Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ ప్రగతి బావుటా

-నిజాయితీగా.. నిటారుగా పనిచేస్తున్నం మన రాష్ట్రం దేశానికే ఆదర్శం -అంచనాలు తలకిందులు చేశాం అనితరసాధ్యమైన సంక్షేమం -అనన్య సామాన్యంగా అభివృద్ధి -ఇంతవేగంగా దేశంలో ఏ ప్రాజెక్టుకూ అనుమతులు రాలేదు -ఎటు చూసినా ఆకుపచ్చ తెలంగాణ -ప్లీనరీలో సీఎం శ్రీ కేసీఆర్

తెలంగాణ ప్రజానీకం అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టినరు. మా బతుకులను తీర్చిదిద్దేవారు కచ్చితంగా ఈ టీఆర్‌ఎస్ బిడ్డలేనని.. వీళ్లే మాకు సరైన న్యాయం చేస్తారని వాళ్ల గుండె తీసి మన చేతుల పెట్టినరు. అందుకు ప్రతిగా అహర్నిశలు కష్టపడినం. నీతిగా, నిజాయితీగా యావత్ మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిజాయితీగా పనిచేస్తున్నం. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలినా.. గాలి ఆరోపణలు చేసినా ఈరోజు నిజాయితీగా నిటారుగా పనిచేసే ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ శివారులోని కొంపల్లి జీబీఆర్ గార్డెన్‌లో జరిగిన పార్టీ 17వ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ అధ్యక్ష, ముగింపు ప్రసంగాలు చేశారు. గత నాలుగేండ్లలో సాధించిన అద్భుతమైన ప్రగతిని ప్రగతి ప్రాంగ ణం వేదికగా అంశాలవారీగా వివరించారు.

వివరాలు ఆయన మాటల్లోనే..అంచనాలు తలకిందులయ్యాయి పార్టీని, ఉద్యమాన్ని ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టినం. జలదృశ్యం లో 2001 ఏప్రిల్ 27న పార్టీ ప్రారంభించిన సమయంలో అనేక అనుమానాలు. మెటికలు విరిచిన వాళ్లు, చప్పరిచ్చిన వాళ్లు, ఇది అయ్యేపనా, పోయేపనా అని అన్నవాళ్లు.. అనేక సన్నివేశాలు, సందర్భాలు చూసినం. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ, అనేక అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అప్రతిహతంగా, అనన్య సామాన్యంగా అనేక గెలుపులు, ఓటములు మిశ్రమ ఫలితాలను ఆస్వాదిస్తూ.. ఆత్మవిశ్వాసంతో పురోగమించి అద్భుతంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినం. ఒక సందర్భంలో ఆత్మవిశ్వాసంతో.. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్న. తిరిగి తెలంగాణ రాష్ట్ర గడ్డ మీదనే అడుగుపెడత అని ప్రకటించిన. అట్లే విజయాన్ని సాధించి తిరిగి వచ్చిన. అంత ఆత్మవిశ్వాసంతో పురోగమించినం కాబట్టే తెలంగాణ సాధించుకొన్నం. ఆ తదనంతరం కూడా శాపాలు, దీవెనలు పెట్టినవారున్నరు. ధైర్యంతోటి, తెలంగాణ ప్రజల మీద ఉండే నమ్మకంతో ఎలాంటి తత్తరపాటు లేకుండా, స్పష్టమైన ప్రకటనచేసి, ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగినం. అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టినరు. నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నం.

మావా నాటే-మావా రాజ్ రాష్ట్రంలో అనేక సంవత్సరాలపాటు గిరిజన బిడ్డలు మా తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలు కావాలని కోరినరు. ఏ ప్రభుత్వం కూడా చేయలె. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చి కూడా అమలు చేయలె. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగువేల పైచిలుకు పంచాయతీలు ఏర్పాటు చేసి.. మా తండాల్లో మా రాజ్యం.. మావా నాటే – మావా రాజ్ అనే గోండు బిడ్డల గొంతు కావచ్చు, లంబాడీ బిడ్డల నినాదాన్ని నిజం చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.

