-రూ. 1834 కోట్లతో బృహత్ ప్రణాళిక -1900 ఎకరాల భూ సేకరణ పూర్తి -గుట్టమీద 14 ఎకరాల్లో నిర్మాణాలు -కాటేజీల కోసం 252 ఎకరాల లే-అవుట్ -కళ్యాణ మండపం, నిత్యాన్నదాన సత్రాలు -అభయారణ్యం, వేద పాఠశాల, శిల్ప నిర్మాణ సంస్థ -ఏప్రిల్ 21న బాలాలయం ప్రారంభం -శాసనసభలో మంత్రి కేటీఆర్

రాష్ట్రం గర్వపడేలా, దేశం గుర్తించేలా యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
ఇందుకోసం సుమారు రూ.1834 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.509 కోట్లు, టెంపుల్ సిటీ అభివృద్ధికి రూ. 1325 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ఈ ప్రణాళికలో ఆలయ నిర్మాణంతో పాటు టెంపుల్ సిటీ అభివృద్ధి, మంచినీటి వసతి, కాటేజీల నిర్మాణం, రహదారులు, సరస్సులు, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, నిత్యాన్నదాన సత్రాలు, కల్యాణ మండపాలు, వేద పాఠశాల, శిల్పనిర్మాణ సంస్థ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో కొన్ని పనులు రెండేండ్ల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే గుట్ట మీద పనుల కోసం టెండర్లు కూడా పిలిచారని చెప్పారు. ఏప్రిల్ 21న యాదాద్రిలో బాలాలయాన్ని ప్రారంభిస్తున్నామని, ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పారు.
శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా యాదాద్రి అభివృద్ధి పనుల మీద ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ళ శేఖర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకున్నారని , దాదాపు పదిసార్లు యాదాద్రిని సందర్శించడంతో పాటు ఆలయ అభివృద్ధికి అథారిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. సీనియర్ అధికారిని సీఈవోగా నియమించి, స్వయంగా అభివృద్ధి పనులను సమీక్షిస్తూ యాదాద్రి అభివృద్ధి ఎంత ముఖ్యమైందో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని తెలిపారు. యాదాద్రి సందర్శనలో దుకాణదారులతో నేరుగా మాట్లాడటంతోపాటు వారిని హైదరాబాద్‌కు పిలిపించుకుని సమస్యలు చర్చించారని చెప్పారు.
ఇవీ అభివృద్ధి ప్రణాళికలు.. యాదాద్రి సమగ్ర అభివృద్ధి కోసం రూ. 93.38 కోట్లు వెచ్చించి 1900 ఎకరాల భూమిని సేకరించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గుట్టపై మొత్తం14 ఎకరాల్లో అభివృద్ధి పనులకు బృహత్తర ప్రణాళిక రూపొందించామని, మొదటి దశలో రెండు ఎకరాల 33 గుంటల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయని వివరించారు. ఇక సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రాయగిరి నుంచి యాదాద్రి వరకు నాలుగు వరుసల రోడ్డు, గుట్టపైకి వెళ్లే రహదారి విస్తరణ, కాటేజీల నిర్మాణం కోసం 252 ఎకరాల లే-అవుట్ అభివృద్ధి, ఆలయం- టెంపుల్ సిటీకి మంచినీటి సరఫరా, ఒక అభయారణ్యం అభివృద్ధి, టీటీడీ స్థాయిలో వేద పాఠశాల, శిల్పకళా సంస్థను ఏర్పాటు చేయతలపెట్టామని చెప్పారు.
ఈ పనులు రెండేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే యాదాద్రిని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ఇక్కడికి సమీపంలో నాలుగు సరస్సులను అభివృద్ధి చేస్తున్నామని, బస్వాపూర్ చెరువును బృందావన్ గార్డెన్ తరహాలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అభయారణ్యం పనులను అటవీ శాఖ అధికారులు చేపడుతున్నారన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిత్యాన్నదానం కార్యక్రమం విస్తృతపరుస్తామని హామీ ఇచ్చారు. యాదగిరిగుట్టకు కనెక్టివిటీ రోడ్లన్నీ నాలుగు లైన్లుగా మార్చే ప్రతిపాదన ప్రస్తుతం రోడ్లు-భవనాల శాఖ వద్ద ఉందని చెప్పారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం కల్పించాలన్న సీఎం విజ్ఞప్తిపై కేంద్రం రికార్డు స్థాయిలో కేవలం పది రోజుల్లో స్పందించి బడ్జెట్‌లో చేర్చిందని తెలిపారు.
ఎమ్మెల్యేల సూచనలు.. అంతకు ముందు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం యాదాద్రి అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించారు. అభయారణ్యం, వేద పాఠశాల, నిత్యాన్నదానం, ప్రయాణికుల కోసం రైల్వేలైన్ అంశాలపై ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను సభకు వివరించాలని కోరారు. అభివృద్ధి నేపథ్యంలో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు. భువనగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి యాద్రాద్రిని అమృత క్షేత్రంగా మార్చేందుకు సీఎం చేస్తున్న కృషిని కొనియాడారు. రాయగిరి-యాదాద్రి నాలుగు లైన్ల విస్తరణ పనులు మధ్యలో ఆగాయని మంత్రి దృష్టికి తెచ్చారు. చేర్యాల, కీసర, వర్గల్ నుంచి యాదాద్రికి చేరుకునే రోడ్లను కూడా ఫోర్‌లేన్‌లుగా విస్తరించాలని, గంధమల్ల, బస్వాపూర్ చెరువులను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ప్రభుత్వాన్ని కోరారు. యాదగిరి గుట్టపై కూల్చివేసిన దుకాణాదారులకు అక్కడే షాపులు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత విజ్ఞప్తి చేశారు. అవగాహనలేని కొందరు అధికారులు టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయిస్తామని చెప్తుండడంతో 40 ఏండ్లుగా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఆందోళన చెందుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు.