Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ సాధించిన కేసీఆర్ ముందు..బాబు ఏపాటి?

-హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులంతా తెలంగాణవారే
-నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఒక్క గొడవ కూడా లేదు
-రాహుల్ డ్రామాలను, చంద్రబాబు వేషాలను ప్రజలు నమ్మరు
-ఒకే దెబ్బకు రెండుపిట్టలను కొట్టే సువర్ణావకాశం.. చేజార్చుకోవద్దు
-శ్రీకృష్ణ దేవరాయ ఆత్మీయసదస్సులో మంత్రి కే తారకరామారావు

డబ్బు, కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని బాబు రాజకీయం సమయం వచ్చినప్పుడు బాబుకు ఎలా బుద్ధిచెప్పాలో కేసీఆర్‌కు తెలుసు కుల, ప్రాంతీయ రాజకీయాలను కచ్చితంగా తిప్పికొడతాం.

అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్‌ముందు చంద్రబాబు ఏపాటి? అని మంత్రి కే తారకరామారావు అన్నారు. తొమ్మిదేండ్లు అధికారంలో ఉండి.. నాలుగు బిల్డింగులు కట్టి, తమకే ఓటేయాలని పోజుకొడుతున్న చంద్రబాబుకే అంత ఉంటే.. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యంచేసి.. నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్‌కు ఎన్నిసార్లు ఓట్లేయాలి? మేం ఎంత చెప్పుకోవాలి? అని ప్రశ్నించారు. ఆధునిక తెలంగాణ సృష్టికర్త, నిర్మాత తానేనని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఆయన తన శక్తిని ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. శనివారం మన హైదరాబాద్- మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా భరత్‌నగర్‌లోని మెజెస్టిక్ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయ ఆత్మీయసదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న బాబును అమరావతిదాకా తరిమికొట్టామని, ఈసారికూడా తెలంగాణ సమాజం చంద్రబాబును, ఆయన పార్టీని తరిమి కొడుతుందన్న విశ్వాసం ఉందని చెప్పారు.

జాతీయస్థాయిలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటుచేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందన్నారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు ఎట్లా బుద్ధిచెప్పాలో కేసీఆర్‌కు తెలుసునని పేర్కొన్నారు. డబ్బు, కొన్ని మీడియాసంస్థలను అడ్డంపెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

తామెప్పుడూ ఏపీతో తగాదా పెట్టుకోలేదన్న కేటీఆర్.. చంద్రబాబే ప్రతిసారీ తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని విమర్శించారు. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు నాలుగు పార్టీలు ఏకమై వస్తున్నాయని, కానీ సింహంలా కేసీఆర్ సింగిల్ అని అన్నారు. రాహుల్ ఎన్ని డ్రామాలాడినా.. బాబు ఎన్ని వేషాలువేసినా ప్రజలు నమ్మేస్థితిలోలేరని స్పష్టంచేశారు. రాహుల్ సీట్లు పంచొచ్చు.. చంద్రబాబు నోట్లు పంచొచ్చు.. కానీ ఓట్లువేసేది మనం..వజ్రాయుధంలాంటి ఓటుద్వారా కూటమికి తగిన బుద్ధిచెప్పాలి.

కాంగ్రెస్, టీడీపీ తోడుదొంగల్లా వస్తున్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టే ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోవద్దు అని ప్రజలను కోరారు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్‌గాంధీ వీణ, చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవాల్సిందేనని ఎద్దేవాచేశారు. రాబోయేరోజుల్లో రాజకీయంగా చంద్రబాబు అంతుచూస్తామని మంత్రి హెచ్చరించారు. పుట్టలో వేలుపెడితే చీమ కుట్టినట్టు.. చంద్రబాబు తెలంగాణలో వేలుపెట్టి కయ్యానికి కాలుదువ్వారన్న కేటీఆర్.. రేపటిరోజున అవసరమైతే ఆంధ్రాలో వేలుపెట్టేందుకు కూడా వెనుకాడబోమని చెప్పారు.

సొంత డబ్బా కొట్టుకోవడంలో బాబు దిట్ట
మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు అంటున్నడు. మొన్నటిదాకా హైదరాబాద్ నేనే కట్టానన్నాడు. కేసీఆర్ ఆయన దుమ్ముదులిపితే సైబరాబాద్‌కు తగ్గాడు. రేపటిరోజున కేసీఆర్ మళ్లీగా గట్టిగా అంటే.. ఏంలేదు రెండు బిల్డింగులు కట్టాను అంటారు. అందులో సందేహం లేదు అని కేటీఆర్ చురకలు వేశారు. సొంతడబ్బా కొట్టుకోవటంలో చంద్రబాబును మించిన నాయకుడు లేరని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందరం బాగుండాలని కోరుకున్నదే తప్ప నష్టం జరుగాలని చూడలేదన్నారు. కలిసిమెలిసి ఉంటున్న ప్రజలను విడగొట్టాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న కేటీఆర్.. కులం, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు చేస్తామంటే కచ్చితంగా తిప్పికొడుతామని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం నాలుగున్నరేండ్ల పాలనలో కులం, మతం అని తేడా చూపలేదని చెప్పారు. నందమూరి హరికృష్ణ రోడ్డుప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి టీఆర్‌ఎస్ అండగా నిలబడిందని, స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లి నివాళులర్పించి, అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారని గుర్తుచేశారు.

