Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ కాపలాదారులం

-ఎవరూ బద్దలుకొట్టలేని కంచుకోట టీఆర్‌ఎస్‌
-యావన్మంది తెలంగాణ ప్రజల ఆస్త్తి
-ఇది ఒక వ్యక్తికో.. శక్తికో సొంతం కాదు
-ప్రజల గుండెల్లోంచి ఎగిసిపడ్డ గులాబి
-దిక్కులేని స్థితి నుంచి దేశానికే దిక్కైనం
-విద్యుత్తు కోతలతో దేశమంతా చీకట్లు
-మణి దీపంలా వెలుగుతున్న తెలంగాణ
-అవార్డులు లేని ప్రభుత్వ విభాగం లేదు
-కాళేశ్వరాన్ని మించినది దేశంలోనే లేదు
-మన పనితనానికి, పాలనకు ఇవే గీటురాళ్లు
-పారదర్శక పాలనకు మనం రోల్‌మాడల్‌
-టీఆర్‌ఎస్‌ ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌
-ఘనంగా టీఆర్‌ఎస్‌ 21 ఏండ్ల ప్లీనరీ

తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పార్టీ కాపలాదారుగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఒకప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఎవరూ దిక్కులేని పరిస్థితి నుంచి తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా ఎదిగిందన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించే పార్టీ టీఆర్‌ఎస్‌ అని.. ఇది ఏ వ్యక్తిదో.. శక్తిదో కాదని.. తెలంగాణ ప్రజల ఆస్తి అని ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రసమితి 21వ ప్లీనరీ సమావేశం బుధవారం హైటెక్స్‌లో ఉత్సాహ భరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల అధ్యక్షులు.. ఇతర ప్రజాప్రతినిధులు దాదాపు మూడు వేలమంది ఈ సభకు హాజరయ్యారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనకోసం.. తర్వాత అభివృద్ధికోసం 21 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, పార్టీ సాధించిన విజయాలు, టీఆర్‌ఎస్‌ నేతల కృషి గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిస్థితులు, స్థితిగతులు, మారాల్సిన ఆవశ్యకత.. అందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణకు పెట్టని కోట టీఆర్‌ఎస్‌
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతోపాటు సాధించుకొన్న రాష్ర్టాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న సమర సైనికుల, కాపలాదారుల పార్టీ టీఆర్‌ఎస్‌ అని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌ తెలంగాణకు ఎవరూ బద్దలు కొట్టలేని పెట్టని కంచుకోట అని స్పష్టంచేశారు. నిండైన, మెండైన శక్తితో అనుక్షణం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పరిరక్షించే కాపలాదారులమని పేర్కొన్నారు. రాష్ట్ర అస్తిత్వమే ఆగమైన పరిస్థితిలో తెలంగాణ ప్రజల గుండెల్లోంచి తెలంగాణ పతాకం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తుచేశారు. 80 శాతంమంది ప్రజాప్రతినిధులతో, 60 లక్షల మంది పార్టీ సభ్యులతో, సుమారు రూ.1000 కోట్ల ఆస్తులు కలిగి తెలంగాణకు శ్రీరామరక్షగా మిగిలిపోయే రాజకీయపార్టీ టీఆర్‌ఎస్‌ అని, రాష్ర్టాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్న సమర సైనికుల, కాపలాదారుల పార్టీ అని చెప్పారు. రాష్ట్ర సాధన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల ఆశీర్వాద బలంతో తెలంగాణను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిందని సంతోషం వ్యక్తంచేశారు. అనేక రంగాల్లో కేంద్రం మన రాష్ర్టానికి ఇస్తున్న అవార్డులు, రివార్టులే తమ పనితీరుకు నిదర్శనమన్నారు. ఒకనాడు ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియని పరిస్థితుల్లో స్వర్గీయ కొండాలక్ష్మణ్‌ బాపూజీ నివాసంలో పురుడుపోసుకొన్న టీఆర్‌ఎస్‌కు కనీసం కార్యాలయం లేదని.. ఈ రోజు సగర్వంగా, సమున్నతంగా దేశ రాజధానిలో ఎన్నిమిదిన్నర కోట్లతో స్థలం కొనుక్కొని, ఇంకో 8, 10 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్‌ కడుతున్నామని చెప్పారు.

