Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ బావుటా

-ముఖ్యమంత్రి బాధ్యతలు మోస్తున్నా సొంత నియోజకవర్గాన్ని మరువని కేసీఆర్
-నాలుగున్నరేండ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి..
-ప్రతి ఎమ్మెల్యేకు గజ్వేల్ ఇప్పుడు రోల్ మోడల్

ఉద్యమనాయకుడిగా ఉవ్వెత్తున ఎగిసి, ఒదిగి ఉండాల్సినప్పుడు ఒద్దికగా ఒదిగి ఉండి, పద్నాలుగేండ్లపాటు రక్తపుబొట్టు చిందకుండా ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించిన నేత కేసీఆర్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత విడివడిన ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగు రాష్ర్టాలన్నింటితోనూ సఖ్యంగా మెలుగుతూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో సాటిలేని అభివృద్ధిని సాధించి ప్రజాప్రతినిధికి నిజమైన నిర్వచనం చెప్పిన నేత కేసీఆర్. నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తార్చినాను అని ఆనాడు మహాకవి దాశరథి ఎలుగెత్తి నినదించాడు. ఈ రోజు నిజంగా ఆ మాట అనగలిగిన నాయకుడు.. అనాల్సిన నాయకుడు కేసీఆర్ మాత్రమే. కోవెల సంతోష్‌కుమార్: ఎవరైనా ఒక నాయకుడు ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి పోవడం అనేది అరుదు. ఎవరో ఒకరిని తన ప్రతినిధిగా ఉంచి, అక్కడ ఒకటి రెండు అభివృద్ధి కార్యక్రమాలు మంజూరుచేసి అమలుచేయాలని అధికారులను ఆదేశిస్తారు. ఐదేండ్ల కాలంలో అప్పుడప్పుడూ ఓ మెరుపుతీగగా అలా వచ్చి.. ఇలా వెళ్తుంటారు. కానీ.. దశాబ్దాల కలను సాకారం చేసుకొనేందుకు ఒకటిన్నర దశాబ్దం పాటు కాలికి బలపం కట్టుకొని తిరిగిన నేత.. తన స్వప్నాన్ని సాకారం చేసుకొని.. దాని ఫలాలను రాష్ట్రమంతటా వెదజల్లేందుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాయకుడు.. అదే సమయంలో తన నియోజకవర్గంపై సమాంతరంగా దృష్టి సారించి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేయడం సాధ్యమేనా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మాత్రమే అది సాధ్యమైంది. ఇదేమీ పొగడ్తలకోసం చెప్పేది కాదు.. అత్యుక్తులు అవసరమే లేదు. ఎందుకంటే, 2014 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనవి. రాష్ట్రం విడిపోయిన సందర్భం. తెలంగాణ ఏర్పాటు ఒక విఫలచర్య అని ప్రత్యర్థులు పనిగట్టుకొని ఊదరగొట్టిన సమయం.

ఆ సంధికాలంలో.. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన నేత పరిపాలన పగ్గాలు చేపట్టినప్పుడు సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సఫలం చేసి చూపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. కేవలం రాష్ట్రంలోనే కాదు.. యావత్‌దేశం దృష్టీ ఆయనపైనే ఉంటుంది. ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్‌రావు అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారిగా ముప్పిరిగొన్న సమస్యలను ఏకకాలంలో పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని హింసాత్మకం కాకుండా.. పొదివిపట్టుకొని ముందుకు కొనసాగించిన దానికంటే కూడా అనేక రెట్లు ఎక్కువగా.. తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టడానికి శ్రమించాల్సి వచ్చింది.

ఉద్యోగుల విభజన పూర్తికాని పరిస్థితి ఒకవైపు.. ఏపీ సహాయ నిరాకరణ ఇంకోవైపు.. ఏపీ సీఎం చెప్పినట్టల్లా ఆడటం మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం మరోవైపు.. ఇన్నింటి మధ్య రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత తలకెత్తుకున్న సీఎం కేసీఆర్.. సర్వతోముఖాభివృద్ధికి బహుముఖ వ్యూహరచనచేయాల్సి వచ్చింది. తెలంగాణకు ఆయువుపైట్టెన వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడానికి సమాంతరంగా అనేక చర్యలు చేపట్టారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి చేపట్టిన చర్యలు ఒక్కటొక్కటిగా ఫలితాలిస్తున్నకొద్దీ యావద్దేశం అబ్బురపడటం ఆరంభమైంది.

