Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ గుండె చప్పుడు.. TRS 20 ఏండ్ల ప్రస్థానంలో కీలక మైలురాళ్లు

-నాడు గుప్పెడు మందితో ఉద్యమం.. నేడు కోట్ల మందికి గుండె చప్పుడు..
-ఒక్కడి సారథ్యంలో సాగిన పోరు.. అనేక త్యాగాలతో దక్కిన ఫలితం.. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర సాధన
-అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ.. సాధన దిశగా వేగంగా పయనం

ఇరవై ఏండ్ల క్రితం టీఆర్‌ఎస్‌.. ఒక ఉప ప్రాంతీయ పార్టీగా కొందరు గేలి చేసిన రాజకీయ వేదిక! ఇరవై ఏండ్ల తర్వాత.. దేశ రాజకీయాల్లోనే ప్రత్యేక స్థానం పొంది.. ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన అరుదైన గౌరవం పొందిన రాజకీయ శక్తి! అస్తిత్వ ఉద్యమాల ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు! త్యాగాలకు తెగించి సాధించుకున్న రాష్ట్రాన్ని.. సబ్బండ వర్ణాల సంక్షేమానికి, ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలను సాఫల్యం చేస్తున్న ప్రభుత్వ రథసారథి! 20 ఏండ్ల క్రితం జలదృశ్యంలో పురుడుపోసుకున్న ఉద్యమం అనేక ఆటుపోట్లను చవిచూసింది. ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారీ ఫీనిక్స్‌ పక్షిలా మళ్లీ లేచి.. అస్తిత్వ ప్రకటనచేసింది. తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమాలు సాగించి.. పోరుపంటలు పండించి.. రాష్ర్టా సాధన స్వప్నాన్ని సాకారం చేసింది. రాష్ట్రంగా అవతరించిన నాటినుంచీ బంగారు తెలంగాణ కోసం కృషిచేస్తున్న టీఆర్‌ఎస్‌ 20 ఏండ్ల ప్రస్థానంలో కీలక మైలురాళ్లు…

2001 జలదృశ్యం నుంచి జనదృశ్యంలోకి
తెలంగాణ అవకాశవాదంగా మారిపోయిన వేళ.. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరడం మిథ్యగా భావిస్తున్న తరుణాన.. ఒక శక్తి ముందుకొచ్చింది. ఉప సభాపతి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాచేసిన కేసీఆర్‌.. కొత్త పార్టీ ప్రకటించారు. ప్రస్తుతం ట్యాంక్‌బండ్‌ సమీపంలో అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మిస్తున్న ప్రాంతంలోనే అప్పటి జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట సమితికి అంకురార్పణచేశారు. మే 17న సింహగర్జన పేరిట కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ. న భూతో న భవిష్యత్‌ అన్నట్టు లక్షల్లో తెలంగాణవాదుల హాజరు. వరుసగా మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌ సభలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ. రెండు జెడ్పీ చైర్మన్‌లు, 100 ఎంపీటీసీలు, 85 జెడ్పీటీసీలు, 3వేల సర్పంచ్‌లు, 12 వేల వార్డుల్లో విజయం. అదే ఏడాది కేసీఆర్‌ రాజీనామాతో ఏర్పడ్డ సిద్దిపేట శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక.. కేసీఆర్‌ ఘన విజయం. తెలంగాణ వస్తుందన్న నమ్మకానికి ఇవి తొలి పునాదులు.

2002 పల్లెబాట.. స్ఫూర్తిదాత
2002 మార్చి 27న వికారాబాద్‌ శంఖారావం సభ నిర్వహించారు. ఏప్రిల్‌ 14న వరంగల్‌లో కేసీఆర్‌ పర్యటించారు. ఓ గిరిజన తండాలో ఇల్లు కాలిపోయి.. బిడ్డ పెండ్లికి దాచుకున్న డబ్బు తగలబడిపోయిందని ఆవేదన చెందుతున్న ఓ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్‌ మదిలో నాడు మెదిలిన ఆలోచనే నేడు అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు. మే 22 న చేనేత కార్మికుల కోసం భిక్షాటన ప్రారంభించారు. భూదాన్‌ పోచంపల్లి నుంచి బయలుదేరి.. రాష్ట్రమంతటా పర్యటించారు. పల్లెబాట చేపట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ పడింది అప్పుడే.