31 జిల్లాల తెలంగాణ పాలనా సంస్కరణలో భాగంగా 31 జిల్లాలు చేసినం. మిత్రుడు రాజేశ్వర్‌రెడ్డితో గజ్వేల్ వెళ్లినపుడు ఆ ప్రాంత ప్రజలు మాతో సంతోషాన్ని పంచుకున్నరు. అన్నా.. సంగారెడ్డి పోయే పీడ తప్పిందన్నరు. ఆదిలాబాద్‌పోతే బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ పోయే బాధ తప్పిందని చెప్పినరు. ప్రజలకు అద్భుతమైన రిలీఫ్ వచ్చింది. వెయ్యి కోట్లు కేటాయించుకొని, కార్యాలయాలు కూడా వేగంగా నిర్మాణమవుతున్నాయి.

పశువులకు మొబైల్ దవాఖానలు మనుషుల అంబులెన్స్‌కే దేశంలో చాలా రాష్ట్రాల్లో దిక్కులేదు. కానీ తలసాని అద్భుతమైన గ్రామీణ ఆర్థికవ్యవస్థ పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా పశుగణాభివృద్ధికి చర్యలు తీసుకోవడమే కాదు.. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున పశువుల దవాఖానకోసం మొబైల్ వ్యాన్లను ఏర్పాటుచేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. పోలీస్ సోదరులు.. ట్రాఫిక్‌లో నిలబడి పనిచేస్తరు. వాళ్ల ఊపిరితిత్తులు మామూలు వాళ్లకంటే ఎక్కువ ఖరాబయితయి. మానవతా దృక్పథంతో ఆలోచించి, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనివిధంగా.. బేసిక్ సాలరీలో 30% రిస్క్ అలవెన్స్ కింద ఇస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రమే. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులకు అత్యధిక జీతాలిచ్చే రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే.

కార్యకర్తలే మాకు ఆక్సీజన్ నాలుగేండ్ల పసికూన అయి నా దీక్షతోటి, దక్షతతోటి.. సమర్థంగా పనిచేసే మం త్రివర్గం ఉన్నది. నిన్నగాక మొన్ననే పోరాటంచేసి ఎయిమ్స్ లాంటి సం స్థను మన ఎంపీలు, శాసనమండలి సభ్యు లు సాధించారు. వీళ్లందరికీతోడు ఆనాడు రాష్ట్రసాధన ఉద్యమంలోనైనా, ఈ రోజు ప్రభుత్వంలోనై నా ప్రాణవాయువు లా పనిచేసే 75 లక్ష ల టీఆర్‌ఎస్ సభ్యులు, నాయకులు, కార్యకర్త లు ఉన్నారు. మీరే దీనంతటికీ ఆక్సీజన్. ఈ గౌర వం, కీర్తి.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు దక్కుతుంది. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

ఉత్తమ్.. నీ పదవి గులాబీ పుణ్యమే మన దగ్గర పార్టీలున్నయి. చిన్నవాళ్లు, అర్భకులు.. ఎన్నడు కూడ రాజ్యం చేయలె. ఆంధ్ర నాయకుల దగ్గర సంచులు మోసినోళ్లు. ఇయ్యాల టీపీసీసీ అధ్యక్షులుగా, బీజేపీ అధ్యక్షులుగా ఉన్నరు. చిల్లరమల్లర యాత్రలు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలె. ఇయ్యాల నువ్వు టీపీసీసీ అధ్యక్షుడివి. ఆనాడు మేం పోరాటం చేయకపోతే టీపీసీసీ రాదు.. టోపీసీసీ రాదు. నువ్వు ఎక్కడ్నో ఇంకా సంచులు మోసుకునేవాడివి. తెలంగాణ సృష్టించిందే టీఆర్‌ఎస్, గులాబీ జెండా. ఈ నాయకులు, కార్యకర్తల త్యాగం ఫలం. 14 సంవత్సరాలు అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో, ఆకలి పాలైనమో, మీరు ఆనాడు కొడితే దెబ్బలు తిని జైళ్ల పాలైనమో! ఆ పద్నాలుగేండ్ల మడమ తిప్పని పోరాటమే తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అబద్ధం చెప్పేందుకు తెలివి కావాలి. అతికినట్టు ఉండాలి. దేవుడు నాలుక ఇచ్చిండని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చునా?

