Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ.. ఈ దేశంలో భాగం కాదా?

-మేకిన్‌ తెలంగాణ అంటే.. మేకిన్‌ ఇండియా కాదా?
-ప్రగతిశీల రాష్ట్రాలకు సాయం కరువు
-నినాదాలతో ‘ఆత్మనిర్భర్‌’ సాధ్యమా?
-ఉద్దేశాలు కాదు.. కార్యాచరణ కావాలి
-ఎన్నికల కోసమే ఆలోచిస్తున్న కేంద్రం ప్రజలు, దేశం కోసం ఆలోచించాలి
-మేకిన్‌ ఇండియా అంటారు కానీ.. ఒక్క జోన్‌ కూడా కేటాయించలేదు
-బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసేలేదు
-ఇండస్ట్రియల్‌ కారిడార్‌ జాడే లేదు
-ఐటీఐఆర్‌ రద్దుతో రాష్ట్రానికి అన్యాయం
-సీఐఐ వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్

‌ మేక్‌ ఇన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, ఆత్మ నిర్భర భారత్‌ లాంటి గొప్ప నినాదాలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఉద్దేశాలు ఎంత గొప్పవైనప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోతే.. కేంద్రం, రాష్ర్టాలు కలిసి పనిచేయకపోతే.. ఎటువంటి ఫలితాలు రావు. తెలంగాణకు ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్‌ కూడా

ఇవ్వనప్పుడు అభివృద్ధి ఎక్కడినుంచి వస్తుంది? రాష్ట్రం నుంచి అధిక ఆదాయం పొందుతున్న కేంద్రం, అందుకు తగిన స్థాయిలో కేటాయింపులు చేయకుండా రాష్ర్టానికి అన్యాయం చేస్తున్నది.పార్లమెంట్‌ సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. ఉక్కు కర్మాగారం, విద్యాసంస్థల ఏర్పాటు హామీలను గాలికొదిలేసింది. తాజాగా.. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని చెప్పి తెలంగాణపై మరోసారి వ్యతిరేకతను చాటింది.
– సీఐఐ సదస్సులో మంత్రి కేటీఆర్‌

మేకిన్‌ తెలంగాణ అంటే.. మేకిన్‌ ఇండియా కాదా? తెలంగాణ భారతదేశంలో లేదా? అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం తమకెందుకు సహకరించడం లేదని, తాము భారతదేశంలో భాగస్వాములం కాదా అని ఆవేదన వ్యక్తంచేశారు. బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా? హైదరాబాద్‌కు అర్హత లేదా అని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పనిచేయాలని హితవు చెప్పారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో శుక్రవారం సీఐఐ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇండస్ట్రీ) వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు సమయంలో, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను విస్మరించిందని విమర్శించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణకు కేంద్రం నుంచి గత ఆరున్నరేండ్లలో అవసరమైనంత మద్దతు లభించలేదని విమర్శించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యాన్ని సాధించాలంటే తమ వంటి ప్రగతిశీల రాష్ర్టాలకు తగిన ప్రోత్సాహమివ్వాలని చెప్పారు. ఉద్దేశాలు ఎంత గొప్పవైనప్పటికీ అవి కార్యరూపం దాల్చకపోతే.. కేంద్రం, రాష్ర్టాలు కలిసి పనిచేయకపోతే.. ఎటువంటి ఫలితాలూ రావని స్పష్టం చేశారు. వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు 60 ఎకరాల భూమి అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని, కానీ ఫ్యాక్టరీ మాత్రం రాలేదని మండిపడ్డారు. మేకిన్‌ ఇండియా అంటున్న కేంద్రం రాష్ర్టానికి ఒక్క పారిశ్రామిక జోన్‌ను కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతకుముందున్న యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ప్రకటించిందని, కానీ మోదీ ప్రభుత్వం దానిని రద్దుచేసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. ఐటీఐఆర్‌ను అమలుచేసి ఉంటే కనీసం రెండు లక్షల మందికి ఉపాధి లభించి ఉండేదని అభిప్రాయపడ్డారు.