2003 యాత్రలు.. జైత్రయాత్రలు..
నాగార్జునసాగర్‌ నుంచి తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా కోసం కేసీఆర్‌ జలసాధన ఆందోళన చేపట్టారు. కోదాడ నుంచి హాలియాకు పాదయాత్ర నిర్వహించారు. ఆర్డీఎస్‌పై ప్రధాని, రాష్ట్రపతులకు ఫిర్యాదుచేశారు. మేలో అలంపూర్‌ నుంచి గద్వాల వరకు కేసీఆర్‌ పాదయాత్ర చేపట్టారు. మరో అపురూప ఘట్టం ఢిల్లీకి కారు ర్యాలీ. ఈ ర్యాలీలో కేసీఆర్‌ స్వయంగా కారు నడిపారు. సికింద్రాబాద్‌లో జరిగిన తెలంగాణ గర్జన చిరస్మరణీయం. సిద్దిపేట నుంచి వరంగల్‌కు సైకిల్‌ ర్యాలీ అపూర్వం. 15 లక్షల మందితో వరంగల్‌లో ఏప్రిల్‌ 27న నిర్వహించిన సభ ప్రపంచ మీడియాను ఆకర్షించింది. నాగర్‌కర్నూలు నగరా, సింగూరు సింహగర్జన, పాలమూరు సింహగర్జన, ఇందూరు సింహగర్జన, ఓరుగల్లు వీరగర్జన, కరీంనగర్‌, సిరిసిల్లల్లో బహిరంగసభలు ఉద్యమజ్వాలను రగిలించాయి.

2004 రాష్ట్రపతి ప్రసంగంలో..
2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని 26 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలిచింది. కేసీఆర్‌ సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. యూపీఏ ఆహ్వానంతో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ చేరింది. తనకు పోర్టుఫోలియో అక్కర్లేదని, తెలంగాణ ఇస్తే చాలని.. ఇచ్చిన షిప్పింగ్‌ మినిస్ట్రీని కేసీఆర్‌ వదులుకున్నారు. కేసీఆర్‌ ఒత్తిడితో యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణపై స్పష్టమైన హామీ వచ్చింది. రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ ఉండేలా చేశారు.

2005 కాంగ్రెస్‌ కుట్ర..
తెలంగాణకు అనుకూలంగా కేంద్రం చర్యలు తీసుకొనేలా టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. 2005 జనవరిలో ప్రణబ్‌ కమిటీ ఏర్పాటైంది. అదే సమయంలో రాష్ట్రంలో నాటి సీఎం వైఎస్‌.. కుట్రలకు పదును పెట్టారు. టీఆర్‌ఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది. కాంగ్రెస్‌ కుట్రలకు నిరసనగా అప్పటి క్యాబినెట్‌లోని టీఆర్‌ఎస్‌ మంత్రులు తమ పదవులను వదిలేశారు.

2006 – చిరస్మరణీయ ఏడాది 2006 టీఆర్‌ఎస్‌ చరిత్రలో కీలకమైన ఏడాది. పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్‌ తెలంగాణపై చర్చించారు. హైదరాబాద్‌ నడి బొడ్డున తెలంగాణ భవన్‌ నిర్మాణమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలిగింది. కేసీఆర్‌ తన కరీంనగర్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. సిద్దిపేటలో సమర శంఖారావం పేరుతో నాలుగు లక్షల మందితో సభ నిర్వహించి కాంగ్రెస్‌తో పూర్తిస్థాయిలో తెగదెంపులు చేసుకున్నట్టు ప్రకటించారు. కరీంనగర్‌ ఉప ఎన్నికలో కేసీఆర్‌ను 2 లక్షల మెజార్టీతో గెలిపించి తెలంగాణ జాతి విశ్వాసాన్ని ప్రకటించింది.

2007 కొలువైన తెలంగాణ తల్లి
మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా దిలీప్‌కుమార్‌, ఆర్‌ సత్యనారాయణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యే కోటాలో హెచ్‌ఏ రహ్మన్‌ గెలిచారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఉనికి చాటింది. నల్లగొండలో ఫ్లోరైడ్‌ భూతంపైనా కేసీఆర్‌ యుద్ధం ప్రకటించారు. ఏప్రిల్‌ 27న వరంగల్‌లో తెలంగాణ విశ్వరూప మహాసభ నిర్వహించారు. హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతి ఊర్లో కొలువుదీరాయి.

2008 ఎదురుదెబ్బలు.. మొక్కవోని దీక్ష
2008లో కేసీఆర్‌ తాను రాజీనామా చేయడంతోపాటు ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 16 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. కానీ.. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కేసీఆర్‌, వినోద్‌కుమార్‌ మాత్రమే గెలుపొందారు. కేసీఆర్‌ వెనక్కు తగ్గలేదు. పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధంచేసే పనిలో మళ్లీ తలమునకలయ్యారు. తెలంగాణ ఏర్పాటుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. 50కి పైగా పార్టీల మద్దతు లేఖలు సంపాదించారు.