ఉత్తమ్.. ఇన్ని అబద్ధాలా? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ఒకటి, రెండుసార్లు అవమానపడ్డరు. అయినా తెలివితేటలు లేవు. ఎట్ల మాట్లాడాల్నో తెల్వదు. ఈ మధ్య బస్సు యాత్రలో 100-150 రూంలతోటి సీఎం ప్రగతిభవన్ కట్టుకుండని చెప్తరు. చాలెంజ్ చేస్తున్న. సాయంత్రం ఈ సభ అయిపోతది. సాయంత్రం ఏడున్నర గంటలకు ఇంటికాడనే ఉంట. మీడియాను తీస్కొని నువ్వు రా! ఒకవేళ 150 కాదు.. 15 రూంలు చూపెట్టకపోతే ఆ ప్రగతిభవన్ ముందు నువ్వు ముక్కు నేలకు రాసి పోవాలె. నువ్వు 16వ రూం చూపెట్టు. నేను ముక్కు నేలకు రాయడం కాదు, ఎనిమిది గంటలకు నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్త. ఇంత దారుణమైన అబద్ధ్దాలా? మంత్రి హరీశ్‌రావు, ఇరిగేషన్ అధికారులు ఓ పది చక్కర్లు కొట్టి, నేను రెండు, మూడు సార్లు చక్కర్లు కొట్టి.. చాలా తెలివితేటలతో, వినయం, విధేయతతోటి కాళేశ్వరం, చనాక-కొరాట, ప్రాణహిత ఒప్పందం చేసుకున్నం. 50వేల మంది మీరే బేగంపేటకొచ్చి వెల్‌కం చెప్పినరు. ఆరోజు ఇదే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వీళ్లు కొత్తగ తెచ్చిందేమీ లేదు, మేమే చేసినమన్నడు. నేను బేగంపేటలనే ఉంట.. రా ఇక్కడికి, ఇక్కడి నుంచి రాజ్‌భవన్‌కు పోయి రాజీనామా చేస్తనని చెప్పిన. తోక ముడిచిండు. టీఆర్‌ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ. కాంగ్రెస్ ఏడు దశాబ్దాలు తెలంగాణను వేధించిన, ఏపుకుతిన్న పార్టీ. కాబట్టి వాస్తవాలు గమనించి, ప్రజలు ఆలోచన చేయాలి.

కలలోనైనా ఊహించినరా? మీ జీవితంలో ఏనాడైనా ఉస్మానియా, గాంధీలో పేదలు చచ్చిపోతే ప్రభుత్వమే ఆంబులెన్స్‌లు పెట్టిన వాళ్లను దించిరావాల్నని ఆలోచన చేసినరా? మీరు మాత్రం బిల్డింగ్‌లో కులికినారు, అందలాలు ఎక్కినారు. పేదలు కూడా మంచి ఇంగ్లిషు మీడియంల చదుకోవాలె, మంచి రెసిడెన్షియల్ స్కూళ్లో చదవాల్నని ఎప్పుడైనా ఆలోచన చేసినారా? పెట్టినా మాములుగా, కండితుడుపుగా పెట్టారుగానీ కడుపునిండా పెట్టలె. ఇప్పటికీ కుల వివక్ష ఉందని తెలిస్తే.. ఉప ముఖ్యమంత్రి శ్రీహరి, నేను కూర్చొని మా దళిత, గిరిజన ఆడబిడ్డలు చదుకోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈరోజు అనతికాలంలో 500 పైచిలుకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసినం. ఎప్పుడన్నా మీ జీవితంలో.. భారతదేశంలో ఏలిన మీ పార్టీగానీ, రాష్ట్రంలో ఏలిన మీ పార్టీగానీ డబుల్ బెడ్‌రూం అనే కల కన్నరా? డబ్బాల్లాంటి ఇల్లు కట్టి ఇదే వైకుంఠం, ఇదే కైలాసమని చెప్పినరు. ఇప్పుడు మీకు కనబడ్తలేదా? వృద్ధులకిచ్చే వెయ్యి రూపాయల పింఛను కనిపిస్తలేదా? లక్ష రూపాయలిచ్చే కల్యాణలక్ష్మి అబద్ధమేనా? దేశంలో మొదటిసారి 2014లో ప్రజల ముందు పెట్టిన ఎన్నికల ప్రణాళికను వందకు వంద శాతం అమలు చేసిన ఏకైక పార్టీ, ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దే. ఎక్కడైనా సరే ఈ అంశంపై చర్చకు సిద్ధం. ఇవన్నీ కాకుండా సొల్లు, అబద్ధాలు, అవాకులుచవాకులు పేలుతున్నరు. జాతీయపార్టీ అనుకొనే కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి.

