సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినాన్ని పురస్కరించుకొని నాటి పోరాటాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్మరించుకున్నారు. నిజాం రాచరిక, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం వీరోచిత పోరాటాలు చేసిన పుణ్యభూమి తెలంగాణ ప్రాంతం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ పోరాటాల స్పూర్తితోనే రాష్ట్రంలో ప్రగతిశీల పాలన సాగుతోందని ఆయన అన్నారు. గురువారం తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంత్రుల అధికారిక నివాసంలో పలు జిల్లాల నుంచి తొలితరం తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వినోద్ కుమార్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ విలీన పోరాటాలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకుని వచ్చి, లక్షలాది మందికి భూ సమస్యల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కలిగించిందని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. భూమి సమస్యలు తొలిగిపోయి 97 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు భూ హక్కులు పొందడం తెలంగాణ పోరాటాల ఫలితమేనని ఆయన వివరించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని అందిస్తూ లక్షలాది ఎకరాల భూమిని సస్యశ్యామలం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విలీన దినోత్సవ స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విలీన పోరాటాల ఉద్యమ నేపథ్యం గురించి వినోద్ కుమార్ వివరించారు.