-ఫలించనున్న సీఎం కేసీఆర్ సుదీర్ఘ స్వప్నం -ఐదు గోదావరి బ్యారేజీలపై ఒప్పందానికి సిద్ధమైన తెలంగాణ-మహారాష్ట్ర -ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం – ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు నీరు -తెలంగాణ మాగాణంపైకి గోదావరి గలగలలు -కేసీఆర్‌కు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ఫోన్ -ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆహ్వానం -7న ముంబైకి కేసీఆర్.. 8న ఒప్పందాలు -మేడిగడ్డ, రాజాపేట, చనాక-కొరాట, పెన్‌పహాడ్, తుమ్మిడిహట్టిపై ఒప్పందాలు -వెంటవెళ్లనున్న మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులు -రెండ్రోజుల ముందుగానే నీటిపారుదలశాఖ అధికారులు

రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి సాగునీరు అందాలి. తెలంగాణ పచ్చబడాలి ఇది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కల. ఆ సుదీర్ఘ స్వప్నం ఫలించనున్న సమయం ఆసన్నమైంది. దశాబ్దాల తరబడి సాగునీటి రంగంలో ప్రత్యేకించి గోదావరి జలాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యానికిగురై, వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న తెలంగాణ.. ఎట్టకేలకు అడ్డంకులను అధిగమించబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవ, దౌత్యనీతితో అంతర్రాష్ట్ర జలవివాదాలను దాటుకుని.. సస్యశ్యామల తెలంగాణ దిశగా చారిత్రక ఘట్టం ఆవిష్కరణకు రంగం సిద్ధమవుతున్నది.
గోదారమ్మ పరవళ్ల ప్రవాహంతో తెలంగాణ మాగాణం పరవశించనున్నది. ఈ మహత్తర సందర్భానికి ఈనెల 8వ తేదీ ముహూర్తంగా నిలువనున్నది. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా నిలవనున్న గోదావరిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న అత్యంతకీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టు, పెన్‌గంగపై రాజాపేట, చనాక-కొరాట, పెన్‌పహాడ్ వద్ద నిర్మించనున్న మూడు బ్యారేజీలు, ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద మరో బ్యారేజీ నిర్మాణంపై ఒప్పందాలు కుదర్చుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమ్మతి తెలిపారు. ఈ మేరకు ఆయన స్వయంగా బుధవారం సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి, ముంబై రావాల్సిందిగా ఆహ్వానించారు. రెండు రాష్ర్టాల రైతులకు మేలుచేకూర్చే విధంగా గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించడంపై తమకు ఎలాంటి అభ్యంతరంలేదని ఈ సందర్భంగా ఫడ్నవిస్ స్పష్టం చేశారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నీటిని సమర్థంగా ఉపయోగించుకుని రైతాంగానికి మేలుచేయాలని వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానంమేరకు సీఎం కేసీఆర్ ఈ నెల 7న సా యంత్రం ముంబై బయలుదేరనున్నారు. మరుసటిరోజు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సంబంధిత ఉన్నతాధికారులు కూడా సీఎం వెంట వెళ్లనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరు అందనున్నది. తెలంగాణ పుడమితల్లి నీటి గోస తీరనున్నది.