అద్భుత తెలంగాణ సాకారం
ఒకప్పుడు కరువు కాటకాల పాలైన తెలంగాణ నేడు జలభాండాగారంగా మారిందని.. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ అని అంతర్జాతీయ చానళ్లు చెప్తున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజక్టులు పూర్తి చేసుకుంటే అద్భుతమైన తెలంగాణ సాకామవుతుందని తెలిపారు. ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు. ధరణి పోర్టల్‌ వంటి అనేక కార్యక్రమాలు ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా అది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.

అన్నింటా మనమే నంబర్‌ 1
తెలంగాణ రాకముందు.. వచ్చినాక ఎంతో మేధోమథనం చేశాము కాబట్టే మనకంటే ఎంతో ముందుగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ రాష్ర్టాలను అధిగమించి తలసరి ఆదాయంలో రెట్టింపు సాధించామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇవాళ తెలంగాణ తలసరి రూ.2.78 లక్షలు ఉన్నదన్నారు. విద్యుత్తు వినియోగంలో, ఇంటింటికీ మంచినీరు అందిస్తున్న రాష్ర్టాల్లో, జీరో ఫ్లోరైడ్‌ రాష్ర్టాల్లో.. ఇలా అన్నింటా తెలంగాణ నంబర్‌ 1గా ఉన్నామని చెప్పారు. వ్యవసాయరంగంలో సాధించిన విప్లవాలు, మనం పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనలేని అశక్తతను వెలిబుచ్చే స్థాయికి చేరామంటేనే తెలంగాణ వ్యవసాయరంగం ఏ విధంగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర స్థూల ఆదాయం దేశంకంటే ఎన్నో రెట్లు అధికంగా ఉన్నదని చెప్పారు. ఒక్కప్పుడు రాష్ట్రంలో మూడే మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే.. నేడు 33 ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. రెండున్నర లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.

మణిదీపంలా తెలంగాణ
ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహించే గుజరాత్‌ సహా అనేక రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలతో అంధకారం అలుముకొన్నా.. తెలంగాణ మణిదీపంలా వెలుగుదివ్వెలు ప్రసరిస్తున్నదని కేసీఆర్‌ గర్వంగా చెప్పారు. తాగునీరు, సాగునీరు, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించామన్నారు. ఏడేండ్ల క్రితం తెలంగాణకు కూడా భరించలేని కోతలున్నా.. ఇవాళ 24 గంటల పాటు కరెంట్‌ ఇచ్చే తెలంగాణ ఎట్ల తయారైందన్న కేసీఆర్‌.. ఇదేపని దేశంలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ‘తెలంగాణ పని చేసిన పద్ధతిలో దేశం పనిచేయడం లేదు. ఒకవేళ చేసి ఉంటే.. దేశంలో కూడా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి కోల్‌కతా వరకు 24 గంటల కరెంట్‌ కచ్చితంగా లభించేది. ఎందుకీ దౌర్భాగ్యం.. దేశంలో కరెంటు లేకనా? ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మనా? దీనికి సమాధానం చెప్పే వాళ్లెవరు? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

వలసలు రివర్స్‌
-11 రాష్ట్రాల నుంచి తెలంగాణకు
-అనేక రంగాల్లో 30 లక్షల మంది
ఒకప్పుడు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగితే.. ఇప్పుడు తెలంగాణకే వలసలు పోటెత్తుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాలోని ఊరూరి నుంచి బొంబాయికి బస్సులు పోయేటివని.. జిల్లాలో దాదాపు పదిహేను లక్షల మంది కడుపు చేతపట్టుకొని అన్నమో రామచంద్రా అంటూ వలసపోయారని.. నాటి బాధలను గుర్తుచేసుకొన్నారు. ఇప్పుడు తెలంగాణ వలసలన్నీ రివర్స్‌ వచ్చాయని.. ఒక్క వ్యక్తి కూడా వలసపోవటం లేదని పేర్కొన్నారు. పైగా ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలసలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. బీహార్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ తదితర 11 రాష్ర్టాల నుంచి 25- 30 లక్షల మంది కార్మికులు మన రాష్ర్టానికి వచ్చి పొట్టపోసుకొంటున్నారని చెప్పారు. ‘ఈ రోజు గర్వంగా చెప్తున్నా. ఇవాళ బీహార్‌ హమాలీలు లేకపోతే తెలంగాణ రైస్‌ మిల్లులు నడవవు. డెయిరీ ఫామ్‌లలో పాల ఉత్పత్తి నిలిచిపోతది. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి రియల్‌ఎస్టేట్‌ రంగంలో 95 శాతం మంది బీహార్‌, యూపీ కార్మికులే ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రం ప్రగతికాముకంగా సాగుతున్నందుకే పనిదొరుకుతున్నది.

