Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ గొంతుక ఢిల్లీలో నినదించాలి

-సంఘటితశక్తితో 16 సీట్లివ్వండి.. కేంద్రం మెడలు వంచుతాం
-శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ సెగ్మెంట్లలో రోడ్‌షోల్లో కేటీఆర్
-సంఘటితశక్తితో 16 సీట్లివ్వండి.. కేంద్రం మెడలు వంచుతాం
-తెలంగాణ ప్రయోజనాలకోసం యాచించడంకాదు.. ఢిల్లీని శాసిద్దాం
-టీఆర్‌ఎస్ గెలిచే 16కు 140 తోడుచేసే సత్తా ఉన్న సీఎం
-నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీల నేతలు టచ్‌లో ఉన్నారు
-అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
-శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ సెగ్మెంట్లలో రోడ్‌షోలు

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కావని, ఈ దేశాన్ని 71 ఏండ్లు ఏలినా ఏమిచేయని జాతీయపార్టీలకు, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన టీఆర్‌ఎస్‌కు మధ్య జరుగుతున్నవని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభివర్ణించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే దిశగా ఢిల్లీలో తెలంగాణ గొంతుక నినదించాలన్నారు. ఈ ఎన్నికల్లో 16 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపిస్తే.. యాచించడం కాదు ఢిల్లీని శాసిద్దామని పిలుపునిచ్చారు. ఆదివారం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్‌రెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌యాదవ్ తరఫున శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని పలుప్రాంతాల్లో కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు జాతీయపార్టీలు ఏడు దశాబ్దాలుగా పాలించినా.. ఇప్పటికీ దేశంలో ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టున్నదని చెప్పారు. దీనికి కారణం ఏంటి? అభివృద్ధిలో దేశం ఎందుకు వెనుకబడి ఉన్నది? అని ప్రశ్నించారు. ఐదేండ్లలో దేశానికి ఏమి చేశామో చెప్పుకోలేని దుస్థితిలో ప్రధాని మోదీ, ఐదేండ్లలో ఏం చేస్తామో చెప్పలేని దుస్థితిలో రాహుల్ ఉన్నారన్న కేటీఆర్.. వీళ్లా మనల్ని ఉద్ధరించేది? అని ప్రశ్నించారు.

ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్
తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, 900 రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యార్థులకు సన్నబియ్యం, ఆసరా పింఛన్లు, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం గా సీఎం కేసీఆర్ పనిచేశారని కేటీఆర్ చెప్పా రు. ఇద్దరు ఎంపీలతోనే రాష్ర్టాన్ని తీసుకువచ్చిన మొనగాడు సీఎం కేసీఆర్ అని, ఆదే పదహారుమంది ఎంపీలతో కేసీఆర్ ఏం చేస్తారో తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతదో సీఎంకు తెలుసునని చెప్పారు. ఢిల్లీలో చాలామంది కాంగ్రెస్, బీజేపీ అంటే ఇష్టంలేని పార్టీలు సీఎం కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నాయని, మనం గెలిపించే పదహారుమంది టీఆర్‌ఎస్ ఎంపీలకు తోడుగా మరో 140 మంది ఎంపీలు జత కలుస్తారని చెప్పారు. ఈ పరిస్థితిలో రేపటి రోజున యాచించడం కాదు మనమే ఢిల్లీని శాసించవచ్చన్నారు.

ఓటువేసే ముందు ఆలోచించాలి
ప్రస్తుతం దేశం ఏ రకంగా నడువాలి? దేశం ఎటువైపు పోవాలి? ఎవరు ఈ దేశాన్ని సమర్థవంతంగా నడుపుతారు? తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి హక్కులు, నిధులు, ప్రాజెక్టులకు నిధులు ఎట్ల వస్తాయి? అనే అంశాలను ఆలోచించి, కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటువేయాలని కేటీఆర్ కోరారు. టికెట్ కావాలన్నా, బీ-ఫాం కావాలన్నా ఢిల్లీకి వెళ్లే బీజేపీ, కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ గులాంలేనన్నారు.

ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలె
ఐదేండ్ల కిందట రాష్ట్ర ఏర్పడిన వారం రోజుల్లోనే మనకు కనీసం మాటమాత్రంగానైనా చెప్పాలనే సంస్కారం లేకుండా నరేంద్రమోదీ ప్రభుత్వం ఖమ్మంజిల్లాలోని ఏడు మండలాలను, విద్యుత్ ప్రాజెక్టును రాత్రికి రాత్రే ఆంధ్రాలో కలిపిందని కేటీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు ఎంపీల సంఖ్యాబలం, ఒత్తిడితో మోదీ తలొగ్గారని వివరించారు. కేంద్రంలో కర్ర ఉన్నోడిదే పెత్తనమని, రైల్వే మంత్రులుగా ఎవరున్నా.. కొత్త రైళ్లు వాళ్ల రాష్ర్టానికే వెళుతాయని చెప్పారు. తొలిసారి ప్రవేశపెట్టిన బుల్లెట్ రైలు కూడా నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు తీసుకువెళ్లారన్నారు. ఏపీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న ఆశోక్‌గజపతిరాజు తమ రాష్ర్టానికి కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు తెచ్చుకున్నారని, అక్కడ కూడా వాళ్ల మాటే నెగ్గిందని చెప్పారు. ఎవరి దగ్గర ఎంపీల సంఖ్యాబలం ఉంటే వాళ్ల మాట నెగ్గుతదని అన్నారు. ఎట్టికైనా, మట్టికైనా మనవాళ్లే ఉండాలన్న కేటీఆర్.. తెలంగాణ ప్రజల ఇంటిపార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆఖండ మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.

తెలంగాణ కోసం బీజేపీ చేసిందేమీ లేదు
తెలంగాణ కోసం కేంద్రం ప్రత్యేకంగా ఏమిచేసిందో చెప్పాలని రాష్ట్ర బీజేపీ నేతలను కేటీఆర్ ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కోసం రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేసినా ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. ఎన్నికలప్పుడే బీజేపీకి దేవుడు గుర్తుకొస్తాడని మండిపడ్డారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి 40 మంది సైనికులను చంపుతుంటే చౌకీదార్ ఏంచేశాడని ప్రశ్నించారు. మతాల పేరిట చిచ్చుపెట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 80 మంది ఉండే మంత్రివర్గంలో తెలంగాణ బిడ్డకు అవకాశం ఇవ్వని మోదీకి మనం ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. నల్లధనం తెచ్చి, పేదల ఖాతాలో జమచేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయి? ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలెక్కడ? అని నిలదీశారు.

గ్రేటర్‌లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు
మూడునెలల క్రితం ప్రజలు తిరస్కరించిన బీజేపీ, కాంగ్రెస్ చింతచచ్చినా పులుపుచావదు అన్నట్టుగా మళ్లీ వస్తున్నాయని కేటీఆర్ ఎద్దేవాచేశారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యిందన్నారు. ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీగా సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ పరిస్థితి ఉన్నదన్నారు. సింగూరు ఎండిపోవడం వల్లే తాగునీటికి ఇబ్బందులు వచ్చాయని, శేరిలింగంపల్లిలో త్వరలోనే మళ్లీ సమృద్ధిగా నీటిసరఫరా జరుగుతుందని వివరించారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లు కడుతున్నామని, రాబోయే 6-9 నెలల్లో అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ప్రజల కనీస అవసరాలు తీర్చడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, టీఆర్‌ఎస్ నాయకుడు పాటిమీది జగన్మోహన్‌రావు, వాసుదేవరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

నేడు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ రోడ్‌షో
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటలకు మూసాపేట,7 గంటలకు బాలానగర్, శోభనసెంటర్ వద్ద కేటీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరిగుట్టలో కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొని ప్రజలు, శ్రేణులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రోడ్‌షో విజయవంతం చేసేందుకు మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యేలు వివేక్, మాధవరం కృష్ణారావు, యువజన విభాగం నాయకుడు పాటిమీది జగన్మోహన్‌రావు, కార్పొరేటర్లు రోడ్‌షో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.