కాంగ్రెస్ నాయకుల్ని ప్రజలు నిలదీయాలి వలసలు పోయిన తెలంగాణ, నీళ్లకోసం గోస పడిన తెలంగాణ, 31 వేల కోట్ల రైతుల డబ్బులతో 23 లక్షల బోర్లువేసి బోర్లాపడిన తెలంగాణ కోసం మూడు షిఫ్టులు, 24 గంటలు, అధికారులు, మంత్రులు, భారతదేశ చర్రితలో ఎక్కడాలేని విధంగా రోజుకు 20 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తూ కాళ్వేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కడుతుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నరు. 250 కేసులు పెడతారా? మీరా ప్రగతి గురించి మాట్లాడేది? ఏదైనా శ్రుతిమించినపుడు ప్రజలు కూడా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి, కేసులు విత్‌డ్రా చేసుకునే వరకు తరిమికొట్టాలి. తెలంగాణలో అనేకమైనటువంటి పరిపాలనా సంస్కరణలు. దేశంలో ఎక్కడా లేనటువంటి, కనీవినీ ఎరుగని సంక్షేమం ఇక్కడ జరుగుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 19.88% తోటి సొంత రాబడిలో దేశంలో నంబర్‌వన్ రాష్ట్రం తెలంగాణ అని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని అనేకమైన అంతర్జాతీయ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, హడ్కో, నాబార్డు సంస్థలు దేశంలో ఏ రాష్ర్టానికివ్వని వంద పైచిలుకు అవార్డులను తెలంగాణకు ఇచ్చినయి.

హైదరాబాద్‌ల నీళ్ల గొడవల్లేవు హైదరాబాద్‌లో ఎండాకాలం వచ్చిందంటే బిందెలు కనబడేవి. లొల్లి కనబడేది. ఈ సంవత్సరం ఎక్కడ కూడా కనపడతలేదు. మున్సిపల్ శాఖ రూ.2 వేల హడ్కో రుణం తెచ్చి తీసుకున్న చర్యలతో శివారుల్లో ఎక్కడ చూసినా నీళ్లు పారుతున్నయి.

పేకాట అంటే భయపడుతున్నరు స్వాతి లక్రా అనే ఐజీ ఆధ్వర్యంలో షీ టీమ్స్‌ను తీసుకువచ్చినం. గ్రామాలకు కూడా ఆ కార్యక్రమాన్ని విస్తరించుతున్నరు. తెలంగాణలో మహిళలు భద్రంగా ఉంటరనే గౌరవం మనకు రావాలి. శాసనసభ్యులు కూడా ఇందుకు కృషిచేయాలి. తెలంగాణలో పేకాట క్లబ్బులు లేవు. అదే కాంగ్రెస్ హయాంలో వాడకట్టుకో క్లబ్, పేటకో క్లబ్. దాంట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు మామూళ్లు. కానీ ఈరోజు ఎక్కడా కూడా పేకాట క్లబ్‌లు లేవు. పేకాట అంటే భయపడుతున్నరు. గుడుంబా తెలంగాణలో అడ్రస్‌లేకుండా పోయింది.

