త్రఆర్డర్లతో నేత కార్మికులకు చేతి నిండా పని, కడుపు నిండా తిండి అందించి సిరిసిల్లగా మార్చిన ఘతన కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును మించింది లేదని, నాలుగేండ్లలో అమలుచేసిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై ప్రజాకోర్టు ముం దుకొచ్చామని స్పష్టంచేశారు.

కాంగ్రెసోల్లు ఇజ్జత్‌లేని మనుషులని, కేసీఆర్ ఏదిచెబితే దానికి రెండింతలు ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలలో రూ. 2వేల పింఛను ఇస్తామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నాడు గనుకే ఇక్కడ హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. మహాకూటమి దుకాణం అధికారంలోకి వస్తే బతుకులు ఆగమైపోతయని, ప్రాజెక్టులు నిలిచిపోయి పొలాలు మళ్లీ బీడులుగా మారుతాయని పేర్కొన్నారు. రైతులు, పేదలు సంతోషంగా ఉన్నపుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, వారికోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ సీఎం కేసీఆర్ ఇంకా అసంతృప్తిగానే ఉన్నారని, వారికోసం ఇంకా చేయాలనే తపనతో ఉన్నారని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.


టీఆర్‌ఎస్‌లో 500 మంది చేరిక

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా కార్యదర్శి ఓరుగంటి తిరుపతి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 500 మంది కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరినవారిలో మహిళలు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరందరికీ మంత్రి కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మ బాలయ్య, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపాల్‌రావు, జెడ్పీటీసీ శరత్‌రావు, ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, సహకార సంఘాల చైర్మన్లు చక్రధర్‌రెడ్డి, బాపూరావు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.