Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతులు నిబ్బరంగా ఉండాలి

-అన్ని విధాలా ఆదుకుంటాం -రైతు సంక్షేమానికి రూ.2లక్షల కోట్లు వెచ్చిస్తాం -మూడు జిల్లాల్లో మిషన్ కాకతీయ ఫలాలు -ఆదిలాబాద్ జిల్లాలో 12లక్షల ఎకరాలకు నీరిస్తాం -విద్యుత్‌కు రూ.91వేల కోట్లు,ప్రాజెక్టులకు రూ.1.09లక్షల కోట్లు -రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

రాష్ట్రంలో రైతులు మనో నిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయానా రైతు అని, రైతుల కష్టం సుఖం ఆయనకు పూర్తిగా తెలుసునని అన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే సోయాకు సబ్సిడీ ఇవ్వాలని ఆనాడు అధికారులను ఆదేశించారని ఆయన గుర్తుచేశారు. అంతకుముందు సోయా విత్తనాలను కొనుగోలు చేశాక రైతుల ఖాతాల్లో రాయితీ వేసేపద్దతి ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో ముందుగానే సబ్సిడీతో విత్తనాలను అందించామని వివరించారు. రైతు సంక్షేమానికి రానున్న మూడేండ్లలో రూ.2లక్షల కోట్లు వెచ్చించి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రైతాంగానికి 9గంటల పాటు విద్యుత్తు సరఫరా కోసం రూ.91వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.1.09లక్షలకోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

Irrigation-Minister-T-Harish-Rao-and-Housing-Minister-Indrakaran-Reddy-paid-floural-tributes-to-Chakala-Ailamma

వచ్చే ఖరీఫ్‌నుంచి 9 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు నీరందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను కశ్మీర్‌లాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. లోయర్ పెన్‌గంగ నదిపై రూ.300కోట్లతో మూడు బ్యారేజిలను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. గురువారం ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. రోజంతా ఊపిరి సలుపని రీతిలో సాగిన ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.బోథ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పెన్‌గంగ, కుప్టి ప్రాజెక్టుల నిర్మాణ స్థలాలు పరిశీలించారు. సాగునీటి పారుదల శాఖపై అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

టీడీపీ, బీజేపీలకు హక్కులేదు.. రైతు ఆత్మహత్యల మీద మాట్లాడే హక్కు టీడీపీ, బీజేపీలకు లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నకాలంలో ఎక్స్‌గ్రేషియా ఇస్తే మరిన్ని ఆత్మహత్యలు జరుగుతాయని టీడీపీ వాదిస్తే బీజేపీ నాయకులు తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులపై మొసలికన్నీళ్లు కార్చేబదులుగా తమ హయాంలో ప్రాజెక్టులను పూర్తిచేసి, చెరువులను పట్టించుకొని ఉంటే బాగుండేదని అన్నారు. వాళ్లు కరెంటు, సాగునీరు ఇచ్చి ఉంటే ఈ రోజు రైతు పరిస్థితి దిగజారి ఉండేది కాదని అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన కరెంటు,సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నదని చెప్పారు. 50 ఏండ్లుగా టీడీపీ కాంగ్రెస్ చేసిన పాపాల వల్ల వచ్చిన సమస్యలు కొద్దికాలం తప్పవని పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మోటార్లు కాలడం లేదు.. ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం లేదు. విద్యుత్ ఆరేడు గంటలపాటు రైతులకు వస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో గత ఐదేండ్లు జిల్లాకు మంత్రి లేడని, కేసీఆర్ మాత్రం ఇద్దరు అద్భుతమైన మంత్రులను పెట్టారని చెప్పారు.

మూడు జిల్లాల్లో మిషన్ కాకతీయ సక్సెస్ రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు బాగా కురియటంతో మిషన్ కాకతీయ విజయవంతమైందని.. చెరువుల్లో బాగా నీరు చేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మిగతా జిల్లాల్లో ఆశించినంత వర్షాలు కురియలేదన్నారు. అపారమైన జలవనరులు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో రానున్న మూడేండ్లలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంతో గతంలో 51వేల ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం 1,56,500ఎకరాలకు నీరందించబోతున్నామని చెప్పారు.

సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు.. పత్తికి రూ. 4100 మద్ధతు ధర కల్పిస్తూ సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఇంజినీరింగ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింప చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు చదివితే వీరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించేవి కావని గుర్తు చేశారు. ఉట్నూర్‌లో మోడల్ పాల్‌టెక్నిక్ రెసిడెన్షియల్‌ను ప్రారంభించనున్నామన్నారు. నదీజలాలను సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన నీటి సామర్థ్య పరిశీలన కేంద్రం (సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్) కార్యాలయాన్ని నిర్మల్ ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తానని హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలో ఇరిగేషన్ శాఖలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులను వెంటనే భర్తీ చేస్తామన్నారు.

పాలకుర్తి మార్కెట్ యార్డుకు అయిలమ్మ పేరు.. చాకలి అయిలమ్మ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ ముందు ఉన్న అయిలమ్మ విగ్రహానికి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాకలి అయిలమ్మ మహిళల పౌరుషానికి, పోరాటాలకు ప్రతీకగా అభివర్ణించారు. పెత్తందార్ల సైన్యాలను కొడవలితో ఎదుర్కున్న ధీరవనితగా అయిలమ్మ చరిత్రకెక్కారని అంటూ ప్రస్తుతం కళాశాలల్లో ఎదురవుతున్న ర్యాగింగ్ సంఘటనలను అయిలమ్మ స్ఫూర్తితో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలో చాకలి అయిలమ్మకు గుర్తింపు లేకుండా చేశారని.. తెలంగాణ రాష్ట్రంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు, భావితరాలకు తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో చరిత్ర చేర్చామన్నారు. ఆమె స్వస్థలమైన పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డును చాకలి అయిలమ్మ మార్కెట్ యార్డుగా మార్చుతామని, హైదరాబాద్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బీసీలకు 80శాతం సబ్సిడీపై రుణాలు: మంత్రి జోగు రామన్న త్వరలోనే వెనుకబడిన తరగతుల వారికి 80 శాతం సబ్సిడీపై రుణాలు అందించనున్నామని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న తెలిపారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు సబ్సిడీపై రుణాలు అందించాలని సీఎం కేసీఆర్ దృఢసంకల్పంతో ఉన్నారన్నారు. గత ప్రభుత్వాలు బీసీల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని కనీసం బీసీ గణన చేయలేదని దుయ్యబట్టారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు సముచిత న్యాయం చేస్తామని, గ్రామాల్లో ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు పెంచుతామన్నారు.

నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు: గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంలో త్వరలోనే నియోజక వర్గానికి వెయ్యి ఇండ్లు కేటాయిస్తామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తొలి విడత 400ఇండ్లు కేటాయించామని.. రూ.5.04లక్షల వ్యయంతో ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. కుంటాల, పొచ్చెర, కుప్టి ప్రాజెక్టులకు పర్యాటక ప్రాంతాలుగా మార్చే విషయంపై ముఖ్యమంత్రికి విన్నవిస్తామన్నారు. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కల్పనకు పెట్టుబడులు పెట్టేలా సీఎం చైనాలో పర్యటిస్తున్నారన్నారు. వచ్చే రెండు నెలల్లో ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలిపారు.

16 గంటల పాటు పర్యటన మూడు నియోజకవర్గాలు.. 16 గంటల పర్యటన.. అర్ధరాత్రి వరకు సమీక్షలు. ప్రాజెక్టు స్థలాల సందర్శనకు కిలోమీటర్ల కొద్దీ రాళ్లు.. రప్పలు దాటుకుంటూ ప్రయాణం. ఇదీ ఆదిలాబాద్ జిల్లాలో నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం నాటి పర్యటన తీరు. బుధవారం రాత్రి 12.50 గంటలకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనానికి చేరుకున్న ఆయన ఉదయం 6.30కు లేచి 7.15కే పర్యటన ప్రారంభించారు. 7.15కు నిర్మల్ కూరగాయల మార్కెట్‌ను తనిఖీ చేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంట్లో అల్పాహారం చేసి 8.30 నుంచి రాత్రి 11 గంటల వరకు సుమారు 15 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మల్ నుంచి ప్రారంభమై బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల మీదుగా మహారాష్ట్ర ప్రాంతంవరకూ పర్యటన సాగింది. ఈ పర్యటనలో ఆదిలాబాద్ సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి వచ్చే పెన్‌గంగపై శెనక, కోర్ట వద్ద నిర్మించే బ్యారేజీ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. కాలినడకన రాళ్లు.. రప్పలు ఉన్న వాగులో సుమారు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లారు. ఆయనకు మహారాష్ట్ర ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. రోజంతా క్షేత్రపర్యటనలో ఉన్న మంత్రి రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.