హామీలు విస్మరించారు
మేక్‌ ఇన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌ లాంటి గొప్ప స్లోగన్స్‌ ఇచ్చే బీజేపీ ప్రభుత్వం వాటి అమలులో మాత్రం దారుణంగా విఫలమైందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు, ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. తెలంగాణకు ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్‌ కూడా ఇవ్వనప్పుడు ఉద్యోగాలు ఎక్కడొస్తాయని నిలదీశారు. రాష్ట్రం నుంచి అధిక ఆదాయం పొందుతున్న కేంద్రం, అందుకు తగిన స్థాయిలో కేటాయింపులు చేయకుండా అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సెక్టర్లు అడిగితే పట్టించుకోవడం లేదని, బయ్యారం ఉక్కు ఊసే మరిచిపోయారని, ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు స్థలం ఇస్తామన్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఇక ఎవరిని అడగాలని ప్రశ్నించారు.

ఈ విధానాలతో చైనాతో పోటీ పడగలమా?
ప్రామాణికమైన ఆర్థిక విధానాలు లేకుండా చైనాతో పోటీ పడగలమా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘ప్రపంచంలో భారీ వస్తు ఉత్పత్తి దేశంగా నిలిచేందుకు చైనాతో పోటీ పడాలని చెప్తున్నారు. ప్రామాణికమైన ఆర్థిక వ్యవస్థను సాధించకుండా చైనాతో ఎలా పోటీ పడుతారు? వైద్య పరికరాలను తయారుచేసే ఓ కంపెనీ యజమాని.. చైనా నుంచి పరికరాలను దిగుమతి చేసుకొని, వాటికి తన కంపెనీ లేబుల్‌ వేసి భారత్‌లో అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే భారత్‌లో ఆ పరికరాలను తయారు చేయడం కంటే దిగుమతి చేసుకుంటేనే అతనికి గిట్టుబాటు అవుతుంది. దిగుమతి సుంకాలు మన దేశంలో హాస్యాస్పదంగా తయారయ్యాయి. ఈ పరిస్థితిలో మేకిన్‌ ఇండియా అంటే విదేశీ కంపెనీలు వస్తాయా?’ అని ఆయన ప్రశ్నించారు.

సీఆర్‌ విజన్‌తో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా
కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుత నాయకత్వ పటిమ, దీర్ఘకాలిక విజన్‌తో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ‘రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఉన్న విద్యుత్‌ సంక్షోభం నుంచి పరిశ్రమలకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్‌ఐపాస్‌ వంటి వినూత్న, విప్లవాత్మక పారిశ్రామిక విధానం తీసుకొచ్చి, తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తెలంగాణ బాట పట్టేలా కార్యాచరణ చేపట్టింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సింగిల్‌ విండో అనుమతుల విధానం తీసుకొచ్చి, దాదాపు 15 వేల కంపెనీలు, రెండు లక్షల 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించింది. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు కల్పించింది’ అని చెప్పారు.

టాప్‌ రాష్ట్రాల్లో తెలంగాణ
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కొత్త రాష్ట్రంలో ఏమవుతుందోననే సందేహాలుండేవని, కానీ తక్కువ సమయంలోనే వాటన్నింటినీ తెలంగాణ పటాపంచలు చేసిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ‘ఈ రోజు ఏ దేశంలో ఎక్కడికి వెళ్లినా.. ఏ రంగం గురించి మాట్లాడినా తెలంగాణ ప్రస్తావన లేకుండా ఉండదు. స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే టాప్‌ మూడు, నాలుగు రాష్ర్టాల్లో, సులభతర వాణిజ్య విధానం అమలుచేస్తున్న టాప్‌ మూడు రాష్ర్టాల్లో తెలంగాణ ఉన్నది. రాష్ట్రంలో 2014-15లో ఐటీ ఎగుమతులు రూ.57వేల కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.1.40లక్షల కోట్లకు చేరాయి. తెలంగాణలో డిజిటల్‌ లిట్రసీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ సాంకేతికత, రోబోటిక్స్‌, యానిమేషన్‌ తదితర రంగాల అభివృద్ధికి రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది’ అని వివరించారు.

ఐటీ రంగాన్ని విస్తరించాం
ఐటీని హైదరాబాద్‌కు పరిమితం చేయకూడదనే ఉద్దేశంతో ద్వితీయశ్రేణి నగరాలైన వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలకు కూడా విస్తరిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వరంగల్‌ నగరంలో సైయంట్‌ సంస్థ భారీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు.