శాంతిభద్రతలు బాగున్నాయి కాబట్టి, సాయంత్రానికి వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకోవచ్చు. అందుకే ఇతర రాష్ర్టాలవారు వస్తున్నారు’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది ప్రజలు.. కేంద్రం దిక్కుమాలిన విధానాలతో జాతీయ రహదారులమీద చస్తూ బతుకుతూ వెళ్లారని తెలిపారు. వారి అరిగోస చూడలేక.. మన ప్రగతి రథచక్రాలను ముందుకు తీసుకొని పోయేవాళ్లను.. మన కోసం చెమట బిందువులు ఖర్చుపెడుతున్న వాళ్లను మనలో భాగంగానే చూసుకొన్నామని, మనవాళ్ల లాగానే రేషన్‌బియ్యం, డబ్బులు అందజేశామని గుర్తుచేశారు. మందులిచ్చామని, 178 రైళ్లు పెట్టి, టికెట్‌ ఖర్చులు భరించి, భోజనం, పండ్లు ఇచ్చి సొంతూళ్లకు పంపించామని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టగానే ఎవరూ పిలవకుండానే మళ్లీ వచ్చి పనిచేసుకొంటున్నారంటే..తెలంగాణలో మంచి వాతావరణం, చేతినిండా పని, కడుపునిండా అన్నం, మంచి చెడ్డలు చూసే ప్రభుత్వం ఉండటమేనని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

దేశానికి పాఠం దళితబంధు
అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యసాధనలో భాగంగా దేశానికి, ప్రపంచానికి ఒక పాఠం చెప్పేలా దళితసమాజాన్ని తీర్చిదిద్దడం కోసం దళితబంధు కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఒక స్పష్టమైన వ్యూహంతో, గుండెల నిండుగా పూర్తి అవగాహనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఓట్లకోసమో, నినాదాల కోసమో.. చిల్లరమల్లర రాజకీయాల కోసమో కాకుండా దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుపడం కోసం బృహత్తరమైన ఈ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. దళితజాతిలోని అద్భుతమైన మాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు వెలుగులోకి రావాలన్నది ఈ పథకం లక్ష్యమని తెలిపారు. ‘దళితబంధులో మూడు పార్శ్వాలున్నాయి. మొదటిది.. 17.5 లక్షల కుటుంబాలకు ఏడాదికి 2 లక్షల మంది చొప్పున, ఏ నిబంధనలు, షరతులు లేకుండా నచ్చిన ఉపాధి ఎంచుకొనేందుకు రూ.10 లక్షలు ఇవ్వటం. రెండోది..మెడికల్‌ షాపులు, ఫర్టిలైజర్‌, హాస్టల్‌ సరుకుల సరఫరాలో, వైన్స్‌ బార్‌షాపులు ఇలా ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చే అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం. ఇచ్చే రూ.10 లక్షలతో ఒక పనిచేసుకోవచ్చు.

రెండు పనులు చేసుకోవచ్చు. ఆంక్షలు లేవు. దళితబంధులో మూడు పార్శాలు, ఒకటి ఆర్థిక ప్రేరణ, అన్నింటిలో రిజర్వేషన్‌, మూడోది అద్భుతం. ప్రపంచంలోనే ఎక్కడా లేని సపోర్ట్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేయటం’ అని వివరించారు. ఇప్పటివరకు దేశంలో అమలైన పథకాల తీరు అంతా పంచుకొంటూ పోవటమే తప్ప, ఆలోచించే పద్ధతి లేదని అన్నారు. ‘ప్రభుత్వం ప్రజలను రెండు రకాలుగా చూస్తది. ఒకటి బిలో పావర్టీ లైన్‌, ఎబౌ పావర్టీ లైన్‌(ఏపీల్‌)..పది లక్షలు ఇచ్చినం గనుక బీపీఎల్‌ కుటుంబం ఎపీల్‌ లోకి పోతుంది. మళ్లీ ఆ కుటుంబం బీపీఎల్‌కు దిగజారిపోకుండా చూడడమే దళితబంధు గొప్పతనం. అందుకోసం ఏర్పాటుచేసిందే దళిత రక్షణనిధి. లబ్ధిదారుల్లో ఎలాంటి కష్టం వచ్చినా ఆ రక్షణ నిధి నుంచి కుటుంబాన్ని నిలబెడుతరు. అంతటి గొప్ప నిర్మాణం ఉంది. ఆరేడేండ్లలో తెలంగాణ దళిత సమాజం దేశానికే పాఠాలు చెప్పగలిగేంత గొప్పగా తయారవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దళితజాతి బిడ్డలు 10 ఇస్తే 20 చేస్తారని చెప్పారు.