గొల్లాయన బలిస్తే తెలంగాణకు నయం ఇయ్యాల చేనేత, గీత కార్మికులను ఆదుకున్నం. ఈ మధ్యనే గీత కార్మికులకు రాయితీలు ప్రకటించినం. దేశంలో ధనికులైన యాదవులు తెలంగాణలోనే ఉన్నరనే పేరు రావాలని, అది కొద్దిరోజుల్లో చూడబోతరని నేను అసెంబ్లీలో చెప్పిన. ఇయ్యాల ఆ కల నిజమవుతున్నది. ఇప్పటికే తెచ్చిన గొర్రెలు పెట్టిన పిల్లలు పది లక్షలు. అది సృష్టించిన సంపద వెయ్యికోట్లు. ఇంతకుముందు ఒక సామెత ఉండేది.. గొర్రె బలిస్తే గొల్లాయనకు నయం అనేవారు. ఇప్పుడు కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం నమ్మేది.. గొర్రె బలిస్తే గొల్లాయనకు నయం – గొల్లాయన బలిస్తే తెలంగాణకు నయం అనే సిద్ధాంతంతో ముందుకుపోతున్నం.

వెయ్యి కోట్లతో మత్స్యకారులకు చేయూత రాష్ట్రంలో అద్భుతమైన మత్స్యకారులను తయారుచేసే బాధ్యతను మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ ప్రకాశ్‌కు అప్పగించినం. మనకు నాగార్జునసాగర్, శ్రీశైలంలలో వాటా ఉన్నది. మన జూరాల, శ్రీరాంసాగర్, ఎల్‌ఎండీ, ఎంఎండీ, నిజాంసాగర్, సింగూరు తదితర ప్రాజెక్టుల్లో చేపలు పట్టుకునేలా మత్స్యకారులకు మరబోట్లు, మోటరుబైకులు, వలలు ఇవ్వబోతున్నం. రాబోయే రెండు, మూడు నెలల్లో ఖర్చు పెట్టేందుకు ఆర్థికశాఖ మంత్రి వెయ్యి కోట్ల రూపాయల నిధిని సిద్ధంగా పెట్టారు. నాతోపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ముత్తా గోపాలకృష్ణది కాకినాడ. శాసనసభలో తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధిపై నేను చేసిన ఉపన్యాసాన్ని టీవీల్లో విని.. ఫోన్ చేసి మిమ్మల్ని అభినందించేందుకు స్వయంగా వస్తున్నానని చెప్పి వచ్చారు. నిజంగా ఆంధ్రవాళ్లం చేపలంటే మా దగ్గరేనని గర్వపడేవాళ్లం. మాకు 900 కిలోమీటర్ల తీర ప్రాంతముంది.. మత్స్యకారులంటే మా దగ్గరనే ఉంటరని అనుకునేవాళ్లం. కానీ మీ మాటలు విని తెలంగాణలో కూడా మత్స్యకారులను ఎలా బాగుచేయొచ్చో విని ఆశ్చర్యపోయాను, గర్వపడ్డాను.. అని చెప్పి అభినందించారు.

హరీశ్‌రావు శుభవార్త చెప్పారు.. ఇప్పుడే మంత్రి హరీశ్‌రావు నా పక్కన కూర్చుని శుభవార్త చెప్పినాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రావాల్సిన చివరి అనుమతి కూడా ఈ రోజే వచ్చింది. ఇంకొక చిన్న అనుమతి పెండింగ్ ఉన్నది. అది కూడా సాయంత్రానికి వచ్చే పరిశీలన జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ వాళ్లు కేసులు పెట్టినా.. ఇంత సత్వరం అనుమతులు సాధించినటువంటి దాఖలాలు చరిత్రలో లేదు.

నిరుపేదలకు ఏటా ఉచిత వైద్యపరీక్షలు తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద కార్యక్రమం, తెలంగాణ కంటి వెలుగు అని ప్రారంభిస్తున్నం. ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో.. మొత్తం బృందాలు యావత్‌రాష్ట్ర ప్రజానీకానికి రెండు మహత్తరమైన కార్యక్రమాల్ని చేయనున్నారు.

