
-అత్యాధునిక పార్టికల్
-క్యారెక్టరైజేషన్ ల్యాబ్ ఏర్పాటు
-ఇంగ్లండ్‌కు చెందిన సర్ఫేస్
-మెజర్‌మెంట్ సిస్టమ్స్ ప్రకటన
-ఐటీ మంత్రి కేటీఆర్‌తో భేటీ
-టీఎస్‌ఐపాస్ భేష్: బ్రిటన్ మంత్రి
మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నది. ఇంగ్లండ్‌కు చెందిన ఫార్మా సంస్థ ‘సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్’ దేశంలో ఎకడాలేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఏడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే ఈ ల్యాబ్‌లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాస్యూటికల్ పౌడర్ క్యారెక్టరైజేషన్‌పై పరిశోధనలు జరుగుతాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ ల్యాబొరేటరీ వేదిక కానుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ పరిశోధనాంశాలను మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్ ప్రకటించింది.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావుతో సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, గ్లోబల్ ఛానల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ డేనియల్ విల్లాలోబోస్, లండన్ లోని ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సయ్యద్ కుతుబుద్దీన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ కంపెనీ ప్రణాళికలు, పరిశోధనలను మంత్రి కేటీఆర్‌కు వారు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల, పారిశ్రామిక అనుకూల విధానాలే హైదరాబాద్‌లో తాము అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీని ఏర్పాటుచేయడానికి కారణమని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిసి తమ సంస్థ పనిచేస్తుందని వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోమే ల్యాబ్‌తో తెలంగాణ ఫార్మా రంగం ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రప్రభుత్వం తరఫున పూర్తి సహకారం: కేటీఆర్
హైదరాబాద్ ఫార్మారంగంలో ప్రవేశించబోతున్న సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఎకడా లేనివిధంగా అత్యాధునిక సౌకర్యాలతో ల్యాబ్‌ను ఏర్పాటుచేయడం ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనమని అన్నారు. ఫార్మాలో దేశంలో ఏ రాష్ట్రానికీ లేనటువంటి అనుకూలతలు, ప్రత్యేకతలు హైదరాబాద్ కు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్‌కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ అధ్యక్షతన యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశం
లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. డెలాయిట్, హెచ్‌ఎస్‌బీసీ, జేసీబీ, ఈ అండ్ వై, రోల్స్‌రాయిస్ తదితర అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల పారిశ్రామిక విధానాలను కేటీఆర్ వివరించారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, లైఫ్‌సైన్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల్లో పెట్టుబడి అవకాశాల గురించి వారికి తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్తు, మానవ వనరుల లభ్యతకు కొదవ లేదని తెలిపారు. పెట్టుబడిదారులకు తెలంగాణ ఇచ్చే ప్యాకేజీ ఇతర రాష్ర్టాల కన్నా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.