ఉపన్యాసాలతో అభివృద్ధి జరగదు
-దేశంలో పది ఉత్తమ గ్రామాలు మనవే
-ఎర్రబెల్లి, వారి శాఖకు అభినందనలు
అభివృద్ధి అనేది ఊకదంపుడు ఉపన్యాసాలతో జరుగదని.. రేయింబవళ్లు కష్టపడితేనే సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పంచాయతీరాజ్‌ అవార్డుల్లో మన గ్రామాల ప్రతిభను కేసీఆర్‌ బుధవా రం టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో ప్రశంసించారు. దేశంలో పది గ్రామాలకు అవార్డులిస్తే పదికి పది తెలంగాణకే రావటం ఒట్టిగనే కాలేదన్నారు. వ్యవస్థ ను చక్కదిద్దితేనే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. మొదటి టర్మ్‌లో 50 కోట్ల మొక్కలు పెంచి వాటిని గ్రామ గ్రామానికి, ప్రతి పట్టణానికి తీసుకెళ్లి ఇచ్చినా తగిన ఫలితం రాలేదన్న కేసీఆర్‌.. రెండో టర్మ్‌లో కఠిన నిర్ణయం తీసుకుని కొత్త పంచాయతీరాజ్‌ చట్టా న్ని తెచ్చామని తెలిపారు. 85శాతం మొక్కలు దక్కకపోతే.. పార్టీలకు అతీతంగా సర్పంచ్‌ పదవి పోతదని చెప్పామని, నీ ఉద్యోగం పోతదని గ్రామ కార్యదర్శికి చెప్పామని గుర్తు చేశారు. ‘డిపార్ట్‌మెంట్‌ను మొత్తం స్ట్రీమ్‌లైన్‌ చేసినం. రాష్ట్రంలో 12,769 గ్రామాలకు కార్యదర్శులను నియమించి బాధ్యతలు అప్పగించి నం. పల్లె ప్రగతి అని పేరు పెట్టుకొని సంవత్సరానికి రెండు మూడుసార్లు డ్రైవ్‌ పెట్టి మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రతి ఒక్కరు మమేకంగా పనిచేస్తే ఈ రోజు పదికి పది గ్రామాల్లో మనమే ఫస్ట్‌ వచ్చినం. మన పనితీరు కు ఢిల్లీలో అవార్డులు ఇచ్చి ప్రశంసించారు. ఇందుకు మంత్రి దయాకర్‌రావును, వారి డిపార్ట్‌మెంట్‌ను అభినందిస్తున్నా’అని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు.

గవర్నర్‌ వ్యవస్థ మారాలి
గత అనుభవాలనుంచి గవర్నర్ల వ్యవస్థ గుణపాఠాలు నేర్చుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హితవు చెప్పారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఆయన ప్రసంగిస్తూ.. గవర్నర్లు పెడధోరణితో వ్యవహరించడం సరికాదని చెప్పారు. గతంలో ఎందరో మహానాయకులు వచ్చారని.. సందేశాలు ఇచ్చారని, ఇవాళ గవర్నర్ల వ్యవస్థ వక్రమార్గంలో వెళ్తున్నదని అన్నారు. మహారాష్ట్ర క్యాబినెట్‌ 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించి ఏడాది కాలం గడుస్తున్నా.. ఫైల్‌ క్లియర్‌ చేయకుండా తన దగ్గరే ఉంచుకొన్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. తమిళనాడులో గవర్నర్‌ది పెడధోరణి అని.. బెంగాల్‌లో, కేరళలో అన్నిచోట్లా పంచాయతీలు కొనసాగడం సరైన పరిణామం కాదన్నారు. ‘పెద్దలు, పూజ్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు.