ఒకరి తర్వాత ఒకరు తెలంగాణకు రావటం.. ఆశ్చర్యపోవడం మొదలైంది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు.. కీలక ఆర్థిక వ్యవస్థల అధినేతలు.. రాష్ర్టాల ముఖ్యమంత్రులు.. అధికారుల బృందాలు.. శాస్త్రవేత్తలు.. అందరికీ ఆశ్చర్యమే.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మస్తిష్కం నుంచి ఆవిర్భవించిన ప్రతి పథకం వినూత్నమే. ఇక్కడ పుట్టిన ప్రతి పథకాన్ని కూడా పేర్లు మార్చుకొని రకరకాలుగా తమదగ్గర అమలు చేయడానికి అన్ని రాష్ర్టాలు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణలో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు సైతం తాము అధికారం లో ఉన్న రాష్ర్టాల్లో మ్యానిఫెస్టోల్లో చేర్చుకొని ఓట్ల కోసం వెంపర్లాడుతుండటం నిష్ఠుర సత్యం. చివరకు సంక్షేమ పథకాల అమలుకు అధ్యయన వేదికగా తెలంగాణ మారిన సన్నివేశం ఆవిష్కారమైంది. సంక్షేమం.. అభివృద్ధి రాష్ట్రం నలుదిక్కులకూ వికేంద్రీకృతమైంది. నగర ఆర్థిక వ్యవస్థతోపాటు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకూడా పరిపుష్టం అయ్యే దిశగా పుంజుకుంది. హైదరాబాద్ మాత్రమే కాకుండా.. పల్లెల నుంచి కూడా ఆదాయం వచ్చే పరిస్థితి నెలకొన్నది. నాలుగున్నరేండ్లలో సగటున 17.7శాతం వృద్ధిరేటు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి గెలవటం నిస్సందేహంగా అద్భుతమే. మనమెరిగిన కాలంలో భారతీయ జనతాపార్టీ ఏర్పాటుచేసిన మూడు రాష్ర్టాలు ఇప్పటికీ కూడా ఆపసోపాలు పడుతున్న వాస్తవాలు కండ్లముందు కనిపిస్తున్నవే. పాలకుడైన నాయకుడు తన ప్రాంతం పట్ల.. ప్రజల సంక్షేమం పట్ల స్పష్టమైన దార్శనికత కలిగినవాడైతే ఆ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుందన్నదానికి తెలంగాణ ఒక స్పష్టమైన ఉదాహరణ.

నాలుగున్నరేండ్ల కిందట అతీగతీ లేకుండా పడి ఉన్న గజ్వేల్ దారి ఇప్పుడు నాలుగులేన్ల రోడ్లతో జిగేల్‌మంటున్నది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా విద్యాహబ్‌ను తన నియోజకవర్గంలో సృష్టించింది ఎమ్మెల్యే కేసీఆర్ మాత్రమే. లైబ్రరీ, ఆడిటోరియం, అర్బన్ పార్కు, ఉద్యాన విశ్వవిద్యాలయం, పేదలకు ఇండ్లు, సాగు.. తాగునీరు, రైల్వేలైన్ల నిర్మాణం.. ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే ఉద్గ్రంథమే అవుతుంది. సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఏనాడూ ఎమ్మెల్యేగా తన బాధ్యతను విస్మరించని ముఖ్యమంత్రి బహుశా కేసీఆర్ మాత్రమేనేమో.

ఒకవైపు తాను స్వప్నించిన రాష్ట్రం సాకారం చేసుకోవడం కోసం ముఖ్యమంత్రిగా పడుతున్న తపన. మరోవైపు తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆరాటం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి నిధులు పారించడం చాలా తేలిక.. ఇక అభివృద్ధి మాటేమిటని రాజకీయ పండితులు ఎన్నైనా మాట్లాడవచ్చు. కానీ.. ఒక్కసారి గతంలోకి తొంగిచూస్తే వాస్తవాలు అర్థమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అంతకుముందు హైదరాబాద్ స్టేట్‌లో.. ఆంధ్రరాష్ట్రంలో మరో నలుగురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాలకు ఇద్దరు ముఖ్యమంత్రులున్నారు. వీరందరూ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను ఒక్కసారి పరిశీలించి.. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని చూడాలి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందాలి? మిగతా ఎమ్మెల్యేలకు అది ఏ విధంగా ఆదర్శం కావాలన్నదానికి నిస్సందేహంగా గజ్వేల్ ఓ రోల్‌మోడల్. యావత్ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా గజ్వేల్ ముందు దిగదుడుపే. ప్రధానమంత్రులుగా పనిచేసిన వారి నియోజకవర్గాల్లోనూ ఈ రకమైన అభివృద్ధిని మనం చూడలేం.

గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో ముఖ్యమంత్రి తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొనడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. తాను స్వయంగా పాల్గొని.. తానే గ్రామాల్లో సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారం చూపించడమే కాకుండా.. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలుకరించి వారి పంట పొలాల్లో సాగు ఏ రకంగా చేసుకోవాలో కూడా దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడు కాబట్టే ఆయన అందరికీ చేరువయ్యారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్నీ స్వయంగా పర్యవేక్షిస్తారు. లేకుంటే.. తన అంతేవాసి హరీశ్‌రావుకు పురమాయిస్తారు. పనులు పూర్తయ్యేదాకా ఊరుకోరు. ఎవరినీ ఖాళీగా ఉండనివ్వరు. రాజకీయాలకు.. పార్టీలకు అతీతంగా ప్రతి ఎమ్మెల్యేకు కేసీఆర్ ఒక ప్రేరణ. తన నియోజకవర్గంపై చూపుతున్న శ్రద్ధ ఆదర్శం. ఉద్యమనాయకుడిగా ఎగిసినప్పుడు ఉవ్వెత్తున ఎగిసి.. ఒదిగి ఉండాల్సినప్పుడు ఒద్దికగా ఒదిగి ఉండి.. పద్నాలుగేండ్లపాటు రక్తపుబొట్టు చిందకుండా ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించిన నేత కేసీఆర్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత విడివడిన ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగురాష్ర్టాలన్నింటితోనూ సఖ్యంగా మెలుగుతూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో సాటిలేని అభివృద్ధిని సాధించి ప్రజాప్రతినిధికి నిజమైన నిర్వచనం చెప్పిన నేత కేసీఆర్. నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తార్చినాను అని నాడు మహాకవి దాశరథి ఎలుగెత్తి నినదించాడు. ఈ రోజు నిజంగా ఆ మాట అనగలిగిన నాయకుడు.. అనాల్సిన నాయకుడు కేసీఆర్ మాత్రమే.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.