2009 సువర్ణాధ్యాయం
తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2009 అత్యంత కీలకమైంది. ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎంలతో కూడిన మహాకూటమితో టీఆర్‌ఎస్‌ పొత్తుపెట్టుకున్నది. టీడీపీ వెన్నుపోటు రాజకీయంతో టీఆర్‌ఎస్‌.. 16 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలతో సరిపెట్టుకొన్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆనాటి సమైక్య ప్రభుత్వం హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించింది. దీనిపై కేసీఆర్‌ ఉద్యమం మొదలుపెట్టారు. అక్టోబర్‌ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన నిర్వహించారు. ఉద్యోగ సంఘాలన్నీ కేసీఆర్‌తో జట్టుకట్టాయి. నవంబర్‌ 29 నుంచి అమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. దీనికోసం కరీంనగర్‌ నుంచి సిద్దిపేట దీక్షాస్థలికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఇక ఇక్కడి నుంచి ఉద్యమం పతాకస్థాయికి వెళ్లింది. నిమ్స్‌లో నిరాహార దీక్షను కొనసాగించిన కేసీఆర్‌.. మృత్యుముఖం దాకా వెళ్లారు. కేంద్రం ప్రకటన చేయకతప్పని పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలకమైన డిసెంబర్‌ 9 ప్రకటన వెలువడింది. అప్పటికప్పడే కుట్రలకు తెరలేపిన సమైక్య నాయకులు.. రాజీనామాల నాటకం మొదలుపెట్టారు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైంది.

2010 సెగ రేపిన ఉద్యమాలు
చావునోట్లో తలపెట్టి కేసీఆర్‌ సాధించిన డిసెంబర్‌ 9 ప్రకటనపై ఆంధ్ర నాయకత్వం కుట్రలు చేస్తే.. ఉధృత ఉద్యమాలతో టీఆర్‌ఎస్‌ సెగరేపింది. కాలయాపన చేసేందుకు కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమిస్తే.. దాని ముందుకూ హాజరైన కేసీఆర్‌.. రాష్ట్ర ఏర్పాటుపై ప్రజల, పార్టీ వైఖరిని విస్పష్టంగా చెప్పారు. ఈ సమయంలో తెలంగాణలో ఉద్యమం ఉధృతమైంది. కేసీఆర్‌ అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ సంఘాలతో ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ)ని ఏర్పాటు చేశారు. జేఏసీ పిలుపుతో జాతీయ రహదారుల దిగ్బంధం, మానవహారం, వంటావార్పు వంటి కార్యక్రమాలు నడిచాయి. పాలమూరు పొలికేక, తెలంగాణ పొలికేక, ఉస్మానియా విద్యార్థుల గర్జన పేరుతో విద్యార్థి జేఏసీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఉస్మానియా రణరంగమైంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల వద్ద లాయర్లు ఆందోళనలు చేశారు. తెలంగాణ ఏర్పాటు కోరుతూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. డిసెంబర్‌ 16న వరంగల్‌లో 20 లక్షల మందితో జరిగిన తెలంగాణ మహాగర్జన.. తెలంగాణ వచ్చే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పింది.

2011 ఉద్యమానికి సొంత గొంతుకలు
2011లో ఉద్యమాన్ని అనేక రూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఫిబ్రవరిలో చేపట్టిన 48 గంటల తెలంగాణ బంద్‌ అపూర్వంగా విజయవంతమైంది. మార్చి ఒకటిన రైల్‌ రోకో చేపట్టింది. చరిత్రలో నిలిచిపోయేలా ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ నిర్వహించింది. అప్పటికే తెలంగాణ ప్రజల కోసం సొంత న్యూస్‌చానల్‌ ఉండాలన్న లక్ష్యంతో రాజ్‌న్యూస్‌ (ప్రస్తుత టీన్యూస్‌)ను టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది. 2011లో నమస్తే తెలంగాణ పత్రిక ఆవిర్భవించింది. జైబోలో తెలంగాణ పేరుతో వచ్చిన సినిమా జనం నాడిని చూపింది. తెలంగాణ ఆకాంక్షలను ప్రజలు వ్యక్తపరుస్తున్న తీరుతో కాంగ్రెస్‌, టీడీపీ బేజారయ్యాయి. ఆ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ సారు జూన్‌ 21న మరణించడం ఒక పెద్ద లోటు. సెప్టెంబర్‌లో నిర్వహించిన సకల జనుల సమ్మె చరిత్రను తిరగరాసింది. సబ్బండ వర్ణాలూ ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఇదో రికార్డు.

