Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

టీమ్ కేసీఆర్

-పనితనాన్ని మెరుగుపరుచుకుంటా
– ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి

రెండోసారి మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మరిచిపోను. రెండోసారి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పనితనాన్ని మెరుగుపరుచుకుంటా. ప్రజల ఆకాంక్షలు పూర్తిచేయాలి. గతంలో దేవాదాయశాఖ మంత్రిగా సీఎం కేసీఆర్ చొరవతో తీసుకున్న నిర్ణయాలతో శాఖకు మంచిపేరు వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తాను. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా.

న్యాయవాద విద్యను అభ్యసించిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 1969 నుంచి విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. 1985లో తెలుగుదేశంలో పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1991లో ఆదిలాబాద్ స్థానం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో కాంగ్రెస్‌లో చేరి నిర్మల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 ఎన్నికల్లో మరోసారి ఆదిలాబాద్ ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 2014లో బీఎస్పీ తరపున నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే తరువాతి పరిణామాలలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే సంవత్సరం దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2018 ఎన్నికల్లో నిర్మ ల్ నుంచి మంచి మెజార్టీతో గెలుపొందారు. రెండోసారి క్యాబినెట్‌లో స్థానం సంపాదించారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటా
– ఈటల రాజేందర్, రాష్ట్ర మంత్రి

కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటా. రెండోసారి మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తా. మంత్రిగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు, ఎమ్మెల్యేగా గెలిపించిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. బీఎస్సీ పట్టభద్రుడైన ఈటల రాజేందర్ మొదట్నుంచీ వామపక్ష భావజాలంతో ఉన్ననేత. విద్యార్థి దశలోనే ప్రజాకవి కాళోజీ అధ్యక్షతన ఏర్పడ్డ జనసంఘర్షణ సమితిలో ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. తర్వాత పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. కొంతకాలం వివిధ వ్యాపారాలు చేసిన ఈటల 2002లో టీఆర్‌ఎస్‌లో చేరికతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004 మొదటిసారి కమలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కమలాపూర్ రద్దయి హుజూరాబాద్ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఈటల హుజూరాబాద్ నుంచి పోటీచేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 57వేల పైచిలుకు మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా కీలకపాత్ర పోషించారు. 2018లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈటలకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బాధ్యత పెరిగింది
– జీ జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి

మళ్లీ నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. అదేవిధంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, సహకరించిన నల్లగొండ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు. సంతోషం ఒకవైపు.. బాధ్యత పెరిగిందనే భావన ఇంకో వైపు ఉన్నాయి. ఏ శాఖ అయినా ఒకటే. సీఎం కేసీఆర్ సంతృప్తిపడే విధంగా, ఆశించే స్థాయిలో పనిచేస్తా. ఎవరెవరి సేవలు ఎక్కడ వాడాలో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు.సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జీ జగదీశ్‌రెడ్డి విద్యార్థి దశనుంచే ఉద్యమనేతగా ఎదిగారు. న్యాయవిద్య పూర్తిచేసుకొన్న 1997లోనే సూర్యాపేట, భువనగిరిల్లో తెలంగాణ మహాసభల నిర్వహణలో క్రియాశీల పాత్రపోషించారు. 1999లో తెలంగాణ న్యాయవాదుల హక్కుల కోసం తెలంగాణ న్యాయవాదుల సంఘం ఏర్పాటులో ఆయనది ప్రధాన భూమిక. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. పార్టీ నిర్ణయాలు, నిర్వహణలో కేసీఆర్‌కు చేదోడువాదోడుగా ఉంటూ ప్రధాన నాయకుడిగా గుర్తింపుపొందారు. 2014లో తెలంగాణ తొలి మంత్రివర్గంలో మొదట విద్యాశాఖ మంత్రిగా, ఆ తర్వాత విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖల మంత్రిగా పనిచేశారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగదీశ్‌రెడ్డికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

అందరినీ కలుపుకొనిపోతా
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర మంత్రి

