Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ అన్నం గిన్నె సింగరేణి

-వారసత్వ ఉద్యోగ నియామకాలకు కృషి -జాతీయ సంఘాలది కూటనీతి -మమ్మల్ని ఎదుర్కొనలేకే పొత్తులు -వాళ్లు గనులను మూసివేస్తే..మేము కొత్తవి తెరిచాం -లాభాల్లో వాటాను పెంచాం -భారీగా కొత్త ఉద్యోగాలు చేపట్టాం -రూ.120కోట్ల వృత్తి పన్ను రద్దు చేశాం -మళ్లీ టీబీజీకేఎస్‌దే గెలుపు -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత

తెలంగాణలోని అతిపెద్ద కార్మిక సంఘ ఎన్నికలకు తెరలేచింది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో, ఇక ప్రచారపర్వం మొదలైంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం మళ్లీ తమదే విజయమని ధీమాతో ఉన్నది. సీఎం కేసీఆర్ సింగరేణి అభివృద్ధికి చేస్తున్న కృషి, ఆయన మార్గదర్శకత్వం విజయం సాధించడంలో కీలకమవుతుందని టీబీజీకేఎస్ నేతలు భరోసాతో ఉన్నారు. సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే ప్రచారస్త్రాలుగా చేసుకొని గుర్తింపు సంఘ ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నెల 21నుంచి రెండుదశల్లో ప్రచారం నిర్వహిస్తామని, సింగరేణి కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలను సాధించడానికి కృషి చేస్తున్నామని, కార్మికుల నోటికాడికి వచ్చిన బుక్కను చెడగొట్టే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరించాయని విమర్శిం చారు. అక్ట్టోబరు 5న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు…

తెలంగాణకు అన్నం పెట్టిన సంస్థ సింగరేణి తెలంగాణకు అన్నం పెట్టిన సంస్థ సింగరేణి. రాష్ట్రంలో సరైన నీటిసదుపాయం లేకపోవడం, చదువుకొనడానికి తగిన సంఖ్యలో విద్యాసంస్థలు లేకపోవడంతో సింగరేణే అతి పెద్ద ఉపాధి సంస్థగా ఇక్కడి ప్రజలకు ఊతమిచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సంస్థ తెలంగాణ ప్రజలకు జీవనాధారమైంది. శారీరక శ్రమ ఎంతైనా ఉపాధి కోసం కష్టపడ్డారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారులుగా ఆంధ్ర ప్రాంతంవారు ఉండటం, కార్మికులందరూ తెలంగాణ వారు కావడంతో క్రమంగా సంస్థను బలహీనపరిచే యత్నం జరిగింది. 1.15లక్షల మంది ఉద్యోగులతో కళకళలాడిన సంస్థలో క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం ప్రత్యేక రాష్ట్రంతోనే అన్న భావనతో తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌కు కార్మికులు మొదటినుంచీ అండగా నిలిచారు. సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష దిగడానికి బయలుదేరిన సమయంలో అలుగునూరు చౌరస్తాలో ఆయనను అరెస్టు చేయగానే తెల్లవారినుంచి సమ్మెలో పాల్గొన్న మొదటి సంఘం సింగరేణి కార్మికులే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ పదేపదే గుర్తు చేస్తారు. ఇతర సంఘాలు కూడా అదే బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేశాయి.

లాభాల్లో వాటాను పెంచింది కేసీఆరే కార్మికులకు లాభాల్లో ఇచ్చే వాటాను టీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రమంగా పెంచుతూ వచ్చింది. 2010-11లో 16శాతం వాటాతో రూ.56కోట్లు ఇవ్వగా 2015-16శాతానికి సంబంధించిన వాటాను 23శాతానికి పెంచి రూ.245కోట్లు కార్మికులకు అందించాం. సింగరేణి లాభం కార్మికుల కష్టార్జితం. దానిని వాళ్లకే ఇవ్వాలని నిర్ణయించాం.

కొత్త గనుల ఘనత మాదే గతంలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడే ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను మొదలైంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌పై సంతకం చేసి.. ఇప్పుడు టీబీజీకేఎస్ కొత్తగా తీసుకొచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గనులను మూయడం తప్ప తెరిచిన దాఖలాలు లేనే లేవు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇల్లెందు, భూపాలపల్లిల్లో కొత్త గనులు తెరిచాం.

