Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ గడ్డపై గంగావతరణం

-కడలిపాలయ్యే జలాలకు కాళేశ్వరం అడ్డుకట్ట
-గోదావరిలో వాటా జలాల వాడకానికి మార్గం సుగమం
-100 టీఎంసీల నుంచి ఏకంగా 600 టీఎంసీలు పెరుగనున్న వినియోగం

తెలంగాణ నీటిపారుదలలో కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక మలుపు. గోదావరి జలాల వినియోగంలో కాళేశ్వరానికి ముందు.. కాళేశ్వరానికి తరువాత అని చెప్పుకొనేలా సరికొత్త అధ్యాయానికి నాంది. తలాపునే వేల టీఎంసీల గోదావరిజలాలు పారుతున్నా.. వంద టీఎంసీల వినియోగానికి సైతం మొహం వాచిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు 500-600 టీఎంసీల వినియోగానికి సమాయత్తమవుతున్నది. గోదావరి బేసిన్‌లో 954 టీఎంసీల వాటా జలాలున్నా పట్టుమని పదిశాతం వాడుకోలేని తెలంగాణ గడ్డ.. ఇప్పుడు ఏకంగా 60-70 శాతం వినియోగ లక్ష్యాన్ని సాధించబోతున్నది. కడలి వైపు సాగే జలాలకు కాళేశ్వరం వద్ద అడ్డుకట్టతో ఇది సాక్షాత్కారం కానున్నది.

గోదావరిలో తెలంగాణ వాటా 954 టీఎంసీలు. ఇంత భారీవాటాను వినియోగించుకునేందుకు నిన్నటిదాకా వెదికినా దారి కనిపించలేదు. దీంతో పట్టుమని పదిశాతం వాటా కూడా వాడుకోలేని దుస్థితి. శ్రీరాంసాగర్ నిర్మాణాన్ని చేపట్టిన గత పాలకులు దానినే వరప్రదాయిని అనుకోమన్నారు. 90 టీఎంసీల నిల్వసామర్థ్యంతో నిర్మించిన ఆ ప్రాజెక్టు.. పూడిక పేరుకుపోయి 40 శాతం సామర్థ్యానికి పడిపోయింది. ఎగువన మహారాష్ట్ర వరుస బరాజ్‌లతో గోదావరి జలాలను ఎక్కడికక్కడ ఒడిసిపట్టడంతో ఈ ప్రాజెక్టుది గత వైభవంగానే మారింది. ఎస్సారెస్పీ నీటి వినియోగంలో కీలకపాత్ర పోషించే కాకతీయ కాల్వ డిజైన్ ప్రవాహ సామర్థ్యం 8,500 క్యూసెక్కులైతే ఏనాడూ 2వేల నుంచి 3 వేల క్యూసెక్కులకు మించి ప్రవహించిన దాఖలాలు లేవు.

శ్రీరాంసాగర్‌కే వరద రాకపోగా.. ఆ తర్వాత ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుది తెలంగాణ ఏర్పడేనాటికి అయోమయ పరిస్థితే. మిడ్ మానేరు సవాలక్ష సమస్యలతో కునారిల్లుతుండగా.. అట్టహాసంగా ప్రారంభించిన దేవాదుల మూడు టీఎంసీల నీటిని కూడా పొలాలకు పారించిన సందర్భాల్లేవు. సింగూరు హైదరాబాద్ తాగునీటితోనే సరిపెట్టుకోగా… నిజాంసాగర్ వర్షాకాలంలోనూ క్రీడామైదానాన్నే తలపించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ పరిధిలోని గోదావరి బేసిన్‌లోని చెరువుల ద్వారా నీటి వినియోగం 175 టీఎంసీలు. కానీ శిథిలావస్థకు చేరుకున్న చెరువుల కారణంగా అందులో సగం కూడా నీటి వినియోగం జరిగిన దాఖలాలు లేవు. దీంతో గోదావరిజలాల్లో 100-150 టీఎంసీలు వాడుకుంటే గగనంగా మారేది.

తెలంగాణ బీళ్లకు ప్రాణహితమే..
గోదావరి జలాలను ఒడిసిపట్టే వనరులు లేక ప్రతిఏటా వేల టీఎంసీలు కడలి పాలయ్యేవి. కేంద్ర జలసంఘం అధికారిక రికార్డుల్లో దశాబ్దాలుగా నమోదయిన లెక్కలు ఇదే చెప్తున్నాయి. గోదావరి జలాలను ఎగువన ఉన్న మహారాష్ట్ర మాత్రమే మెరుగ్గా వినియోగించుకుంటున్నది. దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరితోపాటు అనేక వాగులు, వంకల ద్వారా వచ్చే భారీస్థాయి జలాలను వాడుకొనే పరిస్థితి లేకుండాపోయింది. నేడు కాళేశ్వరం ద్వారా తెలంగాణకు ఆ సదవకాశం వచ్చింది. గోదావరి నీటి లభ్యతలో ఏకంగా 35 శాతం కంట్రి బ్యూషన్ ఉన్న ప్రాణహిత జలాలను కాళేశ్వరం ప్రాజెక్టుతో వినియోగించుకునే వెసులుబాటు వచ్చింది. దీంతో గతంలో సముద్రంలోకి వృథాగా వెళ్లే గోదావరి జలాలకు అడ్డుకట్ట పడినట్టే. అదే సమయంలో తెలంగాణ పరిధిలో బీడు భూముల్లో గోదావరిజలాల వినియోగం పెరిగినట్లే.

పోలవరానికి ఎలాంటి ఢోకాలేదు
గోదావరిలో తన హక్కు జలాల వినియోగానికి తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో దిగువన ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నీటి లభ్యతకు ఎలాంటి ఢోకా ఉండదు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లోనూ అధికారిక రికార్డుల ఆధారంగా వెల్లడించారు. రెండురాష్ర్టాలు సమృద్ధిగా జలాల్ని వాడుకునేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. పోలవరం వద్ద సరాసరిన 2,631.1 టీఎంసీల నీటిలభ్యత ఉన్నదని కేంద్ర జలసంఘం లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. అంటే తెలంగాణ తన హక్కు వాటాను పూర్తిగా వాడుకున్నా ఏపీ పోలవరానికి ఎలాంటి ఢోకా లేదనేది సుస్పష్టం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.