నిష్కల్మషమైన మనసుతో ప్రజలకు తన వల్ల ఏదైనా మంచి జరగాలని పార్టీ పెట్టారు. ఆ రోజు యువకులుగా మేం అంతా కలిసి ఆ పార్టీలో పనిచేశాం. ఎటువంటి కిరికిరి లేకుండా అద్భుతంగా ఆయన 200 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చారు. తాను చెప్పిన పనిని ఆచరిస్తూ ముందుకుపోతున్నరు. కానీ, ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించి.. ఎన్టీ రామారావును పదవి నుంచి చాలా కుటిలంగా తొలగించారు. నేను చెప్పేది ఎక్కడో భారతమో..రామాయణ కథో కాదు. ఇదే రా్రష్ట్రంలో..ఇదే హైదరాబాద్‌లో జరిగిన చరిత్ర. కానీ.. ఆనాడు తమంత సిపాయిలు లేరనుకొన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, తెలుగు రాష్ర్టాల ప్రజలు మెడలు వంచి ఎన్టీరామారావును మళ్లీ అధికారంలోకి తెచ్చేదాకా కొట్లాడారు. ఇది జరిగిన చరిత్రే కదా.. దీని తర్వాతైనా బుద్ధి, జ్ఞానం రావొద్దా? ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి? ఎన్టీ రామారావుతో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్‌ అవమానపడి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. తొలగించబడ్డారు. దాని నుంచి దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా ఈ రోజు గవర్నర్ల వ్యవస్థ నడుస్తున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా ఉండాలి..
ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ప్రకారం రైతుల వద్ద నుంచి పూర్తిగా ధాన్యాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందుకోసం శాసనసభ్యులు ఎక్కడివాళ్లు అక్కడ కొనుగోలు కేంద్రాలు తెరిపించి యాక్టివ్‌గా పూర్తి ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు. ఒక్క గింజ కూడా బయట అమ్ముకోకుండా రైతులను కాచుకోవాలని సూచించారు.

తెలంగాణ భూములపై అప్పుడే చెప్పిన
కలలు కనడమే కాకుండా.. వాటిని సాకారం చేసుకోవచ్చని తెలంగాణ నిరూపించిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.1987లో కేరళకు వెళ్లినప్పుడు అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఎకరం రూ.3 కోట్లు ఉంటే, పట్టణ ప్రాంతంలో రూ.10-12 కోట్లు ఉన్నదని అందుకే భూసేకరణ కష్టంగా మారిందని స్థానిక అధికారులు చెప్పారని తెలిపారు. ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రం వస్తదని, తెలంగాణ వస్తే కేరళలో మాదిరిగానే తెలంగాణ భూముల ధరలు పెరుగుతయి అని తాను ఆనాడే చెప్పినట్టు గుర్తుచేసుకొన్నారు. ఇప్పుడు అది వందశాతం నిజమైందని.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా భూమి విలువ కోట్లు పలుకుతున్నదని చెప్పారు. ఈ రోజు తెలంగాణలో ఎక్కడ కూడా డిస్ట్రెస్‌ సేల్స్‌ లేవని, ఇబ్బంది పడి అమ్ముకొనే పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు 120 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు కోట్ల రూపాయల్లోకి వెళ్తాయన్నారు.

అద్భుతంగా మాట్లాడుతున్నారు
ప్లీనరీలో మాట్లాడిన వక్తలు ఎంతో విషయ పరిజ్ఞానంతో మాట్లాడారని, ఇక తనకు ఎటువంటి రంది లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఒక అద్భుత తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్షగా నిలబడే, పర్మినెంటుగా తెలంగాణకు కంచుకోటగా ఉండే గొప్ప పార్టీ నిర్మాణం జరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. అద్భుతంగా అధ్యయనం చేసి జాతీయ, అంతర్జాతీయ విషయాలను కూడా చాలా గొప్పగా, అలవోకగా చెప్పేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్న వక్తలు ఉండటం ఆనందంగా ఉన్నదని తెలిపారు. అయితే నిబద్ధతతోని ఒక నియంత్రిత పద్ధతిలో, క్రమశిక్షణతో కఠోరమైన పరిశ్రమ చేస్తే ఉన్నతస్థానాలకు చేరుతామనేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎదుగుదలే నిదర్శనమన్నారు.

కార్యకర్తలు ఇచ్చే విరాళాలు చాలు
జాతీయ రాజకీయాల్లోకి పోవాలంటే వనరులు, డబ్బులు కావాలని అందరూ అంటున్నారని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తమ పార్టీకి నిబద్ధతగల 60 లక్షల కార్యకర్తలున్నారని, ఆ సభ్యుల్లో కోటి రూపాయలు ఇచ్చేవాళ్లు, పది రూపాయలు, వెయ్యి రూపాయలు, లక్ష రూపాయలు ఇచ్చేవాళ్లు కూడా చాలామంది ఉన్నారని, తాము ఒక్కసారి పిలుపిస్తే ఒక్కో కార్యకర్త సగటున రూ.1000 చొప్పున ఇచ్చినప్పటికీ రూ.600 కోట్లు జమవుతాయని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.