మమ్మల్ని ఎదుర్కొనలేకే పొత్తు రాజకీయంగా సిద్ధాంతాలను మరిచి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల నాయకులు పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించడం వారి అనైతికతకు నిదర్శనం. తెలంగాణ సంఘాన్ని నేరుగా ఎదుర్కొనలేక సిద్ధాంతాలను మరిచి విచిత్ర పొత్తు పెట్టుకున్నారు. కార్మికుల సంక్షేమం, సంస్థను అభివృద్ధి చేసుకోవడం అన్న అంశాలపై కాకుండా, టీబీజీకేఎస్ సంఘాన్ని గెలువకుండా చేయడమే లక్ష్యంగా వాళ్లు ఏకమయ్యారు. వారి అవకాశావాదాన్ని , కుట్రను కార్మికులు అర్థం చేసుకుంటున్నారు. 2012వరకు సింగరేణి చరిత్రలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలే గుర్తింపు సంఘాలుగా ఉండేవి. నిన్నమొన్నటి వరకు వీళ్లే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడేమో పొత్తు పెట్టుకున్నారు. వీటికి టీడీపీ అనుబంధ సంఘం టీఎన్‌టీయూసీ తోడైంది. ఈరకమైన పొత్తు ఏవిధంగా పవిత్రమైనదో కార్మికులు అలోచించాలి.

సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు పునరుజ్జీవం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్తు సంస్థలపై ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపించాయి. దీంతో అవి బలహీనపడ్డాయి. కానీ, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిల్లో పనిచేసే వారు తెలంగాణ బిడ్డలనే ఉద్దేశంతో ఆ సంస్థలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. ఉదయ్ స్కీంలో చేరటం ద్వారా విద్యుత్తు సంస్థ అప్పులను ప్రభుత్వం తీసుకొన్నది. ఆర్టీసీకి దాదాపుగా వెయ్యికోట్ల వరకు కేటాయించాం. ఇలా అన్ని సంస్థలు బాగుంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందనేదే సీఎం కేసీఆర్ ఉద్దేశం.

50 పైగా సంక్షేమ కార్యక్రమాల అమలు కార్మికులందరూ ఇక్కడి వారే కావడంతో ఆంధ్రపాలకులు వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్న విషయాన్ని గుర్తించి, టీఆర్‌ఎస్‌తోపాటు టీబీజీకేఎస్ సంఘాన్ని స్థాపించారు. తెలంగాణ కార్మికులకు జరిగే అన్యాయాలన్నింటిపై సంస్థ పోరాడింది. నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు సమస్యల పరిష్కారానికి ఒత్త్తిడి చేసింది. 2012లో టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచింది. ఇప్పటివరకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం దాదాపు 50 సంక్షేమ పథకాలను అమలుచేసింది. ఉద్యోగుల ఆత్మగౌరవం పెంపొందేవిధంగా యూనిఫాం విధానాన్ని తీసుకొచ్చాం. కార్మికులు పని నుంచి బయటికి రాగానే విశ్రాంతి తీసుకోవడానికి రెస్ట్ రూంలను నిర్మించాం. గతంలో వారికి కనీసం గది కూడా లేదు. దేశంలో ఏ సంస్థలోనైనా ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేస్తే ఆ పనిరోజులకు వేతనాలు ఇచ్చిన రోజులులేవు. కానీ 35 రోజుల సకల జనుల సమ్మెకాలానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ఇంక్రిమెంట్‌ను కూడా ప్రకటించారు. లాభాల్లో వాటాతో పాటు బోనస్‌ను రూ.25వేలకు పెంచాం. 16వేల మంది కాంట్రాక్టు కార్మికులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని వేజ్ ప్రొటెక్షన్ కోసం జీవో ఇచ్చాం. పండుగలకు ఇచ్చే అడ్వాన్స్ మొత్తాన్ని గతంలో రూ.10వేలు ఉండగా 2014లో రూ.16వేలకు, 2015లో రూ.18వేలకు పెంచాం. ఇవన్నీ చేశాం కాబట్టే బ్రహ్మండమైన మెజార్టీతో గెలుస్తామనే ధీమా మాకుంది.

భారీగా కొత్తగా ఉద్యోగాలు తెలంగాణ ఏర్పడే నాటికి 60వేల ఉద్యోగులు ఉంటే రాష్ట్రం వచ్చిన తర్వాత మూడేండ్లలో 15వేల మంది రిటైర్ అయ్యారు. మిగిలింది 45వేల మందే. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 5500 కొత్త పోస్టులను మంజూరు చేశాం. 1989 తరువాత తొలిసారిగా నియామకాలను సింగరేణి చేపట్టింది. 3527 వీఆర్‌ఎస్ పోస్టులకు సంబంధించిన వారికి ఉద్యోగాలు కల్పించాం. వీటితో పాటుగా ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను 665 మందికి ఇప్పించాం. వీఆర్‌ఎస్ పోస్టులను నెలకు 22చొప్పున భర్తీ చేసే వారు. దీన్ని అశాస్త్రీయ విధానంగా గుర్తించిన సీఎం కేసీఆర్ వారందరినీ ఒకేసారి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో చాలామంది ఉద్యోగాలు పొందారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, సింగరేణిలో ఉన్న గుర్తింపు సంఘం రెండు ఒకటే ఉంటే కార్మికుల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.