టీకాల రాజధానిగా తెలంగాణ..
దేశానికి టీకాల రాజధానిగా తెలంగాణ మారిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఐటీ, ఏరోస్పెస్‌, డిఫెన్స్‌, లాజిస్టిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, నిర్మాణ రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గడిచిన ఆరున్నరేండ్లలో స్వదేశీ, విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయన్నారు. పెట్టుబడులకు రాజధానిగా హైదరాబాద్‌ అవతరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధికమంది ఆధారపడిన నిర్మాణరంగంలో మిగిలిన రాష్ర్టాల కంటే తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉందని తెలిపారు. దేశంలో ఏ మెట్రో నగరంలో సైతం నిర్మాణ రంగం ఇంత పటిష్ఠంగా లేదని కితాబిచ్చారు. ఇందుకు కృషి చేస్తున్న నిర్మాణ సంస్థలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్రం సహకరించకున్నా ఎదుగుతున్నాం
కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందకున్నా దేశంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్‌ పార్కును హైదరాబాద్‌లో, అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ‘స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ తెలంగాణను ఇన్నోవేషన్‌ హబ్‌గా, హైదరాబాద్‌ను ఇన్నోవేషన్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. నిరంతర విద్యుత్‌ సరఫరా, గోదాముల సామర్థ్యం పెంపుతో దేశంలోనే తెలంగాణ రూ.లక్ష కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు చేసే స్థాయికి ఎదిగింది. త్వరలోనే రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేయబోతున్నాం’ అని తెలిపారు. ‘వాణిజ్యాన్ని ప్రోత్సహించే రాష్ట్రంగా ఎప్పుడూ ముందువరుసలో ఉండే తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. అన్ని రంగాల్లో పెర్ఫార్మింగ్‌ స్టేట్‌గా ఉన్న తెలంగాణకు కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు ఎన్నడూ అందలేదు. కేంద్ర మంత్రులు రావడం, వివిధ వేదికల మీద రాష్ర్టాన్ని ప్రశంసించడం, వెళ్లడం తప్పితే రాష్ర్టానికి పైసా సాయం చేసింది లేదు. గత కొన్నేండ్లుగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్రాన్ని సంప్రదిస్తూనే ఉన్నాం.. విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. ఏండ్లు గడుస్తున్నాయే తప్ప కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం మా గొంతును గట్టిగా విప్పాల్సిన అవసరం వచ్చింది.’ అని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం తన ప్రాధాన్యాలపై మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు. ఎన్నికల కోసం కాకుండా దేశం కోసం ఆలోచించాలన్నారు.

వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏది?
ప్రపంచానికి 35% వ్యాక్సిన్లను అందిస్తున్న హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ మాత్రం లేదని మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఫార్మా పార్కు కోసం ఇప్పటికే 12వేల ఎకరాలను తమ ప్రభుత్వం సేకరించినా కేంద్రం మద్దతు మాత్రం లభించడం లేదన్నారు. వ్యాక్సిన్ల టెస్టింగ్‌ కోసం శాంపిల్స్‌ తీసుకొని హైదరాబాద్‌ నుంచి 1200 కిలోమీటర్ల దూరం పోవాలా? అని ప్రశ్నించారు. వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయమని కేంద్రాన్ని అడుక్కోవాలా? అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేంద్రం తమతో కలిసి పనిచేయాలని కోరారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్రం సహకారం దొరికితే ఇంకా బాగుంటుందన్నారు.