మరో 100 డయాలసిస్ సెంటర్లు కిడ్నీవ్యాధిగ్రస్థులు డయాలసిస్‌కు రావాలంటే.. ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు రావాలి. కానీ, మన వైద్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో.. తెలంగాణవ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలను పెట్టినారు. ఎక్కడివాళ్లు అక్కడనే ప్రభుత్వానికి, పార్టీకి దీవెనలు ఇస్తాఉన్నారు. ఇంకా 100 సెంటర్లు పెట్టాలనే డిమాండ్ వస్తా ఉన్నది. త్వరలోనే వాటిని విస్తరిస్తాం.

ఎక్కడ చూసినా ఆకుపచ్చ తెలంగాణ మనం ఏ కలలైతే కన్నమో.. బంగారు తెలంగాణ దిశగా ఆరునూరైనా.. రాబోయే రెండేండ్లలో కోటి ఎకరాలల్లో నీరు పారాలే. తెలంగాణలో హెలికాప్టర్లో బయల్దేరితే, ఎక్కడ పక్కకు పోయినా ఆకుపచ్చ తెలంగాణ కనబడాలే. అదీ లక్ష్యం. స్వతంత్రం వచ్చినప్పట్నుంచి నేటివరకూ, ఇరిగేషన్ కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం 37,500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన చరిత్ర లేదు. అహోరాత్రాలు మంత్రి హరీశ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నరు. ప్రాజెక్టుల సైట్లలో పడుకుంటున్నరు. సైట్లలో ఇంజినీర్లను పరుగెత్తిస్తున్నరు.

కాంగ్రెస్ దివాలా.. ఇన్వర్టర్ల దుకాణాలు దివాలా.. విద్యుత్ రంగంలో తప్పుడు ప్రచారాలు చేశారు. ఎందుకంటే, వారికి కన్ను కుట్టింది. తెలంగాణ అంధకారమైతదని శాపనార్థాలు పెట్టారు. దాన్ని రివర్స్ చేసినం. ట్వంటీఫోర్ అవర్స్ పవర్ ఫర్ ఆల్. ఒకరికి కాదు.. వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు పవర్, క్వాలిటీ పవర్ అందరికీ ఇస్తా ఉన్నాం. ఇవ్వాళ తెలంగాణలో దివాలా తీసిండ్రంటే.. ఇద్దరే ఇద్దరు దివాలా తీసిండ్రు. ఒకటి కాంగ్రెస్ పార్టీ. ఇంకొకరు ఇన్వర్టర్లు, జనరేటర్ల దుకాణం వాళ్లు. 24 గంటలు పవర్ ఇస్తుంటే ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు.

రాజకీయ పక్షపాతంలేని పాలన మాది మతం, కులం, జాతి, వర్గం లేదు.. తెలంగాణ ప్రజలంతా బాగుపడాలని కోరుకుంటున్నం. అరిచేవాళ్లు అరుస్తరు. ఒక నీతి, మంచి సమాజం హర్షించాలి. గుర్తించాలి. అప్పుడే మంచి బతుకుతది. గతంలో పక్షపాతవైఖరితో వ్యవహారం చేసేవాళ్లు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అమలులో అక్కడ ఎమ్మెల్యే ఎవరో చూడకుండా అన్ని నియోజకవర్గాలను తీసుకున్నం. అన్ని ఇండ్లకు నీళ్లియ్యమని చెప్పిన. ఆ నీళ్లు రేపు జానారెడ్డి తాగరా? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాగరా? వాళ్ల నియోజకవర్గ ప్రజలు తాగరా? మేం వివక్ష చూపెట్టలేదు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు, రోడ్లు, చివరకు ఎమ్మెల్యేలకు ఇచ్చే రూ.3 కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులు చూసుకున్నా ఇదే పద్ధతి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధికారపార్టీ ఎమ్మెల్యే లెక్కనే సంపూర్ణ అధికారం ఇచ్చామే తప్ప దాంట్ల మేం వాటా పెట్టుకోలేదు. తెలంగాణలో ఒక ఇంచు.. అది జానారెడ్డి నియోజకవర్గమా? కేసీఆర్ నియోజకవర్గమా? ఈటల రాజేందర్ నియోజకవర్గమా? అని చూడకుండా తెలంగాణ ఏ ఫీటు జాగా బాగుపడినా అది మాదే. ఏ ఒక్క వ్యక్తి బాగుపడినా ఆ సోదరుడు మావాడే. తెలంగాణలో ఒక మహిళ గర్వపడి, సంతోషపడినా ఆ చెల్లెలు, తల్లి మాదే. తెలంగాణ జాతి మాది. తెలంగాణకోసం రక్తం ధారపోసి కొట్లాడినం కాబట్టి ఈ తెలంగాణ యావత్తు అన్ని రంగాల్లో ఏ వివక్ష లేకుండా బాగుపడాలని రాజకీయ పక్షపాతం లేకుండా ముందుకుపోతున్న ప్రభుత్వం మాది.

