-మేం తరిమేస్తే.. మీరు స్వాగతిస్తారా? -కాంగ్రెస్ తీరు.. అయితే వద్దు.. -లేకుంటే రద్దు అన్నట్టుగా ఉంది -తెలంగాణ విరోధితో పొత్తు కడతారా.. -చంద్రబాబు తలుపుకాడ చేతులుకట్టుకొంటావా -ఉత్తమ్‌పై మంత్రి హరీశ్‌రావు అగ్రహం -కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
తెలంగాణ ద్రోహి చంద్రబాబును ప్రజలు పొలిమేరదాకా తరిమికొడితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు పొత్తు పేరిట మళ్లీ స్వాగతించడం దారుణం. తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్‌వారు దేనినైనా వద్దంటున్నారు. అందుకే ఆ పార్టీని ప్రజలు మాకొద్దంటున్నారు. – మంత్రి హరీశ్‌రావు
అయితే వద్దు, లేకుంటే రద్దు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని, అందుకే ఆ పార్టీని ప్రజలు మాకొద్దంటూ ఈసడించుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. చంద్రబాబుతో పొత్తును సమర్థించుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమకు ఎలాంటి ఇబ్బందిలేదని, అయితే పొలిమేర దాకా తరిమిన తెలంగాణ ద్రోహి చంద్రబాబును పొత్తు పేరిట మళ్లీ స్వాగతించడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి విరోధి అయిన చంద్రబాబు తలుపుకాడ రేపు చేతులు కట్టుకొని ఉంటావా? కొట్లాడి సాధించుకున్న స్వీయ అస్తిత్వం, స్వయం పాలనను మళ్లీ ఆంధ్రాభవన్, అమరావతి వద్ద తాకట్టుపెడతావా? అని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణభవన్‌లో మంత్రి హరీశ్ సమక్షంలో అందోల్‌కు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు అనిల్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, పెద్దసంఖ్యలో వారి అనుచరులు టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం, హైకోర్టు విభజన, ఇతర హామీల అమలుకు అడుగడునా అడ్డం పడుతున్న చంద్రబాబుతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతున్నదన్నారు. అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్ ప్రాజెక్టును తొలిగిస్తామని, రైతుబంధు, రైతు సమన్వయ సమితులు లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించడం దారుణమని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తమకు చెప్పడం మానుకొని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సీట్లను కాపాడుకోవాలని సూచించారు. ఐదుసీట్లు ఉండికూడా జీహెచ్ఎంసీలో ఒక్క కార్పొరేటర్‌ను గెలిపించుకోలేదని గుర్తుచేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పిన బీజేపీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి, కాళేశ్వరానికి మొండిచేయి చూపిందని తెలిపారు.
మెదక్‌లో పదికి పది సీట్లు మావే.. మెదక్‌లో మొత్తం పది సీట్లు టీఆర్ఎస్కే వస్తాయని హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. అందోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి పేదవాడని, ప్రజల నుంచి వచ్చిన అతడ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నోఏండ్ల తర్వాత ఆందోల్ పెద్దచెరువు నిండి నీళ్లు మత్తడి మీది నుంచి పరవళ్లు తొక్కుతున్నాయంటే కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. నేడు మూడుపంటలకు నీరు అందిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే అందోల్‌లో లక్ష ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. టీఆర్ఎస్ పాలన నచ్చినందుకే ప్రతిరోజూ పెద్దమొత్తంలో గులాబీ కండువాలు కప్పుకుంటున్నారని పేర్కొన్నారు.