-రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నది -ఆహార తెలంగాణను సాధించినా అసూయే -ఏడేండ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమిటి? -7 మండలాలను ఏకపక్షంగా ఏపీలో కలిపింది -నీళ్ల సమస్యను తేల్చకుండా చోద్యం చూస్తున్నది -బీజేపీపై మండిపడ్డ మంత్రి నిరంజన్‌రెడ్డి

త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణకు బీజేపీ చేసిందేమిటని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రజల నుంచి తీసుకోవడమే తప్ప.. నయాపైసా ఇచ్చింది లేదని మండిపడ్డారు. దేశంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతుంటే.. బీజేపీకి ఓర్వబుద్ధి కావడంలేదని విమర్శించారు. ఏడు మండలాలను ఏపీలో అన్యాయంగా కలిపిన కేంద్రం.. ఇప్పుడు తెలంగాణ వాటా నీటిని తరలించుకుపోతుంటే చోద్యం చూస్తున్నదని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లయినా ఇప్పటిదాకా విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన యూనివర్సిటీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి దిక్కే లేకుండాపోయిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆరణ్యరోదనే అవుతున్నదని తెలిపారు. ఖమ్మంలో స్టీల్‌ఫ్లాంట్ ఏర్పాటు ఏమయిందని ప్రశ్నించారు. అడ్డగోలుగా, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు వీటిపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. సీఎం కేసీఆర్ అనేక ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి కష్టాలను తీర్చారని.. తెలంగాణను ధాన్యం ఉత్పత్తికి కేరాఫ్‌గా మార్చి పంజాబ్‌ను వెనక్కి నెట్టారని కొనియాడారు. కేంద్రం మాత్రం పంజాబ్‌లో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తూ తెలంగాణలో కొర్రీలు పెడుతున్నదని, రాష్ట్ర రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆకలికేడ్చిన తెలంగాణ.. ఆహార తెలంగాణగా మారడంపై కేంద్రం ఓర్వలేకపోతుందని విమర్శించారు. రెండు రాష్ర్టాల మధ్య జలవివాదాలతోపాటు షెడ్యూల్ 9,10 సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. కృష్ణా నది నుంచి అక్రమంగా నీళ్లను తరలించుకుపోతున్న ఆంధ్రా జలదోపిడీపై రాష్ట్ర బీజేపీ నేతలుగానీ, కేంద్ర మంత్రులు గానీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సంగమేశ్వరం అక్రమ నిర్మాణంపై మాట్లాడని బీజేపీ నేతలకు తెలంగాణపై ప్రేమ లేదని మండిపడ్డారు. బీజేపీకి ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప.. తెలంగాణ ప్రజలపై ప్రేమలేదన్నారు. బీజేపీ నేతలు థర్డ్‌క్లాస్, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.