మిషన్ భగీరథ 95 శాతం పూర్తి యువకుడు, బాల్కొండ ఎమ్మెల్యే వైస్ చైర్మన్‌గా ఉంటూ, ఆ శాఖకు మంత్రి లేకపోయినా, ఆయనే మంత్రిలా వ్యవహారం చేస్తూ.. అహోరాత్రాలు కష్టపడతాఉన్నడు. ఈ పథకం 95% పూర్తయ్యింది. మిగిలిందల్లా ఇంట్రా విలేజ్ పనులే. ఒక రాష్ట్రం ప్రభుత్వం ఖర్చుతోనే.. ఇంటింటికి నీరిచ్చిన ఘనత ప్రపంచ పటంలో మనదే.

కనీవినీ ఎరుగని సంక్షేమమిది ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నయి. పింఛను వస్తే అవ్వకో, అమ్మకో స్వయంగా వెయ్యి రూపాయలు వస్తున్నయి. కల్యాణలక్షి వస్తే వధూవరులకు వస్తున్నయి. కొన్ని పనులు చేయాలంటే సాహసం, గుండెధైర్యం కావాలి. ఈ మధ్యనే బెంగళూరు వెళ్లిన. మాజీ ప్రధాని దేవెగౌడ ఒక మాట చెప్పినరు.. కేసీఆర్‌గారూ ఈ రోజు మా దగ్గర ఎన్నికలు జరుగుతున్నయి. కర్ణాటక-తెలంగాణ పెద్ద బార్డర్ ఉన్నది. మీ పథకాలన్నీ మా ప్రజలకు తెలిసిపోయినయి. అవన్నీ ఇక్కడ పెట్టండని ప్రజలు డిమాండు చేస్తున్నారని అన్నరు. మీ దెబ్బకు బ్రాహ్మణ పరిషత్తు పెట్టినం. న్యాయవాదుల సంక్షేమం, జర్నలిస్టుల సంక్షేమం ప్రకటించినం. కేసీఆర్ కిట్ మా దగ్గర పెడుతున్నమని చెప్పినరు. ఈమధ్య షిర్డీ వెళ్లిన. అక్కడ జిల్లా కలెక్టర్ వచ్చి.. సార్ మాది పెద్దరాష్ట్రం, పాత రాష్ట్రం. మీది కొత్త రాష్ట్రమైనా మీది మహారాష్ట్రకు పెద్ద బార్డర్ ఉన్నందున మా ప్రజలకు మీ పథకాలన్నీ తెలిసిపోయినయి. ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండు చేస్తున్నరని చెప్పినరు. మన కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నది.

