Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ ట్రెండ్‌సెట్టర్

-ముఖ్యమంత్రి దార్శనికతతో అద్భుతమైన ప్రగతి
-మిషన్ భగీరథ ఓ దిగ్గజ పథకం
-కాళేశ్వరం అపూర్వమైన ప్రాజెక్టు
-దీర్ఘకాలిక ప్రయోజనాలతో సంక్షేమ పథకాలు
-రైతుబంధు దేశానికే మార్గదర్శకం
-పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్

అభివృద్ధిలో, ఆర్థిక నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిందని పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ ప్రశంసించారు. దార్శనికుడైన ముఖ్యమంత్రి తీసుకొంటున్న నిర్ణయాలతో తెలంగాణ అభివృద్ధిలో ఆవిర్భావం నుంచి దూసుకుపోతున్నదన్నారు. ఏయేటికాయేడు సంపదను గణనీయంగా పెంచుకొంటూ పోతున్న తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నదని పేర్కొన్నారు. బంగారు తెలంగాణకోసం సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు అద్భుతమన్నారు. ఆయా పథకాల గురించి విడివిడిగా ప్రస్తావించారు. జూబ్లీహాల్‌లో మంగళవారం 15వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తోపాటు ఆర్థిక సంఘం చైర్మన్, ఇతర సభ్యులు.. రాష్ట్రం తరపున ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్కే జోషి, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, మంగళవారం ప్రమాణం చేసిన పదిమంది మంత్రులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాసమావేశంలో చైర్మన్ ఎన్‌కే సింగ్ మాట్లాడుతూ.. తమ సంఘం సభ్యులు మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించి అన్ని విషయాలను తెలుసుకున్నారని, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, ఇతర పనులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంచి వాతావరణంలో పారదర్శకమైన రీతిలో చర్చించామన్నారు.

దూసుకెళ్తున్న తెలంగాణ
ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ వృద్ధిరేటులో గణనీయంగా పురోగతి సాధిస్తున్నదని ఆర్థిక సంఘం చైర్మన్ చెప్పారు. తెలంగాణ జీఎస్డీపీ రేటు దేశ సగటు కంటే 60% అధికంగా ఉన్నదని తెలిపారు. జీఎస్టీ పన్నుల రాబడిలో కూడా తెలంగాణ అన్ని రాష్ర్టాలకంటే ముందున్నదన్నారు. 14% పైగా రాబడి సాధించి దేశం లో అగ్రభాగాన నిలిచిందని, మొదటి నెల మినహా ఎప్పుడూ కేంద్రం నుంచి పరిహారం తీసుకోలేదన్నారు. సులభ వాణిజ్య విధానంలో రెండోస్థానంలో తెలంగాణ కొనసాగుతున్నదని అభినందించారు. పెట్టుబడి వ్యయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని చెప్పారు. భవిష్యత్‌లో ఉపయోగపడేలా ప్రాజెక్టులను చేపట్టి పెట్టుబడి వ్యయాన్ని 27 శాతానికి పెంచిందన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రైవేటు పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చే పద్ధతి.. పారిశ్రామిక పురోగతికి దోహదపడుతుందని చెప్పారు.

మిషన్ భగీరథ అద్భుత ప్రాజెక్టు
నీటిపారుదల రంగంలో ముఖ్యమంత్రి దూరదృష్టితో ప్రారంభించిన మెగా ప్రాజెక్టు కాళేశ్వరం అత్యద్భుతమని ఎన్‌కేసింగ్ అన్నారు. ప్రాజెక్టును తమ సంఘం సభ్యులు ప్రత్యక్షంగా చూసి వచ్చారని.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభ ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు పైపు లైన్ల ద్వారా సురక్షిత మంచినీటిని అందించే మిషన్ భగీరథపై ఎన్‌కే సింగ్ ప్రశంసల వర్షమే కురిపించారు. ఇది దేశంలోనే అపూర్వమైన పథకమని, అద్భుతమైన దార్శనికతతో దేశంలో రూపొందించిన ఒక దిగ్గజ పథకం మిషన్ భగీరథ అని అన్నారు.

త్వరలోనే సత్ఫలితాలు
తెలంగాణ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పురోగతికి సోపానాలని ఎన్‌కే సింగ్ తెలిపారు. ఇవి త్వరలోనే సత్ఫలితాలనిస్తాయని, రాష్ట్ర ప్రజలకు మంచి ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నారు. గురుకుల పాఠశాలల ఏర్పాటుతోపాటు, వైద్య రంగంలో చేపట్టిన విభిన్న పథకాలు, వ్యవసాయ ఉత్పత్తి ద్విగుణీకృతానికి అమలుచేస్తున్న పథకాలు తెలంగాణకు మంచి భవిష్యత్తునిస్తాయన్నారు.

రైతుబంధు దేశానికే మార్గదర్శం
రైతుబంధు పథకం వ్యవసాయ ప్రయోజనాలను రెట్టింపు చేస్తుందని ఎన్‌కే సింగ్ చెప్పారు. ఈ పథకం యావత్ దేశానికి ఆదర్శమయిందని.. అనేక రాష్ర్టాలకు మార్గదర్శనంగా మారిందని తెలిపారు. ఒడిశా రాష్ట్రం కాలియా పేరుతో అమలుచేస్తున్న పథకానికి రైతుబంధు స్ఫూర్తి అని అన్నారు.

జాతీయ సగటు కంటే జీఎస్డీపీలో 60శాతం అధికం
భవిష్యత్తులో తెలంగాణ సంపద బాగా పెరుగుతుందని ఎన్‌కే సింగ్ అన్నారు. జీఎస్డీపీ జాతీయ స్థాయిలో జీడీపీ సగటుతో పోలిస్తే 60% ఎక్కువగా ఉన్నదని చెప్పారు. రాష్ట్ర సంపదలో 52% వాటా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి నుంచే వస్తున్నదని వివరించారు. మిగతా జిల్లాల్లో కూడా సంపదను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పెట్టుబడి వ్యయం 27% దాటిందని ఇదేసమయంలో రాష్ట్రం అప్పుల భారాన్ని తగ్గించుకొని, ద్రవ్యలోటును ఏ విధంగా అధిగమించనున్నదీ.. విద్యుత్‌రంగంలో ఉదయ్ స్కీంను ఏవిధంగా మెరుగ్గా అమలుపరుస్తారో తెలుపుతూ మిడ్‌టర్మ్ (మధ్యకాలిక) రోడ్ మ్యాప్‌ను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు ఎన్‌కే సింగ్ తెలిపారు. కేంద్ర పన్నులలో రాష్ర్టాల వాటాను 42 నుంచి 50 శాతానికి పెంచాలన్న డిమాండ్‌ను కేంద్రం పరిశీలనకు నివేదిస్తామన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలన్న విషయంలో తాము రాష్ర్టాలవారీగా పరిశీలించి సిఫారసుచేస్తామని చెప్పారు. రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్ట్టులు సంపదను పెంచుతాయని, భవిష్యత్‌లో ద్రవ్యలోటు సమస్య ఉండదని సీఎం తమకు వివరించినట్లు ఎన్‌కే సింగ్ వెల్లడించారు. సీఎం దేశ పరిస్థితులపై కూడా నివేదించారన్నారు. తాము వీటిని పరిగణనలోకి తీసుకొంటామన్నారు. ఆర్థికసంఘం పర్యటన మంగళవారం ముగిసింది. 1349

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.