జగన్మోహన్‌రెడ్డిపై దాడిజరిగితే ఖండించామని చెప్పారు. చంద్రబాబుకు నందమూరి కుటుంబంపై అంత ప్రేమ ఉంటే తన కుమారుడు లోకేశ్‌ను మంత్రిని చేసినట్టు సుహాసినిని కూడా ఆంధ్రకు తీసుకెళ్లి మంత్రిని చేయొచ్చుకదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఓడిపోయే సీటు ఇచ్చి సుహాసినిని రాజకీయంగా బలిపశువును చేశారని, లోకేశ్‌కు అడ్డులేకుండా చేశారని అన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేను రూ.50 లక్షల బ్యాగుతో తెలంగాణకు పంపి దొరికిపోయింది చంద్రబాబు కాదా? మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న ఆ గొంతు తనదికాదని చంద్రబాబు ఏనాడైనా చెప్పారా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో అడుగుపెడితే పాతరోజులు గుర్తొస్తున్నాయని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు హయాంలో కరంటు అడిగిన రైతులను బషీర్‌బాగ్‌లో కాల్చిచంపిన రోజులు తమకు ఇంకా గుర్తున్నాయన్నారు. వ్యవసాయం దండగ అనడాన్ని ఇంకా మరిచిపోలేదన్నారు.

మళ్లీ ఆశీర్వదిస్తే హైదరాబాద్‌ను మరింత బాగుపర్చుకుందాం
కులమతాలకు అతీతంగా పనిచేసిన కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎవ్వరినీ ఇబ్బందిని పెట్టే ఆలోచన టీఆర్‌ఎస్‌కు ఏనాడూ లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదిస్తే హైదరాబాద్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. రాబోయేరోజుల్లో ప్రతిరోజూ నీటి సరఫరాకు కృషిచేస్తామన్నారు. హైదరాబాద్‌లోని పేదవారందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. చెప్పింది చేసి చూపించాం..

కేసీఆర్ మొక్కవోని దీక్షతో సాధించుకున్న రాష్ట్రంపై ఎన్నో అనుమానాలు.. అపోహలు కల్పించారని, దుష్ప్రచారంచేశారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కరంటు ఉండదని, పరిశ్రమలు తరలిపోతాయని, హిందువులు, ముస్లింలు కొట్టుకుంటారని చెప్పడమేకాకుండా.. సీమాంధ్రులను ఇబ్బందిపెడుతామని తమపైనా చిల్లరమల్లర మాట్లాడారని పేర్కొన్నారు. కానీ.. మనది ప్రజల విభజన కాదు. భౌగోళికంగా విడిపోతున్నామే తప్ప అన్నదమ్ముల్లా కలిసే ఉందాం అని ఆనాడు చెప్పామని, చెప్పింది ఆచరణలో చూపించామని కేటీఆర్ చెప్పారు. పొరుగు రాష్ర్టాల విషయంలో నువ్వు బతుకు.. నన్ను కూడా బతుకనివ్వు అనే నినాదంతో ముందుకుపోయామని తెలిపారు. గోదావరి జలాల విషయంలో మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి, ఒప్పందం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి, వచ్చే ఆరునెలల్లో 38 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామన్నారు.

అలంపూర్ నుంచి భద్రాచలందాకా సుదూరమైన సరిహద్దు ఆంధ్రతో ఉందన్న కేటీఆర్.. ఏ రోజూ ఏపీతో పేచీ పెట్టుకోలేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ సంక్షేమంపై దృష్టిపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు మాత్రం గిల్లికజ్జాలు, పుల్లలు పెట్టడంలో నిమగ్నమయ్యారని పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. 24 గంటల కరంట్ విషయంలో పవన్‌కల్యాణ్ మెచ్చుకున్నారని తెలిపారు. సీమాంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారందరూ తెలంగాణ బిడ్డలే అని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 15 మందిని కార్పొరేటర్లుగా గెలిపించుకున్నామని మంత్రి వివరించారు. అందరం కలిసిమెలిసి ఉంటేనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్, కాపు, బలిజ, ఇతర సంఘాల నేతలు ఎం రాఘవరావు, పసుపులేటి లక్ష్మి, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దాసరి రంగారావు, దాసరి రాము, హిమబిందు, వంగవీటి నరేందర్, రమేశ్, ఈశ్వరవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.