పకడ్బందీగా ఎన్నికల ప్రచారం ఈనెల 21 నుంచి 27 వరకు మొదటి దశ, అక్ట్టోబరు 1 నుంచి 3 వరకు రెండోదశ ఎన్నికల ప్రచారం చేస్తాం. నేను అన్ని చోట్లా ప్రచారం చేస్తా. నాతో పాటుగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జలగం వెంకట్రావు ప్రచారం చేసే విధంగా ప్రణాళికను రూపొందించాం. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రాంతాలవారీగా 12 మంది యూనియన్ నాయకులతో అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశాం. ఇలా అన్ని స్థాయిల్లోనూ ప్రచారం పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం.

రూ.120కోట్ల ఆదా కార్మికులు బకాయి ఉన్న రూ.120కోట్ల వృత్తి పన్నును సీఎం కేసీఆర్ ఒకే సంతకంతో రద్దు చేశారు. ఈమొత్తం కార్మికులకు మిగిలినట్లే కదా. ఆదాయం పన్నును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. లోక్‌సభలో దీనిని ప్రస్తావించాం. నేను కూడా మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పన్ను రద్దుచేశాం. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేకుండా జాతీయ సంఘాలు ఏవేవో మాట్లాడుతున్నాయి. ఈ విషయాన్ని కార్మికులు గుర్తించారు. ఆ సంఘాలను కార్మికులు నిలదీస్తారు. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తే దానిని బేసిక్‌లో కలపాలంటూ జాతీయసంఘాలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. బేసిక్‌లో విలీనం చేయాల్సిన వేజ్‌బోర్డులో జాతీయ సంఘాల ప్రతినిధులు సభ్యులు ఉంటారు. కానీ స్థానిక సంఘమైన మాపై ఆరోపణలు చేయడం వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కార్మికులు ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. వారి మద్దతుతో సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధిస్తుంది.

సింగరేణిని కుంగదీసిన జాతీయ సంఘాలు సింగరేణిలో మొదటినుంచీ జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలదే ఆధిపత్యం. వారుఏనాడూ కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోలేదు. కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న సందర్భాల్లో ఏనాడు కూడా కార్మికులకు అండగా ఉండి పోరాడలేదు. కార్మికులకు ఒక్క కొత్త హక్కు కూడా సంక్రమించలేదు. ఉన్న హక్కులు కూడా పోయాయి. తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం (టీబీజీకేఎస్) అవిర్భవించిన ఆరేడు నెలల్లోనే జరిగిన గని ప్రమాదంలో 17మంది కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలను టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. ఎక్స్‌గ్రేషియాను పెంచాలని ఆయన డిమాండ్ చేయడంతో అప్పటివరకు కేవలం రూ.లక్ష ఉన్న ఎక్స్‌గ్రేషియాను రూ.6లక్షలకు పెంచారు. ఆనాడు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా లేకపోయినా కార్మికుల సమస్యలపై ప్రేమ, తెలంగాణ ప్రజలపై మమకారంతో పోరాటం చేసింది. సమస్య పరిష్కారానికి నడుంకట్టింది. మేం అక్కడితో సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.20లక్షలకు పెంచాం. ఎంతమొత్తం పీఎఫ్ కార్మికుడి ఖాతాలో ఉంటే దానికి సమానంగా అంతే మొత్తాన్ని ప్రభుత్వమే కలిపి కార్మికుడి కుటుంబానికి అందిస్తున్నది. సాధారణ మరణం సంభవిస్తే రూ.15లక్షలు ఇస్తున్నాం. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షలు ఇస్తున్నాం.

వారసత్వ ఉద్యోగాల కోసం కృషి వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. దానికి సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. వారసత్వ ఉద్యోగాలను కొడుకులు, అల్లుళ్లకే కాకుండా దత్తత తీసుకున్న కొడుకులకు వర్తించే విధంగా రాష్ట్రప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ విపక్షాలకు చెందిన వారు కోర్టుకు వెళ్లి దానిని రద్దు చేయించారు. ఒక రకంగా చెప్పాలంటే కార్మికుల చేతికి వచ్చిన బుక్కను నోటికి అందకుండా చేశారు. అంతమాత్రం చేత వారసత్వ ఉద్యోగాల సమస్య ముగియలేదు. దానికి కోసం కృషి చేస్తున్నాం. ఆ సమస్యకు పరిష్కారం టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కార్మికులు నమ్ముతున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.