మంత్రి కావడం సంతోషంగా ఉన్నప్పటికీ, మరో వైపు భయంగా కూడా ఉన్నది. తెలిసిచేసినా.. తెలియకుండా తప్పుచేసినా కేసీఆర్ దగ్గర సీరియస్‌గా ఉంటుంది. పాతికేండ్ల క్రితం ఎన్టీఆర్ మంత్రిగా అవకాశం కల్పిస్తే, అప్పుడు లక్ష్మిపార్వతి అడ్డుపడ్డారు. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని మోసంచేశారు. ఇప్పుడు కేసీఆర్ అడుగకుండానే మంత్రిగా అవకాశం కల్పించారు. వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత నీదే అని కేటీఆర్ కూడా చెప్పారు. జిల్లాలోని సీనియర్ నాయకులను కలుపుకుపోతాను. ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఏనాడూ ఓటమి ఎరుగలేదు. డబుల్ హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించారు. ఒకసారి ఎంపీగా కూడా వ్యవహరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనదైన ప్రత్యేకతను సంతరించుకున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రాథమిక సహకారసంఘం అధ్యక్ష పదవినుంచి విప్ వరకు అనేక పదవుల్లో, అనేక స్థాయిల్లో పనిచేశారు. మాస్ లీడర్‌గా ఆయన పేరు పొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్‌లలో మంత్రిపదవులు రాకపోయినా నిరాశచెందలేదు. తాజాగా సీఎం కేసీఆర్ ఆయన సీనియార్టీకి పట్టంకట్టారు. ఎర్రబెల్లికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ప్రజల రుణం తీర్చుకోలేను
– తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి

ఏ బాధ్యతలు అయినా విజయవంతంగా చేశా. గ్రేటర్ హైదరాబాద్, సనత్‌నగర్, గతంలో సిక్రింద్రాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్ని జన్మలు ఎత్తినా ప్రజల రుణం తీర్చుకోలేను. మీ అందరి ఆశ్వీర్వాదంతో ఈ స్థాయికి వచ్చాను. హైదరాబాద్ సిటీలో ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ ఏవైతే పథకాలు ప్రజల కోసం అమలు చేస్తున్నారో వాటిని ప్రమోట్ చేయడంలో అందరిని కలుపుకుని ముందుకెళ్తాను. హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన ముద్ర చూపించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాజకీయ ప్రస్థానం 1984లో తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత సభ్యుడిగా ప్రారంభమైంది. 1994లో సికింద్రాబాద్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని టీడీపీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా వ్యవహరించారు. 2014 అనంతర పరిణామాలలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా పార్టీ నుంచి వైదొలిగి టీఆర్‌ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మత్స్య, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన తిరిగి ఎన్నికయ్యారు. రాజకీయాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న తలసాని హైదరాబాద్‌లో మాస్‌లీడర్‌గా పేరుపొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

ప్రణాళికాసంఘం అనుభవం ఉపయోగపడుతుంది
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి

మంత్రివర్గంలో నాకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలపాటు కేసీఆర్ అడుగుల్లో అడుగు వేసి ప్రస్థానం కొనసాగించాను. గత నాలుగున్నర సంవత్సరాల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ అనుభవంతో నేర్చుకున్న విషయాలు ఈ దఫా మంత్రిగా పనిచేయడానికి దోహదపడుతాయని నమ్ముతున్నాను. వృత్తిపరంగా న్యాయవాది అయిన నిరంజన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. టీడీపీలో కొంతకాలం పార్టీ విశ్లేషకుడిగా వ్యవహరించిన ఆయన 1999లో ఏపీ ఖాదీబోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2001లో టీఆర్‌ఎస్ స్థాపించినప్పుడు ఉద్యమనేత కేసీఆర్ వెన్నంటి నడిచారు. రాష్ట్రసాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. 2001 నుంచి 2014 వరకు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరోమెంబర్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ తదితరహోదాల్లో పనిచేశారు. 2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2018 ఎన్నికల్లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తా
– కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర మంత్రి

సీఎం కేసీఆర్ నాకు మంత్రిగా అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉన్నది. టీఆర్‌ఎస్ ఆవిర్భావంనుంచి అటు ఉద్యమంలోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశాను. కేసీఆర్ ఇచ్చిన సూచనలను పాటిస్తా. ప్రజాసేవలో నిమగ్నమై తెలంగాణ పునరినిర్మాణం కోసం పాటుపడుతా. జిల్లా అభివృద్ధి కోసం ఈటలతో కలిసి పనిచేస్తా. బీఏ పట్టభద్రుడైన కొప్పుల ఈశ్వర్ 1976లో సింగరేణిలో ఉద్యోగంలో చేరి.. అక్కడే కార్మికనాయకుడిగా ఎదిగారు. కార్మికుల హక్కులకోసం పోరాటం చేస్తూనే రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. 1994లో టీడీపీ అభ్యర్థిగా మేడారం నుంచి పోటీచేసి ఓడిపోయిన ఈశ్వర్ 2004లో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి గెలుపొందారు. 2009 నుంచి ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఉప ఎన్నికలతో కలుపుకొని మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు. ఈశ్వర్‌కు భార్య, కూతురు ఉన్నారు.

