-తాగునీటికి ప్రథమ ప్రాధాన్యం
-25 ఏండ్లలో జరుగని పనులు
-మూడేండ్లలో చేసి చూపించాం
-44 మార్కెట్లలో ఈ-నామ్ అమలు
-అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి
తెలంగాణ రాష్ర్టానికి మిడ్‌మానేరు ప్రాజెక్టు గుండెకాయలాంటిదని శాసనసభ వ్యవహారాలు, భారీ సాగునీటిపారుదలశాఖల మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. మిడ్‌మానేరు ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 18 మండలాలకు తాగునీరు అందుతుందని వివరించారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మిడ్‌మానేరు ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్ సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో తాగునీటికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. వచ్చే డిసెంబర్ నుంచి మిడ్‌మానేరు ద్వారా 466 గ్రామాలకు తాగునీరు, మానకొండూరు నియోజకవర్గంలోని 48,731 ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలిపారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులు పుణ్యస్నానం చేసేందుకుగాను వేములవాడ గుడిచెరువుకు నీరు మళ్లిస్తామని పేర్కొన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయనేందుకు మిడ్‌మానేరు ఒక ఉదాహరణ అని మంత్రి గుర్తుచేశారు. 1993-2006 మధ్య మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని విమర్శించారు. 25 ఏండ్లలో జరుగని పనులను మూడేండ్లలో చేసి చూపించామని తెలిపారు. ప్లానింగ్‌లో లోపం ఉండటం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిందని ఆయన అన్నారు. మిడ్‌మానేరు పనులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు మంత్రి హరీశ్ వివరించారు. రూ. 461కోట్ల పనులతో 10 టీఎంసీల నీటి నిల్వకోసం రూపొందించిన మిడ్‌మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీల నీటి నిల్వ ఉన్నదని పేర్కొన్నారు.
44మార్కెట్లలో ఈ-నామ్ సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ.. ప్రస్తుతం 44 వ్యవసాయ మార్కెట్లలో ఈ-నామ్ అమలు జరుగుతున్నదని, మరో 14 మార్కెట్లలో త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈ విధానాన్ని అందరికీ ఆదర్శంగా ఉండేలా పూర్తిస్థాయిలో అమలు చేశామని, ఈ మార్కెట్లో ఈ-నామ్ అమలు తీరును తెలుసుకునేందుకు ఇతర రాష్ర్టాలవారు వచ్చారని వివరించారు. సర్వర్ వేగం తక్కువగా ఉండటం వల్లే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఈ-నామ్ అమలు కావడం లేదన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.