2012 ఢిల్లీకి పెరిగిన సెగ
2012 మొత్తం ఒకవైపు తెలంగాణలో ఉద్యమాన్ని నడుపుతూనే మరోవైపు ఢిల్లీలో తెలంగాణకు మద్దతు కూడగట్టే పని జరిగింది. సాగరహారం పేరుతో నెక్లెస్‌ రోడ్డులో జేఏసీ నిర్వహించిన అతిపెద్ద సభ తెలంగాణ ఆకాంక్షను దిగంతాలకు చాటింది. సాగరహారా సక్సెస్‌ చేసింది. కేసీఆర్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపారు. తెలంగాణలో ప్రతి ఎన్నికలోను టీఆర్‌ఎస్‌నే విజయం వరించింది. సింగరేణిలో గుర్తింపు సంఘం హోదాను టీఆర్‌ఎస్‌ దక్కించుకొన్నది. ఆర్టీసీలో సైతం టీఎంఎస్‌ గెలిచింది. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచింది. ఒక వెల్లువలా టీఆర్‌ఎస్‌లో చేరికలు మొదలయ్యాయి.

2013 విజయతీరంలో తెలంగాణ
కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారుపై టీఆర్‌ఎస్‌ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానంపై జరిగిన చర్చలు.. తెలంగాణ ప్రజలు ఎటు ఉండాలో నిర్దేశించాయి. పార్లమెంటులో కేసీఆర్‌ నిరసన కొనసాగించారు. రాయల తెలంగాణ అని, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అని కేంద్రం లీకులు ఇచ్చింది. మొదటికే మోసం వస్తుందని గ్రహించిన టీఆర్‌ఎస్‌.. పది జిల్లాల తెలంగాణే కావాలంటూ ప్రజలను ఏకం చేసింది.

2014 పుష్పించిన తెలంగాణ
2014 తొలి నుంచే తెలంగాణ రావడం ఖాయమైంది. అప్పటికీ కొందరు బడా పెట్టుబడిదారులు, ఆంధ్రా ఆధిపత్య మీడియా, పెత్తందారి నాయకులు ఆఖరు నిమిషంలోనైనా తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. తెలంగాణ సంకల్పం ముందు అవన్నీ ఓడిపోయాయి. 60 ఏండ్ల తెలంగాణ కల సాకారమైంది. 2014 జూన్‌ 2 అపాయింటెడ్‌ డేగా ప్రకటించారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. అందరు కోరుకున్నట్టుగానే తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్‌ ప్రమాణం స్వీకరించారు.

2015 చీకటి నుంచి వెలుగుల్లోకి..
తెలంగాణ సాధన ఫలితాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తొలిగా విద్యుత్‌రంగ సంస్కరణలకు తెరతీశారు. తెలంగాణ వస్తే చీకట్లు తప్పవన్న వాదనలను పటాపంచలు చేస్తూ.. ఒక్క ఏడాదిలోనే వెలుగుల తెలంగాణను ఆవిష్కరించి, విమర్శకుల నోళ్లు మూయించారు. తెలంగాణలో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చన్న నమ్మకం కలిగించారు. పాలనను కొత్త పుంతలు తొక్కించారు. అప్పటికీ కుట్రలు ఆగలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. కానీ.. అది బెడిసికొట్టింది. టీఆర్‌ఎస్‌ను మాయం చేయాలనుకున్న టీడీపీ.. తెలంగాణలో మాయమైపోయింది.

2016 కాళేశ్వర శకం మొదలు
తెలంగాణ వస్తే కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామన్న కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి ్టసారించారు. పెద్ద ఎత్తున మేధోమథనం చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్‌ చేశారు. అంతర్రాష్ట్ర అనుమతులన్నీ సాధించడంతో నిర్మాణంలో వేగం పెరిగింది. అదే సమయంలో తెలంగాణ అనేక కొత్త పథకాలకు నాంది పలికింది. మిషన్‌ కాకతీయతో పంట పొలాలకు నీళ్లు అందించే బృహత్తర కార్యక్రమం ఫలితాలు ఇవ్వడం మొదలయ్యింది.

2017 పాలనతో ప్రజల వద్దకు…
పాలనతో ప్రభుత్వం ప్రజల వద్దకు చేరుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించి నామినేటెడ్‌ పదవులతో గౌరవించారు. పార్టీ ప్రారంభించిన కార్యకర్తల బీమా పథకం లబ్ధిదారులకు సహాయం అందించడం మొదలయ్యింది.

2018 ముందస్తు ఎన్నికలు.. విజయ దుందుభి
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. 88 స్థానాలను గెలిచి టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా అవతరించింది.

2019 పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌
కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించడం పార్టీలో కీలకమైన మలుపు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న కేటీఆర్‌.. యూత్‌ ఐకాన్‌గా నిలిచారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం, పార్టీ కమిటీలు, సభ్యత్వ నమోదు జోరందుకున్నాయి.

2020 కరోనా కాలంలో అండగా..
ప్రపంచాన్ని కుదిపివేస్తున్న కరోనా సమయంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రజలకు అండగా ఉంటున్నారు. కరోనా పేషెంట్లకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చడంతోపాటు పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వలస కార్మికుల పట్ల మానవీయకోణంలో స్పందించారు. అనేక మందికి సహాయం అందిస్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.