శభాష్ అనిపించుకునేలా పనిచేస్తా..
– వీ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మంత్రి

నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంట. ఆనాడు ఉద్యమంలో ఉద్యోగ సంఘాల్లో ఉన్న మమ్మల్ని నమ్మి ముందుకు నడిపించారు. ఒక తండ్రిలా మార్గనిర్దేశం చేశారు. ఆయన మంత్రిగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంట. రాష్ట్రమంత్రి వర్గంలో తీసుకొని పదిమందిలో ఒకడిగా నాకు గుర్తింపు ఇచ్చారు. నా పనితీరుతో ఆయనను మెప్పించి శభాష్ అనిపించుకుంటా.ఉద్యోగసంఘాల నాయకుడిగా రాష్ట్రమంతటా సుపరిచితుడైన విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్.. మున్సిపల్ శాఖలో కమిషనర్‌గా విశేష అనుభవం గడించిన నాయకుడు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) వ్యవస్థాపక అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు. స్వరాష్ట్ర ఉద్యమంలో అనేక ఆందోళనలను ముం దుండి నడిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉద్యమ ప్రస్థానం సాగించిన శ్రీనివాస్‌గౌడ్.. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. పార్లమెంటరీ సెక్రటరీగా కూడా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండోసారి వరుసగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్‌తోనే..
– వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి

నాపై నమ్మకం ఉంచి మంత్రిపదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటా. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ది కోసం ముఖ్యమంత్రి ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధమే. వారి మాటే నాకు శిరోధార్యం. నాలో ఊపిరి ఉన్నంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఉంట. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కల్వకుంట్ల కవిత మార్గనిర్దేశకత్వంలో, స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డి సలహాలు, సూచనలు తీసుకొని పనిచేస్తా. జిల్లా అభివృద్దికి, పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో విజయానికి పార్టీలోని నాయకులందరితో కల్సి సమిష్టిగా పనిచేస్తా. వృత్తిపరంగా సివిల్ ఇంజినీర్ అయిన వేముల ప్రశాంత్‌రెడ్డి.. కొంతకాలం హైదరాబాద్‌లో బిల్డర్‌గా కొనసాగారు. రైతునాయకుడిగా, టీఆర్‌ఎస్ రైతు విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించిన తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డికి చేదోడువాదోడుగా ఉన్నారు. 2010లో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమబాటలో నడిచారు. ప్రశాంత్‌రెడ్డి పనితీరును పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు అనేక కీలక బాధ్యతలు అప్పగించారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి 2014, 2018లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తెలంగాణ తొలి ప్రభుత్వంలో కేసీఆర్ మానసపుత్రిక అయిన మిషన్ భగీరథ ప్రాజెక్టు వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

జన్మ ధన్యమైంది
-చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర మంత్రి

జన్మ ధన్యమైంది. సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు. నా జీవితంలో మరిచిపోలేను. ఎమ్మెల్యే అయి మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు. సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకున్నందుకు కృతజ్ఞతలు. తెలంగాణ అభివృద్ధి, బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తాను. నా జీవితంలో అన్నీ జరిగినయి. మిగిలిన జీవితమంతా ప్రజలకే అంకితం. తెలంగాణలో చామకూర మల్లారెడ్డికి మాస్ లీడర్‌గా పేరున్నది. టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన ఆయన 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం జరిగిన పరిణామాలలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునకు ఆకర్షితుడై టీఆర్‌స్‌లో చేరారు. అనతికాలంలోనే ముఖ్యనాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగున్నర సంవత్సరాలు ఎంపీగా సేవలందించిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పదవికి రాజీనామా చేశారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. టీఆర్‌ఎస్‌లో చేరిన నాటినుంచి కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్నారు. ఆ నమ్మకంతోనే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా క్యాబినెట్‌లో మంత్రిగా అవకాశం కల్పించారు. మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.