కేంద్రం నుంచి వివిధ రంగాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటి గురించి మంత్రి కేటీఆర్‌ చెప్పిన వివరాలు
-పార్లమెంట్‌ సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలోకి తొక్కిం ది. ఉక్కు కర్మాగారం, విద్యాసంస్ధల ఏర్పాటు హామీలను గాలికొదిలేసింది. తాజాగా.. విభజన హామీల్లో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు సైతం అవసరం లేదని చెప్పి తెలంగాణపై మరోసారి వ్యతిరేకతను ప్రదర్శించింది.
-పారిశ్రామిక అభివృద్ధికి ప్రాణాధారమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని తెలంగాణ చేస్తున్న విజ్ఞప్తులకు కేంద్రం స్పందించడం లేదు. ఇప్పటికే 8 రైల్వే లైన్ల నిర్మాణం పెండింగ్‌లో ఉండగా, నాలుగు నూతన రైల్వే లైన్ల ప్రతిపాదనలకు సైతం కేంద్రం నుంచి స్పందన లేదు. మరో మూడు రైల్వే లైన్ల సర్వేను పక్కన పెట్టింది. కేంద్రం భారీగా ప్రచారం చేసుకుంటున్న బుల్లెట్‌ రైలు, హై స్పీడ్‌ రైల్వే నెట్‌వర్క్‌లోనూ తెలంగాణకు దక్కింది శూన్యమే.
-బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు రావాలని, రాష్ట్రం తరఫున అన్ని రకాల సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపినా, కేంద్రం నుంచి స్పందన లేదు.
-రాష్ట్ర ఏర్పాటుకు ముందే హైదరాబాద్‌కు దక్కిన ఐటీఐఆర్‌ను రద్దుచేసింది. తద్వారా ఐటీ పరిశ్రమ వృద్ధిని అడ్డుకునే ప్రయత్నంతోపాటు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు మోకాలడ్డింది.
-ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో హైదరాబాద్‌లో ఉన్న రెండు ఈఎంసీలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో అదనపు ఈఏంసీని ఏర్పాటుచేయాలని కోరినా.. ఎటూ తేల్చడం లేదు.
-హైదరాబాద్‌లో ఫార్మాసిటీ మౌలిక వసతుల కోసం రూ.3,900 కోట్లు ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తిచేసినా స్పందించలేదు. పైగా.. ఫార్మా పార్కు స్కీం అంటూ ఓ పథకంతో ఏడాదికాలంగా 19 రాష్ర్టాల మధ్య పోటీ పెట్టి కాలయాపన చేస్తున్నది.
-వివిధ దేశాల రాయబారులు వచ్చి జీనోమ్‌ వ్యాలీ ప్రాధాన్యాన్ని గుర్తిస్తుంటే.. కేంద్రం నుంచి మాత్రం ఇక్కడి పరిశ్రమకు కావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహం లభించడం లేదు. దురదృష్టం ఏంటంటే జీనోమ్‌ వ్యాలీలో లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలు ఉంటే, వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ కోసం వందల కిలోమీటర్ల దూరంలోని కసౌలీలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీకి వెళ్లాలి. ఇక్కడే టెస్టింగ్‌ కేంద్రం నెలకొల్పాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం వాటిని ఖాతరు చేయడం లేదు.
-హైదరాబాద్‌లో అద్భుతమైన ఎరోస్పేస్‌, డిఫెన్స్‌ ఎకో సిస్టం ఉన్నా కూడా కేంద్రం తలపెట్టిన డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్లలో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. ఎలాంటి ఈకో సిస్టంలేని ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్‌ కారిడార్‌ మంజూరు చేసి రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చింది.
-మెగా క్లస్టర్‌ పాలసీలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సాయం అందించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా మొండిచెయ్యే మిగిలింది. రాష్ట్రంలోని 90 శాతానికి పైగా మరమగ్గాలు కలిగి ఉండి, వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేసినా పట్టించుకోవడం లేదు.
-అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, సీపోర్టు సౌకర్యం లేని తెలంగాణకు ఒక డ్రై పోర్టు ఇవ్వాలని కోరినా స్పందన లేదు. సముద్రతీరం లేకుండానే రాష్ట్ర ఉత్పత్తుల వృద్ధిరేటు జాతీయ సగటు కన్నా ఎక్కువ. 2019-20తో పోల్చుకుంటే 2020- 2021 సంవత్సరానికి సుమారు 15.5 శాతంతో తెలంగాణ అద్భుతమైన రీతిలో ఎగుమతుల్లో వృద్ధిరేటు నమోదు చేసింది.
-తాజాగా నేషనల్‌ హైవే అథారిటీ ప్రకటించిన 23 మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు దక్కలేదు.
-ఫార్మాసిటీలో బల్క్‌డ్రగ్‌ పార్క్‌, సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైస్‌ పార్క్‌లకు కేంద్ర ఫార్మాస్యూటికల్స్‌శాఖ నుంచి దక్కింది శూన్యం.
-రంగారెడ్డి జిల్లా మంకాల్‌లో ప్లాస్టిక్‌ పార్క్‌కు కేంద్ర పెట్రో కెమికల్స్‌శాఖ ఇచ్చింది ఏమీలేదు
-స్టేషన్‌ఘన్‌పూర్‌లో లెదర్‌పార్క్‌ ఏర్పాటు చేస్తున్నా కేంద్రం నుంచి ప్రత్యేక సహాయం రాలేదు.
-జహీరాబాద్‌ నిమ్జ్‌ హోదా ఇచ్చినా, మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు ఇవ్వాలని కోరినా ఒక్క పైసా ఇవ్వలేదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.