సాహసోపేతమైన భూరికార్డుల ప్రక్షాళన దశాబ్దాలుగా ఎవరూ ముట్టుకోని, సాహసంచేయని భూరికార్డుల ప్రక్షాళన వందరోజుల్లో పూర్తిచేసినం. మే 10వ తేదీ నుంచి ప్రపంచంలోనే ఎక్కడాలేనట్టుగా రైతాంగాన్ని ఆదుకొనే దిశగా ఎకరానికి రూ. 8వేల పంట పెట్టుబడిసాయాన్ని పాస్‌పుస్తకాలతోటి పంపిణీ చేయబోతున్నం. అన్నింటికీ మించి రాబోయే కొద్దిరోజుల్లోనే విప్లవాత్మక విధానం రాబోతున్నది. ఒకేరోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోతుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్ అందరికీ అందుబాటులో ఉంటది. ఏ భూమి ఎవరిదనేది రెండు గంటల్లోనే ఆ వెబ్‌సైట్‌లోకి వచ్చే పరిస్థితి ఉంటది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీసుకుపోతే చాలు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయిపోతయి. పాస్‌పుస్తకాలు కొరియర్‌లోనే రైతుల ఇంటికి వస్తయి. డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ఆధ్వర్యంలో కంప్యూటరైజేషన్ అయిపోయింది.

మా ఎమ్మెల్యేలందరూ వజ్రాలు కేసీఆర్ మంత్రివర్గ మార్పులు రేపే చేస్తరు.. వచ్చేవారం చేస్త్తరు.. అని వార్తలు రాసీరాసీ ఒక పేపర్ థకాయించి పోయింది. అవన్నీ తలకిందులయ్యాయి. పొద్దాక మంత్రులను మార్చి సికాకులు చేసి, గందరగోళాలుచేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా కొన్ని పేపర్లు 30% మందికి టిక్కెట్లు ఇవ్వరని రాస్తున్నాయి. దయచేసి ఆ స్పెకులేషన్స్ మీకు అవసరంలేదు. మా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా డైమండ్స్‌లాగా ఉన్నారు. అందరికీ మళ్ల టిక్కెట్లు ఇస్తాం. బ్రహ్మాండంగా ముందుకు పోతం. ఎవ్వరికీ ఏ అనుమానం అవసరం లేదు. ఎవరైనా బాగాలేకపోతే వారిని సెట్‌చేస్తాం. వారిని బాగుపడేటట్టు చేస్తాం తప్ప. ఎవరినీ బిట్రేట్ చేయం. ఇంతకన్నా గొప్పోళ్లు మాకు ఆకాశం నుంచి రారు. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడో ఒకటో అరో మార్పు ఉంటుంది. బలహీన వర్గాల నుంచి ఇద్దరిని రాజ్యసభ సభ్యులుగా చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో బలహీన వర్గాలకు అవకాశాలు రావాలి. ముఖ్యంగా ఎంబీసీ వర్గాల వారికి, ఎవరికైతే వాయిస్ లేదో, ఎలక్ట్ అయి రారో వాళ్లందరికీ ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తాం.

హైదరాబాద్‌లో ఉండే ప్రతి వ్యక్తి తెలంగాణ బిడ్డే హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉన్న ఏ వ్యక్తి అయినా మన తెలంగాణ బిడ్డే. అనవసర అపోహలు ఎవరికీ అవసరం లేదని ఈ వేదిక ద్వారా మనవి చేస్తున్నా. నేను గర్వంగా చెప్తున్నా.. మన ఆంధ్రాప్రాంతం నుంచి ఎప్పుడో వచ్చి ఇక్కడే సెటిలై అద్భుతంగా ఈ కల్యాణ మండపాన్ని నిర్మించిన మన క్షత్రియ సోదరులు.. మనం ఈ సమావేశం జరుపుకోవడానికి ఈ జీబీఆర్ గార్డెన్స్‌ను ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. స్థానిక ఎంపీ మల్లారెడ్డి రాత్రింబవళ్లు కష్టపడి మంచి ఏర్పాట్లు చేశారు. వారికి ధన్యవాదాలు. స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌కు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. రుచికరమైన భోజన వసతి కల్పించిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు ధన్యవాదాలు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్‌ఎస్ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, వలంటీర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు అద్భుతంగా కృషిచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.